Wednesday 2 July 2014

ఫ్లారెన్స్ నైటింగేల్



19వ శతాబ్దపు మహిళలల్లో ఫ్లారెన్స్ నైటింగేల్ పేరు అత్యంత ప్రసిద్ధమైంది. ఒక నీచమైన పనిగా భావించబడే రోగి సంరక్షణను (నర్సింగ్) గౌరవప్రదమైన వృత్తి స్థాయికి మార్చిన విఖ్యాతురాలు ఆమె. ఫ్లారెన్స్ నైటింగేల్ దక్షిణ ఐరోపాలోని ఇటలీలో ఒక సంపన్న కుటుంబంలో 1820 మే 12న పుట్టింది. కేంబ్రిడ్జి విద్వాంసుడైన తండ్రి వద్ద ఈమె విద్యను అభ్యసించింది. ఫ్లారెన్స్ నైటింగేల్ చురుకుగా, ఆకర్షణీయమైన మహిళగా పెరిగింది. 1850లో ఐరోపాలో చాలా ఆసుపత్రులను చూసే అవకాశం ఆమెకు కలిగింది. త్వరలోనే ఈమె ఒక స్థానిక ఆసుపత్రిలోని సిబ్బంది పర్యవేక్షకురాలుగా నియోగించబడింది. 1854లో బ్రిటన్, ఫ్రాన్స్, సార్డీనియా, టర్కీ దేశాలు రష్యాపై యుద్ధాన్ని ప్రకటించాయి. క్రిమియన్ యుద్ధంగా పరిగణితమైన ఈ యుద్ధంలో అనేకమంది చనిపోయారు. సాహసోత్సాహాలుగల నైటింగేల్ నవీన పద్ధతిలో చర్య తీసుకోపూనుకుంది. యుద్ధ రంగంలో సేవ చేయడానికి తన సంసిద్ధతను ప్రకటిస్తూ ఈమె బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాసింది. క్రిమియాలో పోరాడే బ్రిటిష్ సైనికులకు తగిన వైద్య సదుపాయాలు లేనట్లు ప్రభుత్వానికి లేఖ అందింది.దానికి ప్రభుత్వం వద్ద నుండి సానుకూలమైన ఆహ్వానాన్ని అందుకుని ఈమె 1854 నవంబర్ 4న గాయపడే సైనికులకు పరిచర్యలు చేయడానికి 38 మంది నర్సులతో బ్రిటన్‌ను వదిలి టర్కీలో గల స్కూటరీ వద్దనున్న బ్రిటిష్ సైనిక ఆసుపత్రికి చేరుకుంది.

స్కూటరీ మరియు బాలక్లవ వద్ద ఈమె ఆసుపత్రులను నెలకొల్పింది. ఫ్లారెన్స్ రాత్రనక, పగలనక ఈ సైనిక ఆసుపత్రిలో సేవ చేసింది. ఈమె పరిశుభ్రతకు, జాగ్రత్తకు అత్యున్నత ప్రమాణాలను విధించింది. ఈమె చూపిన అవిరామమైన కృషి చేత గాయపడినవారిలో, రోగ పీడితులలో మరణించే వారి సంఖ్య చాలావరకు తగ్గింది. ఈ వార్త బ్రిటన్‌కు చేరి, విక్టోరియా రాణి మొదలు ప్రజలందరి మన్ననలను పొందింది. రాణి ఈమె సేవను ప్రశంసిస్తూ లేఖను రాయడమేగాక తన వ్యక్తిగత కానుకను కూడా అందజేసింది. ఈమె ప్రశంసకులు "దీపంతో వుండే మహిళ" అని ఆప్యాయంగా ఈమెను పిలిచేవారు. క్రిమియన్ యుద్ధంలో ప్రతి రాత్రీ ఈమె దీపంతో కూడా వెళ్ళి గాయపడ్డ సైనికుల్ని చూసి, ఘనమైన సేవను చేసింది. ఈమె చొరవ చూసి మహిళా నర్సులను సైనిక ఆసుపత్రులలో నియోగించింది. 1856లో క్రిమియన్ యుద్ధానంతరం ఈమె చేసిన సేవకు గుర్తింపుగా 50,000 పౌండ్లు మూలధన నిధి ఏర్పాటు చేయబడింది. లండన్‌లో సెంట్ థామస్ వద్ద నర్సింగ్ స్కూల్‌ను, నర్సుల శిక్షణా గృహాన్నీ, లండన్‌లో కింగ్స్ కాలేజ్ ఆసుపత్రిని నిర్మించడానికి ఆ నిధి వాడుకోబడింది. ఈమె గణిత శాస్త్రంలో ప్రవీణురాలు. ఈమె ఆసుపత్రులకు విరాళాలనూ, గణాంకాలనూ సేకరించే "ఆసుపత్రులకు గణాంక నమూనా పత్రం"ను తయారుచేసింది. ఈమె యత్నాన్ని చాలామంది మెచ్చుకున్నారు. లండన్‌లో శ్తాటిస్టికల్ సొసైటీలో "ఫెలో"గా ఎన్నుకోబడిన తొలి మహిళ ఈమె. ఇది అరుదైన గౌరవం.
గాఢానుభూతిని ప్రేరేపించే రచనలను చేయడంలో కూడ నైటింగేల్ సిద్ధహస్తురాలు. 1860లో ప్రచురితమైన ఈమె "నోట్స్ ఆన్ నర్సింగ్" సమర్ధవంతంగా రోగులను సంరక్షించేలా నియమాన్నీ, మార్గదర్శక సూత్రలన్నొ ఏర్పరచిన రచన. ఇది పదకొండు భాషలలో అనువదించబడి యింకా ముద్రణ పొందుతూనే వుంది. ఈమె 200కు పైగా పుస్తకాలు, నివేదికలు రచించింది. "ఆర్డర్ ఆఫ్ మెరిట్" పొందిన తొలి మహిళగా కీర్తి పొందింది. 1910 ఆగస్టు 13న మరణించింది.

No comments:

Post a Comment