Sunday, 25 May 2014

తెలంగాణ చరిత్ర

తెలంగాణ చరిత్ర

1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు భౌగోళిక విభాగాలలో తెలంగాణా ఒకటి. ఈ ప్రాంతం 1948 సెప్టెంబరు 17న నిజాం పాలన నుంచి విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు ఆంధ్రరాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ ప్రాంతములో 10 జిల్లాలు కలవు. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 7వ (కొత్త పేరు 44వ) నెంబరు జాతీయ రహదారి మరియి 9వ నెంబరు (పూనె-విజయవాడ) జాతీయ రహదారి, హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి,  తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి తెలుగు రామాయణ కర్త గోన బుద్దారెడ్డి, సహజకవి బమ్మెరపోతన, దక్షిణా భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి,  ప్రధానమంత్రిగా పనిచేసిన పివి.నరసింహారావు తెలంగాణకు చెందినవారు. చకాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారతం కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ మొత్తం వైశాల్యం 114,840 చకిమీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757 (రాష్ట్ర జనాభాలో 41.6%)గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ లో 5వ శక్తిపీఠం, భద్రాచలంలో ప్రముఖమైన రామాలయం, బాసరలో సరస్వతీ దేవాలయం ఉన్నాయి.

 భౌగోళిక స్వరూపము - నదులు


తెలంగాణ ప్రాంతము దక్కను పీఠభూమిలో  భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్నది. ఈ ప్రాంతము సరాసరిన సముద్రమట్టం నుంచి 1500 అడుగుల ఎత్తును కలిగియుండి తూర్పు వైపునకు వాలి ఉంది. తెలంగాణాలో దక్షిణ భాగంలో ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున ఈ ప్రాంతాన్ని రాయలసీమ నుంచి వేరుచేస్తున్నవి. ఈ ప్రాంతం విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పెద్దది కాగా, హైదరాబాదు చిన్నది. ఈ ప్రాంతానికి సముద్రతీరం లేదు. రాష్ట్రం మొత్తంగా చూస్తే కృష్ణానది పరీవాహకప్రాంతంలో 69%, గోదావరి నది పరీవాహకప్రాంతంలో 79% ఈ ప్రాంతంలోనే ఉంది.
నదులు


గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్రనది మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. భీమా నది మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. దుందుభి నది మహబూబ్‌నగర్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ప్రాణహిత నది ఆదిలాబాదు జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. మూసీ నది రంగారెడ్డి, హైదరాబాదు మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. పాలేరు నది నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. కాగ్నా నది  రంగారెడ్డి జిల్లాలో పశ్చిమం దిశగా ప్రవహించి కర్ణాటకలో కృష్ణాలో సంగమిస్తుంది. మంజీరా నది మెదక్, నిజామాబాదు జిల్లాలలో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది.

No comments:

Post a Comment