Monday, 9 June 2014

ఆలంపూర్



జోగులాంబ అనే దేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆలంపూర్‌ అనే ఈ ఊరు పరిపాలనాపరంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉంది. ఇది కర్నూలు నుంచి కేవలం ముప్పై కి.మీ. దూరం. కర్నూలు నుంచి ఆలంపురానికి వెళ్ళే మార్గంలో తుంగభద్రనది ఉంది. ఆలంపురానికి అక్కడ ఉన్న నవబ్రహ్మ ఆలయాలవల్లనే ప్రసిద్ధి ఏర్పడింది.

క్రీ.శ. తొమ్మిది, పదవ శతాబ్దాల కాలంలో చాళుక్య చక్రవర్తుల చేత నిర్మింపబడిన ఈ ఆలయాలు శిల్ప శాస్త్రజ్ఞుల చేత గొప్ప కట్టడాలుగా పేరు తెచ్చుకున్నాయి. అయితే జోగులాంబకు ఇక్కడ ఇంతకుముందు వరకూ ప్రత్యేకంగా ఆలయం లేదు. ఇక్కడ వున్న నవబ్రహ్మేశ్వరాలయాలలో ప్రధానమైన బాలబ్రహ్మేశ్వరాలయంలోనే ఒక ప్రక్కగా ఉన్న ఒక చిన్న గదిలో, ఒక గూడు వంటిది ఏర్పాటు చేసి, అందులోనే అమ్మవారిమూర్తిని ఉంచి పూజలు చేస్తూ ఉండేవారు. ఈ మధ్యనే అమ్మవారికి ప్రత్యేకంగా ఆలయం నిర్మించారు. అష్టాదశ శక్తిపీఠాలు అనబడే పద్దెనిమిదింటిలో నాలుగు మన రాష్ట్రంలోనే ఉండటమూ అందులో ఈ జోగులాంబ కూడా ఒకరు కావడం తెలుగువారు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విశేషమే. అలంపురం చిన్న ఊరు. అందువల్ల వసతి సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. కర్నూలు నుంచి వచ్చి దర్శించుకుని తిరిగి వెళుతుంటారు భక్తులు.

No comments:

Post a Comment