Sunday, 16 March 2014

అబ్రహం లింకన్ తన కుమారుని ఉపాధ్యాయుడికి వ్రాసిన లేఖ....



ఈరోజు నుండి నాకొడుకుకి విద్యాలయంలో విద్యాబ్యాసం మొదలు. కొంత కాలం వాడికి అక్కడి పరిస్థితులు అన్ని కొత్తగా వింతగా అనిపిస్తాయి, వాడిని సున్నితంగా చూసుకుంటారనే భావిస్తున్నాను. ఈరోజు వాడికి ఒక సాహసం వంటిది, ఈసాహాసం వాడికి ఖండఖండాంతరాలు తిరిగే అవకాశం ఇవ్వచ్చు. చరిత్రలో సాహసాలు రాజ్యాలనీ, యుద్దలనీ , వేదననీ మాత్రమే మిగిల్చాయి. కానీ జీవితం మీద సాహసం చెయ్యటానికి, ఒక మంచి మనిషిగా మిగలటానికి వాడికి నమ్మకం, ప్రేమ, దైర్యం అవసరం.

ప్రియమైన ఉపాధ్యయులారా, నా కొడుకుని మీచేతులలోకి తీసుకుని వాడికి అవసరమైనవన్నినేర్పండి, కానీ సున్నితంగా వాడి మనసుకి అర్థమయ్యేలా.

మనుష్యులు అందరూ నీతిమంతులు కారనీ - మనుష్యులు అందరూ సత్యవాదులు కారనీ - వాడు నేర్వాలని నాకు తెలుసు. కానీ ప్రతి నీచుడికి ఒక ఉత్తముడు కూడా ఉంటాడని - ప్రతి స్వార్ధ రాజకీయనాయకుడికి ఒక నిబద్ద నాయకుడు కూడా ఉంటాడని వాడికి భోదించండి. ప్రతి శత్రువుకి ఒక మిత్రుడు కూడా ఉంటాడని వాడికి తెలియపరచండి.

ఈర్ష్యకు వాడిని దూరం చెయ్యండి. మాట్లాడే మాట మీద నియంత్రణ, మాటల్లో గొప్పతనం వాడికి నేర్పండి.
ఎదుటివారి మీద ఆదారపడి బ్రతకటం కన్నా, సొంత కాళ్ళ మీద నిలబడటం గౌరవం అని భోదించండి. మీవల్లనయితే నిశబ్దపు నవ్వులో రహస్యాన్ని విప్పండి. సాద్యమైతే పుస్తకాలు, వాటి గొప్పతనం వాడు తెలుసుకునేలా చేయండి
అయితే అదే సమయంలో... ఆకాశంలోని పక్షులలో, ఎండలోని తేనటీగల్లో, పచ్చని కొండల్లోని పువ్వులలో
ఎడతెగని మర్మాన్ని గ్రహించేటంత నిశబ్ద ఖాళీ సమయాన్ని కూడా వాడికి ఇవ్వండి. ప్రకృతిని వాడు ఆరాధించి, ఆస్వాదించే మనస్సుని పెంచండి.

వంచనకన్న ఓటమి మంచిదని, గొప్పగా ఉంటుందని మీ పాఠశాలలో భోదించండి. దొరికిన 100 రూపాయల కన్నా సంపాదించిన 10 రూపాయలు విలువ ఎక్కువని వాడికి చెప్పండి. వాడికి వచ్చే సొంత మంచి ఆలోచనలపై నమ్మకాన్ని కలిగి ఉండటం నేర్పించండి. వాడి ఆలోచనలు తప్పు అని అందరూ అంటున్నా సరే
సున్నితస్తులతో సున్నితంగా, మొండివాళ్ళతో మొండిగా ఎలా ఉండాలో నేర్పించండి.

అందరూ వేలంవెర్రిగా ఒకే మందలో చేరి పోతునప్పుడు గుడ్డిగా అనుసరించక ప్రకక్కు నిలబడగలిగి, నిర్ణయించుకోగల సామర్ద్యాన్ని నాకొడుక్కి ఇవ్వండి. ఎవరు ఏది చెప్పిన, వినడాన్నిభోదించండి.
అయితే విన్న అన్నిటిని, సత్యపు జల్లెడలో వడకట్టి, పైన నిలిచే మంచి మాత్రమే గ్రహించటాన్ని నేర్పించండి.

మీవల్లనయితే విషాదంలో నవ్వటం ఎలానో భోదించండి. ఓటమిని-గెలుపుని, సుఖాన్ని-ధుఃఖాన్నికూడా సమానంగా ఎలా స్వీకరించి ఆనందించాలో భోదించండి. కన్నీరు లజ్జాకరం కాదని భోదించండి. వాడిదగ్గర ఉన్నది నలుగురికి పంచటం నేర్పించండి. అలాగే అతి చనువు పట్ల జాగురూకత భోదించండి. అలాగే బలాన్ని బుద్దిని అత్యదిక ధరకు అమ్ముకోవటం భోదించండి. కానీ వాడి హృదయంపైన, అత్మపైన అమ్మకపు ధర అతికించుకోవద్దు అని చెప్పండి.

సత్యం తనవైపు ఉన్నదని తెలిసినప్పుడు లోకుల మూకుమ్మడి కేకలను పట్టించుకోకుండా, దైర్యంగా నిలబడటాన్ని, పోరాడటాన్నిభోదించండి. వాడికి అన్ని నెమ్మదిగా నేర్పించండి, సున్నితంగా ప్రవర్తించండి, అలా అని గారాభం, ఎత్తుకు తిప్పటం చేయకండి. వాడికి తప్పు అంటే భయం నేర్పండి, వీటితోపాటు ఎంత కష్టానికైనా దైర్యంగా నిలబడే సహనాన్ని భోదించండి. ఎందుకంటే నిప్పులో కాలినాకే నిజమైన బంగారం బయటకి వస్తుంది.
వాడిమీద వాడికి ఉత్కృష్టమైన విశ్వాసాన్ని పెంచండి. అది వాడికి సమస్త మానవాళిమీద అదే విశ్వాసాన్ని పెంచుతుంది. ఇవన్నీ వాడు తెలుసుకున్ననాడు వాడు మనుష్యులలో ఉత్తముడిగా మిగులుతాడు.

ఇదంతా పెద్ద పట్టికే, తండ్రిగా వాడు అలా ఉండాలని నా కోరిక.. అలా తయారుచేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ మీవల్లనేమవుతుందో అది మీరు చేయండి,,,
వాడు ఒక పసిపిల్లవాడు, మనం ఎలా మలుస్తామో అలా పెరుగుతాడు
జాగ్రత్తగా చూసుకోండి.....
from:-
www.sandeshtv.com http://charitrarealfacts.blogspot.in/

Saturday, 15 March 2014

“ఎందుకంత అవస్థ పడుతున్నావ్! నన్ను చంపటానికొచ్చావని తెలుసు. చంపరా పిరికిపందా!....చే గెవారా


“ఎందుకంత అవస్థ పడుతున్నావ్! నన్ను చంపటానికొచ్చావని తెలుసు. చంపరా పిరికిపందా! ఓ మనిషిని చంపబోతున్నావు అంతే కదా ” అని గర్జించాడతను.

కాళ్లలో రెండూ, మోకాళ్లలో రెండూ, చాతీలో రెండు, పక్కటెముకల్లో రెండు, గుండెలో ఒకటీ మొత్తం తొమ్మిది బుల్లెట్లు శరీరంలో దిగబడటం వల్ల మరణం సంభవించిందని అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలిపింది.
******

నేటికీ ప్రపంచ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...చే రూపం.

నీ రూపం
నీ పోరాట పటిమ
ప్రపంచ యువతరానికి నేటికీ ఆదర్శం.
ప్రపంచంలో ఎకడచుసినా నీ రూపం...
ఏ కీ చైన్ చూసినా, టీ షార్ట్ చూసినా .....
మరో వైపు నీ రూపం శత్రువు గుండెల్లో నేటికీ దడపుట్టిస్తోంది...
 

నువ్వందించిన స్ఫూర్తి
ఆచరణలో నీవు చూపిన తెగువ
నేటికీ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...


చే గెవారా దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు. రాజకీయ నాయకుడు. ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకించాడు. క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడు.
అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో చే జన్మించాడు. 1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు


1950 వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టా కు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం(1956-1959)లో ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్ గా మరియు మిలిటరీ కమాండర్ గా సేవలందించాడు. ఈ సమయం లోనే ఇతను 'చే' గా పిలువబడ్డాడు. చే గెవారా అసలు పేరు ఎర్నెస్టో గెవారా డి లా సెర్నా. గెవారా ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని 'చే' అని పిలువనారంభించారు.
ఈ పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు చే పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్ గా పనిచేసాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశం లో కూడా పర్యటించాడు. తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చే క్యూబా సామ్యవాద దేశం గా మారటానికి దోహదపడ్డాడు.


ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా
ఎదురించడానికి సిద్దంగా ఉండు - చే


అలా 1967, అక్టోబర్ 9 మద్యాహ్నం 1:10 నిముషాలకు, బొలీవియా సేనలకు చిక్కిన పోరాటయోధుడు చే గెవారా హత్య జరిగింది. మరణం దేహానికే కానీ ఆలోచనలకు కాదని చరిత్ర నిరూపించింది.
చే గెవారా మరణించి నాలుగు దశాబ్దాలు నిండాయి. దేశదేశాల విప్లవకారులు, రాజకీయవిశ్లేషకులు అతని గురించి ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. అనుకూలంగానో, వ్యతిరేకంగానో.

గొప్ప రాజకీయవేత్త, మేధావి, దుస్సాహసికుడు, నిజాయితీకల విప్లవకారుడు, ఒంటెత్తు తత్వమనిషి, ఆదర్శవంతమైన నాయకుడు, స్వాప్నికుడు, ప్రేమికుడు – అంటూ ఎవరికి తోచినట్లుగా వాళ్లు నిర్వచిస్తూనే ఉన్నారు.


చే గెవారా జీవితంలోని సమకాలీన ప్రాధాన్యతను కాత్యాయని గారు రచించిన చే గెవారా అనే పుస్తకం మనముందుకు తెస్తుంది.
క్యూబా విప్లవోద్యమంలో కార్యకర్తగా అడుగుపెట్టి, ఫిడల్ కాస్త్రో కు కుడి భుజంగా మెసలి, విముక్త క్యూబా రాజ్య పునర్నిర్మాణంలో ప్రధాన పాత్రవహించి, బొలీవియా విమోచనోద్యమంలో అసువులు బాసిన అమరవీరుడు చెగువెరా. ఆయన తన జీవితమంతా అమెరికన్ సామ్రాజ్యవాదం మీద రాజీ లేని పోరాటాన్ని సాగించాడు. జీవితానికీ మరణానికీ సార్ధకత ఉండాలని తపించిన అచ్చమైన మనిషి. మార్పు జీవితమంత విశాలమైనది అని చెప్పిన విప్లవకారుడు.

ప్రభుత్వాలు మానవజాతిని రెండు పరస్పర వ్యతిరేక వర్గాలుగా విభజించే దిశగా వెళితే, నేను సామాన్యులుండే వర్గం తరపునే నిలుస్తానని ప్రకటించుకొన్న విశ్వమానవుడు.
చే గెవారా జీవితమంతా సామ్రాజ్యవాద శక్తులతో జరిపిన పోరాటాలమయం. తన మార్గం అనితర సాధ్యం అనిపించేలా జీవించిన ఒక గెరిల్లా యోధుడు ఇతను. క్యూబా విప్లవవిజయానంతరం లభించిన అధిపత్యాన్ని స్వచ్ఛందంగా వొదులుకొని మరిన్ని ఇతర లాటిన్ అమెరికన్ ప్రాంతాలను విముక్తం చేయాలని మరలా విప్లవపోరాటమార్గన పయనించిన గొప్ప ధీశాలి. ఆ ప్రయత్నంలో బొలీవియా సైనికులకు చిక్కి హత్యచేయబడ్డాడు.


ఏమిటీ మనిషి? ఎందుకలా ప్రవర్తించాడు? ఇతనికేంకావాలి? సుఖమైన జీవితాన్ని వొదిలిపెట్టి ఎందుకలా చిత్తడి బురదలో వందలకిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రాణాలకు తెగించి పోరాడాడు? ఒక మనిషిని శృంఖలాలనుంచి విముక్తుడిని చేయటానికి మరో మనిషిపై తుపాకి గురిపెట్టాలా? అన్న ప్రశ్నలకు చనిపోయే ముందురోజువరకూ చే వ్రాసుకొన్న డైరీలలో కొన్ని సమాధానాలు దొరుకుతాయి. ఇతని నిబద్దత, రాజకీయ అవగాహనా, పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్ర్ర్యాలను అందించాలన్న తపన వాటి ప్రతీ పేజీలో కనిపిస్తాయి. మార్పు తీసుకురావటానికి చే గావేరా ఎంచుకొన్న విధానం హింసాపూరితం కావొచ్చు, కానీ ఇతని నిజాయితీని శంకించలేము.

“మార్పు అనేది ముగ్గగానే రాలిపడే పండు కాదు, మనమే దానిని రాల్చాలి” అన్న చే గెవారా మాటలే అతని జీవితం.

Monday, 10 March 2014

రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు స్వామీ వివేకానంద......






స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు.భారతదేశాన్ని ప్రేమించి,భారతదేశం మళ్ళి తన ప్రాచీన ఔన్నత్యాన్ని పోందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానందా. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.


తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా1984 లో ప్రకటించింది.



ముఖ్య సూత్రములు తత్త్వములు



వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదంతము తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' (పేదవారి సేవ తో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహము ను కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి. రామకృష్ణా మిషన్ (రామకృష్ణా మఠము)ను "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు"(आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) అనే నినాదము మీద స్థాపించాడు.
  • సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగువాటిని గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దీపిస్తూన్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది.సోదర ప్రేమ గురించి ప్రసంగాలుమాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి.త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థ వాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు. అపుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మంయొక్క అంశాలు.
  • స్వామి వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు. అవి ఇక్కడ వివరించబడ్డాయి.
    1. గమ్యం చేరేవరకు ఆగవద్దు. జాగ్రుతులు కండి.
    2. దీర్ఘ (?)అంతమౌతోంది. పగలు సమీపిస్తోంది. ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు. ఆవేశపూరితులు కండు; ప్రేమతత్వాన్ని వీడవద్దు; విశ్వాసాన్ని, నమ్మకాన్ని, సడలనీయకండి. భయం విడనాడండి. భయమే పెద్ద పాపం.
    3. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాలయి. సాహసాన్ని ప్రదర్శించండి.
    4. మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపువద్దు. వారికి మీ సేవలను అందించండి.

 

Thursday, 6 March 2014

ఉపపాండవులెందరు?


త్రేతాయుగపు కాలంనాటి హరిశ్చంద్రుని సత్యవ్రత దీక్షను పరీక్షించాలని విశ్వామిత్రుడు అతనిరాజ్యము, భార్య, పిల్లలు కట్టు బట్టలతో సహా వదిలి పొమ్మని ఆదేశిస్తాడు... ఈక్రమంలో రాణిపై చేయికూడా చేసుకుంటాడు... ఆ సమయంలో పరమ వీరులయిన అయిదుగురు సైనికులు/రక్షకభటులువిశ్వామిత్రుని చర్యకు మండిపడి అతనిచర్యలను ఖండిస్తారు... దీనికి ఆగ్రహం చెందినవిశ్వామిత్రుడు మీకు ఈ జన్మలో మోక్షం రాకపోవుకాక అని శపిస్తాడు... ... భీతిల్లిన ఆ రక్షకభటులుమునివర్యుని శాంతింపజేసి శాపానికి విరుగుడు ప్రసాదించమని వేడుకుంటారు.. శాంతించినవిశ్వామిత్రుడు మీరు వచ్చేజన్మలో ఏ బంధాలు ఏర్పడక ముందే చనిపోవుదురు, తర్వాతి జన్మలోపాండవుల పుత్రులుగా జన్మించి ఏ తప్పు చేయనప్పటికీ అశ్వథ్థామ చేతిలో నిద్రించే సమయంలోమరణించి మోక్షం పొందుతారు అని అభయమిస్తాడు... (వారిని చంపిన అశ్వథ్థామ రహస్యం తల్లిఅయిన ఉత్తర గర్భంలో ఉన్న పరిక్షిత్తుకు (అభిమన్యుని కుమారునికి) తెలుస్తుంది... ఈ విషయంతెలుసుకున్న అశ్వథ్థామ ఆ గర్భస్థ శిశువును హతమార్చాలని కూడా చూస్తాడట... కానీ శ్రీకృష్ణుడుకాపాడతాడని ఇంకొక కథ ఉంది) ఆ విధంగా పుట్టిన వారే ఉప పాండవులు....
“ధర్మరాజు కు పాంచాలియందు ప్రతివింధ్యుడు,భీమునికి శ్రుతసోముడు, అర్జునునకు శ్రుత కీర్తి,నకులునకు శతానీకుడు, సహదేవునకు శ్రుత సేనుడు కలిగారు. వీరు కాక ధర్మరాజుకు స్వయంవరంలో భార్యయైన దేవిక అనే ఆమెకు యౌధేయుడు కలిగాడు. భీమునికి జలంధర అనే ఆమెయందు సర్వగుడు కలిగాడు. అర్జునునకు సుభద్రయందు అభిమన్యుడు కలిగాడు. నకులునకు చేది రాజపుత్రి కరేణుమతికి నిరమిత్రుడు కలిగాడు. సహదేవునికి స్వయంవరం మూలంగా లభించిన భార్య విజయకు సుహోత్రుడు కలిగాడు.భీమునకు హిడింబ వలన ఘటోత్కచుడు కలిగాడు. వీళ్ళు మొత్తం పదకొండు మంది.”
1.ధర్మ రాజు+ద్రౌపది= ప్రతివింధ్యుడు,
2.భీముడు+ద్రౌపది= శ్రుతసోముడు
3.అర్జునుడు+ద్రౌపది= శ్రుత కీర్తి
4.నకులుడు+ ద్రౌపది=శతానీకుడు
5.సహదేవుడు+ద్రౌపది= శ్రుత సేనుడు

6.ధర్మరాజు+దేవిక=యౌధేయుడు.
7.భీముడు+జలంధర=సర్వగుడు
8.భీముడు+హిడింబ= ఘటోత్కచుడు
9.అర్జునుడు+సుభద్ర=అభిమన్యుడు.
10.నకులుడు+కరేణుమతి=నిరమిత్రుడు.
11.సహదేవుడు+విజయ=సుహోత్రుడు.

వీరిలో భీమునికి హిడింబ వలన కలిగిన ఘటోత్కచుడే పెద్దవాడు. పాంచాలి వలన కలిగిన వారు కాక, మిగిలినవారంతా యుద్ధం లో మరణించారు. ఉపపాండవులలో మిగిలిన, పాంచాలి పుత్రులు ఐదిగురిని పాండవులుగా భ్రమించి, అశ్వద్ధామ నిదరపోతుండగా చంపేశాడు. ఇదీ ఉపపాండవుల చరిత్ర. ఇక అభిమన్యునికి ఉత్తర కు జన్మించినవాడు పరీక్షిత్తు.

వీరుకాక అర్జునునికి ఉలూపి, చిత్రాంగద అనే ఇద్దరు భార్యలున్నారు. ఇందులో చిత్రాంగద కుమారుడు భభ్రువాహనుడు, ఇతను మణి పురాజ్యాధిపతి, తాత గారి రాజ్యానికి వారసుడయ్యాడు,అందుకు ఉప పాండవులలో చేర్చలేదు. ఇతను భారత యుద్ధం తరవాత బతికి ఉన్నవాడు.

Tuesday, 4 March 2014

అక్షతల పరమార్థం


వివాహ శుభకార్యంలో జీలకర్ర, బెల్లం పెట్టే వేళ, మాంగల్యధారణ వేళ, వధూవరులపై ఆహుతులు అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి ‘దీర్ఘాయుష్మాన్‌ భవ, చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు’ అంటూ ఆశీర్వదిస్తారు. ఇక దైవసన్నిధిలో సరే సరి, పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు. ‘అక్షతలు’ అనే మాట నుంచి వచ్చిందే ‘అక్షింతలు’. క్షతం కానివి అక్షతలు. అంటే రోకలి పోటుకు విరగని, శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని పసుపు లేక కుంకుమతో, నేతితో కలిపి అక్షతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు. మనిషి మనసు, బుద్ధి, గుణము, తల్లి, వ్యసనము ఇత్యాదులన్నీ చంద్ర కారకాలే అని అన్నారు పెద్దలు. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కు వగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మన స్సుపై ప్రభావం చూపుతుంది. మనోధర్మాన్ని నియంత్రిస్తాయి.
శాస్ర్తీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల్లో తమో, రజో, సాత్త్యికాలనే త్రిగుణాలకూ కారకము. పెద్దలు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహంలోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు, అత్తమామలు వివాహ సమయంలో, శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!

మరో సిద్ధాంతం ప్రకారం చూస్తే మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు. విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. అక్షతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు కుంకుమలు కలపడం ఎందుకు? ఆయుర్వేదం ప్రకారం, చర్మ సంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంది. అక్షతలు వేసే వారికి ఎలాంటి రోగ సమస్యలున్నా, పుచ్చు కొనే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతేకాక పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.
భగవద్గీతలో

‘అన్నాద్భవన్తి భూతాని’ అని మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమే. అక్షతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.
తెలుగులో ఈ అక్షతలని తలంబ్రాలు లేదా తలబ్రాలు అని కూడా అంటారు.
తలను = తల యందు పోయబడే, ప్రాలు = బియ్యం అని అర్థం.
పూర్వం వధువు ధాన్యలక్ష్మిగా చెప్పబడింది. ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ‘ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంట ధాన్యం ఇలా కుప్పతెప్పలుగా విరివిగా ఉండి, మన జీవనానికి’ ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదల వాళ్ళమై తులతూగుతూ ఉండాలి’ అనే భావానికి అనుగుణంగా ఈ తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది. వరుడు, వధువు శిరస్సులపై తలంబ్రాలు పోసుకొనే దానికి ముందు, వరుడు ముందుగా వధువు చేతిని దర్భతో తుడిచి, దోసిలిలో రెండు మార్లుగా బియ్యాన్ని వేసి, ఆ మీదట పాలని కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. తలంబ్రాలు వేసాక వధువు ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెప్తుంది. ఈ కాలంలో పురోహితులే చేయించి పోయిస్తున్నారు. ‘ఈ కన్య వంశాన్ని తరింపజేయుగాక పుణ్యం వృద్ధి చెందుగాక. శాంతి, పుష్టి, సంతోషం, అభివృద్ధి, విఘ్నాలు లేకపోవడం, ఆయురారోగ్యాలు అన్నీ వీరికి కల్గుగాక!’ అని చదువుతూ అక్షతారోపణం (తలంబ్రాలు పోయించడం) చేయిస్తారు. ఈ చేసిన వివాహకర్మ మొత్తం అక్షతము (నాశనము లేనిది) అగుగాక! అని దీని భావం.


అక్షతలలో, తలంబ్రాలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. మన పూర్వీకులు ఈ వివాహ శుభకార్యాలలో, ఇతర శుభకార్యాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయాల్లో, ఆచారాల్లో ఇంత గూఢార్థం ఉంది. వివాహ సమయంలో నవదంపతులు కలిసి జీవించి ఉండాలనీ, ఆదర్శ దంపతులుగా మెలగాలనీ, వధూవరులపై ఆహుతులు అక్షంతలు చల్లి ఆశీర్వదించడమే అక్షతల కార్యక్రమంలోని అర్థం, పరమార్థం. దాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా మెలగాలి....