Saturday 21 June 2014

మహా విప్లవ నేత మావో



నిద్రాణమై ఉన్న చైనాను మేల్కొల్పి విముక్తి పథంలో ప్రస్థానం సాగించేలా చేసిన మహాసేనాని ఆయన. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాన్ని అరుణారుణ పథంలో నడిపించిన నవ చైనా నిర్మాణ శిల్పి ఆయన. తన సతీమణి శత్రువుల దాడుల్లో హతమైన ప్పుడు సైతం ప్రజా విముక్తి పోరాటం నుంచి వెనుదిరగని ధీశాలి ఆయన. చైనా విప్లవం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరి జ్ఞాపకా లనూ ఆయన స్మరించేవారు. ఆయనే నవ చైనా నిర్మాత మావో సేటుంగ్‌.

మావో సేటుంగ్‌ చైనాలోని హునాన్‌ రాష్ట్రం షావో షాన్‌ గ్రామంలో ఓ రైతు కుటుం బంలో 1893 డిసెంబర్‌ 25న జన్మించారు. 1918లో పట్టభద్రులయ్యారు. యవ్వనంలో మావో చైనా భూస్వామ్య సంస్కృతిని అధ్యయనం చేశారు. పశ్చిమ బూర్జువా ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి తెలుసుకున్నారు. దేశం పట్ల విపరీత మైన అభిమానం ఉన్న మావో కొద్దిమంది సహచరులతో కలిసి న్యూ పీపుల్స్‌ సొసైటీని స్థాపించారు. సొసైటీ ముఖ్య ఉద్దేశం చైనాను బలోపేతం చేయడానికి కొత్త మార్గాలనూ, పద్ధ తులనూ అన్వేషించడం. సొసైటీ స్థాపించిన కొద్ది కాలానికి ప్రగతిశీల యువతనూ, సభ్యుల నూ సమీకరించి ఫ్రాన్సులో పర్యటించి ప్రగతిశీల సిద్థాంతాలు, విప్లవానుభవాలను అధ్యయనం చేశారు. 1919 మే నాలుగు ఉద్యమం సంద ర్భంగా మావో తొలిసారిగా మార్క్సిజానికి దగ్గర య్యారు. ఒక విధంగా ఆయనను చైనా కమ్యూ నిస్టు పార్టీ (సిపిసి) వ్యవస్థాపకుల్లో ఒకరుగా పేర్కొనవచ్చు. 'సియంగ్‌ రివ్యూ' అనే పత్రికనూ, సాంస్కృతిక అధ్యయన కేంద్రాన్నీ స్థాపించి విప్లవ భావాలను ప్రచారం చేయసాగారు. హ్యూనాన్‌ రాష్ట్ర రాజధాని చాంగ్‌ షా లో వామపక్ష బృందాలను ఏర్పాటు చేశారు. 1921 జూలైలో పార్టీ తొలి జాతీయ మహాసభకు హాజ రయ్యారు. తర్వాత హ్యూనాన్‌ ప్రాంతీయ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1923 జూన్‌లో సిపిసి మూడవ జాతీయ మహాసభకు హాజరయ్యారు. సన్‌ ఏట్‌ సేన్‌ నాయకత్వంలోని కొమింటాంగ్‌ పార్టీతో జత కలిసి జాతీయ స్థాయిలో సామ్రాజ్యవాద, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పార్టీ సమావేశంలో తీర్మానించారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యులందరూ వ్యక్తిగతంగా కొమింటాంగ్‌లో చేరాలని కూడా సమావేశం నిర్ణయించింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైన మావో కేంద్ర నాయకత్వంలో ప్రముఖ పాత్ర పోషించ డం మొదలు పెట్టారు. కొమింటాంగ్‌-కమ్యూ నిస్టు పార్టీల మధ్య అవగాహన కుదిరిన తర్వాత మావో కొమింటాంగ్‌ కేంద్ర కమిటీ అనుబంధ సభ్యునిగా రెండేళ్లపాటు వ్యవహరించారు. మావో గువాంగ్‌ ఝా రాష్ట్రంలో కొమింటాంగ్‌ కేంద్ర ప్రచార విభాగం అధిపతిగా వ్యవహరి స్తూనే 'పొలిటికల్‌ వీకీ'్ల పత్రికకు సంపాదకుడ య్యారు. 1925-27 మధ్య మావో రాసిన 'చైనా సమాజంలో-వర్గాలు-విశ్లేషణ' 'హునాన్‌ రైతాంగ ఉద్యమంపై పరిశోధనాత్మక నివేదిక' గ్రంథాలు చైనా విప్లవం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలనూ, నూతన ప్రజాస్వామ్య విప్లవంపై మావో ఆలోచనలనూ చర్చించాయి.
1927లో కొమింటాంగ్‌ మితవాద వర్గా న్ని శాసించే చియాంగ్‌ కై షేక్‌, వాంగ్‌ జింగ్వీలు కొమింటాంగ్‌-సిపిసి జాతీయ కూటమికి ద్రోహం చేశారు. వరుస ప్రతీఘాత విప్లవ తిరుగుబాట్లతో కూటమిని విచ్ఛిన్నం చేశారు. కొమింటాంగ్‌ హత్యాకాండను సాయుధంగా ఎదుర్కొని రైతాంగ ఉద్యమంతో విప్లవ లక్ష్యాన్ని సాధించాలని మావో నిర్ణయించారు. రాజకీయా ధికారాన్ని ప్రజా సాయుధ పోరాటం ద్వారానే సాధించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన చైనా కమ్యూనిస్టులకు నూతన దిశా నిర్దేశాన్నిచ్చింది. సమావేశంలో మావోను పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఎంపిక చేసి ఆయనను హునాన్‌ రాష్ట్రానికి పంపారు. కొద్ది కాలానికే విప్లవ సైన్యాలను సమీకరించి జింగ్గాంగ్‌ పర్వత శ్రేణుల్లో చైనా తొలి గ్రామీణ విప్లవ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చూటే నాయకత్వంలోని విప్లవ సైన్యాలతో జత కలిసి కార్మిక-కర్షక విప్లవ సైన్యం నాల్గవ విభాగాన్ని స్థాపించారు. ఈ విభాగానికి మావో కార్యదర్శిగా, ఝా కమాండర్‌గా ఎన్నికయ్యారు. 1929లో దక్షిణ జియాంగ్జీ, పశ్చిమ పూజియాన్‌లో విప్లవ కేంద్రాలను స్థాపించారు. మావో ప్రధాన ప్రతి నిధిగా చైనా కమ్యూనిస్టులు తమ విప్లవ ప్రస్థా నాన్ని ప్రారంభించారు. వాస్తవ పరిస్థితులను ఆకళింపు చేసుకొని, తిరోగమన శక్తులు బలహీ నంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సాయుధ పోరాటంతో ముందుకు సాగుతూ చైనా విప్లవా నికి బాటలు వేశారు. నగరాలనూ గ్రామీణ ప్రాంతాలనూ చుట్టుముట్టి రాజకీయాధికారాన్ని హస్తగతం చేసుకోవాలని నిర్ణయించారు.
1930 ఆగస్టులో తొలిసారిగా ఎర్రసైన్యం ప్రధాన విభాగం ఏర్పడింది. 1931 నవంబరు లో తొలిసారిగా చైనా సోవియట్‌ రిపబ్లిక్‌ కేంద్ర ప్రభుత్వాన్ని మావో అధ్యక్షతన నైరుతీ యాలక్సీ లోని రుయిజిన్‌ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 1933లో ఆయనను కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యునిగా నియమించారు. 1930 చివరి నుంచి మావో, ఝా నేతృత్వంలోని ఎర్ర సైన్యం ప్రధాన దళం కొమింటాంగ్‌ దళాలను తమ ప్రధాన స్థావరంలో ఎదుర్కొని మట్టి కరిపిం చింది. వ్యవసాయ విప్లవం నడుస్తుండగానే మావో సాధారణ ప్రజలను వ్యవసాయ ఉత్పా దనలో, చేనేత పరిశ్రమ, వాణిజ్యం, సహకార రంగం, సాంస్కృతిక-విద్యా రంగాల్లో భాగస్వా ములను చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ శత్రు సైన్యాలు విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎదుర్కొన్నారు. సాయుధ పోరాట పరిధిని గణనీయంగా పెంచారు. అయితే వాంగ్‌మింగ్‌ చేపట్టిన వామపక్ష తీవ్రవాద ధోరణి కారణంగా మావో ప్రతిపాదించిన నిర్దేశిత విప్లవ సిద్థాంతం మరుగున పడింది. మావోను కేంద్ర కమిటీ బాధ్యతల నుంచీ, ఎర్ర సైన్యం బాధ్యతల నుంచీ తప్పించారు. ఫలితం గా కొమింటాంగ్‌ సేనలు ప్రారంభించిన ఐదవ దిగ్బంధనం, అణచివేత కార్యక్రమాన్ని ఎదుర్కోవ డంలో ఘోరంగా విఫలమయ్యారు. 1934 అక్టోబరులో సిపిసి, ఎర్రసైన్యం ప్రధాన దళం లాంగ్‌మార్చ్‌ మొదలు పెట్టాయి. 1935 జనవరి లో జున్హీలో జరిగిన సర్వసభ్య సమావేశంలో వాంగ్‌మింగ్‌ నాయకత్వాన్ని తిరస్కరించి మావో ను కేంద్ర కమిటీ నాయకునిగా ఎన్నుకున్నారు. ఈ విధంగా విప్లవ పోరాటాన్ని రక్షించుకు న్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో ఇదో కొత్త మలుపును సూచించింది. పర్వతాలు, నదులు దాటుకుంటూ 25 వేల మైళ్లు దాటి యాత్ర జరిపిన పార్టీ కేంద్ర కమిటీ, ఎర్రసైన్యం ప్రధాన దళం ఎట్టకేలకు శత్రు సైన్యాల దిగ్బంధనాన్ని ఛేదించి 1935 అక్టోబరులో ఉత్తర షాంగ్జీ ప్రాంతానికి చేరుకున్నాయి.
1936 నుంచి 1937 నుంచి వరకు మావో చైనా విప్లవ అనుభవాలను బేరీజు వేయ డానికి మార్క్సిజం-లెనినిజంపై ఆధారపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలో పేరుకుపోయిన సిద్థాంత వాదం, ప్రత్యేకవాదాలను ఆయన విమర్శిం చారు. తన రచనల ద్వారా మార్క్సిజం, లెనిని జం తాత్విక ఆలోచనను మావో మరింత అభి వృద్ధి పరిచారు. జపాన్‌ వ్యతిరేక ఉద్యమం మొదలైన తర్వాత మావో నేతృత్వంలోని సిపిసి కేంద్ర కమిటీ ఐక్య వేదికలో పార్టీ స్వాతంత్య్రాన్నీ, చొరవనూ సమర్థించడమే కాకుండా శత్రు సైన్యాల వెనుక గెరిల్లా యుద్ధం సాగించేందుకు సాధారణ ప్రజలను సమీకరించాలనీ, జపాన్‌ వ్యతిరేక విశాల యుద్ధ స్థావరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కమ్యూనిస్టు పార్టీ స్థావరాలపై జపాన్‌ సామ్రాజ్యవాద సేనలు దృష్టి కేంద్రీకరించినప్పుడు, కొమింటాంగ్‌లోని మిత వాద శక్తులు కూడా ఈ స్థావరాలపై ఆర్థిక దిగ్బంధనాన్ని మరింత విస్తృతం చేశాయి. ఈ కారణంగా 1941 ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ స్థావరాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని నివా రించడానికి స్థావరాల్లోని సైనికులు, సాధారణ ప్రజలను ఆహారం, దుస్తులను స్వయంగా సమ కూర్చుకోవాలనీ, అందుకోసం ఉత్పత్తిని మరింత పెంచుకోవాలనీ మావో నేతృత్వంలోని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. మావో దీనికి నాయక త్వం కూడా వహించారు. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా వస్తువుల పంపిణీని స్థిరీకరించారు. 1942లో మావో పార్టీలో సంస్కరణల ఉద్యమాన్ని చేపట్టి మార్క్సిస్టు-లెనినిస్టు సైద్థాంతిక విద్యను పార్టీ కార్యకర్తలకు అందించారు. ప్రత్యేకవాదం, వర్గపోరాటం, మూస రచనలను వ్యతిరేకించి, వాస్తవాల నుంచి సత్యాన్ని గ్రహించేలా సిద్థాంత పరమైన సూత్రాన్ని అమలు చేశారు. సిద్థాం తాన్ని ఆచరణతో ముడిపెట్టారు. ఈ సంస్కరణల ఉద్యమం వాంగ్‌మింగ్‌ ప్రభావాన్ని పూర్తిగా రూపుమాపి పార్టీకి ఒక కొత్త దిశానిర్దేశాన్ని ఇచ్చింది. జపాన్‌ వ్యతిరేక యుద్ధంలో విజయా నికి పునాదులు వేసింది. మావో 1943 మార్చి లో కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో ఛైర్మన్‌గా ఎన్ని కయ్యారు.
జపాన్‌ వ్యతిరేక యుద్థంలో విజయం తర్వాత మావో తన దృష్టిని చాంగ్‌ కై షేక్‌ కుయుక్తులపై కేంద్రీకరించారు. 1945 ఆగస్టులో చౌ ఎన్‌ లైతో కలిసి మావో చుంగ్‌కింగ్‌కు వెళ్లాడు. చాంగ్‌ కై షేక్‌తో చర్చలు జరిపి అంత ర్గత శాంతిని నెలకొల్పాలని ఆయన భావించా డు. అక్టోబర్‌ 10న శాంతి, జాతీయ పునర్నిర్మా ణం లక్ష్యాలుగా సిపిసి, కొమింటాంగ్‌ అక్టోబరు 10 సంధి కుదుర్చుకున్నాయి. అయితే 1946 వేసవిలో చాంగ్‌ కై షేక్‌ ఒప్పందానికి తూట్లు పొడిచి అంతర్యుద్ధాన్ని మొదలు పెట్టాడు. ఇందుకోసం అతడు ముందుగానే రంగం సిద్ధం చేసుకున్నాడు. దీనికి ప్రతిస్పందనగా మావో కొమింటాంగ్‌ దాడులను ఆత్మరక్షణలో భాగంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. శత్రు సైన్యాలను ఒక్కొక్కటిగా మట్టి కరిపించేందుకు ఒక బలమైన సైన్యాన్ని కేంద్రీకరించాడు. చౌఎన్‌లై, చూటేతో కలిసి మావో ప్రజావిముక్తి సైన్యానికి చెందిన అనేక విభాగాల నియంత్రణను తన ఆధ్వర్యం లోకి తీసుకున్నాడు. వ్యూహాత్మక దాడులు, దిగ్బంధనాలతో శత్రు సైన్యాలను చిన్నాభిన్నం చేస్తూ, భారీ స్థాయి పోరాటాలతో పెద్ద, మధ్య తరహా పట్టణాలను స్వాధీనం చేసుకుంటూ అనేక మంది శత్రు సైనికులను మట్టుబెట్టారు. మరోవైపు రాజకీయంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 1948 సెప్టెంబరు, 1949 జనవరి మధ్య ప్రజా విముక్తి సైన్యం మూడు భారీ విజయాలను సాధించింది. కొమింటాంగ్‌ సేనల ప్రధాన బలగాన్ని తుడిచిపెట్టింది. ప్రజా విముక్తి సైన్యాలు యాంగ్జీ నదిని దాటి కొమిం టాంగ్‌ దుష్ట పాలనకు తెరదించాయి.
ప్రజా విముక్తి సైన్యాన్ని నడిపి మావో తన సహచరులతో కలిసి భూ సంస్కరణలు, విముక్తి ప్రాంతాల్లో ఆర్థిక నిర్మాణాల ప్రక్రియను మొదలు పెట్టారు. 1949 సెప్టెంబరులో జరిగిన చైనా ప్రజా రాజకీయ చర్చావేదిక తొలి ప్లీనరీకి మావో అధ్యక్షత వహించి స్వాగతో పన్యాసం చేశారు. ఆ సమావేశంలో మావోను చైనా ప్రజా రిపబ్లిక్‌ ప్రభుత్వ ఛైర్మన్‌గా ఎన్ను కున్నారు. అదే సంవత్సరం అక్టోబరు 1న తియాన్మెన్‌ కూడలిలో చైనా ప్రజా రిపబ్లిక్‌ స్థాప నను మావో అధికారికంగా ప్రకటించారు.
ప్రజా రిపబ్లిక్‌ ఏర్పాటు తరువాత లీషావ్‌ చీ, చౌ ఎన్‌ లై, చూటే, చెన్‌యున్‌, డెంగ్‌ జియావో పింగ్‌ తో కలిసి చైనా ప్రజలను సామ్యవాద విప్లవం, జాతీయ నిర్మాణం వైపు నడిపారు. ప్రజా రిపబ్లిక్‌ ఏర్పడిన మూడేళ్ల కాలంలో మావో నేతృత్వం లోని చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ, కేంద్ర ప్రజా ప్రభుత్వం జాతీయ స్థాయిలో వ్యవ సాయ, ప్రజాస్వామ్య సంస్కరణలను విజయ వంతంగా అమలు చేశాయి.
1953లో చైనాలో సామ్యవాద పారిశ్రామి కీకరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ప్రణాళి కాబద్ధమైన భారీ స్థాయి ఆర్థిక నిర్మాణం వైపు దృష్టి సారించారు. ఉత్పాదన సాధనాలన్నింటినీ జాతీయం చేశారు. అయితే ఈ ప్రణాళికను చిత్తశుద్ధితో అమలు చేయలేకపోయారు. ఫలితం గా నాయకత్వ స్థాయిలో అనేక తప్పులు దొర్లా యి. ఆ తరువాత 'కంద్రీకరణ-ప్రజాస్వా మ్యం', 'స్వేచ్ఛ-క్రమశిక్షణ', 'ఉమ్మడి ఆకాంక్ష- వ్యక్తిగత వికాసం' సమపాళ్లలో ఉండే రాజకీయ పరిస్థితు లను కల్పిస్తే సామ్యవాద విప్లవం, సామ్యవాద నిర్మాణం సునాయాసంగా సాధ్యపడగలదన్న రాజకీయ సిద్థాంతాన్ని మావో ప్రతిపాదించారు. అయితే దురదృష్టవశాత్తూ తర్వాత కాలంలో మావో తాను ప్రతిపాదించిన రాజకీయ సిద్థాం తాలను అమలు చేయడంలో శ్రద్ధ చూపలేక పోయారు. పొరబాట్లను గ్రహించిన వెంటనే మావో స్వయంగా నివారణా చర్యలు చేపట్టారు. అయితే పార్టీలో మితవాద సరళిని అరికట్టడానికి తీసుకున్న చర్యలు కూడా మరిన్ని పొరబాట్లకు దారి తీసి సామ్యవాద నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపాయి. పొరబాట్లను సరిదిద్దడానికి 1960 నుంచి 65 వరకూ పార్టీ కేంద్ర కమిటీ, మావో అనేక చర్యలు తీసుకున్నారు. జాతీయ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిపైకి తెచ్చారు. అయితే అతి తక్కువ కాలంలో మావో తన దృష్టిని తిరిగి అంతర్గత సంక్షోభానికి దారి తీస్తున్న వర్గపోరా టంపై సారించారు. 1966లో దేశీయ, అంత ర్జాతీయ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకుం డానే మావో సాంస్కృతిక విప్లవానికి కంకణం కట్టుకున్నారు. ఫలితంగా దేశంలో రాజకీయ అరాచకత్వం పెరిగింది. ప్రతీఘాత విప్లవ కుట్ర దారులైన లిన్‌బియావో, జియాంగ్‌ కింగ్‌ల ఎత్తుగడలను సమర్థవంతంగా తిప్పి కొట్టలేక పోయారు. పదేళ్లపాటు కొనసాగిన సాంస్కృతిక విప్లవం చైనాలో తీవ్ర సమస్యలను మిగిల్చింది. సాంస్కృతిక విప్లవంలో భాగంగా లిన్‌బియావో నేతృత్వంలోని తిరోగమన వర్గాన్ని రూపుమాపేం దుకు చైనా కమ్యూనిస్టు పార్టీ భారీ ఉద్యమాన్ని నిర్వహించింది. దుష్టచతుష్టయంగా పేరు గాంచిన ఈ వర్గం దేశ నాయకత్వాన్ని చేజి క్కించుకో కుండా అన్ని స్థాయిల్లో పోరాటం జరిగింది. వెనుకబాటుకు మారుపేరుగా ఉన్న చైనా ప్రజలను మేలుకొల్పి, వారిని విప్లవ పథంలో నడిపించి, విముక్తి గావించిన మహా నేత మావో 1976 సెప్టెంబరు 9న కన్ను మూశారు. అనంతరం చైనా పార్టీ నాయకత్వం దుష్టచతుష్టయం నుండి దేశాన్ని రక్షించుకుని గాడిన పెట్టింది.

No comments:

Post a Comment