Friday, 13 June 2014

తెలంగాణా శకుంతల ఇక లేరు



మహారాష్ట్రలో పుట్టి తెలుగు సినీ పరిశ్రమనే తన స్వంత ఇంటిగా మార్చుకొన్న తెలంగాణా శకుంతల ఇక లేరు. ఆమె శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాదులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆమె దారిలోనే గుండెపోటు కారణంగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. శకుంతల మాతృబాష మరాటి అయినప్పటికీ ఆమెకు తెలంగాణా మాండలికంపై ఉన్న అసాధాణమయిన పట్టుతో ప్రేక్షకులను మెప్పించి తెలంగాణా శకుంతలగా ప్రసిద్దిగాంచేరు.

తెలుగు ప్రేక్షకులకు మహానటి స్వర్గీయ సూర్యాకాంతం లేని లోటును భర్తీ చేయగల అంతటి సమర్దురాలయిన శకుంతల దొరికినందుకు చాలా సంతోషించారు. కానీ ఆమె కూడా అకస్మాత్తుగా మరణించారు. మరాటి నాటకరంగంలో మంచి నటిగా పేరు తెచ్చుకొన్న ఆమె 1981లో ‘మా భూమి’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి పాండవులు పాండవులు తుమ్మెద (2014) సినిమాలో చివరి సారిగా నటించారు. ఈ మూడు దశాబ్దాలలో ఆమె 70కి పైగా తెలుగు సినిమాలలో నటించారు. ఆమె నటించిన నువ్వు నేను, ఒక్కడు, లక్ష్మి, నీకు నాకు, మా నాన్న చిరంజీవి, రాజన్న వంటి సినిమాలు ఆమె అపూర్వ నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. ఆమెకు ఇరువురు కుమారులున్నారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదులో ఆమె అంత్యక్రియలు జరగవచ్చును. తన అద్భుతమయిన నటనతో తెలుగుచిత్ర సీమకు ఒక నిండుదనం తెచ్చిన తెలంగాణా శకుంతల మరిక లేరనే ఈ వార్తను జీర్ణించుకోవడం కష్టమే.

No comments:

Post a Comment