Wednesday, 4 June 2014

చరిత్రకెక్కని చరిత్రకారులు


ఇరీనా సెండ్లర్. ఆరేళ్ళ క్రితం పోలాండ్ లోని వార్సాలో తన తొంభయ్ ఎనిమిదో ఏట చనిపోయింది.
రెండో ప్రపంచ యుద్ధకాలంలో నానా తంటాలు పడి  అధికారులనుంచి ప్లంబర్ గా పనిచేయడానికి అనుమతి సంపాదించింది. ఈ యుద్యోగం దొరకపుచ్చుకోవడంలో ఆవిడ ఉద్దేశ్యం వేరు. తన పనిముట్లు పెట్టుకునే ఒక పెట్టె అడుగున బయటకి కనబడని ఒక అర వుండేది. అందులో పసిపిల్లలను వుంచి సరిహద్దుల అవతలకు చేరవేసేది. పెద్దపిల్లలను చేరవేయడానికి తన ట్రక్కులో ఎప్పుడూ ఓ గోనె సంచీ సిద్ధంగా వుంచుకునేది. తన ‘అక్రమ’ రవాణా వ్యవహారం నాజీ సైనికుల కంట పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది. పిల్లలు ఏడ్చిన ధ్వనులు వినబడకుండా ఒక కుక్కను వెంటబెట్టుకుని వెళ్ళేది.పిల్లలు  ఏడ్చినప్పుడల్లా ఆ కుక్క పెద్దగా మొరిగేలా దానికి శిక్షణ ఇచ్చింది. చాలాకాలంపాటు రహస్యంగా సాగించిన ఈ కార్యక్రమం ఫలితంగా మొత్తం మీద రెండు వేళ అయిదువందల పైచిలుకు పిల్లల్ని దేశ సరిహద్దులు దాటించి నాజీల బారినుంచి వారి ప్రాణాలు కాపాడింది.
 
 
ఒకరోజు రహస్యం బయట పడి నాజీలకు దొరికిపోయింది. వాళ్లు ఆవిడ రెండు కాళ్ళు విరగగొట్టి చిత్రహింసలకు గురిచేశారు. అయినా తాను తరలించిన పిల్లల ఆచూకీ గురించి ఒక్క మాట కూడా బయటకు పొక్కలేదు.
 
కాకపోతే ఆ పిల్లల వివరాలు, వారి తలితండ్రుల వివరాలను రాసిన ఒక దస్త్రాన్ని జాగ్రత్తగా ఒక గాజు జాడీలో భద్రపరచి దాన్ని తన ఇంటి పెరట్లో ఒక చెట్టు మొదట్లో ఒక గొయ్యి తవ్వి అందులో పూడ్చిపెట్టింది.
 
యుద్ధం ముగిసింది. నాజీల నుంచి ఇరీనాకు విముక్తి లభించింది. తన దగ్గర వున్న వివరాలతో ఆ పిల్లలని  వారి తలితండ్రులవద్దకు చేర్చాలని విశ్వప్రయత్నం చేసింది. కాని వారిలో చాలామంది నాజీల గ్యాస్ చాంబర్లలో అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. పిల్లలు అనాధ శరణాలయాల్లోనో, తమను  దత్తుకు  తీసుకున్న వారివద్దనో పెరిగి పెద్దవారయ్యారు.

2007 లో ఇరీనా పేరు మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఆవిడ చేసిన మానవతా దృక్పధంతో ఆవిడ చేసిన సేవకు గుర్తింపుగా ఆమె పేరు నోబుల్ పురస్కారానికి సిఫార్సు చేశారు. కానీ దురదృష్టం ఆ ఏడాది ఆమెకు  బదులు ఆల్ గొరె ను ఎంపిక చేశారు. ఆ తరువాత కూడా అదే జరిగింది. ఆయేడు బరాక్ ఒబామా ఆ పురస్కారాన్ని ఎగరేసుకుపోయారు. ఈలోగా ఆ దయార్ధహృదయురాలిని ఆ భగవంతుడే కరుణించాడు. తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఎందరో పసికందుల ప్రాణాలను కాపాడిన ఆమెను తన అక్కున  చేర్చుకున్నాడు. 2008 లో ఆ కరుణామూర్తి   కన్నుమూసింది.        

No comments:

Post a Comment