ధర్మపురి తెలంగాణాలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం,
తీర్థరాజం. శ్రీ లక్ష్మీనృసింహుడు యోగనారసింహుడిగా, ఉగ్ర నారసింహుడిగా రెండు అవతారాల్లో
ఇక్కడ కొలువై ఉన్నాడు
కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి క్షేత్రాన్ని
దర్శించిన వారికి యమపురి ఉండదు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ప్రాచీన పుణ్యక్షేత్రమైన
ధర్మపురి క్షేత్రంలోని దక్షిణవాహిగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో మూడు సార్లు మునిగి
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటే గత మూడు జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయని
భక్తుల నమ్మకం. అందుకే రాష్ట్రం నలుమూలల నుండి నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి స్వామి
వారిని దర్శించుకుంటుంటారు. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు,
మేధావులు స్వామివారిని తరచూ దర్శించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. ప్రస్తుతం
వార్షిక పండుగ ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ధర్మపురి
క్షేత్రానికి తరలివచ్చారు. అశేష భర్త జనావళితో క్షేత్రం కిటకిటలాడుతోంది.
ధర్మపురి క్షేత్రంలో బ్రహ్మ విష్ణు,
మహేశ్వరుడు ముగ్గురు కొలువైనందున త్రిమూర్తి క్షేత్రంగా, శ్రీ బ్రహ్మదేవుడు, విష్ణుస్వ
రూపుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కొలువై ఉన్నందున నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.
ఈ నరసింహ క్షేత్రం ప్రాచీన పుణ్యక్షేత్రంగా, చారిత్రాత్మకంగా ప్రసిద్ధి గాంచింది. క్షేత్రంలో
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రాంగ ణంలో ప్రధాన దేవాలయంతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామి,
శ్రీ ఉగ్ర నరసింహ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వేణుగో పాల స్వామి, యమధర్మరాజు,
శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ వినాయక స్వామిల ఆలయాలు ఉన్నాయి. విశాలమైన బ్రహ్మ పుష్కరిణితో
పాటు సత్యవతి ఆలయానికి ఇసుక స్తంభం ప్రాశ స్త్యము. క్షేత్రం గుండా ప్రవహిస్తున్న గోదావరి
నదిలో బ్రహ్మ గుండం, సత్యవతి గుండం, యమ గుండం, పాల గుండం, చక్ర గుండములు కలవు.
క్షేత్ర మహాత్యం : రాష్ట్రంలోని ప్రసిద్ధి పుణ్య క్షేత్రాల్లోని నవనారసింహా క్షేత్రాల్లో ధర్మపురి శ్రీ యోగానంద లక్ష్మీనృసిం హాస్వామి వారి క్షేత్రం ఒకటిగా వెలుగొందుతోంది. ఈ క్షేత్రమును పూర్వం ‘ధర్మవర్మ’ అనే మహారాజు పరిపాలించడం వల్ల ఈ క్షేత్రానికి ధర్మపురి అనే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రం క్రీ.శ 850- 928 సంవత్సరం కంటే పూర్వం అయినప్పటికీ క్రీ.శ 1422-1436 కాలంలో బహుమనీ సుల్తానుల దండ యాత్రలో ధ్వంసమై తిరిగి 17వ శతాబ్దంలో ఈ ఆలయం పునరుద్ధరింప బడినట్లు క్షేత్ర చరిత్ర తెలుపుతోంది. ఈ క్షేత్రంలో ప్రధాన మూర్తి అయిన శ్రీ యోగా నంద లక్ష్మీనర సింహాస్వామి సాలగ్రామ శిలగా వెలసియున్నారు. ఈ క్షేత్రానికి ఆనుకుని పవిత్ర గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవిహస్తోంది. అందుకే ఈ క్షేత్రం దక్షిణకాశీగా, తీర్థరాజముగా, హరిహర క్షేత్రముగా పిలువబడుతోంది. స్వామివారి ఆలయ ప్రాంగ ణంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ యమధర్మ రాజు ఆలయం ఉంది.
స్వామి వారిని దర్శించుకునే భక్తులు
అనంతరం యమధర్మరాజును కూడా దర్శించుకుంటారు. అందువల్లే ధర్మపురికి వచ్చిన వారికి యమపురి
ఉండదనే నానుడి ఉంది. ధర్మపురి క్షేత్రం ఆలయాలతో పాటు వేదాలకు ప్రాచీన సంస్కృతికి, సంగీతానికి,
సాహిత్యానికి, కవిత్వానికి పుట్టినిల్లుగా ప్రసిద్ధి గాంచింది. ఈ దివ్య క్షేత్రంలో
శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా పాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి 13 రోజుల పాటు
అత్యంత వైభవంగా నిర్వహించబడుతాయి. ఈ బ్రహ్మోత్స వాల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని
నలుమూలల నుంచే కాకుండా మహా రాష్ట్ర నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని
దర్శించుకుంటారు. స్వామి వారికి నిత్య కళ్యాణంతో పాటు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నారు. ప్రతి 12 సంవత్సరాలకో సారి వచ్చే గోదావ రి పుష్కరాలు ఘనంగా జరుగుతాయి.
క్షేత్రంలో ఏడాది పొడుగునా ఉత్సవాలు:
చైత్ర మాసం :- ఉగాది, శ్రీరామనవమి, చిన్న
హన్మాన్ జయంతి.
వైశాఖ మాసంః- నరసింహ నవరాత్రోత్సవాలు,
పెద్ద హన్మాన్ జయంతి ఉత్సవం
జ్యేష్ట మాసంః- పౌర్ణమి – వటసావిత్రి
పౌర్ణమి.
ఆషాఢ మాసంః- శుద్ధ ఏకాదశి, గురు పౌర్ణమి
ఉత్సవాలు,
శ్రావణమాసంః- శ్రీ కృష్ణాష్ఠమి, మరుసటి
రోజున ఉట్ల పండుగ, శుద్ద పౌర్ణమిన శ్రావణ జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి, శుద్ధ పంచమిన
నాగుల చవితి, రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, పొలాల అమావాస్య ఉత్సవాలు,
భాద్రపదం మాసం :- శుద్ధ చవితిన వినాయకచవితి,
శుద్ధ పంచమిన ఋషి పంచమి ఉత్సవాలు.
ఆశ్వీయుజం మాసం :- దసరా నవ రాత్రోత్సవాలు,
దుర్గాష్ఠమి, మహర్నవమి, విజయదశిమి, కోజగిరి పౌర్ణమి, పాలలో చంద్ర వీక్షణ, బహుళ త్రయోదశిన
ధన త్రయోదశి, చతుర్దశిన నరక చతుర్దశి, అమవాస్య రోజున దీపావళి, కార్తీక మాసంలో కార్తీక
పౌర్ణమిన పంచసహస్ర దీపాలంకరణ.
మార్గశిర మాసంః- మార్గశిర శుద్ధ పౌర్ణమిన
దత్తాత్రేయ జయంతి, పుష్యమాసంః- ఆదివారాలు- పర్వదినాలు.
మాఘమాసంః- శుద్ధపంచమిన వసంత పంచమి, శుద్ధ
సప్తమిన రథసప్తమి.
ఫాల్గుణ మాసంః- శుద్ధ ఏకాదశి నుండి
13 రోజుల పాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు, ఏకాదశిన అంకురార్పణ,
ద్వాదశిన కల్యాణం, పౌర్ణమిన తెప్పోత్సవము, డోలోత్సవము, బహుళ పంచమిన రథోత్సవము కార్యక్రమా
లు నిర్వహిస్తారు.
రవాణా సౌకర్యాలు : ధర్మపురి క్షేత్రం
హైదరాబాద్ నగరానికి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రమైన కరీంనగ ర్‌కు
70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్ నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం
ఉంది. అలాగే ఈ క్షేత్రానికి 40 కిలోమీటర్ల దూరంలో మంచిర్యాల రైల్వే స్టేషన్, 130 కిలోమీటర్ల
దూరంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. ఆయా స్టేషన్‌లకు రైళ్ల ద్వారా చేరుకుని అక్కడి
నుంచి బస్సు సౌకర్యం ద్వారా ధర్మపురికి చేరుకోవచ్చు..............
No comments:
Post a Comment