Friday 4 July 2014

సకల దేవతా పూజా విధానము.... దేవతల ప్రీత్యర్ధం సమర్పించవలసిన నైవేద్యాలు





సకల దేవతా పూజా విధానము

శ్రీ గురుభ్యోనమహా గురువులందరూ సన్నిహితులుగా నున్నట్లు భావించి వారికి నమస్కరించి "హరిహ్ ఓం" అని దేవుని ధ్యానించాలి. పూజకుముందు రాగిగ్లాసులో నీరు, రాగి ఉద్దరిణె, రాగి పళ్ళెము, తీర్ధపాత్ర, పుష్పములు, గంధము, ఘంట, అక్షతలు, పంచామృతము, గోక్షీరము నైవేద్యానికి పటికబెల్లము, ద్రాక్షగానీ, పండ్లుగానీ, వండిన మహానైవేద్యము, దీపములు, ధూపము, హారతి కర్పూరము అన్నీ ముందుగా సిధ్ధంగా ఉంచుకొనవలెను.తూర్పుముఖముగా కానీ, ఉత్తరముఖముగా గానీ కూర్చొని దైవారాధన చేయవలెను.మనకు ఎదురుముఖముగా ఆరాధ్య దైవము ఉండవలెను. అంటే దక్షిణముఖముగా గానీ, పశ్చిమ ముఖముగా గానీ ఆరాధ్య మూర్తులుండవచ్చును. స్నానము చేసి విభూదియో, తిరునామమో, తిలకమో పెట్టుకొని ఆసనముపై కూర్చొనవలెను.ఘంటా నాదంతో దీపారధన, భూత శుద్దికొరకు మంత్రము చెప్పి, నీళ్ళు చల్లాలి. ఆచమన మంత్రాలతో నీటిని స్వీకరించాలి. ప్రాణాయామంచేసి సంకల్పం చేప్పుకోవాలి. సంకల్పం తిధులు, ఋతువులు, సంవత్సరములు, మాసాలు, పక్షాలు, ఆయనాలు మారుతూ ఉంటాయి. రోజూ పంచాంగం చూసుకొని తిధులు చెప్పుకోవాలి. గోత్రనామాలు చెప్పి, కలశారాధన, ధ్యానము, ఆవాహన, సాన్నిధ్య ప్రార్ధన, ఆసనము పాధ్యము, ఆర్ఘ్యము, స్నానము, వస్త్రము, ఉత్తరీయము, తిలకం, యఙ్ఞోపవీతము, గంధము, పుష్పము, ఆభరణము, ధూపం, దీపం, మధుపర్కం, నైవేధ్యం(అవార), మహానైవేధ్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ఫల సమర్పణం, పుష్పాంజలీ, ఆత్మ ప్రదక్షిణ, క్షమాప్రార్ధనం, తీర్ధ ప్రాసనం (అకార మృత్యుహారం శ్లోకంతో) ఇవన్నీ పూజా ప్రకరణములు. తీర్ధం స్వీకరించడంతో పూజా సమాప్తం జరుగుతుంది. ఇంకా విశేషోపచారాలతొ భగవంతుడు పరిపూర్ణ ఆనందం చెందుతాడు. చత్రం, చామరం, నృత్యం, గీతం, వాద్యంలతో బాటు సమస్త రాజోపచారాలు కూడా ఆయనకు చేయాలి. అప్పుడు దేవిగానీ దైవముగానీ (పురుషుడు) అనుగ్రహించి ఇష్టకామ్యములను తీర్చి వారి సంసారాలలో సుఖ శాంతులు అష్ట ఐశ్వర్యాలు ప్రసాధిస్తారు.


దేవతల ప్రీత్యర్ధం సమర్పించవలసిన నైవేద్యాలు


శ్రీ వేంకటేశ్వరస్వామి: శ్రీ వేంకటేశ్వరస్వామికి వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టవలెను. తులసిమాల మెడలో ధరింపవలెను.


వినాయకుడు: వినాయకునకు బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజింపవలెను.

ఆంజనేయస్వామి: ఆంజనేయస్వామికి అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజింపవలెను.


సూర్యుడు: సూర్యుడుకు మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం.


లక్ష్మీదేవి: లక్ష్మీదేవికి క్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజింపవలెను.


లలితాదేవి: లలితాదేవికి క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.


సత్యన్నారాయణస్వామి: సత్యన్నారాయణస్వామికి ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం.


దుర్గాదేవి: దుర్గాదేవికి మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం.


సంతోషీమాత: సంతోషీమాతకు పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.


శ్రీ షిర్డీ సాయిబాబా:శ్రీ షిర్డీ సాయిబాబాకు పాలు, గోధుమరొట్టెలు నైవేద్యం


శ్రీకృష్ణుడు: శ్రీకృష్ణునకు అటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసి దళములతో పూజించవలెను.


శివుడు: శివునకు కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.

No comments:

Post a Comment