ఆమె నిజాం పాలనపై, దొరల దౌర్జన్యాలపై
ఎదురు తిరిగింది. వారి ఆగడాలపై కత్తి దూసింది. దండయాత్రలకు దన్నుగా నిలిచింది. భూమి
కోసం, భుక్తి కోసం జరిగిన మహా ఉద్యమానికి ఊపిరిపోసింది. పోరు గీతికను ఆలపించింది. బాంచెన్
దొరా అనే బతుకును తరిమెయ్యడానికి తెలంగాణ ప్రాంతంలో బాకుగా నిలిచింది. వంటింటి నుంచి
మహిళలను పోరాటం వైపు నడిపించింది... ఆమే వీరవనిత చాకలి ఐలమ్మ.
ఐలమ్మ పేరు వింటే చాలు... ఒళ్ళు గగుర్పొడిచే నిజాం
వ్యతిరేక పోరాటం కళ్ళకు కడుతుంది. పాలకులపై ప్రజలే చలిచీమలై చేసిన తిరుగుబాటు స్ఫూర్తి
నింపుతుంది. ఓ సామాన్య మహిళ సృష్టించిన అసమాన్య చరిత్ర.. తరతరాల తెలంగాణకు తరగని శక్తిని
నింపుతుంది. అందుకే చాకలి ఐలమ్మ నిజాం వ్యతిరేక పోరాటంలో ఓ ఉద్వేగపూరిత అధ్యాయంగా మిగిలిపోయింది.
దేశ్ ముఖ్ ల దౌర్జన్యాలపై...
చాకలి ఐలమ్మ 1895లో వరంగల్ జిల్లా రాయపర్తి
మండలంలోని కిష్టాపురంలో జన్మించింది. ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు ఐలమ్మ నాలుగో సంతానం.
వారి వృత్తి చాకలి. పాలకుర్తికి చెందిన నర్సింహులుతో ఐలమ్మ వివాహం జరిగింది. ఆమెకు
ఐదుగురు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. నాటి నిజాం పాలనలో న్యాయమనే మాటకే తావు లేదు.
నాటి పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక భూమిక పోషించింది. ఐలమ్మ కుటుంబం విస్నూరు దేశముఖ్
గూండాలను ధైర్యంగా ఎదిరించింది. ఆమె కుటుంబాన్ని జైలుపాలు చేసి భూమిని ఆక్రమించడానికి
దేశముఖ్ కుట్ర పన్నాడు. గూండాయిజాన్ని ఎదిరించిన చాకలి ఐలమ్మ పోరాటం భూ పోరాటంగా మారింది.
నిజాం వ్యవస్ధపైనే కత్తిగట్టింది. వారిని గ్రామం నుంచి తరిమి తరిమి కొట్టింది. గూండాల
అన్యాయాలు, రజాకార్ల దౌర్జన్యాలపై ఎదురుతిరిగింది. తూటాలూ, తుపాకులూ తమనేం చేయలేమని
చాటి చెప్పింది. లాఠీ దెబ్బలకు సైతం తలొగ్గలేదు. జైళ్ళలో బంధించినా పోరుపంథాను మాత్రం
వీడలేదు. ఐలమ్మ తెగువను చూసి ఎందరో మహా నాయకులు ఉద్యమంలోకి వచ్చారు.
రైతాంగ సాయుధ పోరాటంలో...
ఆంధ్ర మహాసభ నేతృత్వంలో సాగుతున్న సాయుధ
రైతాంగ పోరాటానికి ఐలమ్మ మద్దతునిచ్చింది. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో సాగిన ఈ
మహాపోరులో.. చాకలి ఐలమ్మ నిప్పు కణికయ్యింది. రైతులను, కూలీలను ఒక్కటి చేసి ఎర్రజెండా
నీడలో నడిపించింది. అక్రమంగా రాసుకున్న అగ్రిమెంట్లకు ఎదురుతిరిగింది. ఊళ్ళలోనుంచి
గూండాలను తరిమికొట్టింది. నిజాం పాలకులు ఎన్ని తీర్లుగా బెదిరించినా ఆమె వాటిని ఏ మాత్రం
లెక్కచేయలేదు. భీం రెడ్డి నర్సింహారెడ్డి, రాం చంద్రారెడ్డిలతో పాటు పోరాడింది. పాలకుర్తి
నుంచి దేశముఖ్ గూండాలను తరిమికొట్టింది.
సిపిఎం అండ...
ప్రజా పోరాటంలో తిరుగులేని పాత్ర వహించిన
ఐలమ్మను సిపిఎం గుండెలకు హత్తుకుంది. ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా ఆమె స్వస్థలంలో స్థూపాన్ని
ఏర్పాటు చేసింది. ప్రతీఏటా వర్ధంతి సభలను జరుపుకుంటూ ఐలమ్మను స్మరించుకుంటోంది. రజాకార్ల
అరాచకాలపై తిరగబడి ఎర్రజెండాకు వన్నె తెచ్చిన ఆమె 1985 సెప్టెంబర్ 10న తుది శ్వాస విడిచింది.
ప్రభుత్వ ఆదరణ కరువు..
ప్రాణాలను సైతం లెక్కచేకుండా రజాకార్లపై
పోరాటం చేసిన చాకలి ఐలమ్మను ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడంలేదు. గ్రామ గ్రామాన సంఘాలు
ఐలమ్మను స్మరించుకుంటున్నా సర్కారు మాత్రం ఆ మాటే మరచిపోయింది. ఐలమ్మ చనిపోయి 28ఏళ్ళు
గడుస్తున్నా ఇప్పటికీ ఆమె సొంత ఊళ్ళో విగ్రహం కూడా పెట్టించలేదు. జీవితమంతా ప్రజల కోసం
పరితపించిన ఐలమ్మ కుటుంబీకులకు కూడా ప్రభుత్వం ఏ సహాయ సహకారాలు అందించడం లేదు. రైతాంగ
సాయుధ పోరాట యోధురాలుగా ఐలమ్మను ప్రభుత్వాలు తగిన రీతిలో గౌరవించాలని ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment