Wednesday 2 July 2014

విశ్వనటచక్రవర్తి ఎస్వీఆర్‌ జయంతి



ఆ డైలాగ్‌ డెలివరీ, ఆ మేనరిజాలు మరొకరికి సాధ్యం కాదు. అలాగే పాత్ర ఔచిత్యం ప్రకారం పరకాయ ప్రవేశం చేnయడంకూడా మరొకరి వల్లకాదు. అందుకే విశ్వనట చక్రవర్తి అయ్యారు ఎస్‌.వి.రంగారావు. మాంత్రికుని పాత్రలద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అంతే పేరుని రాక్షస పాత్రల్లో, విలన్‌ పాత్రల్లో కూడా తెచ్చుకున్నారు. భీకరంగా ఎంత హడలు గొట్టించి తిట్టించుకోగలరో, సాత్విక పాత్రల్లో అంత బాగానూ ఒదిగిపోయి ప్రేక్షకుల జాలిని సానుభూతినీ పొందగలరు. వూరందరికీ పులి పెళ్ళాంకి మాత్రం పిల్లిలా ఎలా కనిపించగలరో, ఎవరినీ లెక్కచేయని అహంకారిగానూ అంత బాగా రాణించగలిగారు. నటనా విధానాన్ని ఇంత బాగా ఔపోసన పట్టడానికి సినీరంగంలో తొలిదశలో లభించిన 'వరూధిని' చిత్ర పరాజయం, ఆ తర్వాత వేషాల వేటలో పొందిన అవమానాలు, ఒక వూరి కాపు మరొక వూరి...లా వాటిని దిగమింగుకుంటూ లభించిన చిన్న పాత్రలకు సై అనిచేస్తూ, సినీ నటనలో పరిపూర్ణత ఎలా సాధించాలా అనే అంశంపైనే దృష్టి కేంద్రీకరించి అవకాశం రాగానే 'షావుకారు'లో రౌడీగా 'పాతాళభైరవి'లో నేపాళ మాంత్రికునిగా విజృంభించి అద్భుతమైన కేరక్టర్‌ ఆర్టిస్ట్‌ అనిపించు కోగలిగారు. ఆ ఇమేజ్‌ పెరుగుతూండగా ఒక పాత్రతో మరోపాత్రను పోల్చుకోలేని విధంగా నటించి, నటిస్తూ ఔరా అనిపించుకున్నారు.

ఎస్‌.వి.ఆర్‌.కెరీర్‌ని 'పాతాళ భైరవి' తెలుగు చిత్రం ఎలా మలుపు తిప్పిందో పాతాళభైరవి, తమిళ హిందీ వెర్షన్లు అలానే మలుపుతిప్పాయి, తమిళ ప్రేక్షకులు ఎస్వీఆర్‌ని తమిళుడుగా హిందీ ప్రేక్షకులు ఉత్తరాదివాడిగా భావించేంతగా. ఎస్‌.వి.రంగారావు నటించిన 'హరిశ్చంద్ర, సతీసావిత్రి, మాయాబజార్‌, భూకైలాస్‌, చెంచులక్ష్మి, కృష్ణలీలలు, భక్త అంబరీష, దీపావళి, సతీసుమతి, దక్షయజ్ఞం, నర్తనశాల, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణసత్య, మోహినీ భస్మాసుర, శ్రీకృష్ణ విజయం, సంపూర్ణరామాయణం, బాలభారతం, యశోదకృష్ణ' మున్నగు పౌరాణిక చిత్రాల్లోని పాత్రలన్నీ ఆయన టేలెంట్‌ని పెంచుతూ పోయినవే.

'పాతాళభైరవి, జయసింహ, రేచుక్క పగటిచుక్క, బాలనాగమ్మ, భట్టి విక్రమార్క, రహస్యం' వంటి జానపద చిత్రాల్లో 'సారంగధర, మహాకవి కాళిదాసు, చండీరాణి, అనార్కలి, బొబ్బిలియుద్ధం' వంటి చారిత్రక చిత్రాల్లో, 'దేవాంతకుడు' ఫాంటసీ చిత్రంలో, 'పెళ్ళి చేసి చూడు, పల్లెటూరు, బంగారుపాప, మిస్సమ్మ, చరణదాసి, తోడికోడళ్ళు, మాంగల్యబలం, అప్పుచేసి పప్పుకూడు, నమ్మినబంటు, వెలుగునీడలు, కలసి ఉంటే కలదు సుఖం, ఆత్మబంధువు, గుండమ్మకథ, నాదీ ఆడజన్మే, తోడునీడ, మొనగాళ్లకు మొనగాడు, చదరంగం, లక్ష్మీ నివాసం, సుఖదుఖాలు, బాంధవ్యాలు, రాము, జగత్‌కిలాడీలు, జెగత్‌జెట్టీలు, మూగనోము, ప్రేమ్‌నగర్‌, దసరాబుల్లోడు, పండంటికాపురం, తాతమనవడు, దేవుడు చేసిన మనషులు, అందరూ దొంగలే' వంటి సాంఘిక చిత్రాల్లో పోషించిన పాత్రలన్నీ ఎస్వీఆర్‌ అద్భుత నటనకు ప్రతిబింబాలే.

No comments:

Post a Comment