Friday, 4 July 2014

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం... "అంగ్‌కోర్‌ వాట్ దేవాలయం".



భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది కంబోడియాలోని "అంగ్‌కోర్‌ వాట్ దేవాలయం". ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా పేరు సంపాదించిన ఈ ఆలయం.. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడి, హిందూ సంస్కృతీ సౌరభాలను వెదజల్లుతోంది. భారతీయ పురాణేతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందర్నీ ఆకర్షిస్తోంది.

కంబోడియాలోని "సీమ్ రీప్" అనే పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది "అంగ్‌కోర్ వాట్" దేవాలయం. ఖ్మేర్ సామ్రాజ్యకాలంలో ఈ ఆలయానికి అంకురార్పణ జరిగినట్లు తెలుస్తోంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో అంగ్‌కోర్ వాట్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పలు చారిత్రక ఆధారాలు రుజువు చేస్తున్నాయి.

ఆలయం తూర్పున పుట్టుక, అవతారాల గురించిన శిల్పాలు, పశ్చిమాన ఉండే మంటపం గోడలపై యుద్ధాలు, మరణాల గురించిన ఆకృతులు లో దర్శనమిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం, రామ-రావణ యుద్ధంలాంటి అద్భుత సంఘటనలు సైతం ఈ గోడలలో అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఇక దక్షిణ మంటంలో రెండవ సూర్యవర్మన్ సైనిక పటాలం.. మహామునులు, అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభలాంటి అనేక కళాఖండాలు ఆయల గోడలపై సాక్షాత్కరిస్తాయి.

. ఆ ఖ్మేర్ నాగరికత తరువాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంబోడియాకు వ్యాపించి.. సంస్కృతం అధికార భాషగా.. హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయట. కాబట్టి భారత సంస్కృతిని అణువణువునా నింపుకున్న ఈ అద్భుత కట్టడాలను జీవితంలో ఒక్కసారయినా దర్శించుకుంటే జీవితం ధన్యమైనట్లే..!

No comments:

Post a Comment