Friday, 6 June 2014

‘బతుకమ్మ’గా మారిన ‘బ్రతుకమ్మ’




‘బతుకమ్మ’ అంటే బ్రతుకుదెరువును మెరుగు పరచే అమ్మయని అర్థం. దేవీదేవతల్లో బతకమ్మను మనం లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా, ఉభయంగా ఊహించుకోవచ్చు. ‘బ్రతుకమ్మ’ తెలంగాణ గ్రామీణ భాషలో ‘బతుకమ్మ’గా మారిందని అనుకోవచ్చు.

ప్రతి బతుకమ్మ పాటను తుదకు ‘ఉయ్యాలో’ అను పదంతో ముగిస్తారు. పాడేవారందరూ ఉయ్యాలలా క్రిందికీ మీదికీ ఊగుతూ లేస్తూ పాడుతారు కనుక. జీవితం బతుకమ్మలా రంగుల సువాసనల పూల వలె అందంగా సువాసనగా ఉండాలని వివిధ రంగుల, వివిధ సువాసనల పూలతో బతకమ్మలను పేరుస్తారు, కూరుస్తారు.

ప్రధానంగా ఈ పండగ పల్లెటూరి వారి పండగ. పట్నాలలో నివసించేవారు కూడా చాలావరకు ఎన్నో ఏళ్ళనుండి పల్లెలనుండి తరలివచ్చి స్థిరపడ్డవారే, కనుక వారు కూడా బతకమ్మ పండగ జరుపుకుంటున్నారు.

ఈ పండగ తెలంగాణా ప్రాంతానికే పరిమితమైన పండగ, పండగ తుదిరోజున బతుకమ్మలన్నిటినీ దగ్గరి చెరువులోనో, కుంటలోనో, నదిలోనో ‘సాగనంపు’ గా వేయడం ఆనవాయితీ. నదులు చాలా తక్కువే కాక చాలా ప్రాంతాలకు సమీపంలో ఉండవు కనుక బతుకమ్మలను చెర్లల్లో, కుంటల్లోనే వేస్తారు ఎక్కవగా.

కాస్త తీవ్రంగా ఆలోచిస్తే ఈ పండగ సీమాంధ్రలో లేక తెలంగాణాలోనే ఉండడానికి కారణం సీమాంధ్ర భూములు చాలావరకు సమానమైన భూములు, ఎక్కువ నదీజలాలతో సాగుబాటయే భూములు కావడం తెలంగాణావి నీటి కొరత గల భూములు కావడం. వర్షంపై ఆధారపడే భూములు కావడమని అనిపిస్తుంది. అందువలన తెలంగాణావారు ‘బతుకమ్మ’ను దేవతగా సృష్టించుకొని ఆ దేవతను వారి చెరువులు, కుంటలు సమృద్ధిగా వర్షాపాతం ద్వారా నింపుమని మ్రొక్కుతూ ఆడుతూ పాడుతూ ప్రార్థిస్తూ తుది రోజున బతుకమ్మలను నీటిలో నివేదనగా అర్పిస్తారేమోనని అనిపిస్తుంది. లేకపోతే నీటిలో వేయడానికి అట్టే అర్థం వేరే కన్పించడం లేదు.

అలాగే ఈ పండగ. అన్ని సంపదలతో పాటు వాన సంపదకు కూడా కూడలి అయిన లక్ష్మీ గౌరీదేవిల ద్వారా వానదేవుడ్ని ప్రార్థించే పండగయని అనిపిస్తోంది. బతకమ్మను లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా పూజిస్తారు కనుక. అది ప్రత్యేకంగా ఆడవారి పండుగ కనుక.

అలా బతుకమ్మ పండుగకు తెలంగాణా చెరువు, కుంటల నీటికి ఒక అనుబంధం ఏర్పడిందని అనిపిస్తుంది.

అలా తెలంగాణా బతకమ్మ, తెలంగాణా వారి బ్రతుకులకు బ్రతుకు దెరువులకు అమ్మ లాంటిదయింది.

ఈ బతుకమ్మ పాటల్లో ప్రేమ, బంధుత్వం, స్నేహం, భక్తి మున్నగు వాటికి చెందిన వాక్యాలు, పంక్తులుంటాయి. వీటి అర్థాలన్నీ అందరూ కలిసి కలెగలుపుగా కలిసిమెలిసి ఉండాలని, వారి వారి స్నేహాలు, ప్రేమలు, బాంధవ్యాలు, సంబంధ అనుబంధాలు బాగుండాలని. భక్తికి, ముక్తికి, రక్తికి చెందినవి. సామాజిక సంబంధాలు మెరుగు పరచేవి వాటి సాహిత్యాల్లోకి, భావాల్లోకి చొచ్చుకుపోయి చూస్తే మనకు అది తెలుస్తుంది.

అందుకే ఈ పండగను అందరూ కలసి కలుపుగోలుగా జరుపుకుంటారు. ఏ కుల మతభేదాలు ఆర్థిక భేదాలు లేకుండా. మరొక విధంగా చూస్తే ఈ పండగ కూడా దసరాలాగా ‘శక్తి’కి చెందిన పండుగలా అనిపిస్తుంది. ఒకటి పురుష శక్తికి, రెండవది స్త్రీ శక్తికి. అందుకేనేమో ఈ పండుగలు రెండూ వరుసగా వస్తాయి. ‘విజయ దశిమి’ని స్త్రీలు పురుషులు ఉమ్మడిగా జరుపుకునే పండగల్లా.

ఏది పురుషుల విజయమో అది స్త్రీల విజయం. ఏది స్త్రీల విజయమో అది పురుషుల విజయం కూడా కదా మరి. అందుకని ఇరువురూ విజయాలలో భాగస్వాములేనని చాటుటకు కాబోలు ‘దసరా’ ‘బతుకమ్మ’ పండుగలు జంటగా వస్తాయి.

‘బతుకమ్మ’ పండగ జరుపుకున్నట్లే తెలంగాణాలో అన్ని కులాలవారు అన్ని ఆర్థిక స్థోమతల వారూ ‘దసరా’ పండుగ కూడా జరుపుకుంటూ ఆడుతారు, పాడుతారు, తింటారు, త్రాగుతారు, కేరింతలు కొడతారు. ఈ రెండు పండుగలు తెలంగాణా పండుగలలోని అన్ని పండుగల కంటే అతి ముఖ్యమైన పండుగలని  చెప్పుకోవచ్చు.

No comments:

Post a Comment