Friday 27 June 2014

ఆయుధం పట్టని యోధుడు ... మార్టిన్‌ లూథర్‌ కింగ్‌



నల్లజాతీయలపై తెల్లదొరల పెత్తనాన్ని ప్రశ్నిస్తూ, అహింసాయుత మార్గంలో పోరాటం చేసిన మానవహక్కుల పరిరక్షణా ప్రతినిధిమార్టిన్‌ లూథర్‌ కింగ్‌. 

అట్లాంటా లో 1929, జనవరి 15న జన్మించిన ఆయన అసలు పేరు మిచేల్‌ లూథర్‌ కింగ్‌. తండ్రి లూధర్‌ కింగ్‌ సీనియర్‌, తల్లి ఆల్బెర్టా విలియమ్స్‌ కింగ్‌, ఆయన తాత, తండ్రి అట్లాంటాలోని బెనేజర్‌ బాప్టిస్ట్‌ చర్చిలో పాస్టర్లుగా పనిచేశారు. చిన్నతనం నుంచి చదువులో చాలాచురుకుగా ఉండే మార్టిన్‌ హైస్కూల్‌ పూర్తి చేయకుండానే నేరుగా 1948లో సామాజిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. బోస్టన్‌ యూనివర్సిటీలో డాక్టరేట్‌ పూర్తి చేసిన తరువాత కోరెట్టాస్కాట్‌ ను వివాహం చేసుకున్నాడు. 

 భారతదేశంలో తెల్లదొరలకు వ్యతిరేకంగా జరిగిన అహింసాయుత ఉద్యమం, సహాయనిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాలు ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆఫ్రికన్‌లపై అమెరికన్ల వివక్షను ఆయన సహించలేకపోయాడు. అమెరికన్లు పరిశ్రమల్లో ఆఫ్రికన్లతో కలిసిభోజనం చేసేవారుకాదు, బస్సులో ప్రయాణించేవారుకాదు. ఆఫ్రికన్‌ ,అమెరికన్‌ పౌరహక్కుల ఉద్యమం ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 1955వ సంవత్సరంలో మౌంట్‌ గోరీ బస్సు నిరసనకు ప్రాతినిధ్యం వహించాడు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం నల్ల జాతీయులకు ఓటు హక్కు కల్పించాలన్న డిమాండ్‌తో మరింత బలపడి రాజకీయ ఉద్యమంగా మారింది. అతి తక్కువకాలంలోనే అమెరికాలోని నల్లజాతీయు లందరికీ అనధికారిక ప్రతినిధిగా మార్టిన్‌ గుర్తింపు సాధించాడు.

పేదరిక నిర్మూలన కోసం పోరాటం సాగించిన ఆయన వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పాడు. మంచివక్తగా పేరుగాంచిన ఆయన హింసా విధానాలను మతపరమైన దృష్టితో విమర్శించాడు. సదరన్‌ క్రిస్టియన్‌ లీడర్‌ షిప్‌ కాన్ఫరెన్స్‌ సంస్థ (ఎస్‌సిఎల్‌సి)ను స్థాపించడానికి మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ఎంతగానో శ్రమించారు. 1957వ సంవత్సరంలో ఎస్‌సిఎల్‌సిని ప్రారంభించాడు. ఈసంస్థకు మొదటి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేశాడు. 

1963లో బర్మింగ్‌ హాంలోసాగించిన పోరాటం మానవహక్కుల ఉద్యమంలో మైలురాయి వంటిది. ఈఉద్యమంలో లక్షలాదిమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యమయ్యారు. ఇది చూసి సహించలేని ప్రభుత్వం జరిపిన దమనకాండలో రెండువేల ఐదువందలమంది బలి అయ్యారు. మార్టిన్‌ కు ప్రభుత్వం జైలుశిక్ష విధించింది. నల్ల జాతి ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న మరోసంస్థ సహాయంతో పోరాటాన్ని ఉధృతం చేశాడు.

ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి కెన్నడీ ప్రభుత్వం సామదాన భేద దండోపాయాలను ప్రయోగించింది.
నల్లజాతి ప్రజలకు కొన్ని హక్కులు ఇస్తూ చట్టాలు చేసింది. అయితే సొంత పార్టీ నుంచి వచ్చిన వ్యతిరేకతను గమనించి మానవహక్కుల ఉద్యమ డిమాండ్లను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు కెన్నడీ. ప్రభుత్వాలను అర్థించడం ద్వారా సామాజిక న్యాయం సాధ్యం కాదని గ్రహించిన మార్టిన్‌ తనపోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. 1965లో ప్రారంభమైన వియత్నాం యుద్ధం మార్టిన్‌కు, కెన్నడీప్రభుత్వానికి మధ్య పోరాటాన్ని మరింత పెంచింది. 

 మానవహక్కులకే ఉద్యమాన్ని పరిమితం చేయాలని, రాజకీయలో జోక్యంవద్దని కెన్నడీ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. తన ఆశయాలకు ప్రభుత్వ విధానాలకూ పొంతన లేకపోవడంతో మోసపూరిత రాజకీయాలతో నిరాశచెందిన మార్టిన్‌, హక్కుల పోరాటపరిధి నుంచి బయటకువచ్చే ప్రయత్నంచేశాడు. పేదరికానికి వ్యతిరేకంగా పోరాటంచేస్తూ1967లో టీంస్టెర్స్‌లో గొర్రెలకాపరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ 'దేశంలో పేదలు నల్లజాతి వారేకాదు. తెల్లజాతివారు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. పేదరికంపై పోరాటం వర్ణ వివక్షకు సంబంధించిన పోరాటం కాదు, ఆర్థిక న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమం' అన్నాడు. 1968లో ఆయన పేద ప్రజల ఉద్యమాన్ని ప్రారంభించాడు. చలో వాషింగ్టన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నల్లజాతి, తెల్లజాతి పేదప్రజలను సంఘటితం చేశాడు. 1968 ఏప్రిల్‌ 4న పారిశుధ్య కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా దారుణంగా హత్యకు గురయ్యాడు.

'దోపిడి దారులు దయతో హక్కులు ఇవ్వరు. దోపిడికి గురయ్యే వారే పోరాడి సాధించుకోవాలి' అన్న మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ మాటలు నాటికీ...నేటికీ...ఏ నాటికి చిరస్మరణీయాలు...!

No comments:

Post a Comment