Friday, 6 June 2014

పోల'వరమా'... శాపమా...? ఎందుకీ రాద్దాంతం...



పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వివాదస్పదంగా మారింది. పోలవరం ప్రాజెక్టుతో ముంపు ప్రాంతాలను రక్షించేందుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని నిపుణులు పదేపదే సూచిస్తున్నారు. కానీ.. మరే ప్రాజెక్ట్ విషయంలోనూ లేనన్ని అభ్యంతరాలు పోలవరం విషయంలో చాలా వస్తున్నాయి. అందుకే దీనిపై ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన, కేంద్రీకరించాల్సిన అంశంగా మారిపోయింది. ఎందుకు వివాదంగా మారిందంటే...


సాగు, తాగునీరే లక్ష్యంగా నిర్మాణం...

    పోలవరం ప్రాజెక్ట్ ప్రతిపాదనకు మూడు దశాబ్ధాల చరిత్ర వుంది. అప్పటి నుంచీ దీనిపై భిన్నాభిప్రాయాలు, వివాదాలు నడుస్తూనే వున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శంకుస్థాపన చేయడంతో వివాదాల తీవ్రత మరింత ముదిరింది.

    పోలవరం ప్రాజెక్ట్ ను 150 అడుగుల ఎత్తులో నిర్మించాలనుకున్నారు. ఇంత ఎత్తున నిర్మించాలని ప్రతిపాదించడంతో వివాదం మరింత రాజుకుంది. ఎందుకంటే సగటున గోదావరి వరదల సమయంలో 30 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వుంటుందన్న అంచనాతో దీనిని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్యలక్ష్యం ఉభయ గోదావరి జిల్లాలకు సాగు, తాగు నీటితో పాటు విశాఖకు సాగునీరు అందిచాలి. బ్యాక్ వాటర్ ద్వారా ఖమ్మం జిల్లాలలో కొంతభాగానికి సాగునీరు అందుతుందని చెబుతున్నారు. వీటితో 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మిస్తామంటున్నారు. ఇలాంటి మంచి లక్ష్యాలను విన్నప్పుడు దీనిపై ఎందుకు వ్యతిరేకత వస్తుందనేది ప్రధానమైనది.

 

పోలవరం రాకముందే జల ప్రళయం...


    ఇదే డిజైన్ తో పోలవరం నిర్మిస్తే విధ్వంసం జరుగనుంది. దీనిని అర్ధం చేసుకోవాలంటే 1986ను గుర్తు తెచ్చుకోవాలి. ఆ సంవత్సరం భయంకర జలప్రళయం అందరినీ భయోత్పాతానికి గురిచేసింది. ఆనాడు గోదావరిలో 36 లక్షల క్యూసెక్కుల వరద నీరు పోటెత్తింది. ఆనాటి వరదల్లో ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతమంతా మునిగిపోయింది. భద్రాద్రి రాములోరు కొలువుదీరిన భద్రాచలం దగ్గర గోదావరి అత్యంత ప్రమాదకర రీతిలో ప్రవహించింది. 76 అడుగుల ఎత్తులో ఎగిసెగిసి పడింది. దాంతో భద్రాచలం మొత్తం నీట మునిగింది. భద్రాచలం వీధులు నీటమునిగిపోయాయి. ఆయా ప్రాంతాల వాసులు నిలువనీడలేక అల్లాడిపోయారు. ఆనాటి జలప్రళయాన్ని స్థానిక ప్రజలు ఎప్పటికీ మరిచిపోకుండా చేసింది. ఆ జల ప్రళయాన్ని తలచుకొని ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతారు.

వస్తే... ఊహకందనిది...!

    అందుకే పోలవరం నిర్మించి తీరాలని కోరుకునేవారే ఆనాటి భయంకర అనుభవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. పోలవరం నిర్మిస్తే గోదావరిలో నిత్యం 43 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే ఎప్పుడూ మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి ప్రవహిస్తూ వుంటుంది. ప్రమాదం ప్రజల తలాపునే నిత్యం కదలాడుతుందని చెప్పకనే చెబుతుంది. మరి గోదావరి ఉగ్రరూపం దాలిస్తే జరగబోయే నష్టాన్ని ఎవరూ ఊహించలేం. భద్రాచలం కరకట్ట ఎందుకూ పనికిరాకుండా పోతుంది. పోలవరం నిర్మించిన తర్వాత వరదలొస్తే, భద్రాచలం దగ్గర ఎంతలేదన్నా 200 అడుగులకు మించి గోదావరి పరుగుతు పెడుతూనే ఉంటుంది. 65 అడుగులు దాటితేనే ఏజేన్సీ ప్రాంతమంతా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుంటోంది. అదే వరద 200 అడుగులకు చేరితే పరిస్థితి ఏమిటి? కనీసం భద్రాద్రి రాముడైనా క్షేమంగా వుండగలడా? ఇప్పుడు ఈ భయమే అక్కడి ప్రజలను వేధిస్తోంది.

నాటి జ్ఞాపకాలతో ప్రజల కళ్లల్లో కన్నీటి సుడులు...

    మూడేళ్ల క్రితం శ్రీశైలం ప్రాజెక్ట్ కు వచ్చిన వరదల కారణంగా కర్నూలు నగరమే మునిగిపోయింది. ఆ తరహా వరద పోలవరానికి వస్తే ఊహిస్తేనే ప్రజల కళ్లల్లో నీటి సుడులు తిరుగుతున్నాయి. గేట్లు మూస్తే ఖమ్మం జిల్లా, గేట్లు తెరిస్తే ఉభయ గోదావరి జిల్లాలు నీట మునుగుతాయని తెలుస్తోంది. పోలవరం నిర్మాణం డిజైన్ మార్చాలని నిపుణుల హెచ్చరికలు చేస్తున్నారు. కానీ పట్టించుకునేదెవరు?

''నిర్మాణ ప్రాంతం భూకంప జోన్'' నిపుణుల హెచ్చరిక...

    అంతేకాక పోలవరం విషయంలో కలవరపెడుతున్న మరో అంశం రాతిపొర లేకపోవడం. పోలవరం నిర్మాణ ప్రాంతంలో 200 అడుగుల లోతు వరకు కేవలం ఇసుక మాత్రమే వుంది. చూద్దామన్నా రాతిపొర జాడైనా కనిపించడం లేదు. ఈ అంశమే ఎక్కువగా భయపెడుతోంది. వీటన్నింటికీ మించి అసలు ప్రాజెక్ట్ నిర్మిస్తున్న ప్రాంతం భూకంపం జోన్ లో వుందని మరో పిడుగులాంటి వార్తను తెలియజేశారు.
గిరిజనులకు, ఆదివాసీలకు మరణ శాసనం...

    పోలవరం నిర్మిస్తే ఖమ్మం జిల్లాలో 278 నుంచి 370 గ్రామాల వరకు మాయమవుతాయి. దాదాపు లక్ష ఎకరాల్లో పంట పొలాలు జల సమాధి అవుతాయి. భారీ స్థాయిలో అటవీ ప్రాంతం కనుమరుగవుతుంది. ఇంతకాలమూ వన్ ఆఫ్ సెవంట్ చట్టం రక్షణలో ఒదిగిన గిరిజనులు, ఆదివాసీలు పునరావాసప్రాంతాల్లో తలదాచుకోవాల్సి వస్తుంది. భద్రాచలం కొండల్లో మాత్రమే కనిపించే కొండ రెడ్లకు తమ భూమి మీదే నిలువనీడలేని దయనీయ స్థితి ఎదురవుతోంది. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోవాల్సి వస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అపురూపమైన ఓ మానవ సమూహపు చరిత్ర మన కళ్లెదుటే జలసమాధి అవుతుంది. ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అరుదైన ఒక మానవ సమూహానికి మరణ శాసనం లిఖించాలా? మానవ నాగరికత మీదే మాయని మచ్చ వేయాలా? ప్రతిఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది.

ఇవే ప్రత్యామ్నాయాలు...

    ఇంతటి విధ్వంసాన్ని, ఒక మానవ సమూహపు చరిత్రలో అంతులేని విషాదాన్ని నింపుతున్న పోలవరం ప్రాజెక్ట్ తో మరో రకంగా తాగునీటి, సాగునీటి సమస్యలను పరిష్కరించుకోలేమా? దానికి ప్రత్యామ్నాయం లేదా? అంటే దానికి అనేక మార్గాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో ఏడు లక్షల 30 వేల ఎకరాలను నీరు అందించాలన్నది లక్ష్యం. ఇందులో అయిదు లక్షల ఎకరాలకు తాటిపూడి, పుష్కరం, చాగల్ నాడు ఎత్తిపోతల ద్వారా నీరు అందుతోంది. ఇక నికరంగా మిగిలింది రెండున్నర లక్షల ఎకరాల లోపే. దీనిపై ఇప్పుడు వివాదమంతా...

110 అడుగులకు కుదించడం...

    అందుకే పోలవరం ప్రాజెక్ట్ కు చాలా ప్రత్యామ్నాయాలున్నాయి. వీటిలో మొదటిది ప్రాజెక్ట్ ఎత్తును 110 అడుగులకు కుదించడం. ఈ ఒక్క పని చేస్తే ముంపు గ్రామాల సంఖ్య డెబ్చైకో, ఎనబైకో పరిమితమవుతుంది. ప్రాజెక్టు ఎత్తు తగ్గినా, అనుకున్న లక్ష్యం ప్రకారం తాగునీరు, సాగునీరు అందింవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బ్యారేజీల నిర్మాణం...


     మరో ప్రత్యామ్నాయం ఎక్కడికక్కడ బ్యారేజీలు నిర్మించడం. పోలవరం, కూనవరం, భద్రాచలం ఈ మూడు ప్రాంతాల్లో గోదావరి, శబరి నదులపై బ్యారేజీలు నిర్మిస్తే పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిన అవసరమే వుండదని నీటి పారుదలరంగ నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు బ్యారేజీల నిర్మాణం పూర్తిచేస్తే ఉభయ గోదావరి జిల్లాలకు పుష్కలంగా నీళ్లు ఇవ్వొచ్చు. ఈ మూడు బ్యారేజీలు కట్టే ప్రాంతం పోలవరం కట్టే ప్రాంతం కంటే ఎత్తులో ఉండడం మరో కలిసొచ్చే అంశంగా ఉంది. ఈ ప్రాంతాలు సముద్రమట్టం కంటే ఎత్తులో వుండడం వల్ల నీటి నిల్వకీ, నీటి తరలింపుకీ ఏ ఇబ్బందీ వుండదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఈ మూడు బ్యారేజీల కారణంగా శబరిపై 17 టీఎంసీలు, భద్రాచలం దగ్గర గోదావరిపై 25 టీఎంసీలు, పోలవరం దగ్గర 37 టీఎంసీలు నిల్వ చేయొచ్చు.

రిజర్వాయర్ల నిర్మాణం...

    వీటితో పాటు కృష్ణా డెల్టాకు నీరు తరలించేందుకు దుమ్ముగూడెం దగ్గర రిజర్వాయర్ నిర్మించవచ్చు. దీని ద్వారా ఖమ్మం జిల్లాతో పాటు కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీటిని తరలించే అవకాశం లభిస్తుంది. దుమ్ముగూడెం దగ్గర గోదావరికి కుడివైపు నుంచి భారీ కాలువ తవ్వితే కృష్ణానది నీటిని కూడా వాడుకునే అవకాశం లభిస్తుంది. ఈ కాలువను పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం వరకూ తవ్వితే ఇక తిరుగే వుండదు. ఎస్ఎల్బీసీ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతిక పరిజ్జానంతో పోలవరం దగ్గర టన్నెల్ నిర్మించి, కొండలను తొలిచేస్తే విశాఖకు కూడా నీటిని తరలించవచ్చు.

మాగోడు వినండి ...

    ఇంత స్పష్టమైన ప్రత్యామ్నాయం వున్నప్పటికీ, జాతీయ ప్రాజెక్ట్ గా పరిగణిస్తామంటున్న కేంద్రం ఆ దిశగా ఆలోచించకపోవడం దారుణమైన అంశంగా మారుతోంది. ఇప్పటికైనా పోలవరం ముంపు ప్రాంతాల విషయంలో కేంద్రం ప్రత్యామ్నాయ విధానాలను చేపట్టి ఆదుకోవాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.

No comments:

Post a Comment