Wednesday 18 June 2014

పొదుపు మంత్ర ! మనీ సూత్రం




నిత్య జీవితంలో 'డబ్బు' పాత్ర తెలియంది కాదు. 'ధనం మూలం ఇదం జగత్‌' అన్న నానుడి ఈ నాటిది కాదు. పైసా పవర్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. క్లాసు... మాసు... అన్న తేడా లేకుండా... తెల్లారి లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మన ప్రయాణం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనకి అనేక అవసరాలు, అత్యవసరాలు కలుగుతూ వుంటాయి. అలాంటి మనీ కోసం కొద్దిపాటి జాగ్రత్తలు పాటించకపోతే కష్టమే. వాటిలో డబ్బు సంపాదన పెంచుకోవడం ఒక కీలకాంశమైతే... వున్నంతలో తెలివిగా పొదుపు చేయడం విశిష్టాంశం. 


మన పనులు మనమే

కారణాలు ఏమైతేనేం! రోజు రోజుకీ పెట్రోల్‌ ధర ఆకాశాన్ని అంటుతోంది. అంతేకాక ఈ రోజుల్లో ప్రతి కాలనీలోనూ సూపర్‌ మార్కెట్లు విరివిగా పుట్టుకొస్తున్నాయి. అవి ఇంచుమించు నడిచి వెళ్లడానికి వీలైనంత దూరంలోనే... మనకి అందుబాటులో వుంటున్నాయి. కాబట్టి వాహనాలకు కొంత విశ్రాంతినిచ్చి, కుటుంబ సభ్యులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్లొస్తే ఆ హాయే వేరు కదా! మనసుకు ప్రశాంతత, మనీకి పొదుపు. ఒకరికొకరం దగ్గరగా వున్న భావనా కలుగుతుంది.
మ్రనింట్లోని ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం ద్వారా వాటి దుమ్ము, ధూళి వంటివి పోతాయి. వాటి మన్నిక బాగుండడంతో పాటు ఎటువంటి మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉండదు. అనవసర రిపేర్లు లేకపోతే అనవసర ఖర్చులు వుండవన్నమాటే కదా!
ద్విచక్ర వాహనం, కారు... శుభ్రపరచుకోడానికి మెకానిక్‌కి ఖర్చుపెట్టే బదులు మీరే శుభ్రం చేసుకుంటే సంతృప్తితో పాటు శారీరక వ్యాయామం కూడా కలుగుతుంది. దీనివల్ల మీ వాహనాన్ని రెగ్యులర్‌గా చెక్‌ చేసుకోగలుగుతారు. 


న్రడిచి వెళ్లడానికి సాధ్యపడని ప్రదేశాలకు కారులోనో, బైకులోనో, ఆటోలోనో వెళ్లే బదులు బస్సులోనో, రైలులోనో వెళ్తే పెట్రోల్‌ ఆదాతో పాటు మనీ కూడా సేవ్‌ చేసిన వారవుతారు. కాలుష్యాన్నీ తగ్గించిన వారవుతారు.


కరెంటు బిల్లు తగ్గాలంటే...

ఈ రోజుల్లో ఎంతోమంది పొద్దున లేవగానే కంప్యూటర్‌ ఆన్‌ చేస్తుంటారు. అలా ఆన్‌ చేసిన కంప్యూటర్‌ చివరికి రాత్రి పడుకునే వరకు అలా ఆన్‌లోనే ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ఇదే విధానాన్ని అవలంభించేవారైతే ఈ పద్ధతికి స్వస్తి చెప్పండి. మీకు అవసరమైన సమయంలో మాత్రమే కంప్యూటర్‌ ఆన్‌ చేసి వాడుకొన్నట్లయితే కరెంటు బిల్లు తగ్గించడం తో పాటు, కంప్యూటర్‌ జీవితకాలాన్ని కూడా పెంచినవారవుతారు.

కరెంటు బిల్లు అధికంగా రావడానికి మరో కారణం నిరంతరం టీవీ ఆన్‌ చేసి ఉండడం. ఇంట్లో మరో పనిలో వున్నాసరే టీవీ అలా నడుస్తూనే వుంటుంది. వీలయినంత వరకు మనం చూడనప్పుడు దానికి విశ్రాంతినివ్వడం మంచిది.


ఒక గదిలో పని చేసుకుంటున్నప్పుడు మిగిలిన గదుల్లోని లైట్లు ఆఫ్‌ చేయండి. దీని ద్వారా కరెంటు బిల్లు ఆదా చేయడమే కాకుండా లైట్ల తాలూకా ఎనర్జీ లెవెల్స్‌ కూడా పెంచొచ్చు.


స్థోమతు వున్నవారికి వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటివల్ల కరెంటు బిల్లు బాగా ఆదా అవుతుంది.
వాషింగ్‌మెషీన్‌లోని డ్రైయర్‌ని తక్కువగా వాడడం ద్వారా మెషిన్‌ జీవిత కాలం పెరగడంతో పాటు కరెంటు ఖర్చు కూడా బాగా ఆదా అవుతుంది. మనది ఉష్ణమండల దేశమే కాబట్టి...దాని అవసరం తక్కువ.... అనేకంటే వుండదనుకోవచ్చు. ఒకసారి వాటిని తడపడం పూర్తయిన తర్వాత ఆరు బయట ప్రదేశాల్లో ఆరబెట్టడం వల్ల తేమ పూర్తిగా పోవడంతో పాటు ఎటువంటి క్రిములు కూడా దరిచేరవు.
ఫ్రిజ్‌ డోర్‌ అనవసరంగా తెరిచి ఉండడం ద్వారా దాని ఉష్ణోగ్రతలో మార్పులు సంభవిస్తాయి. దానికనుగుణంగా విద్యుత్‌ భారం అధికమవుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే చిన్న పిల్లలు అనవసరంగా ఎక్కువసార్లు ఫ్రిజ్‌ తెరిచే అవకాశముంది. కాబట్టి వారికి ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడంతో పాటు ఫ్రిజ్‌ డోర్‌ లాక్‌ చేయడం మంచిది.


నిరంతరం ఫ్యాన్‌ గాలికి, ఎయిర్‌ కండీషన్‌కు అలవాటు పడే బదులు పూర్తిగా కిటికీలను తెరిచినట్లయితే సహజ వాయువుతో పాటు కరెంటు బిల్లు కూడా బాగా ఆదా అవుతుంది. గదిలోని ఉష్ణోగ్రత కూడా తగ్గి చల్లగా ఉంటుంది.


బ్యాంకు ఆదాలు

నేడు బ్యాంకుల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ దృష్ట్యా అనేక బ్యాంకులు జీరో బ్యాలన్స్‌ పథకాన్ని ఖాతాదారులకు అందిస్తున్నాయి. అలాంటి ఎకౌంటు పొందడం ద్వారా మీ ప్రతి రూపాయిని మీరు ఆదా చేసుకోవచ్చు. మీ ప్రతి రూపాయి మీద ఆదాయాన్ని కూడా పొందొచ్చు.
అవసరానికి మించి వస్తువులను క్రెడిట్‌కార్డు ద్వారా కొనడం వల్ల ఒక వస్తువుపై మీరు చెల్లించే పైకం డబ్బులిచ్చి కొన్నదానికంటే అదనంగా వుంటుంది. ఎందుకంటే క్రెడిట్‌ కార్డుపై విధించే వడ్డీరేటు చాలా ఎక్కువ. కాబట్టి వీలయినంత వరకు డబ్బులు చెల్లించి గాని, డెబిట్‌ కార్డు ద్వారా కాని షాపింగ్‌ చేయొచ్చు.
నీరు...ఆహారం... అవసరం మేరకే

 
కొంతమందికి నీటిని వృధా చేస్తున్నామన్న స్పృహే వుండదు. షేవింగ్‌ చేసుకున్నంత సేపూ ట్యాపులో నీళ్లు అలా పోతూనే వుంటాయి. స్నానం చేసినా అంతే! బాత్‌రూమ్‌లోకి వెళ్లిన దగ్గర నుంచి బయటపడే వరకు బక్కెట్లో నీళ్లు అలా ఒలికిపోతూనే వుంటాయి. ఇక గిన్నెలు కడిగినా, ఇల్లు కడిగినా, బట్టలు ఉతికినా ఈ రేంజ్‌లోనే నీటిని వృధా చేసేవారు కొందరుంటారు. ఈ విధంగా నీటిని వృధా చేయడాన్ని ఆపుచేయాలి. దీని ద్వారా నీటిని ఆదా చేయడమే కాదు, మోటారు వాడకం తగ్గుతుంది. తద్వారా కరెంటు బిల్లు భారం తగ్గుతుంది. మోటారు వాడకం తగ్గడం ద్వారా దాని మన్నిక పెరుగుతుంది. దీని ద్వారా అనవసర పెట్టుబడులు పెట్టే అవసరం ఉండదు. 


ఇంట్లో ఎందరున్నారు? ఎవరు ఎంత తింటారు? అన్న అంచనా వంట చేసేవారికి తప్పక వుండాలి. అంచనాలకు మించి వండడం...ఫ్రిజ్జుల్లో పెట్టి తినలేకపోవడం...పడేయడం... అవసరమా చెప్పండి? ఎప్పటికప్పుడు వేడివేడిగా తినగలిగినంత మాత్రమే ఒండుకుంటే ఖర్చూ తగ్గుతుంది. ఆరోగ్యం కూడానూ. ఇదే పండుగలకి, పబ్బాలకి, ఇంటికి అతిథులు వచ్చిన సందర్భాల్లోనూ జరుగుతుంటుంది.
హోటళ్లలో, రెస్టారెంట్లలోనూ రోజు తినే కన్నా, ఇంట్లోనే వంట చేసుకుని తినడం ద్వారా ఆర్థికంగానే కాక, ఆరోగ్యరీత్యా కూడా చాలా మేలు చేస్తుంది. హోటళ్లలో వివిధ రకాల నూనెల్లో వండడంవల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. 


ఇల్లే కదా స్వర్గసీమ

వారాంతాల్లో సరదాగా సమయాన్ని గడపాలనుకున్నప్పుడు కేవలం హోటళ్లకి, రెస్టారెంట్లకీ వెళ్లకుండా ఇంటివద్దనే స్నేహితులను పిలిచి ఆనందంగా గడపొచు ్చ. అంతా కలిసి మెలసి ... ఇంటి దగ్గరే స్నాక్స్‌, ఏర్పాటు చేసుకోవడం ద్వారా చాలా వరకు సొమ్ము ఆదా చేయవచ్చు. ఇంట్లోనే ఆడుకునే కొన్ని రకాల ఆటలను కూడా తయారు చేసుకుని సరదాగా గడపొచ్చు. ఇలా వంతుల వారీగా మిత్రుల ఇళ్లలో కలుసుకుంటే భారం ఒకరి మీదే పడే అవకాశముండదు. బయటికెళ్లిన తృప్తీ మిగులుతుంది.
సినిమా థియేటర్లకి కుటుంబంతో కలిసి చూడడానికి వెళ్తే ఈ రోజుల్లో ఎంత ఖర్చవుతుందో వేరే చెప్పక్కర్లేదు. ఆ ఖర్చులో కొంత సొమ్ము వెచ్చించి ఇంటిదగ్గరే డివిడి ద్వారా అందరూ కలిసి కూర్చొని హాయిగా సినిమా చూడొచ్చు. థియేటర్‌కి వెళ్లడానికి అయ్యే ట్రాన్స్‌పోర్టు ఖర్చులతో సింపుల్‌గా సినిమా చూడొచ్చు.


ఆరోగ్యమే మహా'భాగ్యం'

ఈ రోజుల్లో మందుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏమాత్రం అనారోగ్యం పాలైనా వంటితోపాటు, జేబుకూ చిల్లు పడుతుంది. కాబట్టి మందుల జోలికి పోయే కన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం. దీని కోసం చక్కని ఆహారపు అలవాట్లను కలిగి ఉండడం అవసరం.
ఎప్పుడూ మీతో వాటర్‌బాటిల్‌ తీసుకెళ్లడం ద్వారా ప్రతిసారీ నీటిని కొనే అవసరం ఉండదు. ఇది మీ దాహాన్ని తీర్చడంతో పాటు మీ జేబు ఖర్చును కూడా తగ్గిస్తుంది. పరిశుభ్రమైన నీటినీ తాగగలుగుతాము.
మనసుని ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంచుకోడానికి యోగా, ధ్యానం వంటి ప్రక్రియలు మంచివి. ఇవి ఇంటి దగ్గరే అభ్యసించడం ద్వారా స్పా, మసాజ్‌ పార్లర్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వీటి ద్వారా మన ఖర్చులో చాలా వరకు ఆదా చేసుకోవచ్చు.


తోటపని ద్వారా శరీరానికి తగినంత వ్యాయామం లభించడంతో పాటు ఇంటి దగ్గరే కూరగాయలు వంటివి కూడా పండించుకోవచ్చు. తద్వారా కూరగాయల వంటి ఖర్చులలో కొంతవరకు ఆదా చేయడానికి అవకాశం లభిస్తుంది. ఆరోగ్యవంతమైన తాజా కూరగాయలు కూడా లభిస్తాయి.
మద్యపానం, ధూమపానం, గుట్కా, వంటి దురలవాట్లను వదిలిపెట్టడం ద్వారా ప్రతి నెలా పెద్దమొత్తంలోనే డబ్బు ఆదా చేయొచ్చు. ఆరోగ్యానికి చేటు చేసే అటువంటి అలవాట్ల వల్ల... ఆరోగ్యానికి తూట్లు పడడమే కాకుండా ... ఆర్థికం రీత్యా కూడా జేబులు ఖాళీ అవుతాయి.


కొనుగోళ్లలో మెలకువలు

నెలలో ఒక రోజు వీలు చూసుకుని సామాన్ల లిస్టు తయారు చేసుకుని, హోల్‌సేల్‌ ధరలకే అమ్మే దుకాణంలో వీలయినన్ని సామాన్లు కొనుక్కోవడం ద్వారా మనకి తెలియకుండానే చాలా సొమ్ము ఆదా చేసుకోవచ్చు.

అదే సమయంలో వృధాగా ఎప్పుడో పనికొస్తాయని వస్తువులను కొనే అలవాటు మానుకోవాలి. కొందరు బజారుకెళ్తే చాలు! మనసును అదుపులో వుంచుకోలేరు. కంటికి నచ్చిందంటే ...పర్సులో బరువు సంగతి మర్చిపోయి అవసరమైతే పక్కనే వున్న మిత్రుల దగ్గర అరువు తీసుకుని మరీ కొనేస్తుంటారు. ఈ అలవాటును వుంటే వదిలించుకోవాలి. కొంచెం కష్టమైనా సరే. అదే సమయంలో ఆఫర్లు వున్నయంటే ...ఆగలేరు కొందరు. అవసరమా లేదా అనేది వదిలేసి భవిష్యత్‌ అవసరాలకు పడుంటాయి కదా అని కొనేస్తుంటారు. అవి అప్పుడు పనికొస్తాయో లేదో ఎవరికి తెలుసు. 


షాపింగ్‌కి వెళ్తున్నప్పుడు వీలయినన్ని సంచులు తీసుకెళ్లాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక దుకాణాల్లో మనకిచ్చే సంచులకు కూడా ధర నిర్ణయించి బిల్లు వేయడం గమనిస్తూనే ఉన్నాం. ఇంటి దగ్గర్నుండే సంచులు తీసుకెళ్లడం వల్ల్ల ప్రతిసారీ అనవసరంగా సంచులు కొనాల్సిన పని ఉండదు.పైగా ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించిన వారమౌతాం. పర్యావారణాన్ని కాపాడిన తృప్తి మిగులుతుంది.
ఈ రోజుల్లో అనేక వస్తువులను ఆన్‌లైన్లో కొనుగోలు చేసే అవకాశముంది. ఇవి మార్కెట్‌ ధర కంటే ఖచ్చితంగా తక్కువకు దొరికే అవకాశాలున్నాయి. ఎందుకంటే మార్కెట్‌తో పోల్చుకుంటే వీటికి దుకాణాల ఖర్చులుండవు కాబట్టి. వీలున్నవారు మాత్రం ఈ పద్ధతిని పాటించవచ్చు. అయితే ఇందులో వుండే ఇబ్బందులూ వున్నాయి. వాటన్నిటికీ సిద్ధపడితేనే ఈ పద్ధతిని ఎంచుకోవాలి.
ఏదేమైనప్పటికీ మీరు ఆన్‌లైన్లో షాపింగ్‌ చేయాలనుకుంటే తప్పకుండా డిస్కౌంట్‌ కూపన్ల కోసం ప్రయత్నించండి. అనేక షాపుల వాళ్లు ప్రమోషన్ల కోసం అనేక రకాల డిస్కౌంట్లను ఇస్తుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే వాటిలో మంచి వాటిని ఎన్నుకోవచ్చు.


నేడు అనేక రకాలయిన సూపర్‌ మార్కెట్లలో మనకి కొన్న వస్తువులకు కొన్ని బోనస్‌ పాయింట్లు జత చేయడం జరుగుతుంది. వాటిని జాగ్రత్తగా గమనించి తగిన సందర్భాల్లో ఆ పాయింట్ల ద్వారా తగిన డిస్కౌంట్లను పొందొచ్చు. తద్వారా మన నిర్ణీత బడ్జెట్లో కొంతవరకు ఆదా జరుగుతుంది.
ఉద్యోగస్తులకు బదిలీలు సహజం. వీరు సెకండ్స్‌లో వస్తువులు కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే వారి తిరిగి వారి ప్రదేశాలకు వెళ్లి పోయేటప్పుడు మరికొంత ధర తగ్గించి అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు. అవే కొత్తవైతే నష్టం ఎక్కువగా ఉంటుంది.
మీరు కథలు, నవలలు, మేగజైన్లు చదివేవారైతే న్యూస్‌ స్టేండ్‌లలో కొని చదివేబదులు వాటికి చందాదారులుగా చేరడం మంచిది. ఎందుకంటే పత్రిక నేరుగా మీ ఇంటికి చేరడంతో పాటు మీరు మార్కెట్లో కొనే ధర కన్నా చందా ద్వారా తక్కువకే లభించే అవకాశం ఉంది.
మొదటిసారి కొన్నప్పుడే నాణ్యమైన వస్తువును కొనడం ద్వారా మళ్లీ మళ్లీ అదే వస్తువును కొనాల్సిన అవసరం రాదు. చవగ్గా అందుబాటులో వున్నాయని తక్కువరకం వస్తువులు కొనుగోలు చేస్తే... ఎక్కువ రోజులు మన్నవని మర్చిపోకూడదు. 


బ్యాంక్‌ అకౌంటును ఆన్‌లైన్లో ఉపయోగించడం ద్వారా అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా ఇంటి నుండి బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. దీని ద్వారా అనవసర రవాణా ఖర్చులుండవు. మీ అకౌంటును మీరు నియంత్రించుకోవడం ద్వారా మీకు కొన్ని కంపెనీల డిస్కౌంట్‌ కూపన్లు కూడా లభిస్తాయి. మీకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.

ప్రయాణ వేళ...

విహార యాత్రలకు వెళ్లాలనుకునేటప్పుడు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం అవసరం. దానికనుగుణంగా ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకోవడం ద్వారా కొంత వెసులుబాటు వుంటుంది. ఉదాహరణకు ముందుగా విమాన ప్రయాణాన్ని బుక్‌ చేసుకుంటే మీకు చాలా వరకు డిస్కౌంట్‌ లభించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆఫ్‌ సీజన్‌లో సందర్శించాలనుకున్నప్పుడు కూడా అక్కడి విడిది ప్రదేశాల్లో చాలా వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. వీటి ద్వారా మీ ఖర్చులో చాలా వరకు తగ్గే అవకాశాలున్నాయి.

కొన్ని సందర్భాల్లో విహార యాత్రకు బయలుదేరేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు ఎంతైనా అవసరం. అక్కడి వాతావరణ పరిస్థితులు, ఇతర అవసరాల గురించి తెలుసుకోవడం ఎంతో మంచిది. ఇటువంటి సందర్భాల్లో ట్రావెల్‌ ఏజెంట్లు ఎంతగానో ఉపయోగపడగలరు. అంతేకాకుండా వీరి ద్వారా టూర్‌ ప్యాకేజీ చేసుకున్నట్లయితే కూడా కొంత అధిక మొత్తంలో ఆదాకు అవకాశం వుంటుంది. అక్కడి ఆహారం, వసతి మీద కూడా కొంత రాయితీ లభిస్తుంది. 


ప్రయాణాల్ని ఎప్పుడూ ముందుగానే ప్లాన్‌ చేసుకోవడం మంచిది. ముందుగా ఆన్‌లైన్లో టికెట్లను బుక్‌ చేసుకోవడం ద్వారా మీరు చాలా సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు భారీగా డిస్కౌంట్లను పొందే అవకాశం కూడా ఉంది. కొన్ని సంస్థలైతే టూరిజం పేకేజీల ద్వారా అనేక సేవలను కూడా అందిస్తాయి. వసతి, రవాణా వంటి సదుపాయాలు కూడా కల్పిస్తాయి.


మరి కొన్ని బతుకు సూత్రాలు...

ఇంటర్నెట్‌ను బాగా వాడడం ద్వారా మనకి తెలియకుండానే అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక విషయాన్ని నలుగురు బంధువులకు తెలియజేయాలంటే ఉత్తరాలు పంపడానికి అయ్యే ఖర్చు, అది చేరడానికి పట్టే సమయంతో పోల్చుకుంటే మీరు పంపే ఒక ఈ మెయిల్‌ ద్వారా అదే సమాచారం తక్కువ ఖర్చులో, ఏకకాలంలో అందరికీ అందే అవకాశం ఉంటుంది.
అద్దె ఇంట్లో నివసించేవారు తరచూ ఇల్లు మారకపోవడం వల్ల చాలా శాతం రవాణా ఖర్చులు ఆదా చేసుకున్నట్లే. స్కూళ్లకి, ఆఫీసులకి దగ్గర్లోని ఇంటిని తీసుకోవడం ద్వారా గమ్యస్థానాలకి చేరుకోవడానికి వీలుగా ఉంటుంది.


ఇంట్లోని విలువైన వస్తువులకి ఇన్సూరెన్స్‌ చేయించినట్లయితే ఏదైనా అనుకోని సంఘటనల ద్వారా నష్టం వాటిల్లినప్పుడు వాటి విలువను పూర్తిగా కోల్పోకుండా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా మన కష్టార్జితం చాలా వరకు మిగిలినట్లే అవుతుంది.


అవసరమైన సందర్భాల్లో మాత్రమే మీ ఫోనును ఉపయోగించడం నేర్చుకోండి. ఫోన్లో మాట్లాడేటప్పుడు వీలయినంత క్లుప్తంగా సమాచారాన్ని తెలియజేయడానికి ప్రయత్నించండి. అనవసర ప్రసంగాలు ఫోన్‌లో మాట్లాడ్డం ద్వారా మీ జేబుకు మరిన్ని తూట్లు పడినట్లేలెక్క.


అన్ని పత్రికలు, పుస్తకాలు కొని చదవడం ఎవరికైనా అసాధ్యమే. లైబ్రరీలో సభ్యత్వం పొందడం ద్వారా పుస్తకాలను ఇంటికి తెచ్చుకుని వీలయినప్పుడు చదువుకునే అవకాశం ఉంటుంది. దీనికి మనకయ్యే ఖర్చు కూడా నామమాత్రంగానే ఉంటుంది. దీనిద్వారా మన అభిరుచి తీరడంతో పాటు ఆదా కూడా అవుతుంది.


అప్పు చేసి పప్పు కూడు వద్దు

నిజమైన ధనవంతుడు ఎవరంటే ఒక్క రూపాయి కూడా అప్పు లేనివాడు అన్న నానుడి ఈనాటిది కాదు. ఎందుకంటే ఎంత సంపాదించినా అంతకు మించిన అప్పులుంటే రాబడి శూన్యంతో సమానం. అప్పు అనేది మొదలైనప్పుడు మొక్కలా, తీర్చేటప్పుడు మానులా తయారవుతుంది. కాబట్టి వీలున్నంత వరకు ఏ వస్తువును కూడా అప్పు చేసి కొనకండి. వాటికి అనుగుణంగా ఉన్న కొటేషన్లను ఇంట్లో అక్కడక్కడా అతికించుకోండి.

ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చిన్న చిన్న విషయాల్లా కనిపించే అనేక మార్గాల ద్వారా మనం పొదుపు చేసుకోవచ్చు. ఆ పొదుపు మన అవసరాలకు మదుపుగా ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment