Thursday 17 July 2014

సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి...(సావిత్రిబారుు జ్యోతిభాపూలే భార్య)...




తలపై ముసుగు ధరించిన ఓ యువతి బడిలో పాఠాలు చెప్పడానికని వడివడిగా నడిచి వెళ్తోంది. ఆమెను చూసిన ఒక బ్రాహ్మణ స్ర్తీ ఆగ్రహంతో... ఏం చెయ్యబోతుందావిడ! అసలిదేంపని? అంటూ అవమానిస్తూ... పేడ ముద్దలు విసిరారు. కుల ప్రసక్తి లేని - ఒక బాలికల పాఠశాలను ప్రారంభించేందుకు వెళుతున్న సందర్భంగా 1851వ సంవత్సరంలో సావిత్రిబారుుకి ఎదురైన అనుభవం ఇది... సావిత్రిబారుు జ్యోతిభాపూలే భార్య. ఆమె నిర్భయంగా నడిచి వెళ్లింది. ఎందుకంటే ఆమె ముందు ఒక మహోన్నతమైన లక్ష్యం ఉన్నది. శతాబ్దాలుగా అజ్ఞానాంధకారాలలో మగ్గుతున్న బాలికలకు, ముఖ్యంగా కింద కులాల బాలికలకు విజ్ఞానాన్ని అందించడమే ఆమె ముందున్న లక్ష్యం.

పశ్చిమ మహారాష్టల్రోని సతారా జిల్లా నయ్‌గావ్‌ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో 1831 జనవరి 3వ తేదీన సావిత్రీబాయి జన్మించారు. ఆనాటి సంప్రదాయం ప్రకారమే ఆమెకు 9వ ఏటనే జ్యోతీరావుతో వివాహమైంది. భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె సంపూర్ణ విద్యావంతురాలైంది. సామాజిక పరివర్తనను సాధించింది. తన భార్య విద్యావంతురాలయ్యాక కేవలం తమ కుటుంబానికే ఆమె జ్ఞానం పరిమితం కారాదనీ, ప్రజలందరికీ విద్యనందించగల శక్తిగా ఆమె అవతరించాలనీ జ్యోతీరావుపూలే ఆశించాడు. భర్త ఆకాంక్షలను నెరవేర్చటమే తన ముందున్న కర్తవ్యంగా ఆమె భావించారు. తన లక్ష్యసాధన కోసం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనడానికైనా ఆమె సిద్ధపడింది. ఆమె నిబ్బరం, నిర్భయమూ, సాహసాల ముందు చాందసవాదుల దూషణలు, వేధింపులు కొనసాగలేకపోయాయి. 

1848లో జ్యోతీరావుపూలే ‘పూనే’లో తొలి బాలికా పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలకు సావితత్రీబాయి ప్రధానోపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. ఈ పాఠశాలను నిర్వహిస్తున్నందుకు అన్ని సామాజిక వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతులను గృహ బహిష్కరానికి గురిచేశారు. భర్త ఉద్యమ జీవితంలో అండగా నిలవటం తన బాధ్యతగా భావించిన సావిత్రి అన్ని సమస్యలకూ ఎదురీదుతూ విద్యా సంబంధమైన కార్యక్రమాలలో ముందుకు సాగేట్టుగా పూలేను ప్రోత్సహించారు. గృహ బహిష్కారానికి గురైన పూలే దంపతులకు మహారాష్టల్రోని మాంగ్‌(మాదిగ) కులానికి చెందిన విప్లవ రచయిత ‘అన్నబావుసాటే’ అండగా నిలిచారు.

తన భవనాన్ని పాఠశాల కోసం విరాళంగా ఇచ్చారు. అనేక మంది అసభ్య పదజాలంతో దూషించేవారు. ఎన్నో వారాలపాటు ఆమె ఈ వేధింపులను తట్టుకొని ధైర్యంగా నిలబడింది. నా ధర్మాన్ని నేను నెరవేర్చుచున్నాను. భగవంతుడు మిమల్ని క్షమించి ఆశీర్వదిస్తాడు అని సహనంతో ఆమె పలికేవారు. ఎంతకాలమైనా ఈ దాడులు ఆగకపోవడంతో ఆమె ధైర్యం సన్నగిల్లసాగింది. ఆ సమయంలో ఆమెకు ప్రేమను, ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తూ అండగా నిలిచారు పూలే. ఆమె పాఠశాలకు వెళ్లేటప్పుడు పాత చీర ధరించి, మరొకచీరను వెంటతీసుకొని వెళ్లేది సావిత్రీబాయి. దారిలో చాందసులు చల్లిన బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకొనేది. ప్రతిరోజూ ఈ సమసకం విసిగిపోయిన సావిత్రీబాయి ఒక రోజున తనను వేధిస్తున్న ఒకడిని చాచి లెంపకాయ కొట్టక తప్పలేదు. ఆ తరువాత ఆమె వెంట రోజూ రక్షణగా వెళ్లేందుకు ఒక బంట్రోతును నియమించుకోవాల్సి వచ్చింది.

దీనికితోడు బ్రాహ్మణీయ సంప్రదాయాలు, ధర్మశాస్త్రాలు, స్ర్తీలు చదువుకోవడాన్ని నిషేధించాయని, స్ర్తీలు విద్యావంతులైతే పరాయి మగాళ్లకు ఉత్తరాలు రాసే ప్రమాదముందని, చదువుకున్న స్ర్తీ పాపఫలితంగా ఆమె భర్త తినే అన్నం పురుగులుగా మారిపోతుందని, అతడు రోగగ్రస్తుడై అకాలమరణం పాలవుతాడని ఎన్నెన్నో నమ్మకాలను ప్రచారం చేశారు. అయితే పూలే ఇలాంటి మూఢ విశ్వాసాలను తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రాహ్మణీయ కులచట్రాల నుంచి, పితృస్వామ్య ఆధిపత్యం నుంచి మానవులందరికి విముక్తి కలిగించాలన్నదే లక్ష్యంగా పూలే ముందుకు సాగారు. ఈ క్రమంలో తన భార్య సావిత్రీబాయికి భర్తగానే కాక, గురువుగా, స్నేహితునిగా అండదండలం దించారు. 

మానవుల అభివృద్ధికి విద్య, శ్రమ ఎంత అవసరమైనదో ఆమె పదే పదే నొక్కి చెపుతుండేవారు. శ్రమించి పనిచేయండి, శ్రద్ధగా అధ్యయనం చేయండి, మంచి మార్గాన నడవండి అనేదే సావిత్రీబాయి నినాదం. స్ర్తీలు పురుషులతో అన్నివిధాలా సమానులేతప్ప, వారికి బానిసలు కాదని, స్ర్తీలకు విద్య అత్యావస్య మని ఆమె బలమైన విశ్వాసం కలిగి ఉండేవారు. కింది కులాల వారికి, మహిళలకు విద్యను దూరం చేసి, వాళ్లు చదివితే నాలుకలు తెగ్గోసి, వింటే చెవుళ్లో సీసం కరిగించి పోసే చట్టాలు అమలుజరుగుతున్న ఆ రోజుల్లో కుల, మత, లింగ రహితంగా అందరికీ విద్యను అందుబాటులోకి తేవడం కోసం పూలే దంపతులు చేసిన కృషి నిరుపమానమైనది. 

వారి కృషి ఫలితంగానే బ్రిటీష్‌ ప్రభుత్వం ‘మాస్‌ ఎడ్యుకేషన్‌ సిస్టం’ అమలులోకి తెచ్చింది. దీని వలన శూద్రులు, అతిశూద్రులు, మహిళల కోసం దేశ వ్యాప్తంగా అనేక పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కింది కులాల నుంచి ఎన్నో విద్యా కుసుమాలు ఉదయించాయి. అందులోంచి వచ్చిన ఆణిముత్యమే భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ జ్ఞాని అంబేద్కర్‌ మహాశయుడు. ఈ నేపథ్యంలోనే 1852వ సంవత్సరంలో ‘మహిళా సేవామండల్‌’ అనే మహిళా సంఘాన్ని సావిత్రీబాయి స్థాపించారు. అనంతరం 1853లో అనాధలుగా మారుతున్న శిశువుల కోసం ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ స్థాపనశరణాలయాన్ని స్థాపించారు. ఇక దిక్కులేని స్ర్తీలకు, పిల్లలకు సావిత్రీబాయి ఇల్లే ఒక పునరావాస కేంద్రంగా మారిపోయింది.

లో దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు పూలే దంపతులు చేసిన కృషి సాటిలేనిది. కరువు బారిన పడిన కుటుంబాలలోని అనాథ బాలల కోసం 52 పాఠశాలలను వాళ్లు నిర్వహించారు. 1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. కుల వ్యవస్థకు కారణమైన ‘మనువు’పైన బ్రాహ్మణ పురోహిత, వర్గ దోపిడీపైన ఆమె తీవ్రంగా దాడిచేశారు. కులమతాలనేవి మనుషులు సృష్టించినవని, వీటిని నిర్మూలించి మనుషులందరూ సమానమేనన్న భావనతో మెలగాలని ఉద్భోధించారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి.

తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపించారు. పూర్తి ప్రతికూల పరిస్థితుల మధ్య పోలీసులు, లాయర్ల రక్షణలో జరిగిన భారతీయ తొలి సామాజిక వివాహంగా దీనిని అభివర్ణించవచ్చును. భారత సాంఘికోద్యవూనికి పితామహుడై, కుల నిర్మూలన కుంపటిని రగిలించిన సిసలైన మహాత్ములు జ్యోతీరావుపూలే. 1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖంలోనుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. పూలే మరణానంతరం సత్యసోధక్‌ సమాజ్‌ సంస్థ బాధ్యతలను సావిత్రీబాయి నిర్వహించారు. ప్రేమ భావన, మనిషిని, సమాజాన్ని కలిపే మానవీయ నైతిక విలువలు అనేవే ఆమె ఆధ్యాత్మిక దృక్పథానికి అంతిమ లక్ష్యం. పీడిత ప్రజలను భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను విముక్తి చేయడానికి ఆమె ఎంతగానో పోరాడారు. 

సావిత్రీబాయి ఏ లక్ష్యాన్ని సాధించాలని జీవితాంతం తపించిందో ఆ లక్ష్యం ఈనాటికీ సామాజిక, ప్రజాస్వామి క వాదుల ముందు ఒక సవాల్‌గా మారింది. పండుగలు, పబ్బాలు వంటి ఆర్భాటాల కోసం శక్తిని మించిన ధనాన్ని ఖర్చుచేస్తూ కుటుంబా లను నెడుతాయో, కుటుంబాలను ఎంతగా నాశనం చేస్తాయో తెలియజేస్తూ ఆమె రాసిన వ్యాసాలు 21వ శతాబ్ధానికి కూడా నిత్య నూతనంగానే కనపడతాయి. ఆమె కవితాశైలి సూటిగా, సరళంగా ఉంటుంది. విద్య కుల వ్యవస్థ ప్రజలపై అణచివేత వంటి అంశాలంటిపైనా ఆమె కవిత్వం రాసింది. ఈ కవితా రచనతో ఆమె ఆధునిక మరాఠీ కవిత్వానికి వైతాళికురాలిగా నిలిచారు. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉత్తేజపూరితంగా ప్రసంగించగల వక్త. 1896-97 మధ్య కాలంలో కరవు, ప్లేగు వ్యాధి వ్యాపించిన సందర్భాలలో సత్యసోధక్‌ సమాజ్‌ చేసిన సేవ ఎంతో గొప్పది.

ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, సహాయ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయించగలిగారు సావిత్రీబాయి. 1897లో ‘పూణే’లో అంటువ్యాధులు విజృంభించాయి. రోగులకు సేవ చేయ డంలో సావిత్రీబాయి రాత్రింబవళ్లు పనిచేసింది. ఈ పనిలో నిమగ్నమైన ఆమెకు ప్లేగు వ్యాధి సోకింది. చివరకు 1897 మార్చి 10న ఆమె కన్నుమూసింది. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్‌ అంత్యక్రియలు జరిపించారు. న్యాయం, ప్రజాస్వామ్యం, స్ర్తీ, పురుష సమానత్వం, కుల నిర్మూలన అనే ఆదర్శాలు సావి త్రీబాయి, జ్యోతీరావుపూలేల వ్యక్తిత్వంలో సహజ గుణాలుగా కలగలిచిపోయిన లక్షణాలు. ఈ ఆదర్శాల సాధనలో ఒక స్ర్తీగా సావిత్రీబాయి మరిన్ని కష్టాలను ఎదుర్కొన్నారు.

ఆమె తన లక్ష్యాల పట్ల స్పష్టమైన దృక్పథం ఉన్నది. తనకు ఎదు రైన సమస్యల పరిష్కారానికి ఎవరి సానుభూతినో ఆమె కోరుకోలేదు. మానవ సమాజంలోని వర్ణ, వర్గ, విభజనను గురించి అధ్యయనం చేస్తున్న ఈనాటి ఉద్యమకారులు, అభ్యుదయ వాదులు, పెమినిస్టులు సావిత్రీబాయి విప్లవాత్మక జీవితంపై ప్రజలకు పూర్తి అవగాహన కలిగించాల్సి ఉంది. ప్రభుత్వం కూడా సావిత్రీబాయి చరిత్రను పాఠ్యాంశంలో చేర్చి, ప్రేమ భావన, మనిషిని సమాజాన్ని కలిపే మానవీయ నైతిక విలువల ప్రగతికి కృషి చేయాలి. అలా చేయడమే సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయికి మనమిచ్చే నిజమైన నివాళి.

No comments:

Post a Comment