Tuesday 3 June 2014

బాహుబలి


రెండు కొండల మధ్య ప్రకృతి సిద్దంగా ఏర్పడిన సరోవరమే "బెళగొళ" కన్నడంలో బెళ్ళి అంటే తెల్లని అని, గొళ అంటే నీటిగుండం అని అర్థం. జైన సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రమణులు అంటారు.అలాంటి శ్రమణులు చాలామంది ధ్యానంలో శేషజీవితం గడిపి నిర్వాణం పొందడానికి ఈ కొండలలో, పరిసర ప్రాంతాలలో నివసించారు.శ్రమణులు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ బెళగొళను శ్రమణ బెళగొళ అనేవారు.క్రమంగా శ్రావణ బెళగొళగా మారింది. స్థానికులు బెళగొళ అనే పిలుస్తారు.చంద్రగిరి,ఇంద్రగిరి కొండల మధ్య ఉన్న బెళగొళను చుడడానికి దేశంలో ఉన్న ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తారు.

ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్‌లో టూర్‌కు ఇది చక్కని ప్రదేశం.ఇక్కడ ఉన్న 58 అడుగుల గోమఠేశ్వరుని విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల,శ్రమణుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీ.శ.983వ సంవత్సరంలో చాముండరాయ అనే మంత్రి గోమఠేశ్వరుని విగ్రహాన్ని ఇంద్రగిరి పర్వతంపై చెక్కించినట్లు చారిత్రక కథనం.దీనికే గోమఠేశ్వరుని ఆలయంగా వాడుక.ఇక్కడ ఆలయం కట్టడం, విగ్రహాన్ని ప్రతిష్టించడం జరగలేదు.కొండ చివరి భాగంలో విగ్రహం మలిచారు.బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుని విగ్రహాన్ని చెక్కడంలో శిల్పి అర్త్సమేణి కనబరచిన నైపుణ్యం స్వయంగా చూడాల్సిందే.ధ్యానంలో బాహుబలి ముఖం ప్రశాంతతకు చిహ్నంగా,సర్వం త్యజించిన వ్యక్తి ముఖంలో కనిపించే నిర్వేదాన్ని చక్కగా మలిచారు.ద్యానంలో శిలగా మారిన మనిషి చుట్టూ చెట్లు అలుకుపోయినట్లు బాహుబలి భుజాల చుట్టూ చెట్ల తీగలు,ఆకులను అద్భుతంగా చెక్కారు.విగ్రహం కాలి గోళ్ళు వాటి చుట్టూ ఉండే చర్మం గీతలు సహజంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా చెక్కారు.మనం విగ్రహం దగ్గర నిలబడితే బాహుబలి పాదం ఎత్తుకు సరిపోతాం.

మహామస్తకాభిషేకం సందర్భంగా భక్తులు అభిషేకం చేసేటప్పుడు కింద నిలబడి పాదాలను మాత్రమే అభిషేకించగలం.గోమఠేశ్వరునికి కేన్ల కొద్దీ పలు,తేనె,పెరుగు,అన్నం,కొబ్బరి పాలు,నెయ్యి,చక్కెర,బాదం పప్పు,కుంకుమ పువ్వు,నాణేలు,పసుపు,డ్రైఫ్రూట్స్,పండ్లతో విగ్రహం మొత్తం తడిసేదాకా అభిషేకం చేస్తారు.పూజారులు విగ్రహం పై నుండి అభిషేకం చేయడానికి వీలుగా స్ట్రక్చర్ కడతారు.దీని మీదకు వెళ్ళి అభిషేకం తంతు పూర్తి చేస్తారు.పర్యాటకులకు మహామస్తకాభిషేకం సమయంలో చూడటం కంటే మామూలు రోజుల్లో వెళ్ళడమే అనువుగా ఉంటుంది. ఈ ఆలయం కొండమీద ఉంటుంది.ఈ కొండ ఎక్కువ ఎత్తు లేకపోయినా ఎక్కడం కష్టమే.మెట్లు ఎత్తుగా ఉండడంతో యువకులు కూడా మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఎక్కుతారు. మొత్తం మీద పదిహేను-ఇరవై నిమిషాల కంటే పట్టదు.బాహుబలి విగ్రహం తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్రాంతాలన్నీ దాదాపుగా జైనమత ప్రాధాన్యం ఉన్నవే.జైన తీర్థంకరుల దేవాలయాలు ఉన్నాయి.వీటిలో చంద్రగిరి పర్వతం మీద అశోకుడు నిర్మించినట్లు నిర్మించినట్లు చెబుతున్న చంద్రగుప్త బస్తీ ముఖ్యమైనది.ఇందులో సెమీ ప్రిషియస్ స్టోన్స్ పొదిగి అద్భుతంగా చెక్కిన ఎనిమిది విగ్రహాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి.ఇక్కడ ఉన్నన్ని శాసనాలు మన్ దేశంలో మరే ప్రాంతంలోనూ లేవు.

రిత్ర పరిశోధకులు 523 శాసనాలను గుర్తించారు.ఇందులో చిన్న కొండ మీద 271,పెద్ద కొండ మీద 172,80 శాసనాలు బెళగొళలో,మరో 50 బెళగొళ పరిసర గ్రామాల్లో ఉన్నాయి.ఇవన్ని కూడా క్రీ.శ.600-19వ శతాబ్దం మధ్యనాటివే.లెక్కకు మించిన శాసనాలే కాక లెక్కలేనన్ని దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి.జైనతీర్థాంకురుల స్మృతి చిహ్నాలుగా పర్యాకులను ఆకర్షిస్తాయి. గోమఠేశ్వరుడు జైనమతం అవలంభించి ధ్యానముద్రలోకి వెళ్ళడానికి ఒక కథ వాడుకలో ఉంది.బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుడు ఋషబుని కుమారుడు.(రామాయణంలో శ్రీరాముని వంశానికి మూల పురుషుడు ఋషబుడని ఉంది.) ఇతడికి ఇద్దరు భార్యలు.రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు.పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజదాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు.భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది.తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు.బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు.అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు.స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు.భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి,అంతలోనే పునరాలోచనలో పడతాడు.

ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి,రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు.ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు.మన దేశంలో బౌద్దజైన మతాలు రెండూ దాదాపుగా ఒకే సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ బౌద్దం వ్యాపి చెందినంతగా జైనం విసృతం కాలేదు.జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు.కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు.శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు.వీరు సంసార జీవితం కొనసాగిస్తారు.దిగంబరులు సన్యాసులు.వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని కృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు.

No comments:

Post a Comment