Thursday 10 July 2014

విజయానికి దశ సోపానాలు


"Struggle for the existence and survival & the fittest" అని చార్లెస్ డార్విన్ పేర్కొన్నట్లు ప్రస్తుతము ప్రపంచమంతా పోటీమయమైపోయినది. ఇది 'పులి-జింక ' ఉదంతం వలె ఉంటుంది. 'జింక ' వేగంగా పరిగెత్తటం నేర్చుకొంటేనే మనగల్గుతుంది. లేదా పులి నోటికి ఆహారమౌతుంది. అయితే 'పులి ' జింక కంటే వేగంగా పరిగెత్తటం నేర్చుకోవాలి. లేదా జింక నోటికందకుండా పారిపోతుంది. కనుక నేటి విధ్యార్ధులు తరగతి పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాంతీయ, జాతీయ అంతర్జాతీయ సమకాలీన సమస్యలపట్ల అవగాహన కల్గి, మారుతున్న దేశ, కాలమాన పరిస్థితులను అధ్యయనం చేస్తూ కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాలలోని మార్పులనూ, చేర్పులనూ మరియూ ప్రగతిని ఒంటపట్టించుకొంటూ నిరంతర విఙ్ఞాన జిఙ్ఞాసతో మున్ముందుకు సాగినప్పుడే వారు ఈ పోటీ ప్రపంచంలో నిలువగలరు, మరియూ గెలువగలరు. విధ్యాభ్యాస సమయంలోనూ, విధ్యాభ్యాసము తదుపరి చేపట్టబోయే ఏ రంగంలోనైనా రాణించి విజయ శిఖరాలను అధిరోహించాలంటే ఈ దిగువన పేర్కొన్న దశ సోపానాలను త్రికరణ శుధ్ధితో అమలు పరచవలసి ఉంటుంది.

దశ సోపానాలు:


1. నిర్దిష్టమైన లక్ష్యము (Perfect Goal Setting):

ఇది విజయానికి తొలి మెట్టు. లక్ష్యము ఉన్నత స్థాయిలో ఉండాలి. దానికి అనుగుణంగా కృషి సాగించాలి. అందుకే 'Not failure but low aim is a crime' అన్నారు పెద్దలు.


2. ఖచ్చితమైన ప్రణాళిక (Appropriate Planinig):

నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించాలంటే ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేని కృషి 'చుక్కాని లేని నావ లాంటిది.'


3. కృషి-పట్టుదల (Hardwork - Strong Determination):

"కృషితో నాస్తి దుర్భిక్షం" "కృషి వుంటే మనుషులు ఋషులౌతారు. మహాపురుషులౌతారు. తరతరాలకే తరగని వెలుగవుతారు. ఇలవేల్పులౌతారని" పెద్దలు అన్నారు. కసితో కూడిన కృషి విజయాన్ని సాధించి పెడుతుంది. అందుకే భారతరత్న మరియు మన ప్రియతమ మాజీ దేశాధ్యక్షులైన అబ్దుల్ కలాం గారు తమ ప్రతి ఉపన్యాసంలోనూ " కలలు కనండి, ఆ కలలు సాఫల్యత కొరకు నిరంతరం శ్రమించండి" అని ఉధ్బోధిస్తారు. జీవితమే ఒక వైకుంఠపాళి. ఎగదోసే నిచ్చెనలేకాదు, పడదోసే పాములూ ఉంటాయి. విసుగు - విరామము ఎరుగక ప్రయత్నిస్తే ఈ ఆటలో చివరకు వైకుఠం చేరగల్గుతాం. అబ్రహం లింకన్, మహాత్మా గాంధి, మరియు థామస్ అల్వా, ఎడిసన్ మొదలగు వారంతాఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, స్తిత ప్రఙ్ఞతలను కోల్పోకుండా తమ కృషి పట్టుదలలతో అత్యున్నత శిఖరాలను అధిరోహించినవారే. ఒకానొకప్పుడు వీరంతా సామాన్యులే. అయితే నిరంతర కృషి పట్టుదలలతో అసామాన్యంగా ఎదిగారు. ఉదాహరణకు అబ్రహంలింకంగారు తన జీవితంలో 30 సం||ల వరుస వైఫల్యాలు ఎదురైనా మొక్కవోని కృషీ - పట్టుదలలతో ఎలా అత్యున్నత శిఖరాల్ని అధిరోహించారో ఈ దిగువ క్రమాన్ని పరిశీలించినచో స్పష్టమౌతుంది.

లింకన్‌



సం||ము : జీవితంలో వైఫల్యాము చెందిన ముఖ్య సంఘటనలు

1830 - ఫర్నీచర్ వ్యాపారంలో దివాలా

1832 - ఎన్నికల్లో పోటీ చేసి ఘోర వైఫల్యం

1833 - మళ్ళీ వ్యాపారం ప్రారంభించి నెల రోజులలోనే దివాలా

1834 - ప్రేమ వ్యవహారంలో వైఫల్యం

1835 - ఉద్యోగ ప్రయత్నంలో వైఫల్యం

1836 - మానసిక రుగ్మతకు గురికావడం

1837 - మళ్ళీ ఎన్నికల్లో పరాజయం

1838 - కుటుంబంలో కలహాలు

1839 - ఆత్మహత్యా ప్రయత్నం - విఫలం

1840 - ఎన్నికల్లో మళ్ళీ పరాజయం

1841 - ప్రేమ వ్యవహారంలో మళ్ళీ విఫలం

1842 - అప్పుల వారి పోరు

1843 - కాంగ్రేసు తరుఫున పోటీ చేసి ఓటమి పాలగుట

1846 - "జోకర్ ఇన్ పాలిటిక్స్ " అనే బిరుదుతో ప్రజల హేళన

1848 - సెనెట్ కి పోటీ చేసి ఓటమి చెందుట.

1856 - "వైస్ ప్రెసిడెంట్" పదవికి పోటీ చేసి ఓటమి చెందుట

1860 - అమెరికా 16 వ అధ్యక్షునిగా అఖండ విజయాన్ని సాధించి ప్రజల ఆరాధ్య దైవమై అత్యధ్బుత పరిపాలనాద్యక్షునిగా, ప్రజాస్వామ్యం పరిరక్షకునిగా, శాంతిదూతగా, నల్లవారిపాలిట దైవంగా ప్రజాహృదయాల్లోనే గాక ప్రపంచ చరిత్రలోనే చిరస్థాయిగా నిల్చి ప్రతి పిబ్రవరి 12 న ఆయన జన్మదినాన్ని ప్రజలంతా ఘనంగా జరుపుకునేలా తన్ను తాను మలచుకొన్న యుగ పురుషుడు - అబ్రహం లింకన్

కనుక "విజేతలు చేపట్టిన పనిని ఎప్పటికీ వదిలివేయరు. వదిలివేసే వారు ఎప్పటికీ విజేతలు కాలేరని" బోధపడుతుంది.

4. నమ్మకం (Faith)
పర్సనాలిటి డెవలప్‌మెంట్
నమ్మకం మనిషిని నడిపించే ఇంధనం. భవిష్యత్తు మీద నమ్మకం లేని వ్యక్తి వర్తమానంలో కుంటినడకే నడుస్తాడు. మనిషి తనలోని అంతర్గత శక్తులను వెలికి తీయాలన్నా, తన కలలను, ఆశలను, ఆశయాలను, నెరవేర్చుకోవాలన్నా మొదట ప్రయత్నించాలి. ఆ ప్రయతానికి బలమే "నమ్మకం". ఏ ఓటమీ ఆఖరుకాదు ప్రయత్నిస్తున్నంతకాలం, నమ్మకం మనసుకు సంబంధించినది. మానసిక బలాన్ని నిర్ణయించేది. అందుకే ఆశావాదం + పట్టుదల = నమ్మకం అన్నారు. కేవలం నమ్మకం వల్లనే 1498 లో వాస్కోడిగామ గుడ్ హోప్ (మంచి నమ్మకం) అగ్రం చేరగల్గాడు.


5. ఆత్మ విశ్వాసం (Self Confidence)

'ఆత్మవిశ్వాసపూరితురాలైన కొందరు మానవుల చరిత్రే ప్రపంచ చరిత్ర, అట్టి విశ్వాసం, శ్రద్ధే మనలోని దివ్యత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. శ్రధ్ధాసక్తులుంటే సమస్తమూ సుసాధ్యమే. "అపజయమంటే ఏమిటి? అంతర్నిహితమైన అనంత శక్తిని వ్యక్తం చేయడానికి శక్తికొలదీ ప్రయత్నం చేయకపోవడమే. ఆత్మవిశ్వాసము లేకుండుట మరణంతో సమానమని" స్వామి వివేకానంద అన్నారు. అందుకే తనపై తనకు విశ్వాసమున్న భక్తులకే తన మహిమలతో వారి రుగ్మతలను రూపుమాపగలిగాడు కరుణామయుడు. అట్లే "నేను చేయగలనంటే లోకమంతా తలవంచుతున్నది. నేను చేయకపోతే లోకం నాపై స్వారీ చేస్తుంది. నేను ప్రయత్నిస్తానంటే ఓ సందిగ్ధంలో మిగిలిపోతుంది," అన్నింటినీ సాధించే సాధనమే ఆత్మవిశ్వాసము. అది లేని నాడు మరేదీ లేదు. అందుకే "గోరంత దీపం (ఆత్మవిశ్వాసం) కొండంత వెలుగు" అన్నారు.


6. ఆశావహ దృక్పదం (Optimistic attitude) :

విజయం సాధించాలంటే ఆశావహ ధృక్పధం అత్యవసరం. ఈ దిగువన పేర్కొన్న విధంగా ఒక ఆశావాదికి, ఒక నిరాశావాదికి మధ్యనున్న అంతరాన్ని గ్రహిస్తే ఆశావాహ దృక్పదం వల్ల విజయాన్ని ఎట్లా పొందగలమో బోధపడుతుంది.

ఆశావాది (గెలిచేవాడు)
నిరాశావాది (ఓడిపోయేవాడు)
సగం గ్లాసు నిండుగా ఉన్నది అనేవాడు సగం గ్లాసు ఖాళీగా ఉన్నది అనేవాడు
చెట్టుకున్న గులాబీ కనబడుతుంది గులాబీ కింద ఉన్న ముళ్ళు కనిపిస్తాయి
మిణుగు మిణుగు నక్షత్రాలు దర్శనమిస్తాయి బురద గుంట కనిపిస్తుంది
ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది అంటాడు ప్రతిదీ సమస్యే అంటాడు.
నాదే పొరపాటని సరిదిద్దుకొంటాడు నాదేం తప్పులేదంటాడు
సంతోషాన్ని చూస్తాడు బాధను చూస్తాడు
ప్రతిదాంట్లో అవకాశాలను చూస్తాడు అన్నిట్లో సమస్యలను చూస్తాడు
అది కష్టమే కానీ సాధ్యమంటాడు అది సాధ్యమేగాని కష్టమంటాడు
నిర్ధిష్ట ప్రణాళిక దొరుకుతుంది. కుంటి సాకులు దొరుకుతాయి
ఖచ్చితంగా అలా జరిగేలా చేస్తాను అంటాడు. ఎలా రాసి వుంటే అలా జరుగుతుందని అంటాడు.


7. సమయ పాలన (Time Management):

ఇది విజయానికి అతి ప్రధానమైన సోపానం. "సూర్యుడొకరోజు బద్ధకిస్తే లోకానికి వెలుగే వుండదు. చంద్రుడొకరోజు వెన్నెలను కురిపించకపోతే చల్లదనపు అనుభూతి కరువవుతుంది. వాయిదా మాటే ఎరుగని ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ కూడ జీవితాన్ని అత్యున్నత శిఖరం వైపు నడిపించవలసిన మనం మాత్రం వాయిదాకు అలవాటుపడటం నేరమే అవుతుంది". సమయాన్ని సధ్వినియోగం చేసుకొన్న వ్యక్తి మేధావి అవుతాడు. సమయాన్ని మనం కేర్ చేయకపోతే అది రెండింతలు మనల్ని "కేర్‌లెస్‌గా చూస్తుంది" సమయాన్ని సాధ్యమైనంతవరకూ మన గుప్పెట్లో ఉంచుకొనుటకు ప్రయత్నించాలే తప్ప దానికి మనం బానిస కారాదు. గుర్రపు కళ్ళేలు మనచేతిలో ఉన్నప్పుడే దాన్ని మన ఇష్టమొచ్చినట్లు వెళ్ళవలసిన వైపు నడిపించగలము. లేనిచో అది అదుపు తప్పితే మనమేమి చేయలేము. సమయానికి స్టేషను చేరకపోతే ఎక్కవలసిన బస్సు లేక రైలు మిస్సవుతుంది. అట్లే ఇంటర్వ్యూకి ఆలస్యంగా వెళ్తే రావలసిన ఉద్యోగం కూడ రాకుండా పోతుంది. తలక్రిందులుగా తపస్సు చేసినా రోజుకున్న 24 గంటలను పొడిగించలేము. కనుక అన్ని పనులను చక్కటి ప్రణాళికతో గరిష్ట స్థాయిలో నెరవేర్చుకోగలగాలి. ఈ సందర్భంగా సమయపాలన గూర్చి కొందరు మిలీనియం మహనీయులు తమ అనుభవాసారంతో చెప్పిన సూక్తులను గమనిస్తే సమయపాలన విలువెంతో తెలుస్తుంది.

నెపోలియన్ బోనాపార్టీ : "సక్రమ సమయ పాలనే నా విజయరహస్యం. ప్రతి నిమిషాన్నీ వృధా చేయకుండా ఉపయోగించుకో, లేకుంటే నీవు వృధా పుచ్చిన కాలం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది"

లియోనార్డ్ డావిన్సీ: "సద్వినియోగం చేసుకొనే వారికి సమయం బోలెడంత. వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్చతను కోల్పోతుంది. బధ్ధకం మెదడు శక్తిని హరింపచేస్తుంది."

"నిన్న" చెల్లని చెక్కులాంటిది "రేపు" చెల్లుతుందో లేదో తెలియని ప్రాంసరీ నోటులాంటిది. " ఈ రోజు" హార్డ్ క్యాష్ లాంటిది. కనుక భూత, భవిష్యత్తుల గూర్చి మరచి వర్తమానాన్ని ఎంత గరిష్టంగా సధ్వినియోగం చేసుకొంటామన్న దాని పైనే మన భవిత, విజయం ఆధారపడి ఉంటుంది.


8.నిరంతర విఙ్ఞాన జిఙ్ఞాస (Pernnial Learning of Knowledge):

"విఙ్ఞానమన్నదొక శక్తి" అని విలియం హోబ్స్ అన్నారు. జీవితాంతం శ్రమించి నేర్చుకొన్నా మనము సముద్రంలోని నీటి బిందువంత ఙ్ఞానమైనా పొందలేము. అందుకే "తెలియని విషయాలు తెలుసుకోవాలన్న అనంతమైన, బలీయమైన కోర్కె మీలో ఉంటే చాలు మీరు ఏదో ఒక నాటికి గొప్ప మేధావి అవుతారని" భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటారు. దీనికి నిరంతర పుస్తక పఠనం అనివార్యం అంటారు. ఈ సందర్భంలో కొందరు మహనీయుల సూక్తులను గమనిస్తే "నిరంతర విఙ్ఞాన జిఙ్ఞాస" విజయాన్నందుకొనుటకు ఎలా దోహద పడుతుందో తెలుస్తుంది.


మల్లెమాల:

మొక్కుబడిగాగాక పుస్తక పఠనము

నిత్య వ్యసనమగుచూ నెగడినప్పుడే

పఠితగోరుకొనెడి ఫలము లభించును

మహిత వినయశీల| మల్లెమాల!!

హర్వే ఉల్మన్ : ఎవరైతే నిరంతరం విజ్ఞానాభ్యాసలో వుంటారో - వారు సర్వదా యువకులు గానే మిగిలిపోతారు"

  గీత: 'నహిఙ్ఞానేన సదృశ్యం'

  ఙ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది ఈ ప్రపంచంలో మరొకటి లేదు.


9. స్థితప్రఙ్ఞత - మానసిక బలం (Equilibrium State of Mind and Body - Will power)

భావోద్రేకాలను అదుపులో పెట్టలేని మనిషి, కళ్ళెం లేకుండా పరిగెత్తే గుఱ్ఱం లాంటి వాడు. వేగం వుంటుందేగానీ దిశాగమనం ఉండదు. విజయం అనే మాట వెనుక వుండేది మనిషి తెలివితేటలు మాత్రమే కాదు, అతని "మానసిక బలం" అని కూడా గుర్తించాలి. కనుక Balanced state of mind and Emotion Leads to success అన్నారు. అట్లే IQ + EQ = Success అన్నారు. ఈ సందర్భంలో స్థిత ప్రఙ్ఞత గూర్చి " గీత" లో చెప్పబడినవి తెలుసుకుందాము.

"కార్య సాధకుడి లక్షణం స్థిత ప్రఙ్ఞత. సుఖ దుఖాలకు, జయాపజయాలకు, గౌరవావమానాలకు అతీతుడయన వ్యక్తినే స్థిత ప్రఙ్ఞుడంటారు.


10. వినయ విధేయతలు - క్రమశిక్షణ - అంకిత భావం (Obedience - Discipline - Dedication)

ఇది విజయానికి ఎలా దోహదం చేస్తుందో ఈ దిగువ క్రమాన్ని పరిశీలించినట్లయితే తేట తెల్లమవుతుంది.


వినయ విధేయతలు :

వినయమే విజయానికి రాచబాట. ఇది ప్రతిభకు ప్రాణం లాంటిది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం నేర్పుతుంది. అందుకే బైబిల్‌లో "తన్ను తాను తగ్గించుకొన్న వాడు హెచ్చింపబడును" అని పేర్కొన బడినది. "నిడారంబరం కన్నా గొప్పదేమీ లేదు. గొప్పదనమెప్పుడూ నిరాడంబరంగానే ఉంటుందని" ఎమర్సన్ తెలిపారు.


క్రమశిక్షణ :

పైన పేర్కొన బడిన అన్ని సుగుణాలకు ఇది తల్లి వంటిది. విద్యార్ధులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది వారిని అన్ని రంగాలలో నిష్ణాతులను చేయడంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఇది ఎనలేని సహాయం చేస్తుంది.


అంకిత భావం :

వృత్తి కైనా, ప్రవృత్తికైనా, అంకిత భావముండాలి. దానికి నిబద్దత తోడైతే మనిషి - మనిషిగా రూపుదిద్దుకొంటాడు. అందుకే "విధి నిర్వహణయే ఘనతకు మార్గమని" చెప్పారు పెద్దలు.

పైన పేర్కొన బడిన దశ సోపానాల వల్ల విజయమైతే చేకూరుతుందిగానీ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం మరియు మూర్తిమత్వం సిధించక పోవచ్చు. ఈ విషయంలో కూడా పరిపూర్ణ సఫలత పొందాలన్నా, మన జీవితాన్ని ధన్యత చేసుకోవాలన్నా, పైన పేర్కొనబడిన దశ సోపానాలతో బాటు ఈ దిగువన పేర్కొన్న అనుబంధ దశ సూత్రాలను కూడా త్రికరణ శుద్దితో పాటించవలెను.


దశ సూత్రాలు


1. పరోపకారం 2. సామాజిక బాధ్యత 3. నిరహంకారం 4. ఆనందమయ జీవన యానం (ఆనందో బ్రహ్మ) 5.Think and thank attitude 6. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం 7. తల్లి, తండ్రి, గురువు, దైవములను పూజించడం 8. ఆధ్యాత్మిక చింతన 9.శారీరక, మానసిక పరిపక్వతకు క్రమము తప్పని వ్యాయామము, యోగా మరియు ధ్యానం 10. సింహావలోకనం (Feed Back/Review)


సారాంశము :

పర్సనాలిటి డెవలప్‌మెంట్
ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష, ఆశావహ దృక్పదము , అనితర సాధ్యమైన కృషి, పట్టుదల, నమ్మకము, అత్యంత చురుకైన చొరవ, నిబధ్ధత, క్రమశిక్షణ, ప్రణాళికాబద్దమైన నిర్ధిష్ట లక్ష్యసాధనతో కూడిన కఠోర పరిశ్రమ - విజయసోపానాలు

"విజయమనేది గమ్యంకాదు. అదొక నిరంతర ప్రయాణం"

అపజయాలన్నీ విజయానికి సోపానాలే

ఓటమి నుండి నేర్చుకోండి గెలుపు పాఠాన్ని-సాధనతో చేరుకోండి స్వర్ణపీఠాన్ని!


!!శ్రమయేవ జయతే!

No comments:

Post a Comment