Tuesday, 24 June 2014

సోక్రటీస్





గ్రీస్‌లొ నగర రాజ్యమైన ఏథెన్స్ పౌరుడైన సోక్రటీస్ 470 బి.సి.లో జన్మించాడు. కొంతకాలం తన తండ్రి వృత్తిని చేపట్టాడు. కాని ఇతర ఆశలు అతనికి ఉన్నందువల్ల సైన్యంలో చేరాడు. ఏథెన్స్‌కు తిరిగివచ్చిన తర్వాత తన కాలాన్ని మానవ జీవిత ప్రవర్తనపై అధ్యయానికి వినియోగించి ప్రజా సమస్యలను గురించి ప్రజలకు హెచ్చరిక చేసేవాడు. 406 బి.సి.లో 500 మందితో కూడిన సెనేట్‌లో సభ్యుడయ్యాడు. ఇతర గౌరవాలు కూడా పొందాడు. తన ప్రజాహిత కార్యాలకు తోడు ఒకటి తరువాత ఒకటిగా తన బోధనా వృత్తిని కొనసాగించేవడు. సోఫిస్ట్స్ అని పిలువబడే పాఠశాల ఉపాధ్యాయుల వేదాంత చర్చలను - అతని కాలంనాటి - ఏథెన్స్ వాసులు ఆదరించేవారు. సోఫిస్టులు ధనవంతుల వద్ద డబ్బు తీసుకొని వారి పిల్లలకు - వాదన, ఉపన్యాస విధానం నేర్పేవారు. పాపాన్ని (చెడు) మంచిదాన్నిగా, మంచిదాన్ని పాపంగా రూపొందించేవారు. హృదయపూర్వకంగా, నేర్పుకల వారుగా ఉండేవారు. సన్మార్గం (నీతి)పై మనుషుల విశ్వాసాన్ని బలహీనపర్చే విధంగా వారి బోధనల ప్రభావం ఉండేది. అందరి చేత గౌరవించబడే ఒకే సత్యం, నీతి అనేవి లేవని సోఫిస్టులు చెప్పేవారు. ఒకరికి నీతిగా కనిపించేది మరొకరికి అవినీతి అవుతుంది.

సోఫిస్టులు వ్యతిరేకించినా సత్యం, నీతి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నిలబెట్టాలని సోక్రటీస్ కృతనిశ్చయుడయ్యాడు. అతడు జ్ఞానంతొ సత్ప్రవర్తనను సమత్వం చేశాడు. ప్రజల్ని మంచివారిని చేసేందుకు జ్ఞానానికి శక్తి కలదని నమ్మాడు. ప్రజలకు విషయాలు స్పష్టంగా అర్ధమయ్యేందుకు తార్కికమైన నిర్వచనాలను అతడు అవలంబించాడు. సోక్రటీస్ పేదవాడైనా ఎన్నడూ ధనం వెంటపడలేదు. ఒక చింతనాపరుడుగా జీవితాన్ని గడపాలని కోరుకున్నాడు. సంపద, కీర్తి, అధికారం మరియు పదవిపట్ల పూర్తి వైముఖ్యాన్ని ప్రదర్శించాడు. జీవితం చివరి దశలో అతడు జ్ఞాంతిప్పి అనే ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. కుటుంబం పట్ల సోక్రటీస్  భేద వైఖరికి కోపంతో ఒకసారి ఆమె ఒక కుండెడు పేడ నీళ్ళు అతని తలపైన క్రుమ్మరించిందని చెబుతారు. ఈ ఉత్సాహం కల్గించే స్నానం తరువాత అతడు ఇలా గట్టిగా అరిచాడు "ఉరుముల (పిడుగుల) తరువాతే వర్షం వస్తుంది". తమకు పరిచయమైన అభిప్రాయాలను మనుషులు పరీక్షించి, వాస్తవాలను వెలికితీసి, దానిలోని సారాంశమైన సత్యాన్ని అంగీకరించాలని సోక్రటీస్ విశ్వసించేవాడు. నిజానికి జ్ఞానం లేకుండానే జ్ఞానికి సంబంధించి మాట్లాడే ప్రజలను అతడు ఎట్టి ద్వేషం లేకుండా నిలదీసేవాడు. సత్యాన్ని తీవ్రంగా ప్రేమించే అతడు కపటాన్ని ద్వేషించేవాడు.

న్యాయం, మంచితనం, స్వేచవంటి పదాలను ప్రయోగించే ఏథెన్స్ నాయకులను, పురుషులను సోక్రటీస్ పరీక్షించి, వారి అవివేకాన్ని ఖండించేవాడు. సోఫిస్టులు మరియు ప్రభుత్వపక్ష నాయకులు అసంతృప్తి చెంది సోక్రటీస్ పట్ల క్రోధంతో ఉండేవారు. అతణ్ణి ఎలాగైనా తొలగించాలని వారు కోరుకున్నారు. అతని 70వ ఏట, సోక్రటీస్‌పై అభియోగం మోపి విచారణకు తెచ్చారు. ఆ దేశం విశ్వసించే దేవుళ్ళను సోక్రటీస్ నమ్మటంలేదనీ, యువతను అవినీతికి పురికొల్పుతున్నాడనీ నేరారోపణ చేశ్డారు. విచారణలో తన వాదనలతో జూరీని అంగీకరింపచేయగలనని భావించాడు సోక్రటీస్. ఆత్మన్యూనతా భావాన్ని వెలిబుచ్చి దయ చూపమనే విజ్ఞప్తి కానీ, న్యాయమూర్తుల ఎదుటకు తన శోక సంతప్తులైన సంతానాన్ని తీసుకురావటం కానీ ఆయన చేయలేదు. తన సందేశం ఏమిటో దాన్ని గురించి చెప్పాడు. తన అంతరాత్మ ఆదేశాలకు నిబద్ధత ప్రకటించాడు. తన హేతువులోని ధర్మతత్పరతకే అంటుకుపోయాడు.

దేశానికి తను చేసిన సేవలకుగాను ప్రజాధనంతో నగర ప్రధాన చావిడిలో తనను సన్మానించాలని సోక్రటీస్ సూచించాడు. ఇది జూరీ (పంచాతీదారుల సభ)కు కోపం తెప్పించింది. అతనికి మరణ శిక్ష విధించారు. ఎప్పటికీ గొప్పతనం కలిగిన మాటలతో అతడు న్యాయస్థానాన్ని విడిచిపెట్టాడు. అతను చెప్పిన మాటలివి ... "నిష్క్రమించే గంట వచ్చింది. మనం మన దారిన వెళ్ళిపోతాము. నేని మరణించబోతున్నాను. మీరి జీవించబోతున్నారు. ఏది మంచిదో దేవుడు ఒక్కడికే తెలుసు".

సోక్రటీస్‌ను జైలుకు తీసుకుపోయారు. తన భార్యాబిడ్డల్ని చెరసాలకు తీసుకురావద్దని అతడు తన మిత్రులతో చెప్పాడు. దానివల అందరి ఎదుట ఒక దృశ్యం సృష్టించబడుతుందని చెప్పి అతడు నిరాకరించాడు. మృత్యువును కలుసుకునేందుకు అతడు సిద్ధంగానే ఉన్నాడు. మరణానికి సిద్ధంగా ఉన్న అతను స్టెషికోరోస్ అనే కవి రచించిన అతి కష్టసాధ్యమైన పాటను ఎవరో పాడుతుండగా విని ఆ పాటను తనకు నేర్పించమని ఆ గాయకుడిని అడిగాడు. అందుకా గాయకుడు "మరణానికి సిద్ధంగా ఉన్న నువ్వు ఈ  పాట నేరుచుకోని ఏం సాధిస్తావు?" అనడిగాడు. అందుకు సోక్రటీస్ "ఇంకో విషయం నేర్చుకోని మరణించాలని ఉంది" అని సమాధానమిచ్చాడు. ఆ తాత్వికుని సమాధానానికి అబ్బురపడిన ఆ గాయకుడు ఆ పాటను అతనికి నేర్పించాడు. ఆ పాట నేర్చుకున్న తరువాతే సోక్రటీస్‌ ప్రశాంతంగా విష పానీయాన్ని త్రాగాడు. ఆ మందు పనిచేసేందుకు కొద్దిగా నడిచాడు. కొంచెంసేపైన తరువాత మరణించాడు.  ప్రపంచంలో మేధావంతుడే ఆత్మబలిదానం చేసిన మొదటి మృతవీరుడు సోక్రటీస్. అతడు తత్వ శాస్త్రాన్ని స్వర్గం నుంచి విపణి వీధికి తీసుకువచ్చాడు. అత్యంత ప్రయాస భరితమైన సమయాల్లో కూడా కడదాకా న్యాయపంధాలోనే నడిచాడు.

No comments:

Post a Comment