Thursday 17 July 2014

నల్ల సూరీడు 'ఉదయించిన' రోజు...


నల్ల సూరీడు, నల్ల జాతి హక్కుల రక్షణకోసం పోరాడిన మహానుభావుడు నెల్సన్ మండేలా పుట్టిన రోజు నేడు. ప్రత్యర్థిని అగౌరవ పరచకుండానే వారిపై విజయం సాధించిన నేత. అందుకే ఆయన ప్రపంచానికే ఆదర్శప్రాయుడయ్యారు. జాతి వివక్షకు చరమగీతం పాడారు.

జాతిని ఏకం చేసిన మండేలా ప్రసంగాలు...


జాతిని ఏకం చేయడం కోసం మండేలా తీవ్ర కృషి చేశారు. ఆయన ప్రసంగాలు జాతిని ప్రభావితం చేశాయి. 'ఎక్కడైనా మనుషులు మాత్రమే ఉంటారు.  వ్యవస్థలు, విధానాలు మనుషుల్ని చెడ్డవాళ్లుగా, శత్రువులుగా చిత్రీకరిస్తాయని' తెలిపాడు. జాతి వివక్ష అమాయక ప్రజలను బలి తీసుకుంటుందని, వివక్షను పాటించేవారు కూడా తమ సొంత మనుషులను కోల్పోవాల్సి వస్తుందని తెల్ల అధికారులకు అర్థమయ్యేలా చెప్పగలిగారు నెల్సన్ మండేలా. 'జీవితాన్ని మీరెంతగా ప్రేమించారో నేనూ అంతే ప్రేమించాను. స్వేచ్ఛగా జీవించాలన్న మీ హక్కు, నా హక్కు వేర్వేరు కాదు' అని చెప్పి తన జాతికి నమ్మకాన్ని, ధీమాను కల్పించిన మహానుభావుడు మండేలా'.


27 ఏళ్ల జైలు జీవితం నుండి.. అధ్యక్షునిగా..

నల్లజాతి తిరుగుబాటు పోరాటంలో మండేలా ఇరవై ఏడేళ్ల పాటు దుర్భరమైన జైలు జీవితం గడిపారు. నల్లజాతి పోరాట వీరుల త్యాగాలతో స్ఫూర్తి పొందిన మండేలా, నల్లవారి హక్కుల కోసం ఆవిర్భవించిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరారు. తెల్ల వారి ప్రలోభాలకు లొంగకుండా జాతి వివక్షపై పోరాడారు. తదనంతరం దక్షిణాఫ్రికాలో ఎన్నికైన తొలి నల్లజాతి అధ్యక్షునిగా చరిత్రపుటలకెక్కారు. మండేలా నల్లజాతికి సాధించి పెట్టిన తేనెపట్టు 'స్వేచ్ఛ'. జాతికి అతడు రాసిపెట్టిన రాజ్యాంగం'ఆత్మగౌరవం'.

మండేలా జీవిత చరిత్రే దక్షిణాఫ్రికా చరిత్ర..

దక్షిణాఫ్రికాకు రెండు జీవిత చరిత్రలు. ఒకటి ఆ దేశానిదయితే రెండోది మండేలాది. మండేలా లేకపోతే దక్షిణాఫ్రికా లేదంటారు. మండేలా జీవిత చరిత్రే దక్షిణాఫ్రికా జీవిత చరిత్ర అంటారు. మావో, లెనిన్, గాంధీలా మండేలా తన జాతి ప్రజలకు విముక్తి ప్రదాత. ప్రపంచ దేశాల ప్రియతమ నేతగా నిలిచిపోయారు.

No comments:

Post a Comment