Friday, 30 May 2014

సూపర్‌స్టార్‌ కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు



తెలుగు ఇండస్ట్రీలో కొన్ని అధ్యాయాలు ఎప్పటికీ చెరిగిపోవు.. అలాంటి ఓ సువర్ణాధ్యాయేమే సూపర్‌స్టార్‌ కెరీర్‌.. తెలుగు సినిమాను ప్రయోగాల బాట నడిపించడమే కాదు.. ఎన్నో అత్యున్నత సాంకేతిక విలువలను తెలుగు తెరకు పరిచయం చేసిన సాహసి ఆయన.. తొలి కౌబాయ్‌, తొలి బాండ్‌ లాంటి ఎన్నో విషయాలను తెలుగు తెరకు పరిచయం చేశాడు.. ఆయన తెలుగు తెరకు తెగువ నేర్పిన సూపర్‌స్టార్‌ కృష్ణ.. 72వ యేట అడుగిడుతున్న సూపర్‌స్టార్‌ కృష్ణగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేస్తూ ఆ నటశేఖరుని సినీ కెరీర్‌ ను ఓ సారి తెలుసుకుందాం..


తొలి కలర్ మూవీతో ఎంట్రీ..

  సూపర్ స్టార్ కృష్ణ 1943 వ సంవత్సరం, 'మే' 31 వ తేదీన గుంటూరు జిల్లా, బుర్రిపాలెంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నటన మీద ఆసక్తి పెంచుకున్న కృష్ణ చదువుకునే రోజుల్లోనే ఎన్నో నాటకాల్లో నటించారు.. ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నారు.. ఆ అనుభవంతోనే 1965లో తొలిసారిగా 'తేనేమనసులు' సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. తెలుగులో తొలిపూర్తి స్థాయి కలర్‌ సినిమా కూడా ఇదే.


కౌబాయ్ ని టాలీవుడ్ కు పరిచయం చేశాడు..

  
అయితే తొలి రోజుల్లోనే ప్రయోగాలకు సై అన్నాడు. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే 'గూఢచారి 116' లాంటి స్పై సినిమా చేసి తొలి సారి బాండ్‌ క్యారెక్టర్‌ను తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఈ సినిమాతో మాస్ అండ్‌ యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కృష్ణ. ఇక ఆతరువాత కృష్ణ చేసిన మరో ప్రయోగం 'కౌబాయ్‌'. తెలుగు నేటివిటికి అసలు సంబంధం లేని కౌబాయ్‌ పాత్రతో కూడా సంచలనం సృష్టించాడు కృష్ణ. 1970లో మోసగాళ్లకు మోసగాడు సినిమాతో తెలుగు తెర మీద కౌబాయ్‌ క్యారెక్టర్‌లకు స్వాగతం పలికాడు. తరువాత ఈ సినిమాతో ఇంగ్లీష్‌లోకి కూడా డబ్‌ అయి హాలీవుడ్‌లో రిలీజ్‌ అయింది..



'అల్లూరి'తో సంచలనం సృష్టించాడు..

ఇక కృష్ణ కెరీర్‌లోనే ఓ మైల్‌స్టోన్‌.. 'అల్లూరి సీతారామరాజు'. ఎన్నో ఏళ్లుగా ఎన్టీఆర్‌ చేయాలనుకుంటూ ఆగిపోతున్న అల్లూరి క్యారెక్టర్లో నటించిన కృష్ణ ఈ సినిమాతో అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో రికార్డులను తిరగరాశాడు. వీర రసాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటీకీ ప్రేక్షకుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. సొంత బ్యానర్ పై భారీ వ్యయ ప్రయాసలకి ఓర్చి ఆయన నిర్మించిన ఈ సినిమా, సంచలనానికి సరైన అర్థం చెప్పింది . కృష్ణ పేరు ప్రతిష్టలని ఎవరెస్టు శిఖరమంత ఎత్తులో నిలిపింది.

ఒక్క ఏడాదిలో 17 సినిమాలు..

   కృష్ణ కేవలం సాహసానికే కాదు డెడికేషన్‌కు కూడా పెట్టింది పేరు. అందుకే ఆయన ఒకే సంవత్సరం 17 సినిమాలు విడుదల చేసి సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఆ 17 సినిమాల్లో 9 సినిమాలు 100 రోజులు ఆడటం మరో విశేషం. 'ఈనాడు'లో పవర్ ఫుల్ క్యారెక్టర్ ని పోషించారు. కార్మిక - శ్రామిక పక్షాన నిలిచి అవినీతి రాజకీయాలపై సమర శంఖాన్ని పూరించే శక్తిగా కృష్ణ కనిపిస్తారు. ఈ సినిమాతో జనం మెచ్చిన నటుడుగా నీరాజనాలు అందుకున్న కృష్ణ, 'ఏకలవ్య', 'అడవి సింహాలు', 'ముందడుగు', 'శక్తి', 'పచ్చని కాపురం', 'పల్నాటి సింహం' వంటి చిత్రాలతో ఘన విజయాల్ని అందుకున్నారు. 70 నుంచి 90వ దశకంలో కూడా అద్భుతమైన చిత్రాల్లో నటించారు కృష్ణ.. 'నెంబర్‌ వన్‌', 'అమ్మదొంగ' లాంటి సినిమాలతో చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్‌ హీరోలకు కూడా గట్టి పోటీనిచ్చారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా కృష్ణ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. పద్మాలయ బ్యానర్ పై బాలీవుడ్ చిత్రాలని సైతం నిర్మించిన ఘనత ఆయన సొంతం.


  దాదాపు 350 చిత్రాల్లో నటించిన కృష్ణ నటుడిగా మాత్రమే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించి 'సూపర్ స్టార్‌' గా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఆయన నటనకు ఎన్నో అవార్డులు వరించాయి. పద్మభూషణ్, ఎన్టీఆర్ జాతీయ అవార్డు, పలు ఫిల్మ్ ఫేర్ లతోపాటు, లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు, నంది అవార్డులను సాధించారు.

 ఇప్పటికీ కొన్ని సినిమాల్లో గెస్ట్ లోస్ వేస్తూ అటు తన అభిమానులను ఇటు సినీ ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఇలా కళామతల్లి ముద్దుబిడ్డగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కృష్ణ.. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరకుంటూ మరోసారి ఈ నటశేఖరునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం..

No comments:

Post a Comment