Monday, 30 June 2014

భగత్ సింగ్




భగత్ సింగ్ ఈ పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. ఒక్కసారి ఆయన ధైర్యసాహసాలని గుర్తుచేసుకుందాం… 

    భగత్ సింగ్ స్వస్థలం లయాల్పూర్ జిల్లాలోని ఖాత్కర్ కళన్ గ్రామం.. ఆయన తల్లిదండ్రులు విద్యావతి, సర్దార్ కిషన్ సింగ్.. భగత్ సింగ్ పుట్టిన సమయంలో, కిషన్ సింగ్ సోదరులందరూ, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం వలన, వాళ్ళందరిని జైల్లో పేట్టారు.. ఐతే పిల్లాడు పుట్టీ పుట్టగానే, వాళ్ళందరినీ జైలు నుండి విడుదల చేస్తున్నారనే వార్త తెలిసింది.. తమ కుటుంబానికి అదృష్టం వచ్చింది అని భావించి ఆ పిల్లాడికి భగత్ సింగ్ అని నామకరణం చేశారు...

కుటుంబంలో అందరూ, స్వాతంత్ర్య ఉద్యమంలో, చాలా చురుకుగా పాల్గొనే వాళ్ళు కావడంతో చిన్నప్పటినుండే, భగత్ సింగ్ మనసులో బ్రిటీష్ వాళ్ళంటే, వ్యతిరేక భావం కలిగింది.. ఒకసారి వాళ్ళ నాన్న, బాబాయి తో కలిసి, భగత్ సింగ్ అలా బయటకు వెళుతున్నాడు.. ఐతే కొంచెంసేపైన తరువాత భగత్ సింగ్ కనిపించకపోవడం తో, వెనక్కి తిరిగి చూస్తే, అక్కడ మట్టిలో ఒక మొక్క నాటుతూ, భగత్ సింగ్, నాన్న ఈ మొక్క నుండి తుపాకులు వస్తాయి, వాటితో ఆ బ్రిటీష్ వాళ్ళని పారద్రోలచ్చు అని ఆవేశంగా చెప్పాడు.. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు..
ఆయన 12యేళ్ళ వయసులో ఉన్నప్పుడు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది… ఆ సంఘటన ఆయన్ని చాలా ప్రభావితం చేసింది.. ఆ ప్రదేశానికి వెళ్ళి భూమిని ముద్దాడి, అక్కడ రక్తం తో తడిసిన మట్టిని ఇంటికి తీసుకు వచ్చారు.. ఈ ఒక్కటి చాలు ఆయన ఎంత దేశ భక్తుడో చెప్పడానికి…

చిన్నతనంలో, యూరోప్ లో జరిగిన విప్లవ ఉద్యమాల గురించి ఎక్కువగా చదివేవారు.. వాటి వల్ల ఆయన కమ్యూనిజం వైపు ఆకర్షించబడ్డారు.. ఆ కాలంలో ఉన్న అతి కొద్ది మంది మార్కిసిస్ట్ ల్లో, ఆయన ఒకరు..
భగత్ సింగ్ లాహోరు లోని డి.ఎ.వి. కళాశాలలో చదువుతున్నప్పుడు, అప్పట్లో స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొంటున్న వాళ్ళు పరిచయమయ్యారు.. వాళ్ళలో ముఖ్యులు, “లాలాలజపతి రాయి”, “రాజ్ బిహారి బోస్”.. మహాత్మా గాంధీ గారు 1921లో సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు ఇచ్చారు.. దానికి ప్రతిగా, భగత్ సింగ్ అప్పటివరకు తను చదువుతున్న పాఠశాల మానేసి, లాహోరు లోని, నేషనల్ కాలేజీ లో చేరారు..
భగత్ సింగ్ కి గాంధీ అంటే చాలా అభిమానం ఉండేది.. ఆయన ఎప్పటికైనా భారత దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తాడని నమ్ముతూ ఉండేవాడు.. అయితే 1922లో చౌరీ చోరా లొ జరిగిన సంఘటనల వలన, ఆయన సహాయ నిరాకరణొద్యమం ఆపేశారు.. దాంతో ఒక్కసారిగా భగత్ సింగ్ నిస్పృహుడయ్యరు.. అదే సమయంలో, పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళనం వాళ్ళు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో, ఆయన ప్రధమ బహుమతి సాధించారు.. అక్కడ పరిచయమయ్యారు భీమ్ సేన్ విద్యాలంకార్(సాహితి సమితి అధ్యక్షులు)..

కళాశాలలో చదువుతున్న సమయంలో, తెల్లవారికి వ్యతిరేకంగా పనిచేసే చాలా విప్లవకారుల సంస్థల్లో చేరారు.. అలాంటి సమయంలో, విద్యాలంకార్ దగ్గర నుండి పిలుపు వచ్చింది.. దాంతో, “హిందుస్థాన్ రెపబ్లికన్ అసోసియేషన్”లో సభ్యులుగా చేరారు.. భగత్ సింగ్ దాంట్లో చేరిన తరువాత దాని పేరు “హిందుస్థాన్ సోషలిస్ట్ రెపబ్లికన్ అసోసియేషన్” గా పేరు మార్చబడింది.. ఆ సంస్థ సభ్యులలో, ప్రముఖమైన వాళ్ళు, “చంద్రశేఖర ఆజాద్”, “యోగేంద్ర శుక్లా”.. ఈ సంస్థ ఏర్పాటుకి ముఖ్య కారణం రష్యాలోని “బోల్ష్ విక్ విప్లవం”..
సంస్థలో చేరిన దగ్గరి నుండి, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలు చేశారు… దాంతో బ్రిటీష్ ప్రభుత్వం వాళ్ళందరినీ తీవ్రవాదులు గా ముద్రవేసింది..

అది ఫిబ్రవరి, 1928వ సంవత్సరం.. సైమన్ కమీషన్ భారతదేశంలో అడుగుపెట్టింది.. ఆ కమీషన్ ముఖ్యోద్దేశ్యం, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద నివేదిక ఇవ్వడం… ఐతే ఆ కమిటీ లో ఒక్క భారతీయుడు కూడా లేడు.. అందుకు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. కమిటీ లాహోరులో పర్యటిస్తున్నప్పుడు, లాలాలజపతి రాయ్ దానికి నిరసనగా, ఒక శాంతియుత ప్రదర్శన చేపట్టారు..కానీ పోలీసులు అత్యుత్సాహంతో, దాంట్లో పాల్గొంటున్న వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేశారు.. ఆ దెబ్బలకి లాలలజపతి రాయ్ చనిపోయారు.. ఈ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షైన, భగత్ సింగ్, లజపతి రాయ్ ని చంపిన పోలిస్ అధికారిని చంపుతానని ప్రతిజ్ఞ చేశారు.. తన స్నేహితులైన శివరామ రాజగురు, జై గోపాల్, సుఖదేవ్ థాపర్ తో కలిసి ప్రణాలిక రచించారు..వాళ్ళ పధకం ప్రకారం, జైగోపాల్ ఆ అధికారిని చూసి, భగత్ సింగ్ కి సైగ చేయాలి.. అయితే జైగోపాల్ తప్పిదం వల్ల, అసలు అధికారి బదులు, వేరే వాళ్ళని కాల్చేశాడు భగత్ సింగ్…
పోలీస్ అధికారిని చంపిన తరువాత, భగత్ సింగ్ మీద నిఘా ఎక్కువైంది.. దాంతో, తప్పనిసరి పరిస్థితుల్లో, మారువేషంలో సంచరించ సాగాడు..

దేశమంతా ఎన్నో ఉద్యమాలు జరుగుతుండడంతో, వాటిని అణచి వేయడానికి, బ్రిటీష్ వారు, ఒక కొత్త చట్టం తీసుకు వచ్చారు.. దాని పేరే, “డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్”.. ఐతే ఈ చట్టం, అసెంబ్లీలో, ఒక వోటు తేడా తో వీగిపోయింది.. ఐతే దాన్ని ప్రత్యేక చట్టంగా తీసుకు వచ్చారు.. అందుకు ప్రతిగా, భగత్ సింగ్ వాళ్ళు అసెంబ్లీలో బాంబ్ పెట్టాలని అనుకున్నారు..

ఏప్రిల్ 8, 1929 న భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ కలిసి, అసెంబ్లీలో పెద్దగా "ఇంక్విలాబ్ జిందాబాద్" అని నినాదాలు చేస్తూ బాంబ్ వేశారు.. ఐతే వాళ్ళకి దాన్ని తయారు చేయడంలో అనుభవం లేకపోవడం వలన, అంతే కాక, దాన్ని అక్కడ ఉన్న సభ్యులకి దూరం గా విసిరి వేయడం వలన, ఎవరికీ ఏమి అవలేదు..

బాంబ్ కేసులో, భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.. వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే, పోలీసు అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది.. దాంతో, ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్ కి కూడా మరణశిక్ష పడింది..

కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా, భగత్ సింగ్ ఉద్యమాలని చేయడం ఆపలేదు.. బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు.. దానితో ఆయన పేరు భారత దేశం మొత్తం మారుమ్రోగింది.. (అంతకుముందు వరకూ ఆయన కేవలం పంజాబ్ ప్రాంత వరకు మాత్రమే పరిమితమయ్యారు)

చివరికి మార్చ్23, 1931న రాజ గురు, సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ని ఉరి తీశారు…. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది..

No comments:

Post a Comment