Sunday, 15 June 2014

ప్రపంచ సాహిత్యంలో గొప్ప రచన గీతాంజలి...




భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ టాగోర్ . ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి వారు .    రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా గొప్ప మానవతావేత్తగా టాగూర్ చరిత్రలో నిలిచిపోయాడు. మాతృభూమి, మానవసంబంధాలపట్ల అచంచలమయిన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న విశ్వకవి' రవీంద్రనాథ్ టాగూర్.

                        రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913 వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. గీతాంజలి వెలువడిన తరువాత అన్ని దేశాలవారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ఆరంభించారు.

                       రవీంద్రనాధ టాగోరు డెబ్భై ఏళ్ళ ప్రాయంలో చిత్రకళా సాధనను ప్రారంభించాడు. ఆయన వేసిన చిత్రాలు లండను, ప్యారిస్, న్యూయార్కు మొదలగు నగరాలలో ప్రదర్శించబడ్డాయి. ఆయన దాదాపు రెండు వేల చిత్రాలను గీశాడు.
 
 
రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన మునుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు. ప్రాతఃకాలానే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం, ప్రార్థన చేయటం, నియమిత వేళలలో నిద్ర పోవటం వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవటం, పరిశుభ్రత, సత్యాన్నే పలుకుట, కాలినడక, పెద్దలను, గురువులను గౌరవించటం వారికి నేర్పేవారు. మనం  మన  విశ్వకవి గుణాలు  నేర్చుకుంద్దాం.

No comments:

Post a Comment