Thursday 26 June 2014

చప్పట్లుకొడితే చల్లని నీళ్లు...



chinnaiahచుట్టూ దట్టమైన అడవి... దారి పొడవునా ఎత్తైన గుట్టలు... అన్ని సమయాల్లో నీళ్లూరే బుగ్గ.. చప్పట్లు కొడితే చాలు చల్లని నీరందించే మంచుకొండలు.... భీముడి పాదముద్రలు.. దండకారణ్యంలో ఆహ్లాదంతో పాటు భక్తినీ పంచుతున్న చిన్నయ్య, పెద్దయ్య దేవుని గుట్టల విశేషాలు ఇవి....
ఆదిలాబాద్ జిల్లాలోని అటవీప్రాంతంలో ఉన్న చిన్నయ్య, పెద్దయ్య గుట్టలు గిరిజనులకు ఆరాధ్యదైవాలుగా నిలుస్తున్నాయి.


దండేపల్లి మండలంలో ఉన్న పెద్దయ్యదేవుని గుట్ట, లక్సెట్టిపేట మండలంలో ఉన్న చిన్నయ్య గుట్ట ఇక్కడి ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆధ్మాత్మికంగా భక్తుల కోర్కెలూ తీరుస్తున్నది. పెద్దయ్యదేవుని గుట్ట దండేపల్లి మండల కేంద్రం నుంచి దాదాపు పదికిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ఉంటుంది. గుట్ట చూడటానికి ఒక నిటారు స్తంభం లాగా ఉంటుంది. ఎత్తు సుమారు వేయి అడుగులు. గుట్టచుట్టూ అంతే ఎత్తయిన కొండల వరుసలు వలయాకారంగా ఉండటంతో అవన్ని దాటుకుని వెళ్లే వరకు పెద్దయ్య గుట్ట మనకు కనిపించదు.

చిన్నయ్య మంచుకొండలు.. జలపాతం...


chinnaiah 
 
కుంతీదేవి సంతానం కోసం శంకరుడి వద్ద మొరపెట్టుకుంది. తనకు సంతానం ప్రసాదించమని ఆయనను వేడుకోవడంతో ఆయన ఆమెను పరీక్షించాలనుకుని కప్పలు, చేపలు ముట్టని నీళ్లు, కుమ్మరి చేయని కుండలో, దూసవారి వడ్ల(విత్తనాలు చల్లకున్నా అవే రాలి.. అవే మొలిచే సువాసన గల ఉత్తమ వడ్ల)తో నాకు నైవేద్యం పెట్టాలని కోరాడు. దీంతో కుంతీదేవి తన ఛాతిపై మట్టి కుండను చేసి చేపలు, కప్పలు ముట్టని నీళ్ల కోసం తిరిగి అవి ఎక్కడా కనపడకపోవడంతో అలిసిపోయి సొమ్మసిల్లిపోయింది. ఆమె సత్యనిష్ఠకు మెచ్చిన శంకరుడు ఆ కొండలపై నుంచి నీళ్లను కురిపించాడు. అప్పుడు ఆ నీటితో, కుమ్మరి చేయని కుండలో నైవేద్యం వండి శంకరుడికి పెడుతుంది ఆ తల్లి. శంకరుడు ఆమెకు ఐదుగురు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. వారే పాండవులు. అందులో పెద్దవాడైన ధర్మరాజు పెద్దయ్యగా, భీముడు చిన్నయ్యగా ఇక్కడ వెలుస్తారని స్థానికులు చెబుతుంటారు. ఆనాటి నుంచి చిన్నయ్య దేవుని సమీపంలో ఉన్న కొండలను మంచుకొండలని పిలుస్తున్నారు.
ఇక్కడి మహిమలు ఎన్నో...

చిన్నయ్య దేవుని దగ్గర్నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మంచుకొండలు ఉంటాయి. ఆ కొండల వద్దకు వెళ్లిన భక్తులు చప్పట్లు కొడుతూ అలజడి చేస్తే పై నుంచి నీళ్లు పడతాయి. ఇవి చల్లగా ఎంతో తియ్యగా ఉంటాయి. ఎంత ఎక్కువ మంది చప్పట్లు కొడితే అంత దొడ్డుధారతో నీళ్లుపడతాయన్నమాట. ఈ నీటిని చిన్నయ్య దేవుడి వద్ద ఉంటే పసుపు, కుంకుమలతో కలిపి చల్లితే పంటలకు చీడపీడ ఉండదని స్థానికుల విశ్వాసం.

చాలా మంది అలాగే చేస్తారు కూడా. అదేవిధంగా చిన్నయ్య గుహలకు అత్యంత సమీపంలో మండు వేసవిలో కూడా భూమిలో నుంచి నిరంతర సహజ నీటి బుగ్గ ఉబికి వస్తుంటుంది భయంకర కరువు కాలంలో సైతం ఈ నీటి బుగ్గ ఎండిపోలేదని స్థానిక గిరిజనులు చెబుతుంటారు. ఈ దేవుడి దగ్గరుండే అల్లుబండకు కూడా ఎంతో ప్రాశస్థ్యం ఉంది. మనసులో కోరికలు కోరుకుని ఈ అల్లుబండను ఎత్తితే అది తేలికగా వస్తే అనుకున్నది కాదని, అది కదలకుండా అలాగే ఉండిపోతే పని సులువుగా అయిపోతుందని చెబుతుంటారు. ఇక్కడ మొలిచే ఒక తీగజాతికి చెందిన మొక్కతో తీసే మందు ఎంతటి తలనొప్పినైనా తీవ్రమైన పార్శ్యపు నొప్పినైనా నివారిస్తుంది. ఆ తీగను గుర్తించడం స్థానిక గోండులు, నాయక్‌పోడ్ తెగకు చెందిన వారికి మాత్రమే తెలుసు.

ఏ ధాన్యం పండించాలో చెప్పే పూజారి...

పెద్దయ్య దేవుడి దగ్గరుండే పూజారి స్థానికులకు ఏ ధాన్యం పండించాలో చెబుతాడు. ఆయన చెప్పిన పంటనే ఇక్కడి ప్రజలు వేసుకుంటారు. మొదట పూజారి పెద్దయ్య దేవుడికి దండం పెట్టుకుని పూనకంతో నిట్టనిలువుగా ఉన్న పెద్దయ్యగుట్టను అవలీలగా ఎక్కుతాడు. దాదాపు వెయ్యి అడుగుల ఎత్తున్న ఈ గుట్టను కేవలం పది నిమిషాల్లో ఎక్కుతాడు. అది కూడా మనకు రెండు మూడు చోట్ల మాత్రమే కనిపిస్తాడు.

ఇతరులు ఎవరూ ఈ గుట్టను ఎక్కలేరు. గుట్టపై నుంచి పూజారి పసుపు, కుంకుమలు, సీజన్‌లో పండే పంట గొలుకలను తీసుకువస్తాడు. గుట్టదిగి ఇల్లారి(దేవుని గుడి)కి వచ్చాక రైతులకు ఆ సీజన్‌లో ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో చెప్తాడు. వర్షాల స్థితిగతులు, ఏ పంటలకు ఏ వ్యాధులు ఎక్కువగా సోకుతాయో కూడా జోస్యం చెప్పి పొలాలపై చల్లుకోమని వారికి పసుపు, కుంకుమలను పంచిపెడతాడు. ఇక్కడికి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభంలో, విత్తనాలు విత్తుకునేప్పుడు, పంట కోతలప్పుడు జనం ఎక్కువగా వస్తుంటారు.

చిన్నయ్య వరద పాసెం...

వర్షాలు లేక కరువు వచ్చినప్పుడు ఇక్కడి వాళ్లంతా చిన్నయ్య దేవుణ్ణే ఆశ్రయించేవారట. శనివారం రాత్రి స్నానం చేసిన భక్తులు రాత్రి ఏడు గంటలకు భజన ప్రారంభించి తెల్లవారి ఉదయం ఏడు గంటల వరకూ చేస్తారు. మళ్లీ స్నానం చేసి చిన్నయ్యదేవుడి దగ్గర పాశం(పాయసం) వండి ఆయనకు నైవేద్యం పెడతారు. అనంతరం ఆ పాశంను గొర్రు బండలపై పోస్తారు. ప్రజలు, రైతులు ఆ పాయసాన్ని నాకుతారు. దీన్నే వరద పాశం అంటారు. అట్లా పాశాన్ని గొర్రుబండలపైపోసి ఇంటికి వచ్చేసరికి వర్షం పడుతుందని స్థానికుల విశ్వాసం. అదేవిధంగా ఇక్కడ కుంతీ, భీముడికి సంబంధించిన అనేక ఆనవాళ్లు కనిపిస్తాయి.

ఇక్కడే పుట్టిన భీముడికి(చిన్నయ్య) కుంతీ దేవి కాళ్లు చాపుకుని స్నానం పోసిన కాళ్ల కొల్లు గుంటల (శిశువు స్నానపు నీళ్ల గుంట) గుర్తులు బండపై దర్శనమిస్తాయి. భీముడు నడిచిన అడుగు జాడలు, అంబాడిన మోకాలి ముద్రలు విశాలమైన పరుపు బండపై కనిపిస్తాయి. భీముడు గోండుల ఆడపడుచు హిడింబిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ ప్రదేశం ఇప్పుడు పెండ్లి మడుగుగా ప్రసిద్ధికెక్కింది. ఇది పెద్దయ్యగుట్టకు వెళ్లే దారిలో అడవి ప్రారంభమైన చోటే ఉంటుంది. దానికి కొద్దిపాటి దూరంలో భీముని ఇల్లారి ఉంది. ఈ ఇల్లారికి పడమరన ఫర్లాంగు దూరంలో అర్జుగూడ ఉంది. అర్జుగూడ అంటే భీముడి తమ్ముడు అర్జునుడి పేరిట వెలిసిన గిరిజన గూడెం. దీనికి దక్షిణాన సామ్‌గూడ ఉంది. నిజానికి అది సామ్‌గూడ కాదు సహగూడ అంటే సహదేవుడి పేరిట వెలిసిందన్నమాట.


పట్టించుకోని పాలకులు...

ఇంత ప్రాశస్థ్యం, ఎంతో ప్రకతి రమణీయతలకు నెలవైన చిన్నయ్య, పెద్దయ్య దేవుడి గుట్టలను ఆంధ్రాపాలకులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో పర్యాటక అభివద్ధిలో అడ్రస్‌లేని ప్రాంతంగా ఉండిపోయింది. ప్రజలు ఇక్కడికి ఎంతో ప్రయాసపడి వస్తుంటారు. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నడకసాగించాల్సిందే. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడికి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చిన్న గుహలను అభివద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ విద్యుత్‌ను ఏర్పాటు చేసి మంచినీరు, సరైన వసతి కల్పించాలని కోరుతున్నారు.

ఏసీసీ, ర్యాలీగఢ్‌పూర్, దేవాపూర్, తిర్యాణి రోడ్డును చెల్లయ్యపేట చిన్నయ్య దేవుడి రోడ్డును కలుపుతూ ఉన్న రహదారిని లక్సెట్టిపేటకు కలిపితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చిన్నయ్య గుహలు, మంచుకొండలు, జలపాతం మీద దష్టిపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అభివద్ధి చెందితే ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తారని తద్వారా పర్యాటకంగా కూడా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం లభిస్తుందని వారు చెబుతున్నారు.

No comments:

Post a Comment