ఆంతరంగిక విప్లవ ప్రతికూల శక్తులనూ, విదేశీ జోక్యపరుల అతిథేయ శక్తులనూ ప్రతిఘటించడానికి బాల్యావస్థలో ఉన్న సోవి యట్ రిపబ్లిక్ సాయుధ సైనిక పోరాటానికి నాయకత్వం వహించాడు. లెనిన్ మహాశయుడికి చేదోడు వాదోడుగా ఆధునిక పద్ధతిగల (బోల్షివిక్) పార్టీకి బలం చేకూర్చి, లెనిన్ ఆశ యాలనూ, విధానాలనూ విస్తృతపరిచి, 'మార్క్సి స్టు-లెనినిస్టు' సిద్థాంతాన్ని అభివృద్ధి చేశాడు.
స్టాలిన్ 1879లో 'రిపబ్లిక్ ఆఫ్ జార్జి యా'లో జన్మించారు. తండ్రి చెప్పులు కుట్టే వాడు. అతడు పుట్టుబానిస. స్టాలిన్ పూర్తి పేరు విస్సరియోనోవిచ్ జుగస్‌విలి. తొమ్మిదేళ్ల ప్రాయంలో ఆయన ఒక చర్చి పాఠశాలలో చేరాడు. అంతకుముందు చాలాకాలంగా ఆ విద్యాలయంలో బలహీనవర్గాల వారిని చేర్చు కునేవారుకాదు. అయితే అక్కడి అధ్యా పకులు అతడొక ఉత్తమ బాలుడని గుర్తించారు. ఆత్మవిశ్వాసం, ఇతరులను మించాలనే కాంక్ష అతడిలో ఉన్నట్లు గమనించారు. 1888 నుంచి 1894 వరకూ ఆ పాఠశాలలో విద్యనభ్య సించాడు. అక్కడి అధ్యాపకుడు, మతగురువు సిపార్సు చేసి టైఫిన్ మతబోధనాలయంలో స్టాలిన్‌కు ఉపకార వేతనం తెప్పించారు. చురు కైన జార్జియన్ యువకుల్లో రష్యన్ జాతీయ వ్యామోహాన్ని జొప్పించడానికి ఆ బోధనా లయంలో ప్రయత్నం జరుగుతుండేది. స్టాలిన్ పదిహేనేళ్ల వయస్సులో అందులో చేరాడు. కానీ అక్కడి జీవితం అతడికి కఠోరంగా కనిపించింది. విద్యార్థుల కార్యకలాపాల గురించి తెలుసుకు నేందుకు ఉపాధ్యాయులే గూఢచారుల్లా పనిచేసే వారు. లౌకిక గ్రంథాలను సైతం విద్యార్థులను చదవనిచ్చేవారు కాదు. ఆ విద్యాలయంలో చేరిన మూడో సంవత్సరంలో విక్టర్ హౌగో పుస్తకాలను చదువుతున్న పాపానికి స్టాలిన్‌ను శిక్షించే గదిలో ఉంచారు.
అప్పట్నించి స్టాలిన్ నిషిద్ధ గ్రంథాలను మరింత ఎక్కువగా చదువుతుండేవాడు. 'తాత్వి కులు ప్రపంచానికి వ్యాఖ్యానం మాత్రమే చెప్పారు. ప్రపంచాన్ని మార్చడం మనవంతు' అన్న కారల్ మార్క్స్ మాటలను ఓ గ్రంథంలో స్టాలిన్ చదివాడు. ఆ గ్రంథ ప్రభావంతో ఒక రహస్య సోషలిస్టు సంస్థలో (మార్క్సిస్టు రివల్యూషనరీ గ్రూప్) సభ్యుడిగా చేరాడు. రైల్వే కార్మికులను సంఘటిత పరిచేందుకు తోడ్డడ్డాడు. ఫలితంగా ఆ బోధనాలయం నుంచి 1899లో వెళ్లగొట్టబడ్డాడు. 'నా సాంఘిక స్థితిని బట్టి, ఆ బోధనాలయంలోగల నిర్దాక్షిణ్య ప్రవర్తన, నిర్బం ధ విధానాలను బట్టి నేను మార్క్సిస్టు నయ్యాను' అని స్టాలిన్ ఓ సందర్భంలో చెప్పుకున్నాడు. రహస్య సోషలిస్టు సంస్థలో అనేక పేర్లతో వ్యవహరిస్తూ కార్మిక సంఘ కార్యకర్త అయ్యాడు. తోటి కామ్రేడ్స్ ఆయనకు 'స్టాలిన్' (ఉక్కు మనిషి) అని నామకరణం చేశారు. అప్పటి నుండి జుగస్‌విలి స్టాలిన్‌గా మారాడు. 1904లో 'యకటిరినా స్పాన్‌డీజ్' అనే యువ తిని వివాహమాడాడు. ఆరేళ్ల తరువాత ఆమె ఆనారోగ్యంతో మరణించింది.
స్టాలిన్‌ను అనేకసార్లు అరెస్టు చేశారు. నాలుగుసార్లు ఆయనను ఆర్కిటిక్ ప్రాంతం లోగల వివిధ ప్రదేశాలకు ప్రవాసం పంపారు. నాలుగుసార్లూ ఆయన తప్పించుకొని బయట పడ్డాడు. 1913లో అయిదోసారి ఆయనను ఆరెస్టు చేసి ఉత్తరాదిలోగల యెనేసీ నది ఆర్కిటిక్ సముద్రంలోకి ప్రవహించేచోట నిర్బంధించారు. ప్రవాసంలో ఆయన అధ్య యనం చేశాడు. రాశాడు. రష్యన్ పరిపాలన కింద నలిగిన జార్జియన్ అయినందున ఆయన జాతుల సమస్యను గురించి ప్రత్యేకంగా అధ్య యనం చేశాడు. ఆ సమస్యలపై ఆయన రచనలు బోల్షివిక్కులకు బాగా పరిచయమే. 1917లో సోషలిస్టు మహా విప్లవం జయప్రదం అయ్యాక రష్యనేతర జాతుల వ్యవహారాలను చూసేందుకు స్టాలిన్‌ను 'జాతుల కమిసార్'గా నియమించారు.
1922లో స్టాలిన్ బోల్షివిక్ పార్టీకి ప్రధా న కార్యదర్శి అయ్యాడు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగానూ, ముఖ్యనాయకులు ఐదుగురిలో ఆయన ఒకడయ్యాడు. లెనిన్, కామినీవ్, ట్రాట్క్సీ, బుఖారిన్, స్టాలిన్.... ఈ ఐదుగురూ పార్టీ విధానాన్ని రూపొందించేవారు. అందరూ గుర్తించిన ముఖ్యుడు లెనిన్. అనేక బాధ్యతల్లో లెనిన్‌కు కుడి భుజంగా ఉండేవాడు కామినీవ్. అంతర్యుద్ధ వ్యవహారాలు చూసేవాడు ట్రాట్క్స్రీ. ప్రచారాందోళన పని బుఖారిన్‌ది. జినోవివ్ అంతర్జాతీయ వ్యవహారాలు చూసేవాడు. స్టాలిన్‌కు పార్టీ నిర్మాణ బాధ్యత అప్పగించారు. స్టాలిన్ నెమ్మదిగా ప్రజాజీవితంలోని ప్రతి ప్రజారంగంలోనూ పార్టీ అజమాయిషీ ఏర్పరి చాడు. దీంతో ట్రేడ్ యూనియన్ ఉద్యోగుల్లో కమ్యూనిస్టుల సంఖ్య 27 నుంచి 57 శాతానికి పెరిగింది. సహకార సంఘ సిబ్బందిలో ఐదు నుంచి 50 శాతం పెరిగింది. సైనికోద్యోగుల్లో 16 నుంచి 24 శాతానికి పెరిగింది. అన్ని సంస్థలూ పార్టీ అధీనంలోకి వస్తున్నాయి. అయితే పార్టీలో ఎక్కువ వాదనా స్వేచ్ఛ కావాలంటూ కొన్ని ముఠాలు బయటపడ్డాయి. సమ్మెలూ బయలుదేరాయి. దీనిపై స్టాలిన్, 'పార్టీ అంటే వాగ్వాద సమితి కాదు. సామ్రా జ్యవాద తోడేళ్లు రష్యా చుట్టూ పొంచి ఉండగా, అన్ని ముఖ్య విషయాలూ 20 వేల పార్టీ కమిటీల్లో చర్చించాలంటే పార్టీ తురుపు ముక్క లన్నింటినీ శత్రువు ముందు వెల్లడించడమే' అని చెప్పాడు. స్టాలిన్ నేతృత్వంలో జాతీయ ప్రయో జనాలు, విప్లవ ప్రయోజనాలు కాపాడబడు తున్నాయని పార్టీ భావించింది.
మరోవైపు ప్రజానేపథ్యాన్ని పరిశీలిస్తే..జారు చక్రవర్తులు పాలించిన రష్యాలో పంటలు లేవు. ఆధునిక ఉత్పత్తి పరికరాలు లేవు. ఆదనపు ఉత్పిత్తి లేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా కూలిపోయింది. వస్తు సంపద నశించి పోయింది. ఆహారం అతి స్వల్పంగా మాత్రమే ఉంది. నైపుణ్యంగల కార్మికులు లేరు. రైతుల వద్ద పశుగణం నశించిపోయింది. పాఠశాలలు తక్కువ. అక్కడి రైతు బిడ్డలు పాఠశాలలకు పోలేని స్థితి. వారికి దుస్తులూ ఉండేవి కాదు. అలాంటి స్థితిలో లెనిన్ రష్యాను ఆర్థికంగా పునరుజ్జీవింప చేసేందుకు 'నెప్' అనే నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టాడు. సోషలిస్టు సహకార ఉత్పత్తులకేగాక పెట్టుబడిదారీ ఉత్పత్తికి కూడా ఆ విధానం అవకాశం ఇచ్చింది. బాగా పతనమై పడున్న రైల్వేలనూ, గనులనూ, భారీ పరిశ్రమలనూ ప్రభుత్వం తన చేత పెట్టుకొంది. చిన్న పరిశ్రమల్లోనూ, దుకాణా ల్లోనూ, క్షేత్రాల్లోనూ వ్యక్తిగత యాజమాన్యం కొనసాగింది. 1924 జనవరి నాటికి ఉన్న పరిస్థితి అది. సరిగ్గా అలాంటి సమయంలో లెనిన్ కన్నుమూశాడు.
1924 జనవరి 24న లెనిన్ చనిపోయినప్పుడు అంత్యక్రియలకు స్టాలిన్ నాయకత్వం వహించాడు. లెనిన్ భార్య, కొందరు బోల్షివిక్ మేథావులు వద్దని వారిస్తున్నా వినకుండా లెనిన్ పార్థివ దేహాన్ని రెడ్‌స్క్వేర్‌లో పదిలపర్చాడు. విప్లవ మహానేత లెనిన్ సహజ స్వరూపాన్ని చూస్తూ రైతాంగ స్వభావం ఎక్కు వకాగల రష్యన్ ప్రజలు ఎంతగా ఊగిపోగలి గారో అనేకమంది బోల్షివిక్కుల కంటే స్టాలిన్ బాగా అర్థం చేసుకున్నాడు. కోట్ల కొలది ప్రజలు ఆ మసోలియంలో లెనిన్‌ను చూస్తూనే అపరిమి తోత్సాహాన్ని పొందుతుండటమే ఇందుకు ప్రబల నిదర్శనం. లెనిన్ మరణానంతరం స్టాలిన్ విధానాలపై ట్రాట్క్స్రీ తదితరులు పెద్ద దుమారం లేపారు. పార్టీ విధానానికి సంబంధించిన అనేక ముఖ్య నిర్ణయాల సందర్భంలో ఆయన తన ప్రత్యర్థులనందరినీ ఓడించాడు. ఒకరి తరువాత ఒకర్ని ట్రాట్క్స్రీ, జినోవీవ్, బుఖారిన్, రైకోవ్‌లను పొలిట్‌బ్యూరో నుంచి తొలిగించాడు. ఆ తరు వాత పశ్చాతాపం వ్యక్తం చేసిన కొందరు నేతలను పార్టీలోకి తీసుకొని బాధ్యతలు ఆప్పగిం చాడు. తన కృషి మానవాళి ఉజ్వల భవిష్యత్తు వైపుకు కొనిపోతుందనే విశ్వాసం స్టాలిన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విశ్వాసాన్ని అందరికీ కలిగించాడు. స్టాలిన్ 'లెనినిజం పునాదులు', 'బోల్షివిక్ పార్టీ చరిత్ర' అనే మహత్తరమైన పాఠ్య గ్రంథాలను రచించి సిద్ధాంత పునా దులను గట్టిపరిచాడు. విప్లవ ఎత్తుగడలు ఆయన కరతలామకంగా విశదీకరించాడు. గతితార్కిక చారిత్రక భౌతికవాదాన్ని అయన అద్భుతంగా వివరించాడు.
లెనిన్ తరువాత స్టాలిన్ దేశాధినేత అయ్యాడు. సోషలిజం సిద్థాంతాన్ని ప్రగాఢంగా విశ్వసించిన స్టాలిన్, రష్యాలో దాన్ని పటిష్టం చేయబూనాడు. పెట్టుబడిదారీ పద్ధతులను సమూలంగా నాశనం చేసి ప్రజలకు సాంఘిక- ఆర్థిక న్యాయాన్ని చేకూర్చడానికి చక్కని పథకాలను రూపొందించాడు. లెనిన్ ప్రారంభిం చిన నూతన ఆర్థిక విధానం రష్యా ఆర్థిక వ్యవస్థకు కొంత పటిష్టతను కలిగించడంతో స్టాలిన్ ప్రభుత్వం చేపట్టిన నూతన ఆర్థిక కార్యక్రమాలకు మార్గం సుగమం అయ్యింది. పంచవర్ష ప్రణాళికల ద్వారా స్టాలిన్ రష్యా పారిశ్రామిక, వ్యవసాయ పురోభివృద్ధికోసం అవిరళ కృషి చేశాడు. రష్యా పారిశ్రామికంగా చాలా వెనుకబడి ఉంది. అక్కడ సహజ సంపద అధికంగా ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగం చేయలేదు. కొత్త పారిశ్రామిక విప్లవాన్ని ప్రవేశపెట్టి దేశాన్ని స్యయం సమృద్ధంగా, శక్తిమంతంగా తీర్చిదిద్ది ప్రజలకు ఉద్యోగావకాశాలను కల్పించి నిరుద్యోగాన్నీ, నిరుపేదరికాన్నీ రూపుమాపడానికి నిర్ణయించాడు. స్టాలిన్ 1928లో మొదటి పంచవర్ష ప్రణాళిక ఆరంభించాడు. దీనిలో పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇనుము, బొగ్గు, పెట్రోలియం, ఉక్కు కర్మాగారాలు, ట్రాక్టర్లు, యంత్రాలు, విద్యుచ్ఛక్తి మొదలైనవాటి ఉత్పత్తిని పెంపొందింపచేశాడు. పెద్ద పెద్ద ఆనకట్టలను నిర్మించి విద్యుచ్ఛక్తిని అధికమొత్తంలో తయారు చేసే బృహత్పథకాన్ని అవలంబించాడు. దీంతో పట్టణ, గ్రామ ప్రాంతాలకు విద్యుదీకరణ సమృద్ధిగా జరిగింది.
దేశంలో పారిశ్రామికోత్పత్తికి కార్మికులను ప్రోత్సహించడానికి పనికి తగిన వేతనాలను నిర్ణయించాడు. నేర్పరులైన కార్మికులకు తమ శ్రమకు అనుగుణంగా పెద్దమొత్తాల్లో వేతనాలు లభించాయి. కొన్ని కర్మాగారాల్లో అసమర్థతతో కూడిన లంచగొండి యాజమాన్యాలు ఉండటం తో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి పెరగలేదు. దీంతో అసమర్థ యజమానుల మీద చర్య తీసుకున్నాడు. మొదటి పంచవర్ష ప్రణాళిక 1933లో పరిసమాప్తి అయ్యింది. రెండో పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. ఇందులో మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రాముఖ్యత నిచ్చిన పరిశ్రమలు ఇంకా వృద్ధి చెందేటట్లు చేసి, నిత్య జీవితావసర వస్తువుల ఉత్తత్తిని పెంచి, ఆంతరంగిక రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేశాడు. ఈ ప్రణాళిక 1938లో ముగిసింది. అదే ఏడు ప్రారంభమైన మూడో పంచవర్ష ప్రణాళికలో సాంకేతికాభివృద్ధికి ప్రాముఖ్యతనిచ్చాడు. సహజ వనరులను సక్ర మంగా ఉపయోగించుకొని, పారిశ్రామిక వ్యవ సాయాభివృద్ధిని సాధించి రష్యాను శక్తిమంతమైన దేశంగా మార్చాడు. దేశంలో నిర్బంధ, ఉచిత విద్యా విధానం కమ్యూనిస్టు పద్ధతిలో అమలు చేశాడు. ప్రజల సాంఘిక సాంస్కృతిక రంగాల్లో అద్భుతమైన మార్పులొచ్చాయి. ఇందులో మహిళల స్థాయి మారడం ఒకటి. మహిళలకు రాజకీయంగానూ, శాసనపూర్వకంగానూ సమాన త్వాన్ని ప్రసాదించింది. స్టాలిన్ అవిరళ కృషి ఫలితంగా రష్యా ప్రతిరంగంలోనూ ప్రగతిని సాధించింది. ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఆవిర్భవించింది. శ్రామికవర్గ నియంతృత్వ స్థాపనే లక్ష్యంగాగల స్టాలిన్, 1936లో రాజ్యాంగానికి సవరణలు చేసి, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలను కమ్యూనిస్టు పార్టీ అధీనంలో ఉంటేటట్లు చేశాడు. 'యూనియన్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్' (యుఎస్‌ఎస్‌ఆర్) రాజ్యంగా తీర్చిదిద్డాడు.
1941 జూన్ 22న జర్మనీ నాజీ నియంత హిట్లర్ సోవియట్ యూనియన్‌పై దండయాత్రకు పూనుకున్నాడు. వేలకొలది నాజీ విమానాలు సోవియట్ విమానాశ్రయాలపై బాంబులు వేశాయి. వేలకొలది టాంకులు సరిహద్దులను బద్దలు కొట్టుకొని నడిచాయి. లక్షల కొలది ఫిరం గి దళాలు, సైనిక దళాలు వెనుక నడిచాయి. ప్రపంచ చరిత్రలోకెల్లా పెద్ద సైనిక దాడిగా దాన్ని హిట్లర్ పేర్కొన్నాడు. యుద్ధరంగంలో 90 లక్షల మంది సైనికుల్ని దింపాననీ, ఇంకా లక్షోపలక్షల మంది రిజర్వులో ఉన్నారనీ హిట్లర్ వెల్లడించాడు. ఈ దండయాత్రలో సోవియట్ కొంత భూభాగం నాజీల ఆక్రమణలోకి వెళ్లిందని స్టాలిన్ రేడియో ప్రసంగంలో ప్రజలకు తెలిపాడు. మూడేళ్లపాటు సాగిన ఆ మహా యుద్ధంలో హిట్లర్ మూకలు స్టాలిన్ నేతృత్వం లోని రష్యన్ సేనల ముందు నిలువలేక 1944లో సోవియట్ సరిహద్దుల నుంచి పారి పోక తప్పలేదు. హిట్లర్ ఆత్మహత్యతో నాజీల శకం ముగిసింది. స్టాలిన్ ఒక్క సోవియట్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడే కాదు. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు కూడా. ఆయనను అనేక దేశాల కమ్యూనిస్టు నేతలు కలిసి తమ దేశాల ఉద్యమ ఎత్తుగడలపై చర్చించి ఆయన సూచనలూ, సలహాలూ తీసుకునేవారు. 'మార్క్సిజం-లెనినిజం'కు సిద్ధాంతంలోనూ, ఆచరణలోనూ మహౌపాధ్యాయుడనదగిన స్టాలిన్ 1953లో కన్నుమూశారు.
No comments:
Post a Comment