Wednesday 23 July 2014

చిదంబరం లేక చిత్తంబళము


తమిళనాడులోని ద్రావిడ రీతుల్లో నిర్మించబడిన దేవాలయాల్లో చిదంబరం ఒక మణిపూస. చిదంబరం అంటే విజ్ఞానాంబరము అని అర్ధము. దక్షిణ ఆర్కాట్‌లోని చిదంబరంకు ముఖ్యకేంద్రం. 13 హెక్టార్ల చదరంలో పరచుకొని ఉన్న ఈ ఆలయ సమూహము అతి పురాతనమైనదిగా ప్రసిద్ధి. అందులో ప్రళయతాండవం చేస్తున్న పరమశివుని విగ్రహం కలదు చాలా పెద్ధది. నలువైపులా 4 గోపురాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ గోపురాలు 49 మీ. ఎత్తున ఉన్నాయి. మిగతా 2 గోపురాల మీదా తాండవ నృత్యమాడే నటరాజస్వామి శాస్త్రీయ భంగిమలు 108 చెక్కించబడి ఉన్నాయి. ఆలయంలో విశేషంగా చెప్పుకోదగినవి నృత్యమందిరం. ఒక చిత్ర రధాకృతిలో నున్న పెద్ద సభా భవనంలో మధ్య ఒక చిన్న మందిరంలో నటరాజ స్వామి విగ్రహం ఉండి అంతా తానై వెలసి ఉన్న భావం గోచరిస్తుంది. మరొకటి ముఖ్యమైనది వేయి స్థంబాల మంటపం. ఆలయ ప్రాంగణంలోని పార్వతీ దేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలతో పాటు శ్రీ మహావిష్ణువుకు అంకితమైన మరో ఆలయం ఉంది. శివకేశవులకు అభేదత్వమును కల్పిస్తూ శివుని దర్శించడానికి వెళ్ళిన వానికి విష్ణువు, విష్ణువును దర్శించడానికి వెళ్ళినవానికి శివుడు కనపడుతూ సర్వజగత్తుకు భగవంతుడు ఒక్కడే అనే భావం మన మనస్సులో మెదిలేట్టు చేస్తుంది. అసలు చిదంబర రహస్యం అనే నానుడి ఎప్పట్నుంచో వాడుకలో ఉంది. అంతూ, దరి తెలియని విషయాన్ని చిదంబర రహస్యం అనడం పరిపాటి. ఇక్కడ ఈ ఆలయంలో కూడా పంచ లింగాల్లో ఒకటైనటువంటి ఆకాశలింగమును చూడటానికి రుసుం చెల్లించి లోపలికి వెళ్ళినపుడు ఇది మనకి అనువైకవేద్యమవుతుంది. ఆకాశలింగం అంటేనే దీనికి ఆకారం ఉండదు. ఆలయపు గోడలో బంగారు రేకుమీద యంత్రంతో బిగించబడి ఉంటుంది. దాని ఎదుట ఒక తెరవేసి ఉంటుంది. లోపలకు వచ్చిన తరువాత ఆ తెర తీసి చూపిస్తారు. అంటే మనకు కనపడనిది చిదంబర రహస్యం అనుకోవాలి.

ఈ చిదంబరం 907 నుండి 1310 వరకూ చోళరాజుల రాజధాని. వీరచోళరాజ కాలంలో నటరాజ ఆలయం వ్యవస్థీకరించబడినట్లుగా ఉన్నత పాఠాలు చెప్తున్నాయి. వీరచోళరాజు కాలం క్రీ.శ. 927 నుండి 997 వరకు ఆలయ పట్టణం మధ్య నుండి 5 ప్రాకారాలు కలిగి ఉన్నది. మొదటి ప్రాకారంలోనే 4 సింహ ద్వారాల మీద గోపురములు ముందు చెప్పిన 4 గోపురాలు ఇవే. చిదంబరం నటరాజస్వామి వారి ఆలయంలో వేంచేసియున్న శ్రీ నందీశ్వరుని విగ్రహం చాలా పెద్దది ఒకటియున్నది. దాని యెదయందు గంటలు, దానిపై జీను వగయిరాలు చూస్తే రాతితో చెక్కబడినది కాదు సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హిందూ దేశాల్లో నంది వాహనాలు అన్నింటిలోకంటే పెద్దది. శివగంగ వేయి స్తంభముల మంటపమునకు పడమటగా అమరి యున్నది కోనేరు. దీనికి సువర్ణ కోనేరు అనే పేరు ఉన్నది. చక్కగా చెక్కిన రాతితో మెట్లున్నవి. పూర్వం ఒకానొకప్పుడు వర్మచక్రుడనే రాజు స్నానం చేస్తే అతన్ని భాదిస్తున్న కుష్ఠురోగం పోయిందని చెప్తారు. ఇంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో చూడదగినది- పెద్ద నెమలి విగ్రహం, స్వామి వారి మయూర వాహనం, వినాయక దేవాలయంలోని వినాయకుని విగ్రహం, హిందూ దేశం మొత్తం మీదనే చాలా పెద్దది అంటారు. శిల్పులు ప్రతి అంగుళంలోనూ చూపిన నిపుణత్వం కౌశల్యము మనకు ఆశ్చర్యము, ఆనందాన్ని కలిగిస్తాయి. చిదంబర నటరాజస్వామి పుండరీ పురంలోని పాండురంగని వలె అనేక మంది భక్తులను, కవులను కాపాడి తనలో ఐక్యం చేసికొన్న భక్తసులభుడు. ఈయన లీలలను తిరువాచకమనే గ్రంధం పేర మణికవచుడు అనే ఆయన వ్రాశాడు. స్వామి అనుగ్రహంతో ఇలా ఎంతో మంది మహాగ్రంధకర్తలు స్వామి అనుగ్రహాన్ని పొంది తరించారు. అనపాయచోరుడు అనే రాజు వైరాగ్యము పొందిన పిదప తన జీవిత శేషాన్ని ఆలయ ప్రాంగణంలోనే నడిపాడు. ఆయన గౌరవార్ధం "జ్ఞానవాసి" అనే చిరు దేవాలయం కూడా ఉంది. ఇంకా చిదంబరంలో చూడదగినవి తిల్లైఅమ్మన్ దేవస్థానము శ్రీరాజ అన్నామలై చిట్టియార్‌ గారి పరిపోషణలో రూపుదిద్ధుకొన్న అణ్ణామలై విశ్వవిద్యాలయము చూడదగినది. చిదంబరంలోని శివాలయంలో ఉన్న తిరుచ్చిత్రకూటము ఒక దివ్యదేశంగా పరిగణించబడుతుంది. శ్రీ గోవిందరాజస్వామి పెరుమాళ్ళు, పుండరీకవల్లీ తాయారు, కుల, తిరుమంగయాళ్‌వార్ల మగయాళ్‌శాస్త్రం వైష్ణవులకు పవిత్రమైన క్షేత్రం.

No comments:

Post a Comment