Monday, 7 July 2014

చారిత్రక స్వర్గం..ఈ దుర్గం

పాలమూరుజిల్లాలోని కోయిలకొండ గ్రామంలో విరాజిల్లిన ఈ కొండమీది ఖిల్లాను కోయ(ల) రాజులు నిర్మించారనీ, వారి పేరిటే కోయలకొండగా గుర్తింపు పొందిందని కొందరంటే.. ఈ చోట లెక్కలేనన్ని కోవెలలు(ఆలయాలు) ఉండడం వల్ల మొదట కోవెలల కొండగా రానురాను కోవెలకొండగా అటెన్క కోయలకొండగా మారిందని మరికొందరు చెబుతారు. మొత్తం మీద పురావస్తుశాఖ అధికారుల అశ్రద్ధ వల్ల క్రమంగా కాలగర్భంలో కలుస్తున్న కోయలకొండను కొత్త రాష్ట్రంలోనైనా పర్యాటకంగా అభివద్ధి చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ప్రకతి రమణీయదశ్యాలతోపాటు చారిత్రక ప్రాధాన్యం కూడా కలిగిఉండడంతో ఈ కోయలకొండ.. ఏటా వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది.







ఇదీ చరిత్ర..


అలంపూర్‌లో లభ్యమైన క్రీ.శ 1521నాటి శాసనం ప్రకారం ఈ కోట కాకతీయులకాలంలో నిర్మితమైనట్లు తెలుస్తోంది. వారి తర్వాత బహమనీల వశమైంది. సుల్తాన్ మహ్మద్ షా కాలంలోనకీ.శ. 1482 నుంచి 1518దాకా) ఈ కోయలకొండ కీలక ప్రాంతంగా వర్ధిల్లినట్లు అవగతమవుతున్నది. క్రీ.శ 1505లో మహ్మద్ షాకు, బీజాపూర్ గవర్నర్ యూసుఫ్‌ఖాన్‌కు నడుమ సంబంధాలు చెడిపోవడంతో యూసుఫ్‌ఖాన్ కోయలకొండపై దండెత్తాడు. ఈ యుద్ధంలో యూసుఫ్‌ఖాన్ పైచేయి సాధించగా, గోల్కొండ సుల్తాన్ తన సైన్యాలను వెనక్కు రప్పించి, కోయలకొండను యూసుఫ్‌ఖాన్‌కు అప్పగించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకష్ణదేవరాయలు ఈ కొండను ఆక్రమించాడనీ, ఆయన తర్వాత అచ్యుతరాయలు, వడ్డెరాజులు, వెలమరాజులు, సవాయి బసవరాజు పరిపాలనా కాలంలో కోయలకొండ దాని ప్రాముఖ్యతను నిలబెట్టుకున్నట్లు ఆధారాలున్నాయి. 


చెక్కు చెదరని నిర్మాణాలు..


కోటలోని చారిత్రక నిర్మాణాలు, శతాబ్దాల కాలపరీక్షకు ఎదురొడ్డి నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.

పెద్దపెద్ద బండరాళ్లతో నిర్మించిన బురుజులు, అలనాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోట చుట్టూ నిర్మించిన రాతి గోడ, కోటలోపల దిడ్డీలు (వంగిపోయే దారులు) నాటి కళానైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. గుర్రాలను కట్టేసేందుకు ఏర్పాటు చేసిన అశ్వశాల సైతం నేటికీ అలాగే ఉంది. కోట లోపలిభాగాన దాదాపు పదుల సంఖ్యలో ఉన్న చెరువులు, చిన్నచిన్న కుంటలు, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి ఎప్పటికీ నీటితో కళకళలాడుతుంటాయి. వీటికితోడు కోటలో ధాన్యరాశులు నిల్వ ఉంచేందుకు పదిదాకా కొటీడ్లు (ఓ రకం భవంతులు)ఉన్నాయి. వీటిల్లో నెయ్యి, వడ్లు, గంధం ఉత్పత్తులను నిల్వ చేసేవారని తెలుస్తోంది. కోట మధ్య భాగంలో రాణి మందిరం, ఆమె స్నానం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలను ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఇక కోట పైభాగంలో బాల ఇసార్ (బాలఖిల్లా) విశేషంగా ఆకట్టుకుంటుంది. 

నిరంతర నిఘా..


కోటకు రెండు వైపులా ద్వారాలుంటాయి. శత్రువులు దాడిని ముందుగానే పసిగట్టేందుకు నిర్మించిన నిఘా భవంతులు అమితాశ్చర్యం కలిగిస్తాయి. వాటిపై నుంచి కోట చుట్టూ కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవారిని పసిగట్టవచ్చు. కోట రక్షణ కోసం అలనాడు ఏర్పాటు చేసిన ఫిరంగులు నేటికీ చెక్కుచెదరకుండా ఉండడం విశేషం!


ఏటా మొహర్రం వేడుకలు


కోయలకొండ కోటకు మరో ఘన కీర్తి కూడా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా జరగనంత ఆర్భాటంగా ఇక్కడ మొహర్రం వేడుకలను నిర్వహిస్తారు. కోటలోనే పీర్ల చావిడి కూడా ఏర్పాటు చేశారు. మొహర్రం సందర్భంగా బీఫాతిమా పీరీని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ఆ పీరీకి హిందు, ముస్లింలు కులమతాలకతీతంగా ప్రత్యేక పూజలు చేస్తారు. వేడుకల సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన రజీ వంశస్థులు నల్ల దుస్తులతో కోయలకొండ కోటకు వస్తారు. బీఫాతిమాను శరణు కోరుతూ తమ గుండెలు బాదుకుంటూ రోదిస్తూ ప్రార్థనలు చేయడం అనాదిగా వస్తున్నది. వేడుకలు ముగిశాక బీఫాతిమా పీరీని కోటలోని ఓ ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు. 


గుప్తనిధుల కోసం తవ్వకాలు..


కోటలో గుప్తనిధులు ఉన్నాయనే పుకార్లతో చారిత్రక కోటకు ఎసరు వస్తున్నది. కొందరు దుండగులు

ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతుండడంతో ఇప్పటికే పలు కట్టడాలతో పాటు పురాతన విగ్రహాలూ ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల పెద్దపెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. కోటలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, కాళీకాదేవి ఆలయం పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు పురావస్తు శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదు. గతంలో పురావస్తు శాఖ సంచాలకులుగా ఉన్న పి.చెన్నారెడ్డి ఈ కోటను సందర్శించి, కోట అభివద్ధికి, మరమ్మత్తులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కోట ముఖద్వారం వద్ద విడిది భవనాన్ని నిర్మించేందుకు రూ.45లక్షలు మంజూరైనా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కోయలకొండ కోట పక్కనే కోయిల్‌సాగర్ రిజర్వాయర్ ఉన్నందున, కొత్త సర్కారు దష్టిపెడితే ఇది తెలంగాణలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చెందే అవకాశముంది. 

ఇలా వెళ్లాలి..


మహబూబ్‌నగర్‌జిల్లా కేంద్రం నుంచి కోయలకొండ గ్రామానికి ప్రతి అరగంటకూ బస్సు సౌకర్యం ఉంది. గ్రామానికి చేరుకోగానే ప్రధాన కూడలి నుంచి అర కిలోమీటర్ కాలినడకన వెళ్తే కోయలకొండ చేరుకోవచ్చు. గ్రామ కూడలి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో కోయిల్‌సాగర్ రిజర్వాయర్ ఉంది. అక్కడికి ఆటోల్లో వెళ్లవచ్చు.

No comments:

Post a Comment