Wednesday, 21 May 2014

గోండు వీరుడు కొమురం భీం


దేశాలకు, ప్రాంతాలకు, జాతులకు విడివిడిగా, జమిలిగా వీరులు ఉంటారు. అందుకే వీరులు అనేకం. ఏక సంఖ్య కాదెప్పుడూ. అదొక అవసరం. వారిని గుర్తుంచుకోవడం జన సంప్రదాయం. వీరులు పుట్టరు. తమ ఆచరణ ద్వారా వీరులు కాబడతారు. ఆయా స్థల కాలపరిస్థితుల వల్ల తమ చేతల ద్వారా వీరులు అవుతారు.

స్థానిక వీరులు కూడా కాలమాన పర్థితులనుబట్టి ఆ తరువాత జాతీయ వీరులవుతారు. వీరే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారు. కొందరికి అలాంటి అవకాశం రాకపోవడం కూడా జరుగుతుంది.
సమాజంలోని విలువలవల్ల, అంటరానితనం, వివిధ చులకన భావాలవల్ల కూడా వీరస్మరణ సాధారణ స్థాయికి చేరకపోవచ్చు. కొన్ని పరిధి, పరిమితుల్లోనే ఉండిపోవచ్చు.

ముఖ్యంగా గిరిజన తెగలకోసం పోరాడిన వీరులకు మన దేశంలో గుర్తింపులేదు. అసమాన త్యాగాలు చేసి, ప్రాణాలను సైతం లెక్కించని ఆ ధీరుల చరిత్ర లెక్కలోకి రాకపోవడం దేశం దురదృష్టం. అలాంటి వారిలో బిర్సాముండా ఒకరు. కాకపోతే పద్నాలుగేళ్ళ కింద పార్లమెంటులో ఆ వీరుడి విగ్రహాన్ని యాభై ఏళ్ళ ఆలస్యంగానైనా నిలిపారు. ఒక గిరిజన వీరుడిని గుర్తించడానికి సావతంత్య్రం వచ్చాక ఏభై ఏళ్ళు పట్టింది. అంటే జాతి నిర్వీర్యం అవుతున్న సందర్భాల్లో కొత్త వీరులను స్మరించుకొంటుంటాం. పాత విగ్రహాలు ప్రేరణ కలిగించని వాతావరణంలో, పాత చరిత్రని కొత్త ఆలోచనా ఆయుధంగా మలుచుకుంటాం. ఇది జాతి నవ నిర్మాణానికి ఆవశ్యక సూత్రం. సీతారామరాజు చరిత్ర కూడా తెలుగు జాతి ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిర్వేదంలోంచి, జాతీయస్థాయిలో గుర్తింపు పొందకపోవడాన్ని నిశ్శబ్దంగా నిరసిస్తూ కొత్త చరిత్రని, విశే్లషణని మన ముందుంచే ప్రయత్నం ముమ్మరమైంది. అలాంటి వాటిలో ఎం.వి.ఆర్.శాస్ర్తీగారి ‘విప్లవ వీరుడు’ అల్లూరి సీతారామరాజు సీరియల్ రచన ఒకటని చెప్పుకోవచ్చు.


తెలంగాణా ఉద్యమం కొమురం భీంని తమ ప్రాంత ఆదివాసీ వీరునిగా కొనియాడుతున్నది. అతని విగ్రహం టాంకుబండ్‌పై ఎందుకు లేదని తమ ఆత్మగౌరవంతో ముడిపెట్టుకున్నది. అల్లం రాజయ్య, సాహులు కలిసి ‘కొమురం భీం’ పేరుతో ఇరవై ఏళ్ళ కింద ఒక నవల రాశారు. ఆ తరువాత ఒక సినిమా కూడా వచ్చింది. పిల్లలకోసం భూపాల్ చిన్న నవలని, సినిమా స్క్రిప్టుని ఎస్.ఎమ్.ప్రాణ్‌రావు పుస్తకాలుగా ప్రచురించారు. బి. నరసింగరావు ‘బాబే ఝరి బాట’ ఉయ్యాల పాటగా రాసాడు. ఐనా భీం రాష్ట్రం యావత్తు ఒక వీరుడిగా ఇంకా సరైన గుర్తింపు పొందలేదు. ఇప్పుడిప్పుడే వివిధ రంగాలవారు మెల్లిమెల్లిగా గుర్తిస్తున్నారు. ఇంతగా ఆలస్యం కావడానికి అతని జీవిత వివరాలు లభ్యంకాకపోవడం కూడా ఒక కారణం అయ్యుంటుంది.


అల్లూరి పోరాటం గురించి, అతని జీవితం గురించి చాలా వివరాలు తెలిసినా ఆనాడు పత్రికలపై కనుపించని ఆంక్షలు ఉండడంవల్ల అతని మరణ సంఘటన వార్త కాలేదు. దాంతో అల్లూరి వీరత్వం లోకానికి తెలియకుండా పోయింది. ఆ తరువాత కొన్ని దశాబ్దాలకు గాని అల్లూరి చరిత్ర పునర్జీవనం పొందలేదు. అల్లూరి పోరాటం గురించి ఆర్కైవ్స్‌లో వేలాది పేజీలు, వందలాది ఫైళ్ళు అందుబాటులో ఉన్నప్పటికీ ఛత్తీస్‌గఢ్‌కి చెందిన బిర్సాముండా వలె జాతీయస్థాయిలో గుర్తింపు రాలేదు.
కొమురం భీం గురించైతే చాలాకాలం ఎక్కడా లిఖిత పూర్వక సమాచారం లభించలేదు. కేవలం జ్ఞాపకాలు, వౌఖిక ఉటంకింపులు మాత్రమే వినవచ్చేవి.
1979 ప్రాంతంలో నేను పిహెచ్.డి పట్టాకోసం 1944నుండి జరిగిన తెలంగాణా రైతాంగ పోరాటంపై పరిశోధన సాగిస్తున్నాను. అందులో భాగంగా నాటి మద్రాసు ఆర్కైవ్స్‌లో, హైదరాబాదులోని మన రాష్ట్ర ఆర్కైవ్స్‌లో ఫైళ్ళు తిరగేస్తున్నాను. హైదరాబాదు సంస్థానానికి సంబంధించిన వివరాలు పార్సీ, ఉరుదూ భాషల్లోనే ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం ఒక అనువాదకుడిని ఏర్పాటుచేసుకున్నా లాభం లేకపోయింది.
నెలల తరబడి అక్కడ పరిశోధన సాగిస్తున్నా పెద్దగా ప్రయోజనం కనుపించలేదు. అప్పుడు మిత్రుడు అక్కిరాజు జాన్ ఆర్కైవ్స్‌లో పనిచేసేవాడు. ఇక్కడ ఫైళ్ళు లభ్యంకాకపోతే ఎ.పి. సెక్రటేరియట్‌లోని ఇంటరెమ్ రిపాజిటరీలో చూడమని సలహా ఇచ్చాడు.


అక్కడ చూడ్డానికి అనుమతి కావాలి. సెక్రటేరియట్ పాస్ కావాలి. వెంట ఉరుదూ తెలిసిన అనువాదకుడూ కావాలి. ఆనాడు జిరాక్సు వసతి అందుబాటులో లేనందున ఒక టైపిస్టు కూడా కావాలి. ఈ టైపిస్టుకి అనుమతి, పాస్‌ల వంటివి ఉండాలి. అన్నీ సమకూర్చుకుని ‘జె’బ్లాక్ గేటు ఎదురుగా ఉండే బిల్డింగ్ కింద నేల మాళిగలోకి వెళితే నిర్మానుష్య ప్రదేశంలో ఆర్కైవ్స్ విభాగం ఉంటుంది.


అక్కడ ఏ విభాగంలో నాకు కావలసిన సమాచారం లభిస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఐనా అనే్వషణ ఆరంభించాను. కొన్ని రోజులు వరసగా ఎలాంటి సమాచారం దాఖలాలు కనుపించేది కాదు. ఒక్కో విభాగం పొలిటికల్, రెవెన్యూ, హోం వంటివి విడిగా విభాగాలుగా లేవు. భూపోరాటం ఫైళ్ళు రెవెన్యూలో ఉండేవి. కాని అవి హోంశాఖలో ఉంటాయని అనుకుంటాం. లేదా పొలిటికల్ డిపార్ట్‌మెంట్‌లో!



Komaram Bheem Statue Tank Bund

అలా గుడ్డెద్దులా వెదుకుతూ పోయాం. ఒక రోజు బాబేఝరి రాయిట్స్ అనే ఫైలు దొరికింది. అదేదో పనికిరానిదన్నట్లు మా అనువాదకుడు తానే తేల్చేసి మరో ఫైళ్ళ కట్ట చూడ్డం మొదలుపెట్టాడు. బాబేఝరి పేరు సామల సదాశివగారి నోట 1972లో హనుమకొండలో విన్నాను. ఆయన కొమురం భీం గురించి ఆరోతరగతి పాఠ్యపుస్తకంలో ఒక పాఠం రాశారు. అది గుర్తొచ్చింది. వెంటనే అట్టమీద ఉరుదూలో రాసిన ఫైలుతీసి చూశాను. విచిత్రంగా లోపలి ఫైలు అంతా ఆంగ్లంలో ఉంది. బ్రిటిష్ సైన్యాధికారి పరిశీలనకోసం నైజాం పరిపాలనాధికారులు ఆంగ్లంలో ఫైలుని నడిపారు. ఆ ఫైలు ఇచ్చిన సమాచారంవల్లే కొమురం భీంకి సంబంధించిన అనేక విషయాలు తెలిశాయి. భీం చేసిన పోరాటకాలం స్థలాల వివరాలు, తేదీలతో సహా ఆ ఫైలు ద్వారానే తెలిసింది. ఆ ఫైలు టైపుకాపీని తీయించి అలా కొనే్నళ్ళు నా దగ్గరే దాచాను. ఆ తరువాత దానిని సుప్రసిద్ధ పరిశోధకుడు కె.వి.రమణారెడ్డికి పంపాను. ఆయన దాన్ని అల్లం రాజయ్యకి పంపి ఆదిలాబాదు జిల్లాకు చెందిన భీం వివరాలు సేకరించమన్నారు. ఎట్టకేలకు సాహు సేకరించిన వౌఖిక సమాచారం, ఈ ఫైలులోని లిఖిత ఆధారాల సహాయంతో భీంపై మొదటి నవల వెలువడింది. ఒక అజ్ఞాత వీరుడి చరిత్ర అలా లోకానికి వెల్లడైంది. మన సమాజంలో ఇలాంటి వీరులు కోకొల్లలు. భీం కన్నా చాలా కాలం ముందు ఆదిలాబాదు జిల్లా నిర్మల్ పట్టణంలో రాంజీగోండు అనే అతడిని, అతని మూడువందల మంది అనుచరులని నిర్మల్ పట్టణంలో ఒకే మర్రిచెట్టుకి ఉరివేసి వేలాడదీశారు.


రాంజీగోండుని తొట్టతొలి స్వాతంత్య్ర సమరయోధుడుగా చెప్పుకోవాలి. అలాగే మహబూబ్‌నగర్ పట్టణం పక్కనగల కొండపై ఉరి తీయబడిన పండగ సాయన్న చరిత్రపై కూడా ఇంకా పూర్తి వివరాలు లభ్యంకాలేదు. ఈ వీరులు ఆనాడు ప్రజల తరఫున నిలిచి అసువులుబాసిన వారు. వారి త్యాగాలే ఈనాడు మనం పీల్చే స్వేచ్ఛావాయువులు.
ఆనాడు ఆదిలాబాదు అంటే ఆసిఫాబాదే. గోండ్వనాలో ఎన్నో గోండు రాజ్యాలు ఉండేవి. చంద్రాపూర్, చాందా, మానిక్‌గడ్, ఉట్నూరు, మాహూర్ మొదలైనవి చిన్నచిన్న రాజ్యాలుగా ప్రసిద్ధిపొందాయి. చాలాకాలం- స్వతంత్ర రాజ్యాలుగా ఉండి మొఘలు చక్రవర్తులు, ఆ తరువాత మరాఠా రాజుల ఆధిపత్యం కిందకు వచ్చాయి. భీం పోరాటం నాటికి నైజాం రాజుల పాలన కింద చాలాకాలం ఈ ప్రాంతాలు ఉండిపోయాయి.


దేశంలో ఒకవైపు స్వాతంత్య్రోద్యమం, మరోవైపు హైదరాబాదులో నైజాం వ్యతిరేకోద్యమం రాజుకుంటున్నది. పన్నుల పేరుతో ప్రజలను దోచుకోవడం పెచ్చుపెరిగింది. కొత్త అటవీ చట్టం పేరుతో గిరిజనుల బతుకులు అస్తవ్యస్థం కావడం మొదలైంది.


తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నానుకొని ఉన్న కిన్వట్ తాలూకా సుంకేపల్లిలో జన్మించిన భీం, నిజాం పోలీసులు, అటవీ అధికారుల దౌర్జన్యాలు భరించలేక కుటుంబంతో కెరమెరి ప్రాంతంలోని జోడేఘాట్‌కి చేరుకున్నారు. అక్కడా అదే పరిస్థితి. ఐదేళ్ళపాటు అస్సాంకి అజ్ఞాతవాసం వెళ్ళి అక్కడ తేయాకు తోటల్లో పనిచేసి తిరిగి వచ్చాడు. వచ్చాక- ప్రజలను ఐక్యపరిచి జులుంని ఎదిరించాడు. బాబేఝరి వద్ద జరిగిన పోరాటంలో 1 సెప్టెంబర్ 1940లో తుపాకులతో నైజాం సిపాయిలు భీంని కిరాతకంగా కాల్చి చంపారు.


స్వాతంత్య్రం తరువాత కూడా కొమురం భీం పోరాట వారసత్వాన్ని గోండులు కొనసాగించారు. పొరకల సార్లతో కలసి పోరాడారు. ఇంద్రవెల్లి సంఘటనలో ఎంతోమంది గోండులు వీర మరణం పొందారు. తమ సాంప్రదాయిక జాతరని ప్రాణాలకు తెగించి కాపాడుకున్నారు. భీం భార్య సోనూబాయి కూడా నిజాం పోలీసులని ఎదిరించి పోరాడింది.
భీం గోండుల ఆరాధ్యదైవం. కాని మైదాన ప్రాంతాల వారికి ఒక జ్ఞాపకం మాత్రమే. అల్లూరి మైదాన ప్రాంతంనుండి వెళ్ళి గిరిజనులలో ఒకడయ్యాడు. భీం మాత్రం గిరిజనులనుండే ఒక వీరుడిగా ఎదిగాడు. ఏది ఏమైనా వీరుల చరిత్ర లిఖించుకోవడం చైతన్యవంతమైన కృషికి ఆనవాలు. ఇవ్వాళ అలాంటి సాంస్కృతిక వీరులు లేకపోవచ్చు. కాని ఆ వీరులను కీర్తించడం, గుర్తించడం ద్వారా ఆ లోటుని భర్తీచేయవచ్చు. అది మన విధి.

No comments:

Post a Comment