Friday 20 June 2014

కాలం చెల్లిన భీష్ములు




 మహాభారతంలో నాకు ఇష్టమైన పాత్రలు కర్ణుడు, భీష్ముడు. ఒకరు విభ్రమకు గురిచేస్తే మరొకరు విభ్రాంతిని అందిస్తారు. కర్ణుడు తన నిబద్ధత నిలబెట్టుకుంటూకూడా , బాహ్యప్రపంచ కారకాలమూలంగా ప్రాణాలు కోల్పోతాడు. కానీ భీష్ముడు, తన వ్యక్తిత్వంలోని లోపాల కారణంగా అసువులుబాస్తాడు. ఈ విధంగాచూస్తే, భీష్ముడు ఒక క్లాసిక్ షేక్స్పీరియన్ పాత్ర తరహా అన్నమాట. సినిమా పరిభాషలో "miscasting" అంటారు. అంటే మోహన్ బాబు పాత్రలో మహేష్ బాబుని పెట్టడంలాంటిదన్నమాట. సత్యయుగం, త్రేతాయుగం నాటి విలువలు కలిగిన భీష్ముడు, ఈ ద్వాపరయుగంలో a complete miscast అనిపిస్తుంది.



భీష్ముడి పాత్రలో వున్న అత్యంత definingలోపం, 'సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం' . మొత్తం మహాభారతంలో కృష్ణుడికి సరితూగగలిగిన శక్తియుక్తులు, బలాబలాలూ,జ్ఞానవిజ్ఞానాలూ సొంతమైనా, భీష్ముడు మహాభారతాన్ని నిర్దేశించడానికి తన ఉనికిని వాడడు. ప్రతిసారీ ఒక ప్రేక్షకుడిగానో లేక తప్పుజరుగుతుంటే దానిలో మూగభాగస్వామిగానో కనిపిస్తాడేగానీ, పరిస్థితుల్ని మార్చగలిగివుండీ నిర్ణయాత్మకంగా అడుగులువేసే ధీరీద్ధాత్తుడిలాగా ఆగుపించడు.కొన్ని సందర్భాలలో కృష్ణుడికీ భీష్ముడికీ మధ్య జెట్ -కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ల మధ్య కుదిరిన ఒప్పందంలాంటి 'డీల్' కుదిరినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ జెట్-కింగ్ ఫిషర్ డీల్ లో optimization of operational costs అయితే, కృష్ణ-భీష్ముల మధ్య ధర్మసంస్థాపనకోసం, ఒకరు వేగవంతమైన మరొకరు మూగవంతమైన భాగస్వాములుగా పాత్రలు పోషించారనిపిస్తుంది. కానీ, ఈ పరిణామక్రమంలో కృష్ణుడు అవతారమైపోతే, భీష్ముడు మాత్రం అపవాదునేమూటగట్టుకున్నాడు.లేకపోతే, భీష్ముడుమాత్రం అవతార హోదాకి అర్హుడుకాదా?



తండ్రి సుఖంకోసం, కాబోయేతల్లి పిల్లలకు అధికారం ఇవ్వడంకోసం భీష్మమైన ప్రతిజ్ఞ చేసి ఈ గాంగేయుడు భీష్ముడయ్యాడు.పెద్దతమ్ముడు చిత్రాంగదుడు యుద్ధంలో మరణిస్తాడు. భార్యల్నికూడా గెలిచితెచ్చుకోలేని బలహీనుడైన తమ్ముడు విచిత్రవీర్యుడికి అంబాలిక,అంబికలకు కట్టబెట్టి, అంబ జీవితాన్ని అడవులపాలు చేశాడు. తీరా, విచిత్రవీర్యుడు వంశాంకురాన్నివ్వకుండా కన్నుమూస్తే, తన ప్రతిజ్ఞకు మూలకారణమే నశించినాకూడా, పట్టినపట్టువీడని భీష్ముడిది మంకుపట్టు అనిపిస్తుందేతప్ప,మహాప్రతిజ్ఞలాగా అనిపించదు.వంశాన్నుద్ధరించడానికి వ్యాసుడ్ని పట్టితేగలిగినవాడు, తనే ఆపనిచేసుంటే మహాభారతం ఎలావుండేదో! బహుశా అందుకేనేమో రచయిత వ్యాసుడే కల్పించుకుని కాగలకార్యంకాస్తా నెరవేర్చాడు.



ఇక్కడా భీష్ముడి ప్రతిజ్ఞ నిలబెట్టుకునే కాంక్షకనిపిస్తుందేగానీ, నిజంగా అంబాలిక,అంబికల స్త్రీత్వాన్ని గౌరవించినట్లు కనపడదు. వారి ఇష్టానికి వ్యతిరేకంగా వ్యాసునితో కూడమని చెప్పడంవలనే, ఒకరికి రక్తహీనుడైన పాండురాజు జన్మిస్తే వేరొకరికి అంధుడైన ధృతరాష్టృడు జన్మించాడు. ఇందులో జరిగిన మంచిఏదైనా ఉంటే,అది concessionగా విదురుడు జన్మించడం. ఇక ఈతరంలోనూ స్త్రీల ఉసురు పోసుకోవల్సిన అగత్యం ఈ మహానుభావుడికి పట్టింది. కుంతీ,మాద్రుల్ని సంసారసుఖం ఇవ్వలేని పాండురాజుకు కట్టబెడతాడు. గుడ్డివాడైన ధృతరాష్టృడ్ని గాంధారికి కట్టబెట్టాడు. ఒకరికి సుఖంలేదు మరొకరికి శాంతిలేదు. వేరే ప్రత్యామ్న్యాయం ఉండీ, ఇన్ని సంకరాల్ని చేజేతులారా చేసిన భీష్ముడు, ఆ తరువాత జరిగిన దారుణాలకు మూగసాక్షిగా మిగలక, సాధికారంగా ఆపగలిగేవాడా!



భీష్ముడి వ్యక్తిత్వానికి గొడ్డలిపెట్టులాంటి ఘటన, ద్రౌపదీ వస్త్రాపహరణం. ఇంటికోడలిని, ఏకవస్త్రను నిండుకొలువులో వలువలీడ్పించే సమయంలో,ఆపగలిగిన అధికారం బాధ్యత రెండూ వుండికూడా మౌనం వహిస్తాడు. "ఇంతకన్నా, misplaced sense of loyalty మరోటుంటుందా?" అనిపిస్తుంది. ఈ ఘోరావమానం ఎదుర్కొంటున్న ద్రౌపదికూడా, ఆ నిండుకొలువులో "నేను ధర్మ విదితనా, అధర్మవిధితనా?" అని ఒక్కభీష్ముడి నుంచే సహాయాన్ని అర్థిస్తుంది. కానీ దానికి ఇతడి సమాధానం మాత్రం "దర్మం నిఘూడమైనది. నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను" అని. దర్మాధర్మాల సంగతిపక్కనపెట్టినా, ఒక క్షత్రియుడిగా, విజ్ఞుడిగా, కనీసం మనిషిగా బలాత్కారం చెయ్యబడుతున్న ఒక దాసిని రక్షించకూడదా? కానీ ఆపనిచెయ్యలేకపోయాడు. కారణం విధేయత,విశ్వాసపాత్రత. అదీ ఎవరికి, అన్యాయానికి,అక్రమానికి. ఇంతటి మూర్ఖపు విధేయత అవసరమా అనిపిస్తుంది.బలహీనుల్ని రక్షించాల్సిన క్షాత్రధర్మాన్ని విస్మరించిన భీష్ముడి విధేయత,ధర్మనిబద్ధత ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది.



ఇక్కడే యుగధర్మానికి కట్టుబడిన కృష్ణుడికీ, ‘సత్తెకాలపు సత్తెయ్య’లాంటి భీష్ముడికీ తేడాకనబడుతుంది. కాకపోతే, కురుక్షేత్ర యుద్ధ సమయానికొచ్చే సరికీ ఈ విధేయతకూడా కోల్పోయిన రూపం భీష్ముడిలో కనిపించడం, మరో షాక్. సర్వసైన్యాధ్యక్షుడయ్యుండీ, కావలసినప్పుడు మరణించే వరం పొందుండీ తన చావురహస్యాన్ని తన ప్రభువుయొక్క ప్రత్యర్థులకు సునాయాసంగా చెప్పేసే ఈ మహానుభావుడ్ని ఎలా అర్థం చెసుకోవాలో తెలీదు.జీవితాంతం తప్పుడునిర్ణయాలుతప్ప, తప్పనిసరి పరిస్థితుల్లో సక్రమమైన నిర్ణయాలు తీసుకోలేని భీష్ముడు చనిపోతూ, అంపశయ్యమీద ధర్మరాజుకు రాజ్యధర్మాన్ని నేర్పడం మహాభారతానికే హైలైట్.



బహుశా, మనందరిలోనూ ఈ భీష్ముడున్నాడు. ఈ కలియుగంలో యుగధర్మాన్ని విస్మరించి, కొంత సత్య- త్రేత్రా - ద్వాపరయుగాలలోని విలువల్ని ఆచరిస్తూ, సరైనసమయంలో సరైన నిర్ణయాలు తీసుకోక, అసంబద్ధ విధేయతని (misplaced loyalty) ప్రకటించుకుంటూ జీవిస్తూ ఉంటాము. మనలోని ఆ భీష్ముడికి కాలం చెల్లాలి. కాలం చెల్లిన భీష్ములకు కాలం చెల్లాలి.

No comments:

Post a Comment