కలలు నిజం కావాలంటే మెలకువతో ఉండడం ఒక్కటే మార్గం అన్న సూక్తిని ఒంట బట్టించుకున్నట్టుగా తెలంగాణా ప్రజలు గడిచిన నాలుగేళ్ళు మెలకువతోనే ఉన్నారు. తమ చిరకాల స్వప్నం నెరవేరేదాకా కంటిమీద కునుకు లేకుండా గడిపారు. అంతేకాదు పాలకవర్గాలకు కూడా నిదుర లేకుండా చేసారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలన్న తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారం అయ్యింది. సుదీర్ఘ పోరాటాలు, వేలాది మంది బలిదానాలు, రాజకీయ ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాల నడుమ తెలంగాణా దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. కొత్తరాష్టాన్ని స్వాగతిస్తూ జూన్1 అర్దరాత్రి నుంచి మొదలయిన సంబరాలు నవ తెలంగాణా గగన సీమలను సరికొత్త గులాబీ కాంతితో ముంచెత్తాయి. జూన్ 2 న తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కెసిఆర్) నాయకత్వంలో తొలి ప్రభుత్వం కొలువు దీరడంతో ఆ స్వప్నంలో ఒక ప్రధాన ఘట్టం పూర్తయ్యింది.
తెలంగాణా ఆకాంక్ష అరవై సంవత్సరాలకు పైగా సజీవంగా ఉండడానికి కేవలం పాలకుల
నిర్లక్ష్యమే కారణం. సమైక్య రాష్ట్రంగా అవతరించినప్పుడు ఏర్పాటు చేసుకున్న
పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలుచేసి, తెలంగాణా ప్రాంత ప్రజలను పాలనలో
పూర్తిగా భాగస్వాములుగా చేసి, తెలుగుమాట్లాడే ప్రజలంతా ఒక్కటే అనే భావన
కల్పించి సమతుల అభివృద్ధి సాధించడంలో అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీ
రెండూ విఫలం అయ్యాయి. ఈ రెండు పార్టీలు ఎక్కువకాలం ఆంధ్రా-రాయలసీమ ప్రాంత
నాయకత్వంలోనే ఉండడం, రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో ఎక్కువమంది
ఈ ప్రాంతాల వారే కావడం తెలంగాణా నాయకుల్లో నిరంతర అసమ్మతి, అసహనానికి
కారణం అయినాయి. ఆశించిన అభివృద్ధి లేకపోవడం, సాగు నీటి ప్రాజెక్టుల పట్ల
అశ్రద్ధ, కేటాయింపులు, నిధులు దామాషా పద్ధతిలో ఖర్చు చేయకపోవడం,
ఉద్యోగాల్లో, రాజకీయ విధాన నిర్ణయాల్లో సీమాంధ్రుల ఆధిపత్యం తెలంగాణా
ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సజీవంగా ఉంచాయి.
తెలంగాణా వాదం ఒకవైపు అసమానతలు, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూనే మరోవైపు ఒక
అభివృద్ధి ఆకాంక్షగా ముందుకు వచ్చింది. 1990 దశకం నుంచి అమలయిన ఆర్ధిక
సంస్కరణలు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన విధానాలు గ్రామీణ
జీవనాన్ని ద్వంసం చేసాయి. వ్యవసాయరంగం, చేనేత వంటి గ్రామీణ చేతివృత్తులు
కుప్పకూలిపోయాయి. విద్యుత్ సంస్కరణల ఫలితంగా చార్గీలు తలకు మించిన భారమై
వేలాదిమంది రైతులు ఆత్మహత్యల పాలయ్యారు. ప్రభుత్వ రంగంలో ఉపాది
లేకపోవడంతో తెలంగాణా యువత ఉక్కిరిబిక్కిరయ్యింది. ఈ సంక్షోభం నుంచి బయట
పడడానికి ప్రత్యేక రాష్ట్ర సాధన ఒక్కటే మార్గం అనే నిర్ధారణకు తెలంగాణా
విద్యావంతులు వచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేధావులు తెలంగాణా రాష్ట్ర
సాధన ద్వారా తెలంగాణా ప్రజలకు వనరుల మీద అధికారం వస్తుందని సూత్రీకరించి ఈ
పరాయీకరణ నుంచి బయటపడడానికి స్వపరిపాలన ఒక్కటే మార్గమనే భావించారు. ఈ
భావజాలాన్ని ప్రధాన ప్రాతిపదిక చేసుకుని తెలంగాణా జనసభ, తెలంగాణా మహాసభ
వంటి వామపక్ష ప్రాంతీయ ఉద్యమ సంస్థలు, ఐక్య కార్యాచరణ వేదికలు
గ్రామగ్రామానా తెలంగాణా రాష్ట్ర సాధన అవసరాన్ని ప్రజలు గుర్తించే స్థాయిలో
ప్రచారం చేసారు. తెలంగాణా పౌర సమాజం ముఖ్యంగా విద్యావంతులు, ఉద్యోగులు,
కవులు, రచయితలు, కళాకారులు ముందు వరుసలో నడిచారు. గద్దర్, విమలక్క వంటి
విప్లవ కవిగాయకులు పాటల ద్వారా తెలంగాణా వాదాన్ని పదునెక్కించారు.
కేసీఆర్ తెలంగాణా వాదం ఒక ప్రజా నినాదంగా మారుమోగుతున్న తరుణంలో రంగ
ప్రవేశం చేసారు. పాతతరం నాయకుల్లా అసమానతలు, వివక్ష వంటి వాటికే పరిమితం
కాకుండా తెలంగాణా సాధన ఇక్కడి ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, స్వపరిపాలన ప్రజల
జన్మ హక్కు అని తేల్చి చెప్పారు. అప్పటికి ఆంద్ర ప్రదేశ్ శాసన సభ డిప్యూటీ
స్పీకర్ గా ఉన్న ఆయన తన పదవికి, తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసి 2001
మే 17న తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతో పార్టీని ఏర్పాటు చేసారు. ఒక రకంగా
తెలంగాణా రాష్ట్ర సమితి ఏర్పాటు తెలంగాణా ఉద్యమ పంథాను మార్చివేసింది.
ప్రజలను తిరుగుబాటు మార్గంనుంచి పార్లమెంటరీ రాజకీయాల వైపు మళ్ళించింది.
చట్టసభల మీద ప్రజలకు ముందెన్నడూ లేనంత విశ్వాసాన్ని కల్పించింది. హింసకు
ఎంత మాత్రం తావులేని శాంతియుత ప్రజా ఉద్యమాలు ఒకవైపు, మరోవైపు ప్రత్యర్థులు
ఊహించని వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలతో ఆయన ఒక విస్త్రుత రాజకీయ
ఏకాభిప్రాయాన్ని సాధించ గలిగారు. అదే విధంగా రాష్ట్ర విభజన కు వ్యతిరేకంగా
ఉన్న వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఏర్పడ్డ రాజకీయ శూన్య స్థితిని
ఆసరాగా చేసుకుని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం ద్వారా ఆయన కేంద్ర
ప్రభుత్వాన్ని శాసించ గలిగారు. దాని పర్యవసానమే 2009 డిసెంబర్ 9 ప్రకటన. ఆ
తరువాత కేంద్ర ప్రభుత్వం ఇక వెనక్కి పోకుండా ప్రొఫెసర్ కోదండ రామ్
నేతృత్వంలోని తెలంగాణా ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆద్వర్యంలో ప్రజలు,
ప్రజా సంఘాలు ఆప్రమత్తంగా ఉండి నాలుగేళ్ల పాటు నిరంతరాయంగా ఉద్యమాన్ని
నిలబెట్టుకుని తమ కల నెరవేర్చుకున్నారు.
తెలంగాణా
ఉద్యమం అనేక ఆర్ధిక సామాజిక అంశాలతో ముడివడి ఉన్న ఒక విశాల ఎజెండాను
ముందుకు తెచ్చింది. దానికి తోడు ఉద్యమ సారధిగా ఆయన గత 14 సంవత్సరాల్లో
ప్రజలలో తెలంగాణా ఆకాంక్షను సజీవంగా ఉంచడానికి ఆయన ఒక రంగుల ప్రపంచాన్ని
సృష్టించారు. ఆయన ఉద్యమకాలంలో తరచూ ప్రస్తావించిన నీళ్ళు, నిధులు,
నియామకాలు ఇప్పుడు ప్రధాన సవాళ్లుగా మారబోతున్నాయి. ముందుగా ఆయన దృష్టి
సారించ వలసింది వ్యవసాయ రంగం మీద. ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన రైతులకు అనేక
వరాలు ఇచ్చారు. లక్ష రూపాయల లోపు రుణ మాఫీ ఇప్పుడొక అతిపెద్ద ఆర్ధిక భారంగా
మారబోతోంది. తెలంగాణలో ఇప్పటికే 1500 మెగావాట్ల విద్యుత్ కొరత ఉంది. ఈ
పరిస్థితుల్లో వ్యవసాయానికి ఎనిమిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్
అందించాల్సి ఉంది. అలాగే భూమిలేని దళిత ఆదివాసీలకు ఒక్కొక్క కుటుంబానికి
మూడెకరాల సాగు భూమి, గృహ నిర్మాణం, నియోజక వర్గానికి లక్ష ఎకరాల చొప్పున
సాగునీరు కూడా అంత సులభం కాదు. రెండో పెను సవాలు నియామకాలు. నిజానికి
2009లో ఉద్యమాన్ని రాజేసింది ఉద్యోగులయితే మలుపుతిప్పింది విద్యార్థులు,
నిరుద్యోగులు. వారిలో చాలామంది తెలంగాణా వస్తే తమ బతుకులు బాగు పడతాయని
కలలుగన్నారు. తెలంగాణా సాధనలో ప్రాణాలొడ్డి పోరాడారు. కానీ ప్రభుత్వ
రంగంలో అవకాశాలు ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ పూర్తయితే తప్ప తెలిసేలా లేదు.
అలాగే కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కూడా తెరాస హామీలిచ్చింది. హైదరాబాద్ కు
సహజంగానే పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంది. ఇప్పటికే ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐ టీ ఐ ఆర్) గా గుర్తింపు పొందింది.
అవకాశాలు అందుకోవాలంటే నిరుద్యోగుల్లో అవసరమైన నైపుణ్యాన్నిపెంచే దిశగా
ఆలోచించాలి. తెరాస కేజీ నుంచి పీజీ వరకు పూర్తిగా నిర్బంధ ఉచిత విద్య ను
ప్రతిపాదిస్తోంది. నిజానికి ఇప్పుడు విద్యారంగం కేజీ నుంచి పీజీ వరకు
కార్పోరేట్ శక్తుల చేతుల్లో ఉంది. వాళ్ళిప్పుడు ప్రభుత్వాన్ని శాసించే
స్థితిలో ఉన్నారు.విద్యారంగంలో సమూల ప్రక్షాళన చేపడితే తప్ప ఇది సాధ్యం
కాదు.
వ్యూహకర్తగా పరిపాలనా దక్షత కలిగిన నాయకుడిగా పేరున్న కెసీఆర్ కొత్త
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణా చేస్తానని చెపుతున్నారు. పునర్నిర్మాణ
ప్రణాళిక కూడా సిద్ధం చేసారు. ఇప్పటికైతే సమర్థులుగా పేరు తెచ్చుకున్న
వారినే కీలక స్థానాల్లో మంత్రులుగా అధికారులుగా నియమించారు. ప్రజల
భాగస్వామ్యం కోసం సలహామండలిని, కార్యక్రమాల అమలుకు అభివృద్ధి ప్రణాలికా
మండలిని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. సంక్షేమం- అభివృద్ధి రెండు
చక్రాలుగా ఉంటాయని చెపుతున్నారు. నిజంగానే తెలంగాణా కోసం చిత్తశుద్ధితో
ఉన్న వారిని బాగాస్వాములను చేసి రాజకీయ అవినీతికి తావు లేకుండా.పారదర్శకంగా
పరిపాలన సాగితేనే బంగారు తెలంగాణా అవుతుంది. లేకపోతే అది మరొక కలగా
మిగిలిపోతుంది. !
No comments:
Post a Comment