Friday 20 June 2014

తన్మయత్వంలో తరింపజేసే శైవక్షేత్రాలు



ప్రతి సంవత్సరం శివరాత్రి మహా పర్వదినం వచ్చిందంటే చాలు ఊరూర వెలసిన శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి. వందలు, వేల సంఖ్యలో భక్తులు పొద్దంతా ఉపవాసాలు ఉండి, సాయంకాలం నుండి రాత్రిళ్లు పొద్దు పోయేదాకా ఈశ్వరుని ఆరాధనలలో మునిగిపోతారు. రాత్రంత జాగారం చేసే వారు మరెందరో. దేశవ్యాప్తంగా ఆ రోజు శైవ దేవాలయాలన్నీ ప్రత్యేక అర్చనలు, సేవలు, అభిషేకాలతో కన్నులపండువ చేస్తాయి. ఈ సందర్భంగా భక్తియాత్ర చేద్దామనుకునే వారి కోసం మన రాష్ట్రంలోని ప్రధాన శివక్షేత్రాల దర్శనార్ధం శివరాత్రి సందర్భంగా ఎపిఎన్ఆర్‌టిసితోపాటు ప్రైవేట్ టూరిస్టు సంస్థలు కూడా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బస్ సౌకర్యాలను కల్పిస్తాయి.

పండగ సందర్భంగా మహాక్షేత్రాలను దర్శించడం ఒక అపురూపమైన అనుభూతి. ఆరోజు గర్భగుడిలోకి ప్రవేశం లభించడమే గొప్ప. అక్కడ లింగరూపంలోని కైలాసనాధుని దర్శనం ఒక మహద్భాగ్యమే. ఈ సందర్భంగా ఎంతో ఓపిక ఉంటే తప్ప ఈ కార్యం నెరవేరదు. పరమ పవిత్రమైన శివరాత్రి పూట కోరుకున్న క్షేత్రంలో గడపాలనుకునే వారు తత్ సంబంధ శ్రమ, కష్టాలు, ఖర్చులకు ఓర్చుకోవాల్సి ఉంటుంది.


శ్రీశైలం


శ్రీశైలంమన రాష్ట్రంలోని ఏకైక జ్యోతిర్లింగ శ్రీశైలం. దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన దీని దర్శనం, అందులో శివ రాత్రి పూట ఒక వరంగానే భక్తులు భావిస్తారు. ఎత్తయిన ఘాట్ రోడ్డు మీదుగా నల్లమల కొండలను దాటుతూ సాగే బస్సు ప్రయాణం అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. చుట్టూ దట్టమైన అరణ్యం, కృష్ణానదికి దక్షిణ ఒడ్డున వెలసిన మహాక్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన భ్రమరాంబ మల్లికార్జునస్వామి లక్షలాది తెలుగువారికి ఆరాధ్యదైవం. ఈ ఆలయం సుదీర్ఘమైన చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. రాష్ట్రంలోని అత్యున్నత శ్రేణి శివక్షేత్రమైన శ్రీశైలం లోయలు తిరుపతి కొండలకంటే కూడా గొప్పవని యాత్రికులు అంటారు. ఇది హైదరాబాద్ నుండి 235 కి.మీ. దూరంలో ఉంది.


శ్రీకాళహస్తి

శ్రీకాలహస్తి
అసాధారణ శిల్పకళతో అలరారే మహా శైవక్షేత్రం శ్రీకాళహస్తి. ఇది తిరుపతి పట్టణానికి కేవలం 36 కి.మీ. దూరంలోనే ఉంది. ఇక్కడ ఈశ్వరుడు ఒక వాయులింగంగా దర్శనమిస్తాడు. ఏనుగు, పాము, సాలెపురుగు కలసి ఇక్కడి లింగరూపంలోని ఈశ్వరుని అభిషేకించిన గొప్ప పౌరాణిక కథను భక్తులు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటారు. స్వర్ణముఖి నదీ తీరంలో వెలసిన శ్రీకాళహస్తీశ్వరుని నిత్యం వేలాదిమంది దర్శించుకుంటారు. ఇక శివరాత్రి పర్వదినం రోజు అయితే యాత్రికుల సంఖ్య అసాధరణంగా ఉంటుంది. ఇది రేణిగుంట-గూడూరు రోడ్డుమార్గంలో ఉంది.

ద్రాక్షరామం


ద్రాక్షరామంతూర్పుగోదవరి జిల్లాలో వెలసిన ద్రాక్షరామ రాష్టంలోని ప్రసిద్ధ శైవక్షేత్రంలలో ఒకటి. దక్షమహారాజు నిర్వహించిన గొప్పదైన యజ్ఞకథను ఈ సందర్భంగా పేర్కొంటారు. ఇక్కడి బీమేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధగాంచిన ద్రాక్షారామం కాకినాడకు కేవలం 20 కి.మీ., రాజమండ్రికి 40 కి.మీ.దూరంలో ఉంది. యాత్రికులు పై రెండు పట్టణాలలో ఎక్కడైనా బన చేయవచ్చు.

లేపాక్షి

లేపాక్షి

దక్షిణ భారతదేశంలోనే ఎంతో పేరెన్నికగన్న నంది విగ్రహం ' లేపాక్షి 'లో ఉంది. లేపాక్షి బసవయ్యగా సుప్రసిద్దమైన ఈ నందీశ్వరుడిని శివరాత్రి రోజు దర్శించడం ఒక మరచిపోలేని అనుభూతిగా భక్తులు అభివర్ణిస్తారు. ఇక్కడి వీరభద్రస్వామి దేవాలయంలో ప్రధాన దైవం కంటే కూడా ఈ నందీశ్వరుని ఆలయం విజయనగర రాజుల శైలిలో ఉంది. బెంగుళూరు - హైదరాబాద్ రైల్వే మార్గంలో హిందూపూరుకు15 కి.మీ., బెంగుళూరుకు 100కి.మీ. దూరంలో లేపాక్షి ఉంది.


వేములవాడ


వేములవాడకరీంనగర్ జిల్లాలోని వేములవాడ తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రం. హైదరాబాద్‌కు సుమారు 150కి.మీ. దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో ఆరాధ్యదైవం రాజరాజేశ్వరుడు. లక్షలాది మందికి ఇలవేల్పుగా, భక్తులు కోరిన కోరికలు తీర్చే ' రాజన్న 'గా ఇక్కడి దైవం పేరొందాడు. శివరాత్రి సందర్భంగా వేములవాడలో జరిగే ఉత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.


మహానంది

మహానంది
కర్నూలు జిల్లాలో వెలసిన మహానందిశ్వరస్వామి ఆలయం దేశంలోని నవ నందులలో ఒకటిగా చెబుతారు. ఇక్కడి గుండంలోనికి అయిదు విభిన్న ప్రాంతాల నుండి స్వచ్చమైన స్పటికజలం పంటపొలాల సాగుకు ఉపయోగపడుతోంది. గుంటూరు-ధర్మవరం రైల్వేలేనుపై నంద్యాల రైల్వేస్టేషన్‌కు కేవలం 15 కి.మీ. దూరంలోనే ఈ క్షేత్రం ఉంది. శ్రీశైలం వెళ్లే యాత్రికులు చాలా మంది విధిగా మహానందిని సందర్శించటం పరిపాటి.




కీసరగుట్ట


కీసరగుట్టరామలింగేశ్వర స్వామి, లక్ష్మీనరసింహ దేవాలయాలు రెండూ ఒకేచోట వెలసిన క్షేత్రం కీసరగుట్ట. ఇది హైదరాబాద్ ప్రధాన బస్ స్టేషన్ నుండి 35 కి.మీ. దూరంలో ఉంది. సాక్షాత్ శ్రీరాముడే వారణాశి నుండి హనుమంతుడి చేత శివలింగాన్ని ఇక్కడికి తెప్పించబోయాడు. కానీ ఆ రామబంటు సకాలానికి రాకపోవడంతో తానే స్వయంగా మట్టితో లింగాన్ని చేసి, ఇక్కడి కొండపై ప్రతిష్టించినట్టుగా పౌరాణిక కథ చెబుతారు. తర్వాత ఆంజనేయుడు 101 శివలింగాలను తెచ్చి కొండమీద ఆయా ప్రాంతాలలో ప్రతిష్టించాడు.ఇక్కడికి వెళ్ళడానికి నిరంతర బస్సు సౌకర్యం ఉంది.


కాణిపాకం

కాణిపాకం ఈశ్వర తనయుడైన గణపతిస్వామి క్షేత్రంగా కాణిపాకం తిరుపతికి సమీపంలో ఉంది. తిరుపతి వెళ్ళిన యాత్రికులు విధిగా ఇక్కడి విఘ్నేశ్వర స్వామిని దర్శిస్తారు. 11వ శతాబ్దికి చెందిన చోళరాజుల కాలంలో వెలసినట్టుగా చెబుతున్న ఈ క్షేత్రం 1336లో విజయనగర రాజులవల్ల మరింత అభివృద్దిని సాధించింది. అంతకంతకూ పెరుగుతున్న ఈ విగ్రహం యాభై ఏళ్ళ కిందట ఎంతో చిన్నగా ఉండేదని చెబుతారు.

No comments:

Post a Comment