Monday, 16 June 2014

పాలమూరు పాపికొండలు...




పాపికొండలంటే గుర్తొచ్చేది గోదారమ్మే!
కానీ... అంతే స్థాయిలో కృష్ణమ్మ పొదువుకున్న సింగారాలున్నాయి !
ఎత్తయిన కొండల మధ్య... కృష్ణమ్మకు పచ్చని పట్టు చీరె కట్టినట్లుండే దుర్గమారణ్యం నడుమ...
 ప్రకృతి కుంచె దిద్దితీర్చిన ఓ అద్భుత చిత్తరువు... 
వంద కిలోమీటర్ల పొడవునా మెరిసిపోతూ మురిసిపోతుంటుంది!
పడవెక్కి బయల్దేరితే... ఆప్యాయంగా పలకరిస్తుంటుంది !
మొన్నటి దాకా పోలీసులు, మావోయిస్టుల తుపాకులు పలకరించుకున్న ప్రాంతం...  ఇప్పుడు జాలర్లు హైలెస్సా అంటూ పాడే పాటలకు మౌనంగా గొంతుకలుపుతున్నది !
అసలు అంతటి అద్భుత ప్రాంతం  కృష్ణమ్మకు సొంతమని చాలా తక్కువ మందికే తెలుసు!
అక్కడికి వెళ్ళేవారెవరు ? ఆ అందాలు వెలికి తీసి... బయట ప్రపంచానికి చాటేదెవరు ? భావి తెలంగాణలో మరో అద్భుత పర్యాటక ప్రాంతమయ్యేందుకు సకల అర్హతలూ ఉన్న ఒక ప్రకృతి నిలయాన్ని అత్యంత సాహసానికోర్చి... కన్నులారా చూసింది!
తన కళ్లతో తెలంగాణ ప్రజలకు అందిస్తున్నది !!

హైదరాబాద్‌ నుండి దాదాపు 170 కి.మీ. దూరం ప్రయాణిస్తే కొల్లాపూర్‌ (మహబూబ్‌నగర్‌ జిల్లా) పట్టణం వస్తుంది. అక్కడి నుండి మరో 8 కి.మీ. ముందుకెళితే పవిత్ర ఆలయాలకు నెలవైన సోమశిల, ఆ ఊరిని పెనవేసుకున్న కృష్ణానది దర్శనమిస్తాయి.

 

              ఇక్కడి నుండి నదిలో తూర్పు వైపునకు శ్రీశైలం రిజర్వాయరు వరకు సాగే ప్రయాణం... జీవితంలో ఒక మదురానుభూతిని మిగుతుస్తుంది. ఈ నదిలో నీరు పుష్కలంగా ఉండటం మూలంగా 8 నెలల పాటు జలవిహారం చేసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్‌ నుండి శ్రీశైలం వరకు ప్రభుత్వ పర్యాటక సంస్థే మరబోటులో ప్రయాణం నిర్వహిస్తున్నది.  సోమశిల నుండి సుమారు 10 గం.లపాటు నదిపై మరబోటు ప్రయాణం చేస్తే శ్రీశైలం డ్యాం, పాతాళగంగకు చేరుకుంటారు.
 
 
           కొండకోనల్లో కృష్ణానది వంపు సొంపులుగా తిరుగుతూ ప్రవహిస్తు ఉంటుంది. పచ్చటి కొండల మధ్య చుట్టూ కనిపించే దట్టమైన అటవి ప్రాంతాన్ని చూస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. పేరెన్నికగన్న పర్యటక ప్రాంతమైన పాపికొండలను తలదన్నేట్లుగా ఉన్న నల్లమల కొండల మధ్య కృష్ణా నదిలో  ప్రయాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసే పాలమూరులో పూర్తిగా వెనకబడిపోయిన కొల్లాపూర్‌ నియోజకవర్గం రూపురేఖలు మొత్తం మారిపోతాయి. తెలంగాణలోనే అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా మారడమే కాకుండా పెద్ద ఎత్తున మత్స్య సంపదకు మూల వనరుగా ఈ ప్రాంతం మారే అవకాశముంది. కొల్లాపూర్‌ సమీపంలో పుణ్యక్షేత్రమైన సోమశిల, అమరగిరి తదితర ప్రాంతాల నుండి శ్రీశైలం వరకు కూడా మరబోటులను ఏర్పాటు చేయవచ్చు.

No comments:

Post a Comment