Wednesday, 28 May 2014

వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర




తెలంగాణలో పదకొండు జిల్లాలు. మహారాష్ర్టలో 5 జిల్లాలు, కర్నాటక ప్రాంతంలో 3 జిల్లాలు కలసి హైదరాబాద్ సంస్థానం ఉండేది. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో 90 లక్షల జనాభా ఉండేది. హైదరాబాద్ సంస్థానంపై నైజాం రాచరిక ప్రభుత్వ పాలనవుంది. జాగీరుదారుల నిరంకుశ పరిపాలనలో ప్రజానీకం అనేక బాధలు పడినారు. వెట్టిచాకిరికి గురయ్యారు. చంటిపిల్లల తల్లులు, బాలింత లను కూడా దొరలు, జాగీరుదారులు వ్యవసాయ పనులకు భయపెట్టి తీసుకుపోయేవారు. బాలింతలను మధ్యాహ్నం తమ బిడ్డలకు పాలు యిచ్చుటకు వెళ్ళనిచ్చేవారు కారు. రైతులు వేసుకున్న పంటలను పట్ట పగలే తమ కిరాయి గుండాలతో కోయించి తమ గడిలను నింపుకునే వారు. పట్టా భూములను దొరలకప్పగించేవారు. ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములన్నీ దొరల, భూస్వాముల చేతిలో అధీనంలో వుండేవి. విసునూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి ఆరుగాలం రైతులు పండించి పంటలను స్వాధీనం చేసుకునేవాడు. దొరలకు వెట్టి పనులు చేయడానికి నిరాకరిస్తే మూటాముల్లే సర్దుకుని గ్రామాన్ని వదిలి వెళ్ళాల్సిందే. వ్యాపారం చేసే వైశ్యులు అధికారులకు కావాల్సివున్న సన్న బియ్యం, నెయ్యి, నూనె, పప్పు, చింతపండు, బీడీలు, సిగరెట్లు, చుట్టలు సబ్బులు, మాలు మసాలా తదితర వస్తు సామగ్రినిని ఉచితంగా సరఫరా చేయాలి. సకాలంలో అధికారులకు అందకుంటే అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సిందే. పల్లెల ప్రజానీకాన్ని అనేక విధాలుగా దోపిడి చేసి ప్రజాకంటకులయిన దొరలు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు కుబేరులయినారు. దొర గడిల నుంచి బయటకు వెళ్ళి బజారున పోతుంటే దొరకు ఎదురయ్యే ప్రజలంతా కాళ్ళకు చెప్పులుంటే వాటిని విడిచి వంగి వంగి దండాలు పెట్టాలి. అరుగులపై కూర్చున్న వారంతా లేచి నిలబడి నమస్కరించాలి. గ్రామాలకు ప్రభుత్వ అధికారులు వస్తే వంతుల ప్రకారం గొర్లమందల నుంచి గొర్లను, మేకలను తెప్పించి కోసి అధికారులకు విందులు చేసేవారు. ఈ అధికారులకు ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్న ప్రయోజనం లేదు. వెట్టిచాకిరి చెయ్యటానికి పుట్టినామని మాబ్రతుకులు మారయని నిస్పృహతో కుమిలి కుమిలి పోయేవారు. చెప్పిన పాడుపనులన్నీ కడుపులు మాడ్చుకుని చేసినప్పటికీ అధికారులు, దొరలు ఆగ్రహావేశాలకు తన్నులు, తిట్లు తినాల్సి వచ్చిన రోజులవి. ఎన్ని పనులు చేసినా నోరు మెదపకుండా ఉండాల్సిన బానిసత్వ రోజులవి. హైదరాబాద్ సంస్థానంలో జిల్లా కేంద్రంలో హై స్కూలు మాత్రం ఉండేది. మిడిల్ స్కూలు కూడా లేని తాలూకా కేంద్రాలెన్నోఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు పెట్టుకొనుటకు, గ్రంథా లయాల స్థాపనకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇలా తెలంగాణ ప్రాం తంలో ప్రజలు దోపిడి అణచివేతలు అన్యాయాలకు వెట్టిచాకిరికి గురై బానిసత్వపు బతుకులు జీవిస్తున్నారు. చదువు సంధ్యలు లేని చీకటి రోజులవి.

దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర ఉద్యమం భారీగా నడుస్తున్న రోజులవి. అలాంటి సమయంలో, 1930లో ఆంధ్రమహాసభ సురవరం ప్రతాప రెడ్డి అధ్యక్షతన మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. వితంతు వివాహాలను చేయాలి, బాల్య వివాహాలను నిషేధించాలి, వెట్టిచాకిరిని నిర్మూలించాలి. దేవాలయాల్లోకి దళితులకు ప్రవేశం కల్పించాలి, మద్యపానం నిషేధించాలి, దొరలకు, భూస్వాములకు వంతుల పద్దతిని నిషేధించాలి అంటూ ఆ మహాసభలో పలు తీర్మానాలు చేసినారు. ఆ మహాసభ వేదిక నుంచి ఆయా తీర్మానాలను రావి నారాయణరెడ్డి చది వారు. మహాసభలో పాల్గొన్న యువకులు, సంఘసంస్కర్తల హృదయా లను అవి ఆకర్షించాయి. ఉత్తేజాన్ని నింపాయి. ఈ తీర్మానాలను ప్రభుత్వానికి పంపించారు. ఎక్కడికక్కడ మహాసభ ప్రచారకులను నియమించారు. నల్గొండ జిల్లా చండూరును కేంద్రంగా చేసుకుని వెట్టి చాకిరి విధానానికి, వంతుల విధానానికి వ్యతిరేకంగా జనాన్ని సమీ కరించి ఉద్యమాన్ని నిర్మాణానికి నడుం బిగించారు. ప్రభుత్వధికారులు గ్రామాలకు వెళ్ళినప్పుడు పని పాటల వారిచేత నిర్బంధంగా పనులు తీసుకోకూడదని, పనికి దగ్గ ప్రతిఫలమిచ్చి వారితో పనులు చేయించు కోవాలని ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది. భువనగిరి తాలుకా లోని పాముకుంట, జాల కురారం, రేణికుంట, నమిలె బేగంపేట, రాజపేట తదితర గ్రామాల్లో వందలాది మంది దళితులను సమీకరించి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోకి ప్రవేశం చేయించా రు. జనసమీకరణకు కురారం రామిరెడ్డి శ్రమించాడు. ప్రజా సమస్య లపై ఉద్యమిస్తూ, నిజాం దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజానీకాన్ని కదిలించి ప్రజా పోరాటాల్లోకి దించేవారు. దీంతో దొరలు ఆంధ్రమహా సభ ఉన్న ప్రదేశాలలో వెట్టిచాకిరి పనులు చేయించుకోవడం మానుకు న్నారు. పాత సూర్యాపేట, వరంగల్లు, జనగామ, ఖమ్మం ఏరియాలలో భూస్వామ్య దౌర్జన్యకాండకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు నడుపు తుంటె మితవాద నాయకులైన కొండ వెంకట రంగారెడ్డి, మందుముల నర్సింగరావులు ఆంధ్ర మహా సభలో చేరి కమ్యూనిస్టులు గ్రామాలలో వర్గకలహాలు తెస్తున్నారని వారిని సభ్యత్వం నుంచి తొలగించారు.



రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న కాలంలో పశ్చిమ బెంగాల్‌లో 60 లక్షల మంది ప్రజలు కరువు కాటకాలతో బలైపోయి నారు. నైజాం ప్రభుత్వం ప్రతి చిన్న పేద రైతు నుంచి పండినా, ఎండినా నిర్బంధ లేవీ వసూళ్లకు పూనుకుంది. హైదరాబాద్ సంస్థానంలో నూటికి 90 మంది హిందూమతానికి పది మంది ముస్లిం మతానికి చెందినవారు. బహదూర్ యార్ జంగ్ ముస్లిం మతతత్వవాది. మత మార్పిడి ద్వారా ముస్లింల సంఖ్య పెంచుకొని ముస్లిం రాజ్యాన్ని రక్షించు కోవాలని పథకం పన్నాడు. భూస్వాముల ఇనుప చక్రాల కింద నలిగి నలిగి నరకయాతన అనుభవిస్తున్న కొంత మంది బీసీలు, దళితులు తమ మతం మార్చుకుని ముస్లిం మతంలో చేరారు. గ్రామాలలో మత మార్పిడితో భూస్వాములు విసునూరు రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమా వేశమై హిందు సమితి పేరుతో మత సంస్థలను స్థాపించారు. హిందూ మతం పేరిట మతాన్ని రక్షించే కుంటి సాకుతో మధ్యయుగాల నాటి బానిస విధానాన్ని కొనసాగించదలిచారు. పీడిత ప్రజలు ఆర్య సమాజ నాయకుల మాటలను నమ్మలేకపోయారు.
భారతదేశమంతటా జాతీయ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతు న్నాయి. సత్యాగ్రహ పోరాటాలు సాగిస్తున్నారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనర్సింహారెడ్డి సమావేశమై స్టేటు కాంగ్రె స్‌ను నిషేధించుటకు ఉత్తర్వులు జారీ చేసినారు. సత్యాగ్రహంలో పా ల్గొన్న నాయకులు అక్రమంగా అరెస్ట్‌చేసి జైళ్లలో నిర్బంధించినారు. తెలంగాణ జిల్లాల్లో సత్యగ్రహం తీగలాగ అల్లుకుని పోయింది. జన గామ తాలుకా నల్గొండ జిల్లాలో ఉండేది. 50 గ్రామాలలో విసునూర్ దేశ్‌ముఖ్‌ల పరిపాలన సాగుతుంది. విసునూర్ దొరల దోపిడి కింద నలిగిపోతున్న ప్రజానీకమంతా ఆంధ్ర మహాసభలో స్వచ్ఛందంగా చేరి నారు. కడివెండి సీతారాంపురం నిర్మాల గ్రామాల్లో గ్రామ రాజ్య కమిటీ లను ఏర్పాటు చేసుకున్నారు. కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. కడి వెండిలో భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కమ్యూనిస్టులు గ్రామాలలో పోరాటం ఉదృతం చేయడంతో భూస్వామ్య దొరల గుండెల్లో వణుకు పుట్టింది. విసునూర్ దేశ్‌ముఖులు కడివెండిలో స్వాధీన పర్చుకున్న 250 ఎకరాల భూమిని ఒకే రోజు పది గ్రామాల ప్రజలు పశువులు, గొర్రెలు, మేకలతో మేపుకున్నారు. సంఘటిత బలాన్ని చూపించారు. పాలకుర్తి కుట్ర కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. భూస్వాములు, పోలీసులు మిలాఖతై 35 గ్రామాల ఆంధ్ర మహాసభ కార్యకర్తలపై దాదాపుగా వెయ్యిమంది కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారు. కల్లు దొంగలించినారని స్త్రీలను అవమాన పరిచినారని, దొరల ఆయిల్ ఇంజిన్లు దొంగలించినారని రకరకాల కేసులు సృష్టించారు. ఈ కేసులన్నింటినీ న్యాయస్థానం ఒక సంవత్సరపు కాలంలో కొట్టివేసింది.
చాకలి ఐలమ్మ నాలుగు ఎకరాల పంట చేసుకుంటుంది. విసునూర్ రామచంద్రారెడ్డి దాడి చేయించుటకు పథకం పన్నాడు. ఐలమ్మ భర్త నర్సింహా, కొడుకులయిన లచ్చయ్య, సోమయ్యలను పాలకుర్తి కుట్రకేసులో అరెస్ట్ చేసి జైలులో నిర్బంధించారు. కడివెండి గ్రామం విసునూర్ దేశ్‌ముఖ్ తల్లి నివసించే ప్రదేశం. తల్లి పెత్తనం కింద గ్రామం నలిగిపోతుంది. దీంతో వేలాది ప్రజానీకమంతా చైతన్యమై గడీలోనే రౌడీలను బంధించారు.


గడిలో వుండే రౌడీలు తుపాకులను గాలిలోకి పేల్చారు. ప్రజా నీకం చేతుల్లో వడిశెలలు, రాళ్లు, కర్రలు, కారపు పొట్లాలు ఉండేవి. వీటితోనే నైజాం దొర భూస్వాములను తరిమి తరిమి కొట్టారు. రౌడీలు పేల్చిన తుపాకి గుండ్లు మంగలి కొండయ్య, కొంగళ్ళ సాయిలు బండారి అయిలయ్య పెద్దగాల్ల నరస్సయ్యకు తగిలాయి. మరి కొంతమంది కింద పడిపోయినారు. దీనిలో దొడ్డి కొమరయ్య వీరమరణం పొందాడు. దొడ్డి కొమరయ్య హత్యకు ప్రతీకారంగా చుట్టుపక్కల గ్రామాల 5వేల ప్రజలు కర్రలు వడిశెలతో కారంపొడి పొట్లాలతో కడివెండి చేరుకున్నారు. పాలకుర్తి, ధర్మాపురం కడివెండి గ్రామాలలో జరిగిన పోరాటాలు చరిత్రాత్మకమయినవి. విసునూరు దేశ్‌ముఖ్‌లకు చెందిన 150 ఎకరాల భూమిని పేదలకు పంపిణి చేశారు కమ్యూనిస్టులు. విసునూర్ చిన్న కొడుకు దేవరుప్పల గ్రామానికి చెందిన 11 మందిని దారుణంగా హత్య చేయించాడు. దీంతో ఆందోళనకు గురయిన దేవ రుప్పుల గ్రామ ప్రజలు పోరులోకి దిగారు. రెండు వేలమందిని చెల్లా చెదురుచేసి మందడి సోమిరెడ్డిని దారుణంగా పోలీసులు కాల్చి చంపా రు. మరో 40 మందిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధిం చారు. రేణికుంట గ్రామంలో మిలటరీ క్యాంపు ఏకపక్షంగా కాల్పులు జరిపి రేణికుంట రామిరెడ్డితో పాటు మరో 75 మందిని కాల్చి చంపి గడ్డి వాములలో మృతదేహాలను తగులబెట్టినారు. బైరాన్‌పల్లిలో అల్లరి మూకలు స్త్రీలను బట్టలు ఊడదీసి బతుకమ్మలు ఆడించారు. 6 మంది ని దారుణంగా కాల్చి చంపారు. భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర దేశంగా ప్రకటించబడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతదేశంలో సంస్థానాలన్నీ (రెండు మినహా) ఇండియన్ యూనియన్‌లో చేరిపోయినవి. హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర దేశమయిన ఇండియన్ యూనియన్‌లో చేరదని నిజాం నవాబు బహిరంగ ప్రకటన చేశారు.


గెరిల్లా శిక్షణ:


కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు ఆంధ్రప్రాంతంలో గెరిల్లా శిక్షణ నిచ్చారు. గెరిల్లా పోరాటాలతో ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపిం చారు. గ్రామ గ్రామాన రక్షణ దళాల నిర్మాణం జరిగింది. కమ్యూని స్టులు ఏ పిలుపునిచ్చిన అది పూర్తిగా విజయవంతమయింది. కురారం రామిరెడ్డి నాయకత్వంలో వాసాలమర్రి శత్రు క్యాంపుపై దాడి చేసి నైజాం అల్లరి మూకల నుంచి అమెరికాన్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకు న్నారు. వంగపల్లి రైల్వేస్టేషన్‌లో రైఫిల్స్‌లో కూడిన ఒక రిజర్వు ఉం డేది. రిజర్వు దళంలో ముగ్గురిలో ఒకరు 303 రైఫిల్‌తో తక్కిన ఇద్దరు 12 బోర్‌గన్స్‌తో వుండేవారు. ఆ ఆయుధాల సేకరణకు కామ్రేడ్స్ కురా రం రామిరెడ్డి బొందుగుల నారాయణరెడ్డి గంటం వెంకటరెడ్డి నాయ కత్వంలో 12 మందితో కూడిన గెరిల్లా దళం వంగపల్లి వెళ్లింది. అయ్యగారి వేషాలతో వున్న దళనేతలు గదిలోకి ప్రవేశించి 303 రైఫిల్స్ ను, 12 బోర్స్ రెండు తుపాకులను తీసుకొని స్వాధీనపర్చుకుని బయటపడినారు. రాజపేట మండలంలోని రేణికుంట గ్రామం పాడి పంటలకు పుట్టినిల్లువంటిది. రజాకర్లను తుదిమట్టిస్తానని ప్రజలకు అండగా ఉంటానని రేణికుంట రామిరెడ్డి శపథం చేసినాడు. రేణి కుంటలో 55 మందితో లోకల్ గెరిల్లా దళాన్ని నిర్మించుకున్నాడు. నైజాం రిజర్వుమూకలను ఎదురించాడు. నైజాం అల్లరి మూకలు రేణి కుంట గ్రామాన్ని చుట్టుముట్టాయి. రేణికుంట రామిరెడ్డి బంగ్లాపైకి ఎక్కి శత్రువుదాడులను ఎదురించాడు. ఆ తరువాత, రాంరెడ్డి బంగ్లా సమీపంలో గల చింత చెట్టు పైకి ఎక్కి ఎదుర్కొంటుండగా రిజర్వు పోలీసులు గురిపెట్టి కాల్చారు. అనంతరం రిజర్వు పోలీసులు దళ సభ్యులను కిందికి దింపించి లైన్లో నిబెట్టి ముగ్గురిని స్టెన్‌గన్‌తో కాల్చిచంపారు. ఊరికి నిప్పు అంటించి గ్రామాన్ని దహనం చేశారు. 60 మందిని గ్రామస్థులను అక్రమంగా అరెస్ట్ చేసినారు. ఎంతోమంది క్షేత్రగాత్రులయినారు. మరెంతో మంది బాధితులుగా మిగిలారు. గెరిల్లా దళాలు వచ్చి తిండిగింజలు, కట్టుకునేందుకు బట్టలు, నిత్యావసర వస్తువుల్ని అందించారు. కమ్యూనిస్టులు కాలినడకతో గ్రామ రక్షక్ దళా లను ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలిచారు. చివరకు రజాకార్లు తెలంగాణను వదిలి పాకిస్తాన్‌కు పారిపోయారు. కాశిం రజ్వీ లాంటి నరహంతుకుడితో భూమికోసం, భూ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం మెజ్వలమైనది. తెలంగాణ త్యాగాల చిరు నామాగా ప్రపంచచరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడింది. తెలంగాణ అంటే అది ఒక యుద్ధభూమి. తెలంగాణ ఒక గాయాలవీణ. తెలం గాణ అంటే బతుకు పోరాటం. త్యాగాల చరిత్ర తెలంగాణకే సొంతం.


జైలు పోరాటాలు:
నైజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడినందుకు వేలాదిమంది ప్రజలు ఉద్యమకారులపై కమ్యూనిస్టులను జైలులో నిర్బంధించినారు. జైలులో ఒకరినొకరిని మాట్లాకునిచ్చేవారు కాదు. కమ్యూనిస్టు అగ్ర నా యకులు, గెరిల్లా దళనాయకులు, ఆనాటి మిలటరీ ప్రభుత్వ దృష్టిలో వుండేవారినంతా తిరుమలగిరి జైలుకు తీసుకుని వచ్చేవారు. ఆరుట్ల రాంచంద్రారెడ్డి ఎడ్ల గురువారెడ్డి ఆరుట్ల లక్ష్మీ నర్సింహ్మరెడ్డి అందరిని ఒకే జైలులో నిర్బంధించారు. సిరిసిల్లా జైలులో బద్దం ఎల్లారెడ్డిని నిర్బంధించారు. ఒక్కొక్క జైలులో ఇరవైఐదు వందల మంది కమ్యూ నిస్టులను బంధించారు. జైలులో ఎలాంటి సదుపాయాలు ఉండేవి కాదు. కూర్చోడానికి చాపలు కూడా ఇవ్వలేకపోయారు. ముంతడు నీళ్లు అందించేవారు. ఈ నీళ్లతో దూప తీరేది కాదు. ముడి జొన్నలు ఇచ్చేవారు. ఆ జొన్నలు ఉడకబెట్టి ఆకలి మంటలతో బుక్కితే ఆ జొన్నలు జీర్ణం గాక జొన్నలకు జొన్నలే బయలు భూమిలో పడిపోయేవి. ఆరోగ్యాలు పూర్తిగా చెడిపోయినవి. స్నానాలు చేయుటకు గదులు లేవు. జైళ్లలో ఖైదీల బాధలు అన్ని ఇన్ని కావు. రాజకీయ ఖైదీల పట్ల జైలు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించినట్లయితే జైలులో ఉద్యమాలు నిర్మిస్తామని జైలు అధికారులకు అర్జి పెట్టుకున్నారు. జైలులో ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఖైదీల హక్కులు సాధించారు. జైళ్ళలో ఉన్న రాజకీయ ఖైదీలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతిరోజు రాత్రి గంటల నుంచి 10 గంటల వరకు పుస్తకాలు చదివేవారు. జైలులో కమిటీలను ఏర్పాటు చేసుకొని జైళ్లను పోరాటాలకు వేదికగా మలుచు కుని ఖైదీల హక్కులను సాధించారు.


రాజకీయ తరగతుల నిర్వహణ విద్యాకమిటీ నిర్మాణం
వంటశాల నిర్వహణ కమిటీ, జైలు కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు చేసినారు. జైలు బ్యారక్‌లలో రాజకీయ ఖైదీలు గోడలపై నినాదాలను రాస్తే, ప్రపంచ పటాలనువేస్తే వాటిని సున్నం వేయించి తుడిచివేసేవారు. జైలు జైలుగా కాకుండా పోరు పాఠశాలగా మలచు కున్నారు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు. వందలాది మంది తో జైల్లు కిటకిటలాడినవి. అన్నీ తప్పుడు కేసులే. న్యాయస్థానాల ఎదుట ఏ ఒక్కటి నిరూపితం కాలేదు. చివరకు న్యాయస్థానాలు కొట్టివేసినవి. విద్యావిహీనులకు మట్టి చిప్పలపై చదువు నేర్పించారు. ఆరుట్ల కమలా దేవిని నెలల తతరబడి జైలులోనిర్బంధించారు. ప్రభుత్వ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జైలులో ఉద్యమాలను బలోపేతం చేశారు. ప్రజాకవి మఖ్దూం మొహిద్దీన్ బహిరంగంగా వచ్చి ఉపన్యాసాలు చేశా రు. నైజాం హయాంలో జైళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేవి. రాజకీయ ఖైదీలు పోరాటాల ద్వారా హక్కులను సాధించారు.



భూమి కోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం నిజాం నిరంకుశ ప్రభుత్వంపై సాగిన సాయుధ పోరాటం ఆ తరువాత మరెన్నో పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది. నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కూడా బీజాలు అందులోనే ఉన్నాయి. ప్రపంచ విప్లవ చరిత్రలో తెలంగాణ చిత్రపటం లిఖించబడింది. నమ్మిన ఆశయ సిద్ధాంతానికి కట్టుబడి తుదిశ్వాస విడిచేంతవరకు పోరాటాల దారిలో నేలరాలిన వారెందరో ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగువేల మందికి పైగా రైతాంగ వీరులు ప్రజా యుద్ధంలో అమరులైనారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది అమరులు చిందించిన రక్తమే నేడు తెలంగాణ రాష్ర్ట ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది.

No comments:

Post a Comment