Thursday 5 June 2014

ది ఎలెవెన్ కాజెస్ ఫర్ ది డిజెనరేషన్ అఫ్ ఇండియా


నా దృష్టిలో మన భారత దేశం, ఒక సూపర్ పవర్‌గా ఎదగకుండా నిలవరిస్తున్న పదకొండు కారణాల గురించి మాట్లాడదల్చుకున్నాను. "ది ఇలెవెన్ కాజెస్ ఫర్ ద డిజనరేషన్ అఫ్ ఇండియా." 



1. నిస్పృహ

 
అన్నిటి కంటే భయంకరమైనది నిస్పృహ. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడిని నిర్వీర్యుడిని చేసి, ఆలోచన సైతం స్తంభింప చేసే చలిలా, ఈ నిస్పృహ మనల్ని అచేతనులను చేస్తుంది. ఏం చేసినా చేయకపోయినా ఫలితం ఒక్కటే అనే నిరర్థకమైన వేదాంత ధోరణి అలవాటు చేస్తుంది. ప్రస్తుతం మన దేశం ఉన్న పరిస్థితి చూసి చాలా మంది ఈ నిస్పృహని ఆశ్రయించారు.
ఈ నిస్పృహ మనకు తరతరాల బానిసత్వం నుండి వచ్చింది. మన దేశ సంస్కృతిని గౌరవించడం మానేయడం వల్ల వచ్చింది. పరిస్థితులు మారవు అన్న నైరాశ్యం వల్ల వచ్చింది. కానీ విషాదకరమైన విషయం ఏంటంటే ఇది ఒక విష వలయం. పరిస్థితి విషమించిన కొద్ది నిస్పృహ పెరుగుతుంది. నిస్పృహ వల్ల ఏమీ చేయకుండా కూర్చుంటే పరిస్థితి మరింత విషమిస్తుంది. 

2. సోషలిజం

 
నెహ్రూ ఆమాత్యుడు వృద్ధిలోకి తీసుకుని వచ్చిన రాజకీయ సిద్ధాంతం. ఆయన పోయి చాలా సంవత్సరాలైనా, ఆయనగారి పార్టీ ఐన కాంగ్రెస్, 1991 వరకూ ఈ failed ideologyని కొనసాగించింది. ఇప్పటికీ ఎన్నో "పేదల" పార్టీలు, సోషలిస్ట్ అన్న పదాన్ని తమ పార్టీ పేర్లకు జోడించి, సోషలిజం అనే నినాదాన్ని ఇంకా వెలువరిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం కలగ చేసుకుని సబ్సిడీలూ, రుణాలూ, రాయతీలూ ఇచ్చి ప్రజలలో సమానత్వం స్థాపించాలనేది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని వల్ల మన దేశానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.
సహజంగా రష్యా విధానాల పట్ల మక్కువ ఉన్న నెహ్రూ, అన్ని రంగాల్లో, ముఖ్యంగా విద్యా సంస్థల్లో, వార్తా రంగంలో, కమ్యూనిస్టులని ప్రోత్సహించాడు. ఇప్పటికీ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ, ఈ ఎర్ర మేధావులతో కిట కిటలాడిపోతూంటుంది.
ఎర్ర మేధావులని గుర్తు పట్టడం చాలా సులభం. ఔరంగజేబు మత సహనం ఉన్న పాలకుడు అనో, 1962లో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకోలేదనో, నక్సలైట్ల సమస్యను శాంతి భద్రతల సమస్యగా పరిగణించాలనో, కాశ్మీరుని పాకిస్తాన్‌కి ఇచ్చేస్తే తప్పేంటనో ఎవరైనా అవాకులూ చవాకులూ పేలుతున్నారంటే, వారు ఎర్ర మేధావులని అర్థం.
నెహ్రూ కూతురు ఇందిరమ్మ ఒక్క అడుగు ముందుకు వేసి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మొదలగు పనికి మాలిన చట్టాలు ప్రవేశ పెట్టింది. Urban Land Ceiling Act ప్రకారం ఎవరి దగ్గరన్నా ఒక పరిమితికి మించి ఎక్కువ భూమి ఉంటే, ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పక్కా ఇళ్ళు కట్టడానికి ఉపయోగించవచ్చు. ఐతే దీని వల్ల పక్కా ఇళ్ళ మాట దేవుడెరుగు, భూమి ధరలు విపరీతంగా పెరిగాయి. పైగా ఎన్నో ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా కుంటు పడ్డాయి. 1999లో కేంద్ర ప్రభుత్వం దీని వైఫల్యాన్ని అంగీకరించి ఈ చట్టం ఎత్తివేసింది. 


3. సూడో సెక్యూలరిజం

 
సూడో సెక్యూలరిజం అంటే, మైనారిటీ మతాలకు పెద్ద పీట వేసి, వాటిని కావలసిందానికంటే ఎక్కువగా గౌరవిస్తూ, మెజారిటీ మతాన్ని మాత్రం, అయిన దానికీ కాని దానికీ దుమ్మెత్తి పోయడం. తద్వారా సదరు మైనారిటీలలో అభద్రతా భావాన్ని మరింత పెంపొందించడం, ఆ రకంగా వాళ్ళనుంచి వోట్లు దండుకోవడం.
ఈ ప్రహసనంలో మైనారిటీ నాయకులది కూడా చాలా పెద్ద పాత్రే ఉంది. ఇది పరస్పర లాభం చేకూరుస్తుంది. సూడో సెక్యూలరిస్టులైన మెజారిటీ మత నాయకులకు, మైనారిటీల వోట్లు లభిస్తాయి. మైనారిటీ నాయకులకి, కావలిసిన పదవులు, అధికారాలు దక్కుతాయి. మధ్యలో మైనారిటీలు ఎప్పటికి అభివృద్ధి చెందకుండా అలానే ఉండిపోతారనుకోండి. అది వేరే విషయం. ఈ "ఉభయకుశలోపరి" విధానాన్ని తుంచడం చాలా ముఖ్యం. 


4. కాశ్మీర్ సమస్యని మొగ్గలోనే తెంపి వేయకపోవడం

 
దీనికి మళ్ళీ మన నెహ్రూ గారిని తలుచుకోక తప్పదు. గోటితో పోయే సమస్యని అనవసరంగా పెంచి ఇప్పుడు గొడ్డలితో కూడా పరిష్కారం కాని స్థితికి తెచ్చిన ఘనత ఈయన గారిదే. భారత దేశం, పాకిస్తాన్ సైన్యాలని, ప్రస్తుతం అజాద్ కాశ్మీరు అని పిలవబడుతున్న ప్రదేశం నుంచి పూర్తిగా తరిమివేయబోతున్న తరుణంలో, ఈయన సడన్‌గా cease fire ప్రకటించి, ఐక్య రాజ్య సమితిని ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా కోరాడు. వాళ్ళు పరిషర్కించింది ఏమీ లేదు కానీ, కాశ్మీరులో మూడో వంతు మన చేయి జారిపోయింది.
ఆ తరువాత 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో సంపూర్ణ విజయం సాధించి కూడా, ఆ ఆధిక్యతతో కాశ్మీర్ సమస్యని మళ్ళీ లేవనెత్తకుండా చేయగలిగిన సువర్ణావకాశాన్ని జార విడుచుకోవడం ఇంకొక historical blunder. అప్పుడు మన దేశ ప్రధాన మంత్రిగా ఉన్నది నెహ్రూగారి కుమార్తె ఇందిరమ్మే అన్న విషయం అందరికి తెలిసినదే. 


5. లా అండ్ ఆర్డర్ యొక్క వైఫల్యం

 
ఏ దేశంలో ఐతే లా అండ్ ఆర్డర్ దృఢంగా ఉండదో, ఆ దేశం మూడు అడుగులు ముందుకీ, నాలుగు అడుగులు వెనక్కీ వేస్తూంటుంది. వెరసి ఎప్పటికి ప్రగతి బాట పట్టదన్న మాట. బోఫోర్స్ సమయంలోని 64 కోట్ల కుంభకోణం నుంచి, ఇప్పుడు లక్షా ఎనభై ఆరు వేల కోట్ల బొగ్గు స్కాండల్ వరకు వచ్చాం. అయినా ఒక ముఖ్యమైన రాజకీయ నాయకుడు కూడా అరెస్ట్ కాలేదు. కంటి తుడుపు చర్యల కింద కొందరు చిన్న చేపలని వల వేసి పట్టి జైలులో వేస్తున్నారనుకోండి. అది వేరే విషయం. తప్పు చేసినా శిక్ష పడదు అన్న భరోసా ఉంటే, ఈ ఘరాన దొంగలని ఎలా ఆపుతాము? ఈ సమస్య మన దేశాన్ని నిర్వీర్యం చేస్తూనే ఉంది.


7. మత మార్పిడులని అరికట్టకపోవడం

 
మన రాజ్యాంగంలో నిషేధించినప్పటికీ, భారీ ఎత్తున జరిగే మతం మార్పిడులని ప్రభుత్వం, వోటు బాంక్ రాజకీయల వల్ల అరి కట్టకపోవడం. స్వచ్ఛందంగా మతం మారడం వేరు. డబ్బూ ఇతర ప్రలోభాలూ చూపించి మూకుమ్మడిగా మతాలు మార్చడం వేరు. ఈ కొత్త మతస్తులు అందరు వెంటనే భారతదేశ ద్వేషులు అవుతారు. దీనికి కారణం ఉంది. హిందు మతాన్ని ద్వేషిస్తూ, భారతదేశాన్ని ప్రేమించడం కష్టం. ఈ మతం మార్పిడులు హిందూ మతం మీద ద్వేషం ప్రాతిపదికగా జరుగుతాయి కాబట్టి, ఈ భారతదేశంపై ద్వేషం కూడా తప్పని సరిగా జరిగే ఒక side effect. ఇది భారతదేశం ఉనికికే ప్రమాదం.


8. కులానికి ప్రాధాన్యత ఇవ్వడం

 
కులం మనని వదలకుండా పీడిస్తున్న జాడ్యం. కులం కంటే సంస్కారం గొప్పది అన్న విషయం అర్థం చేసుకోలేనంత వరకూ మనం వెనుక పడే ఉంటాం. దీని అర్థం నిమ్న కులాల వారంతా మంచివారూ, అగ్ర కులాల వారంతా చెడ్డవారూ అని కాదు. దీని అర్థం కులానికీ సంస్కారానికీ సంబంధం లేదూ అని మాత్రమే. 

కులం ప్రభావం రాజకీయల మీద చాలా ఉంది. ఇప్పటికీ పార్టీలు ఎన్నికలలో నిలబడే అభ్యర్థులని ఆ నియోజక వర్గంలో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో అన్న దాన్ని బట్టే నిర్ణయిస్తాయి. కొన్నేళ్ళ కింద బీహార్‌లో జరిగిన ఎన్నికల సంగ్రామంలో రాష్ట్రీయ జనతాదల్ స్లోగన్స్‌లో ఇదొకటి. "న ఫూల్ చాహియే, న సడక్ చాహియే, హమే తో లాలూ జైసా మర్ద్ చాహియే." (మాకు బ్రిడ్జులూ వద్దు, రోడ్లూ వద్దు, మాకు లాలూ లాంటి మగాడు కావాలి.) ఎందుకు? లాలూ వాళ్ళ కులం వాడు కాబట్టి.


9. కుల నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వడం

 
కులాన్ని నిర్మూలిస్తే సమ సమాజం దానంతట అదే వచ్చి పడుతుందని కొందరి నమ్మకం. కులాన్ని నిర్మూలించడంకంటే కులం అప్రస్తుతం (irrelevant) అయ్యే వాతావరణం సృష్టించాలి. అందరికి చదువుతో పాటూ సంస్కారం నేర్పడం ఒక్కటే దీనికి మార్గం. ఎప్పుడైతే మనిషి ఔన్నత్యాన్ని అతని గుణాన్ని బట్టి కొలిచే సంప్రదాయం వస్తుందో, అప్పుడు కులం యొక్క ప్రభావం దానంతట అదే అదృశ్యం అవుతుంది.
అంతే కానీ చదువుల్లో, ఉద్యోగాల్లో, ఆఖరికి ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు ఇచ్చి సామర్థ్యం ఉన్న వాళ్ళ కడుపు కొడితే కులం "పోదు". పైగా కుల తత్వం మరింత ఎక్కువవుతుంది. ఎవరిది ఏ కులమో ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. కుల ప్రాతిపదిక మీద జీవితంలో పైకి వచ్చిన వాళ్ళ మీద చిన్న చూపు మరింత ఎక్కువవుతుంది.
ఇవి మన రాజకీయ నాయకులకు తెలీక కాదు. కానీ మొదటి పద్ధతి కంటే రెండోది సులభం. వోట్లు రాబట్టుకోవడం ఈజీ. ఇది ప్రజలు గుర్తించనంతవరకూ ఇలాగే నిరాటంకంగా సాగుతుంది. 


10. Non-aligned movement

 
చాలా రోజుల వరకూ అలీన సిద్ధాంతం మన foreign policyని నిర్దేశించింది. దీని అర్థం అమెరికా కూటమి కానీ రష్యా కూటమి కానీ దేనిలోనూ చేరకుండా తటస్థంగా ఉండడం. ఇది కూడా చాచా నెహ్రూ అద్భుత ఆలోచనే. తటస్థంగా ఉన్నామని మనం అనుకున్నాం. రష్యా తొత్తులని West అనుకుంది. దీని వల్ల మన తరువాత అతి పెద్ద ప్రజాస్వామ్యిక దేశమైన అమెరికాతో చాలా రోజుల వరకూ మనకు సరైన సంబంధ బాంధవ్యాలు లేవు. మనం ఇంకా సోషలిజంలో మగ్గడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం. 


11. Paliamentary democracy

 
అమెరికాలో ప్రజలు తమ నాయకుడిని నేరుగా ఎన్నుకుంటారు. తరువాత ఆ నాయకుడు తన క్యాబినెట్ సభ్యులని వివిధ రంగాలనుంచి ఎన్నుకుంటాడు. ఇది presidential democracy. దీనిలో సౌలభ్యాలు రెండు. 1. ఎక్కువ మంది మార్బలం లేని ఒక గొప్ప నాయకుడికి ఎన్నిక కాగలిగే అవకాశం. (Of course, దీనికి multi party system ఉండాలనుకోండి. అది ఎలాగూ మన దగ్గర ఉంది.) 2. తనని ఎప్పుడు తన వాళ్ళే కుర్చీ నుంచి లాగేస్తారా అన్న భయం సదరు నాయకుడికి ఉండకపోవడం. కాబట్టి పరిపాలన మీద దృష్టి పెట్టగలగడం.
రాజీవ్ గాంధి 400 పై చిలుకు సీట్లు గెలిచి కూడా తన హయాంలో ఆఖరి రెండు సంవత్సరాలు ఎక్కడ తన పార్టీ ఎం.పీలే తనను పదవీచ్యుతుణ్ణి చేస్తారో అన్న భయంతో ఏమీ చేయలేకపోయాడు. ఇక సంకీర్ణ ప్రభుత్వాల గురించి చెప్పేది ఏముంది? 

ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ ఈ పదకొండు మాత్రం నా దృష్టిలో "ద డిజెనరేషన్ అఫ్ ఇండియా"కి ముఖ్య కారణాలు.

No comments:

Post a Comment