Sunday 6 July 2014

ఫేస్ బుక్ రహస్య ప్రయోగం...నెటిజన్లను మోసం చేసిందా?....

ఫేస్ బుక్ సోషల్ నెట్ వర్కింగ్ సంస్థ రెండేళ్ల క్రితం ఓ రహస్య మానసిక ప్రయోగాన్ని చేపట్టింది. తమ యూజర్లలో దాదాపు ఏడు లక్షల మందిపై ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. దాదాపు రెండున్నరేళ్ల కిందట జరిగిన ఈ ప్రయోగం వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
 
 
ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్. రెండేళ్ల క్రితం ఫేస్ బుక్ తమ యూజర్లలో సుమారు ఏడు లక్షల మందిపై ఒక రహస్య మానసిక ప్రయోగాన్ని నిర్వహించింది. తమ సైట్ లో ఒకరు వ్యక్తం చేసే ఉద్వోగాలు మరొకరిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో గుర్తించేందుకు 2012 జనవరిలో వారం రోజుల పాటు ఫేస్ బుక్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. న్యూస్ ఫీడ్ లో ఉండే సానుకూల పదాలు లేదా ప్రతికూల పదాల సంఖ్య యూజర్లు పెట్టే స్టేటన్ అప్ డేట్ లపై చూపే ప్రభావాన్ని కనుగొనడం లక్ష్యంగా ప్రయోగం చేపట్టింది. ఫేస్ బుక్, కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు ఈ ప్రయోగం జరిపారు. 
 
 
ఫేస్ బుక్... పొద్దున లేచిన దగ్గరనుంచి.. రాత్రి నిద్రపోయే వరకూ గంటకోసారైనా ఫేస్ బుక్ చూడకుండా గడపలేని నెటిజన్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అంతగా జనజీవితంలో ఓ భాగమైపోయిందీ నెట్ వర్కింగ్ సైట్. ఏ చిన్న విశేషం జరిగినా.. దాన్ని ఫేస్ బుక్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పేయడం ఓ అలవాటైపోయింది. పైసా ఖర్చులేకుండా.. తమ అభిప్రాయాలను విశ్వవ్యాప్తంగా ఉన్నమిత్రులకు క్షణంలో చేరవేసే సౌలభ్యం.. ఈ సైట్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ నెట్ వర్కింగ్ సైట్ గా నిలిపింది. అలాంటి ఫేస్ బుక్ ఇప్పుడు ఓ పెను వివాదానికి కేంద్ర బిందువైంది. 
 
 
యూజర్ల భావోద్వేగాలపై ఫేస్ బుక్ రహస్యంగా ప్రయోగం చేసిందన్న విషయం వెలుగులోకిరావడంతో నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రెండున్నరేళ్ల కిందట జరిగిన ఈ వివాదం ఇప్పుడు వెలుగు చూసి పెద్ద దుమారమే లేపుతోంది. ఫేస్ బుక్ లో నెటిజన్లు వ్యక్తం చేసే భావోద్వేగాలను ఎక్కువ, తక్కువ సంఖ్యలో చూపడం ద్వారా.. ఎదుటి వారి భావోద్వేగాలు ఎలా ప్రభావితమవుతున్నాయో రహస్యంగా గమనించింది ఫేస్ బుక్.
 
 
ఈ మేరకు ఓ అల్ గారిథం మార్చారు. ఈ ప్రయోగం వివరాలను వివరిస్తూ ఓ అమెరికన్ పత్రికలో కథనం ప్రచురితమైంది పెను వివాదంగా మారింది. ఫేస్ బుక్ ఇలాంటి ప్రయోగం చేయడంపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అది కూడా ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సైట్ల ద్వారా తమ నిరసన తెలుపుతున్నారు. కార్నెల్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా యూనివర్శిటీలతో కలసి ఫేస్ బుక్ ఈ ప్రయోగం నిర్వహించింది.
 
 
దీనిపై స్పందించిన ఫేస్ బుక్ యాజమాన్యం... తన ప్రయోగాన్ని సమర్థించుకుంది. తమ సేవలను మెరుగుపరచుకోవడం కోసమే ఈ పని చేశామని చెప్పుకొచ్చింది. ఇది యూజర్ల ప్రయోజనాలను ఏ రకంగానూ దెబ్బతీయదని వాదిస్తోంది.

No comments:

Post a Comment