విజయావారి మాయాబజార్ తీస్తున్న రోజులవి. ఎన్టీఆర్ సినీజగత్తులో అంచెలంచెలుగా ఎదుగుతున్న కాలమది. అప్పట్లోనే ఎన్టీఆర్ అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుడయ్యారు. సినీరంగంలో ఎన్టీఆర్ విశ్వరూపాన్ని కనులారా వీక్షిద్దామా….
ఎన్టీఆర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపుగా 302 చిత్రాల్లో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా ఎన్టీఆర్ అనేక చిత్రాలు నిర్మించారు. మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ తెలుగువారి హృదయాల్లో మాత్రం శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడంలో ఆయనకుఆయనేసాటి. రామునిగా అవతారమెత్తినా, శ్రీకృష్ణునిగా లీలావినోదం అందించినా, విశ్వామిత్రునిగా సరికొత్త సృష్టి చేసినా ఎన్టీఆర్‌కే చెల్లింది. ఎల్వీ ప్రసాద్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ ఫోటోను చూసిన ప్రముఖ నిర్మాత బి.ఎ. సుబ్బారావు వెంటనే ఎన్టీఆర్‌ను మద్రాసుకు పిలిపించారు. పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకునిగా ఎంపికచేశారు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలుకాలేదు. ఈలోగా మనదేశం సినిమాలో నటించారు. దీంతో మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా `మనదేశం’ అయింది. 1949లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించారు. 1950లో `పల్లెటూరి పిల్ల’ విడుదలైంది. అదే సంవత్సరంలోనే `షావుకారు’ కూడా రిలీజైంది. సినీరంగంలో నిలదొక్కుకోగానే మద్రాసుకు మకాం మార్చేశారు. THOUSAND LIGHTS ప్రాంతంలో ఓ చిన్న రూమ్ అద్దెకు తీసుకుని ఉండేవారు.
1951లో పాతాళభైరవి, అదే సంవత్సరం బీఎన్‌రెడ్డి తీసిన మల్లీశ్వరి చిత్రాలు సూపర్‌హిట్. 50దశకంలో రిలీజ్ అయిన `పెళ్లిచేసిచూడు’ చిత్రం ప్రేక్షకాదరణపొందింది. విజయావారి సినిమాల్లో నెలకు 500 రూపాయల జీతం, 500 రూపాయల పారితోషికంతో పనిచేశారు. పాతాళభైరవి అప్పట్లో 34 కేంద్రాల్లో వందరోజులు ఆడి ఆడి విజయఢంకా మ్రోగించింది. ఆ సినిమాలో ఉంగరాల జుట్టు… స్ఫూరధ్రూపి, అమాయక యువకునిగా అఖిలాంద్ర ప్రేక్షకుల మన్ననలు ఎన్టీఆర్ అందుకున్నారు. `సాహసం చేయిరా డింభకా…’ అన్నట్టుగానే ఎన్టీఆర్ అప్పటి నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అనేక సాహసాలు చేస్తూ అంచెలంచెలుగా తన విరాట్ రూపాన్ని ఆవిష్కరించారు.
1956లో మాయాబజార్ సినిమాకు ఆయన తీసుకున్న పారితోషికం ఏడువేల ఐదు వందల రూపాయలు. ఇదే అప్పట్లో అత్యధిక పారితోషికంగా చెప్పుకునేవారు. 1959లో ఎవీఎంవారి భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మగా అత్యధ్బుతమైన నటనను ప్రదర్శించారు.
1960లో శ్రీవెంకటేశ్వర మహత్మ్యం కూడా అంతేస్థాయిలో విజయం సాధించింది. 1963లో విడుదలైన లవకుశ చిత్రంలో రామునిగా నటించారు. సినీరంగంలో తనకుతానేసాటిగా సాగిపోతున్న ఎన్టీఆర్ దానవీర శూరకర్ణలో మూడు ప్రధాన పాత్రలు పోషించి , దర్శకత్వం కూడా వహించి సినీజగత్తును విస్మయపరిచారు.
శ్రీమద్విరాటపర్వంలో ఐదు పాత్రలు పోషించి అబ్బురపరిచారు. ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు, యమగోల వంటి చిత్రాలు సూపర్ సక్సెస్ అయ్యాయి.
క్రమశిక్షణకు ఎన్టీఆర్ పెట్టింది పేరు. నటన అంటే ఆయనకు ప్రాణం. అందుకోసం కఠోర శిక్షణ పొందేవారు. అంతేస్థాయిలో శ్రమించేవారు. నర్తనశాల సినిమా కోసం వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నారు. డైలాగ్‌లు కంఠతాపట్టేశాకే కెమేరా ముందు నిలబడేవారు. అంతేకాదు పాత్రలో పూర్తిగా లీనమవడం వల్ల డైలాగ్‌లు అప్పజెపుతున్నట్టుగా ఎక్కడా ఉండేదికాదు.
సినిమాల్లో విశ్వరూపాన్ని ప్రదర్శించిన నందమూరి తారకరామారావు అంతే స్థాయిలో రాజకీయాల్లో కూడా విరాట్ రూపం ప్రదర్శించి రాష్ట్ర రాజకీయ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తెలుగుదేశం పిలుస్తోంది రా…అంటూ ఎలుగెత్తి పిలుస్తూ పాలిటిక్స్‌లో కొత్త ఒరవడి సృష్టించారు. ప్రజాసేవలో పునీతులయ్యారు.
1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కేవలం తొమ్మిదినెలల వ్యవధిలోనే రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్ పాలనను అంతమొందించి తెలుగుదేశం పాలనకు నాంది పలికారు. ఆ తరువాత ఎనిమిది సంవత్సరాలపాటు మూడు దఫాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. సినిమాల్లో రారాజుగా ఎదిగిన ఎన్టీఆర్ మొదటి నుంచి రాష్ట్ర రాజకీయాలను నిశితంగానే గమనించేవారు. అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, తరచూ ముఖ్యమంత్రులు మారడం వంటి సంఘటనలపై ఆయన చురుకైన వ్యాఖ్యలు చేస్తుండేవారు. ఐదు సంవత్సరాల వ్యవధిలో నలుగురు ముఖ్యమంత్రులను ఢిల్లీ అధిష్టానం నియమించడం ఆయనలో ఆగ్రహం తెప్పించింది. ఈ ఆగ్రహం నుంచి ఆలోచన జనించింది. తెలుగు ప్రజలకు ఏదైనా చేయాలన్న తపన ఆవిర్భవించింది. అప్పడే ఆయన రాజకీయ ప్రయాణానికి గ్రీన్‌సిగ్నల్ పడింది.
1982 మార్చి 29 మధ్యాహ్నం రెండు గంటల ముప్పయినిముషాలకు ఎన్టీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఆ శుభముహుర్తంలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ నాయకునిగా కూడా ప్రజలకు మరింత చేరువయ్యారు. తన దగ్గర ఉన్న పాత వ్యాన్‌ను బాగుచేయించి ప్రచార రథాన్ని తయారుచేయించారు. ఖాకీ దుస్తులు ధరించి కోట్లాది ఆంధ్రుల్లో తానూ ఒకనిగా కలిసిపోయారు. `తెలుగుదేశం పిలుస్తోంది రా… కదలిరా..’ అంటూ నినదించారు. ఇప్పుడు ఊరూవాడ తిరుగుతున్న అనేక రాజకీయ రథాలకు స్ఫూర్తి ఈ చైతన్య రథమే. ఆయన చేసిన ప్రసంగాలు ఉద్వేగభరితంగాసాగేవి.
1983
జనవరి ఏడున ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యాయి. తెలుగుదేశం పార్టీ
విజయఢంకా మ్రోగించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అలా
తొమ్మిదినెలల్లోనే తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓటమిపాలైంది. ఆ తరువాత సాగిన
ఆయన రాజకీయ జీవితంలో ఎగుడుదిగుడులు తప్పలేదు. అధికారంలోకి వచ్చాక
ఎన్టీఆర్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సినీరంగంలో స్లాబ్
సిస్టమ్ ప్రవేశపెట్టారు. శాసనమండలిని రద్దుచేశారు. హుస్సేన్‌సాగర్
ట్యాంక్‌బండ్‌మీద సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలను ప్రతిష్టించారు.
రెండురూపాలయకు కిలో బియ్యం పథకాన్ని తీసుకువచ్చారు. సంపూర్ణ మద్యపాన
నిషేధాన్ని ప్రవేశపెట్టారు.
ముప్పైమూడేళ్ల తెర జీవితంలోనూ, పదమూడేళ్ల రాజకీయ జీవితంలోనూ స్టార్‌గా వెలుగొందిన ఎన్టీఆర్ 73 ఏళ్ల వయసులో 1996 జనవరి 18న గుండెపోటుతో మరణించారు.
బాల్యం ఓ కమ్మని కావ్యం
ఎన్టీఆర్ బాల్యం కూడా ఓ కమ్మని కావ్యంలా సాగింది. కాలేజీ కుర్రాడిగా ఉన్నరోజుల్లోనే మీసాల నాగమ్మగా కొత్త రూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సాహసి. అప్పటి నుంచి ఎన్నో నాటకాల్లో నటించారు. చిన్నతనంలోనే ఆర్థిక ఇబ్బందులంటే ఏమిటో రుచిచూశారు. అయినా కళామతల్లిని మాత్రం విడవలేదు.
నందమూరి తారకరామారావు 1923 మే 28 సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో జన్మించారు. కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు పుట్టిన ముద్దుల బిడ్డడు ఎన్టీఆర్. పండంటి బిడ్డడికి ముందుగా కృష్ణ అని పేరుపెట్టాలని కన్నతల్లి అనుకున్నారు. మేనమామ సలహా మేరకు తారక రాముడు పేరు ఖరారు చేశారు. తరువాత ఆ పేరు తారక రామారావుగా మారింది. విజయవాడ మున్సిపల్ స్కూల్‌లో చదువుకున్న తరువాత అక్కడే ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో చేరారు. రామారావు ఆ కాలేజీలో చేరే సమయంలో విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతిగా ఉండేవారు. అప్పుడే రామారావును నాటకంలో నాగమ్మ పాత్ర పోషించమని విశ్వనాథవారు కోరారు. అయితే మీసాలు తీయడానికి ఎన్టీఆర్ ఇష్టపడలేదు. దీంతో మీసాలతోనే ఆ నాటకంలో నటించారు. మీసాల నాగమ్మగా పేరు తెచ్చుకున్నారు.
1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో తన మేనమామ కుమార్తె బసవరామ తారకంను ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చేరారు. అక్కడే నాటక సంఘాల వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ వంటివారితో కలిసి ఎన్నో నాటకాల్లో నటించారు. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. ఆయన గీసిన చిత్రానికి రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీల్లో బహుమతి కూడా అందుకున్నారు. ఒక సారి సుభాష్ చంద్రబోస్ విజయవాడ వచ్చినప్పుడు ఆయన చిత్రాన్ని గీసి కానుకగా ఇచ్చాడు. రామారావు కాలేజీలో చదివేరోజుల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో జీవనం కోసం కొన్ని రోజులు పాలవ్యాపారం చేశారు. మరి కొన్ని రోజులు కిరాణాకొట్టు నడిపారు. ఇకొన్ని రోజులు ముద్రణాలయం నడిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏనాడు అప్పుజేసేవారు కారు. ఆ తరువాత సబ్‌రిజిస్టార్ ఉద్యోగం వచ్చినా సినిమాలమీద ఉన్న మోజుతో ఎక్కువకాలం జాబ్ చేయలేకపోయారు. సినిమాల్లో చేరాక ఇక వెనుదిరిగి చూసుకోలేదు. విజయోత్సాహంతో ముందుకే ఉరికారు.
సినీరంగంలోనూ, రాజకీయ జీవితంలోనూ రారాజుగా వెలుగొందిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. తాను అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు విశ్రమించని కార్యోన్ముఖుడు ఎన్టీఆర్. కాలం పరుగులుతీస్తున్నా నేటికీ కళ్లముందు కనిపించే మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారి గుండెల్లో ఆరని జ్యోతి ఎన్టీఆర్. మరచిపోని మధురస్మృతులే ఆయనకు మనం అందించే నీరాజనం.
No comments:
Post a Comment