కబీరు 15 వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ విప్లవాత్మక యోగి. ఆధ్యాత్మిక సిద్ధ పురుషుడు, ఆనాడు తీవ్ర మత వైషమ్యాల వల్ల, పరస్పర విరోధాల వల్ల హిందూ, మహమ్మదీయుల మధ్య ఏర్పడిన అగాథానికి గొప్ప సేతువు వంటి కబీరు ఉపదేశాలు రెండు మతాల సామరస్యానికి అధికంగా సహకరించాయి అనడంలో సందేహం లేదు.
నిరాడంబరమైన సహజ భావనలతో, ఆధ్యాత్మిక తత్త్వముతో బ్రహ్మానందదాయకమైన వీరిపాటలు, వీరికి అఖండ కీర్తిని గడించాయి. భారతీయ యోగులలో సుప్రసిద్ధుడని ఘనత వహించిన కారణ జన్ముడు.
క్రీ.పూ. 1440 లో జననమొందిన కబీరు బాల్యం ఒక విచిత్ర గాధ. తండ్రిలేని కబీరుని ఇతని తల్లి పరిహరించినది. ఆనాధుడైన కబీరు కాశీ పరిసర ప్రాంతాలలో లహర్‌తోలో అనే సరస్సులో పడి మునిగి పోవుచుండగా నిరు, నిమా అనే ముస్లిం దంపతులు రక్షించి ఇంటికి తీసుకుపోయారు. పుత్ర సంతతికి నోచుకోని ఈ ముస్లిం దంపతులు తమకు దొరికిన ఈ బాలుని అత్యంత ఆదరాబిమానాలతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. మహమ్మదీయుల ఇంట మహమ్మదీయ సంప్రదాయలతో వర్ధిలుతున్న కబీరు హైందవ ఆచారాలను ఆదరిస్తూ ఉండేవాడు. ఇది ఆ మహమ్మదీయ దంపతులకే కాదు ఇరుగు పొరుగు వారి అగ్రహానికి కూడా ముఖ్య కారణమైంది.
చిన్ననాటి నుండి కబీరు ఆధ్యాత్మిక జీవనాన్ని అభిలషిస్తూ ఉండే వాడేగాని ప్రత్యేకంగా ఒక హిందూ మతాభిమానాన్ని గానీ, మహమ్మదీయ మతాభిమానాన్ని గానీ ప్రకటించలేదు. గురువు లేక ఎటువంటి గుణవంతునకైనను జ్ఞాన సాధన సాధ్యం కాదని తలచి, సద్గురువు ఆవశ్యకతను గ్రహించి, అట్టి గురువుకోసం తహతహపడ్డాడు. ఆ సమయంలో కాశీలో నివసిస్తూ ఉన్న రామానందులను గురించి విని వారి సాన్నిధ్యంలో వారి సేవకు ఎంతో కుతూహలం పొందాడు. కాని హీన జాతిలో పెరిగిన తనను రామానందుడు అనుగ్రహించి శుశ్రూషకు అంగీకరించునో లేదో అనే సంశయంతో భాధ పడ్డాడు. చివరకు ఒకనాడు రామనందుడు గంగానదిలో స్నానముచేయు రేవువద్ద కబీరు మెట్లపై మునుగు కప్పి పడుకున్నాడు.తెల్లవారు జామున స్తానానికి వచ్చిన రామానందుడు మేట్లపై పరుండిన బాలుని చీకటిలో గమనించక కాలితో తొక్కిన అపచారమునకు ' రామ రామ ' అని రామనామస్మరణం చేశాడు. వెంటనే కబీరు ఆ రామ నామమే తనకు మహామంత్రమని నిశ్చయించుకుని ఆ నాటి నుండి తాను రామానందుల శిష్యుడని రామానందునితో చెప్పి శ్రుశ్రూషకు ప్రాధేయపడ్డాడు. కబీరు గొప్పదనాన్నీ, అభిలాషనూ గ్రహించి వెంటనే రామానందులు అతన్ని తన శిష్యునిగా అంగీకరించాడు. నాటినుండి కబీరు రామ నామ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు.
రామానందులు సామాన్యులు కారు. కఠినుడు. కబీరు అనేక సంవత్సరాలపాటు శుశ్రూష చేసి వారి వలన నిర్గుణోపాసనచే దైవము సర్వ మతములకు సమ్మతమైన పరమాత్మ తత్వమనియు ఏదో ఒక రూపము చేతను, పేరు చేతను నిర్దేశింపదగినవడు కాడని తెలుసుకున్నాడు. కుల మత వ్యవస్థలతో చెల్లాచెదురైన మానవాళిలో రేగుతున్న ద్వేష వైషమ్యాలకు మిక్కిలి చింతించి, మహమ్మదీయ మత గురువులతో, హైందవ యోగులతో కలసి మెలసి ఉండుటకు ప్రారంభించాడు. దీని వలన కబీరు ప్రజాదరణ పొందలేకపోయాడు.
కబీరు శిష్టాచార సంప్రదాయాలను నిరాకరించి, విగ్రహారాధనను విమర్శించాడు. ఫలితంగా అనేక మందితో విరోధాన్ని తెచ్చిపెట్టుకున్నా, తన గురువు ఉపదేశాలను దేశం నలుమూలలా ప్రకటించాడు. కబీరు ఉపదేశామృతం అతని మృదు మధుర వాక్కులలోను, పాటలలోనూ, పద్యాలలోనూ తొణికిసలాడుతుంటాయి. భక్తులు ఆ పాటలను పాడుతూ కబీరు కీర్తిని నలుదిశలా వ్యాపింపజేశారు.
కబీరు మరణించినపుడు అతడి హిందు, మహమ్మదీయ భక్తులు అతడి మృతదేహ ఖనన విషయంలో కొట్లాడుకున్నారు. మహమ్మదీయులు దేహాన్ని భూస్థాపితం చేయాలని, హిందువులు దహన క్రియలు చేయాలని వాదులాడుకున్నారు. వాదోపవాదాలతొ మృత దేహంపైని వస్త్రాన్ని తొలగించగా ఆయన కళేబరానికి బదులు అక్కడ పుష్ప రాశి ఉండడంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. కబీరు రచించిన బిజక్‌లోని ఉపదేశాలనుంచి, సందేశాలనుంచి మనం ఎంతైనా తెలుసుకోవచ్చు.
కబీరు మానవాళికి అందించిన కొన్ని అమూల్య ప్రవచనాలు (సాఖీలు) :
ఏది చేసినా నువ్వే. నాది ఇసుమంతయూ లేదు. నేనేదైనా చేసినన్నచో నాలోనున్నవాడవు నీవే చేసితివి.
హరినెందుకు ప్రేమింతువు? హరిజనులను ప్రేమించుము.హరి నీకు సంపదనిచ్చును, హరిజనుడు నీకు హరినే ఇచ్చును.
ఆకలి కుక్కవంటిది. అది భజనకు భంగం చేయును. దానికి ముక్కబడవేయుము. జంకు విడిచి స్మరియింపుము.
విరహం లేని హృదయం వల్లకాడువంటిది.
సాఖీలు వల్లిస్తే ఉపయోగం లేదు. వాటి సారాన్ని గ్రహించాలి.
గోవిందుడికన్నా గురువెక్కువ.
పళ్ళెమును నీటిలో నానబెడితే ఉపయోగం ఏముంది? దుర్జనుడూ అంతే. వాడి హృదయం మెత్తబడదు.
ఎత్తైన మేడలు చూసి గర్వించకు. రేపు నేలబొర్లెదవు. మీద గడ్డి ఒలుచును.
అడుగుటకన్నా చచ్చుట మేలు.
మనసు గజరాజు. అంకుశంతో దానిని అణుచుము.
రామ నామము నాల్గు వేదములకు మూలము.
No comments:
Post a Comment