Tuesday, 29 July 2014

విప్లవాత్మక యోగి కబీరు




కబీరు 15 వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ విప్లవాత్మక యోగి. ఆధ్యాత్మిక సిద్ధ పురుషుడు, ఆనాడు తీవ్ర మత వైషమ్యాల వల్ల, పరస్పర విరోధాల వల్ల హిందూ, మహమ్మదీయుల మధ్య ఏర్పడిన అగాథానికి గొప్ప సేతువు వంటి కబీరు ఉపదేశాలు రెండు మతాల సామరస్యానికి అధికంగా సహకరించాయి అనడంలో సందేహం లేదు.

నిరాడంబరమైన సహజ భావనలతో, ఆధ్యాత్మిక తత్త్వముతో బ్రహ్మానందదాయకమైన వీరిపాటలు, వీరికి అఖండ కీర్తిని గడించాయి. భారతీయ యోగులలో సుప్రసిద్ధుడని ఘనత వహించిన కారణ జన్ముడు.

క్రీ.పూ. 1440 లో జననమొందిన కబీరు బాల్యం ఒక విచిత్ర గాధ. తండ్రిలేని కబీరుని ఇతని తల్లి పరిహరించినది. ఆనాధుడైన కబీరు కాశీ పరిసర ప్రాంతాలలో లహర్‌తోలో అనే సరస్సులో పడి మునిగి పోవుచుండగా నిరు, నిమా అనే ముస్లిం దంపతులు రక్షించి ఇంటికి తీసుకుపోయారు. పుత్ర సంతతికి నోచుకోని ఈ ముస్లిం దంపతులు తమకు దొరికిన ఈ బాలుని అత్యంత ఆదరాబిమానాలతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. మహమ్మదీయుల ఇంట మహమ్మదీయ సంప్రదాయలతో వర్ధిలుతున్న కబీరు హైందవ ఆచారాలను ఆదరిస్తూ ఉండేవాడు. ఇది ఆ మహమ్మదీయ దంపతులకే కాదు ఇరుగు పొరుగు వారి అగ్రహానికి కూడా ముఖ్య కారణమైంది.

చిన్ననాటి నుండి కబీరు ఆధ్యాత్మిక జీవనాన్ని అభిలషిస్తూ ఉండే వాడేగాని ప్రత్యేకంగా ఒక హిందూ మతాభిమానాన్ని గానీ, మహమ్మదీయ మతాభిమానాన్ని గానీ ప్రకటించలేదు. గురువు లేక ఎటువంటి గుణవంతునకైనను జ్ఞాన సాధన సాధ్యం కాదని తలచి, సద్గురువు ఆవశ్యకతను గ్రహించి, అట్టి గురువుకోసం తహతహపడ్డాడు. ఆ సమయంలో కాశీలో నివసిస్తూ ఉన్న రామానందులను గురించి విని వారి సాన్నిధ్యంలో వారి సేవకు ఎంతో కుతూహలం పొందాడు. కాని హీన జాతిలో పెరిగిన తనను రామానందుడు అనుగ్రహించి శుశ్రూషకు అంగీకరించునో లేదో అనే సంశయంతో భాధ పడ్డాడు. చివరకు ఒకనాడు రామనందుడు గంగానదిలో స్నానముచేయు రేవువద్ద కబీరు మెట్లపై మునుగు కప్పి పడుకున్నాడు.తెల్లవారు జామున స్తానానికి వచ్చిన రామానందుడు మేట్లపై పరుండిన బాలుని చీకటిలో గమనించక కాలితో తొక్కిన అపచారమునకు ' రామ రామ ' అని రామనామస్మరణం చేశాడు. వెంటనే కబీరు ఆ రామ నామమే తనకు మహామంత్రమని నిశ్చయించుకుని ఆ నాటి నుండి తాను రామానందుల శిష్యుడని రామానందునితో చెప్పి శ్రుశ్రూషకు ప్రాధేయపడ్డాడు. కబీరు గొప్పదనాన్నీ, అభిలాషనూ గ్రహించి వెంటనే రామానందులు అతన్ని తన శిష్యునిగా అంగీకరించాడు. నాటినుండి కబీరు రామ నామ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు.

రామానందులు సామాన్యులు కారు. కఠినుడు. కబీరు అనేక సంవత్సరాలపాటు శుశ్రూష చేసి వారి వలన నిర్గుణోపాసనచే దైవము సర్వ మతములకు సమ్మతమైన పరమాత్మ తత్వమనియు ఏదో ఒక రూపము చేతను, పేరు చేతను నిర్దేశింపదగినవడు కాడని తెలుసుకున్నాడు. కుల మత వ్యవస్థలతో చెల్లాచెదురైన మానవాళిలో రేగుతున్న ద్వేష వైషమ్యాలకు మిక్కిలి చింతించి, మహమ్మదీయ మత గురువులతో, హైందవ యోగులతో కలసి మెలసి ఉండుటకు ప్రారంభించాడు. దీని వలన కబీరు ప్రజాదరణ పొందలేకపోయాడు.

కబీరు శిష్టాచార సంప్రదాయాలను నిరాకరించి, విగ్రహారాధనను విమర్శించాడు. ఫలితంగా అనేక మందితో విరోధాన్ని తెచ్చిపెట్టుకున్నా, తన గురువు ఉపదేశాలను దేశం నలుమూలలా ప్రకటించాడు. కబీరు ఉపదేశామృతం అతని మృదు మధుర వాక్కులలోను, పాటలలోనూ, పద్యాలలోనూ తొణికిసలాడుతుంటాయి. భక్తులు ఆ పాటలను పాడుతూ కబీరు కీర్తిని నలుదిశలా వ్యాపింపజేశారు.

కబీరు మరణించినపుడు అతడి హిందు, మహమ్మదీయ భక్తులు అతడి మృతదేహ ఖనన విషయంలో కొట్లాడుకున్నారు. మహమ్మదీయులు దేహాన్ని భూస్థాపితం చేయాలని, హిందువులు దహన క్రియలు చేయాలని వాదులాడుకున్నారు. వాదోపవాదాలతొ మృత దేహంపైని వస్త్రాన్ని తొలగించగా ఆయన కళేబరానికి బదులు అక్కడ పుష్ప రాశి ఉండడంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. కబీరు రచించిన బిజక్‌లోని ఉపదేశాలనుంచి, సందేశాలనుంచి మనం ఎంతైనా తెలుసుకోవచ్చు.

కబీరు మానవాళికి అందించిన కొన్ని అమూల్య ప్రవచనాలు (సాఖీలు) :


ఏది చేసినా నువ్వే. నాది ఇసుమంతయూ లేదు. నేనేదైనా చేసినన్నచో నాలోనున్నవాడవు నీవే చేసితివి.
హరినెందుకు ప్రేమింతువు? హరిజనులను ప్రేమించుము.హరి నీకు సంపదనిచ్చును, హరిజనుడు నీకు హరినే ఇచ్చును.
ఆకలి కుక్కవంటిది. అది భజనకు భంగం చేయును. దానికి ముక్కబడవేయుము. జంకు విడిచి స్మరియింపుము.
విరహం లేని హృదయం వల్లకాడువంటిది.
సాఖీలు వల్లిస్తే ఉపయోగం లేదు. వాటి సారాన్ని గ్రహించాలి.
గోవిందుడికన్నా గురువెక్కువ.
పళ్ళెమును నీటిలో నానబెడితే ఉపయోగం ఏముంది? దుర్జనుడూ అంతే. వాడి హృదయం మెత్తబడదు.
ఎత్తైన మేడలు చూసి గర్వించకు. రేపు నేలబొర్లెదవు. మీద గడ్డి ఒలుచును.
అడుగుటకన్నా చచ్చుట మేలు.
మనసు గజరాజు. అంకుశంతో దానిని అణుచుము.
రామ నామము నాల్గు వేదములకు మూలము.

పరమేశ్వరుని ఆరాధన


సృష్టి మొత్తం ఒక నియమ పూర్వకమైన సువ్యవస్తతకు లోబడి నడుస్తోంది. గ్రహాలు, నక్షత్రాలు తమ తమ కక్ష్యలలో ఇరుసుమీద ఈమాత్రం అటూఇటూ దారి తప్పకుండా పరిభ్రమిస్తాయి. దివారాత్రులు, ఋతువులు మొదలగు వాటిలో ఒక నియమం ఏర్పడి ఉన్నది. కర్మ ఫలాలు ఒక దైవవ్యవస్తకు సంబంధించినవే. పాలు పెరుగుగా మారటానికి, విత్తనం మొక్కగామారటానికీ కొంతసమయం పడుతుంది. అదే విధంగా కర్మలననుసరించి మంచిచెడుల ఫలితం కొంతసమయం వెనుకా ముందుగానైనా నిశ్చితరూపంలో అందుతుంది. అలాకాని పక్షంలో ప్రపంచమంతా ఆటవిక న్యాయం రాజ్యమేలేది. నోరున్నవాడిమాటే చెల్లుబాటవుతూ, బలమున్నవాడిమాటే సాగుతూ వుండేది. కానీ అలాజరగటంలేదు.

విధ్వాంసులు, ధనవంతులు కళాకారులూ పహిల్వానులు కాగలగాలి అనుకొంటే కృషిసాధన చేసి తీరాలి. కృషికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది. ఏజాతి విత్తనాలు నాటుతామో ఆ జాతి పంటనే కోరుకుంటాము. మధ్యం తాగినవాడికే నిషా తలకెక్కుతుంది. విషంతాగినవాడు ప్రాణాలు పోగొట్టుకొంటాడు. ఇదే కర్మఫలం యొక్క సునిశ్చిత వ్యవస్తకు ప్రత్యక్ష ప్రమాణం.

ఏపనికైనా తాత్కాలంలోనే ఫలితం కనబడుతూ ఉంటే - అనగా దొంగతనం చేసిన వారి చేతులు చచ్చుపడి పోతుంటే, వ్యభిచారం చేసినవారి చేతులు చచ్చుపడి పోతుంటే - ఈ ధర్మాలు, కట్టుబాట్లు అవసరం అయ్యేవి కావు . భగవంతుని సాక్ష్యం పెట్టుకోవలసిన పనీ ఉండదు. మరి అటువంటప్పుడు ఈ అవకాశం మనిషికి ఎందుకు లభించింది? అతడు తన బుధ్ధి కుశలతను ఉపయోగించి వ్యవహరించాలని, తన గౌరవ గరిమను దృష్టిలో ఉంచుకొని సదాశ్యాన్ని కనపరుస్తూ, దుష్యర్మలకు దూరంగా ఉండాలని, కానీ జరిగేదంతా దానికి వ్యతిరేకం. మనిషి తప్పులమీద తప్పులు చేస్తూనే ఉంటాడు. మతి మరుపు అనే గుణం, నిర్లక్ష్య ధోరణి మనిషికి అనేక ఇక్కట్లను తెచ్చిపెడుతున్నాయి. మత్తు పదార్ధాల వల్ల కలిగే దుష్పరిణామాలను అనుభవిస్తున్న వారిని చూస్తూ కూడా, జంకులేకుండా ఆ వ్యసనాలకు తాను కూడా బానిస అవుతుంటాడు మనిషి. ఏది మనిషి తెలిసి చేస్తున్న గొప్ప పొరపాటు.

ఆత్మ వికాసం అంతగా జరగక పోవడంతో - మనిషి ఉచితానుచితాలను తేడాను పట్టించుకోకుండా, వెనుకా ముందూ చూడకుండా మనసుకు ఏది తోస్తే అది చేయడమనే మరో పెద్ద తప్పు జరుగుతున్నది. స్వేచ్చాచరణ ఉదృత అహంకారానికి ప్రతిరూపం. పొగరుబోతు వ్యక్తి నియమాలను, ఆంక్షలను ఉపేక్షించి సంకుచిత స్వార్ధభావనా ప్రేరితుడై, ఏది చేయకూడదో అదే చేస్తుంటాడు. ప్రగతికి కావలసిన సమస్త సదుపాయాలు, సమస్త సంపదలు ఉన్నప్పటికీ జనులు వ్యధలలో, కష్టాలలో మునిగి తేలుతూ ఉండటానికి కారణం ఇదే. ఇతర ప్రాణులు హాయిగా సుఖజీవితాన్ని గడుపుతుండగా, మనిషిమాత్రం ప్రతినిమిషం సమస్యలతో , ఉద్విఘ్నతతో బ్రతక వలసి వస్తున్నది. ఈ స్వేచ్చారణ ఎలా ఆగుతుంది? వ్యక్తి సభ్యతతో అనుబంధితుడై ఎలా ఉండాలి? సమాజంలో పరస్పర సహకారం, సత్భావన ప్రసారం ఎలా ఉండాలి? ఏ ప్రశ్నలన్నింటికీ కలిపి ఒకే సమాధానం వస్తుంది. ఒక నియామక సత్తా యొక్క అస్తిత్వాన్ని నిజాయితీగా అనుభవం లోనికి తెచ్చుకోవడం, దానిని సర్వవ్యాపకమైనదిగా, సర్వ దర్శిగా భావించి, దాని న్యాయ నిష్టలపై స్తిరమైన విస్వాసముంచడం, వీటితోపాటు ఆసత్తాకు భగవంతునిగా పూజనీయతం ఇవ్వడం - ఇదే నిజమైన ఆస్తికత.

భగవంతుని ఉనికిని అంగీకరించేవారు, అతడిని ఆరాధించేవారు అసంక్యాకంగా ఉన్నారు. అయితే, వారి పూజలు భ్రాంతులతో నిండి ఉంటాయి. అందువల్ల వాటికి సజ్జనత, ఉదారత మొదలైన రూపాలలో రావలసిన ఫలితాలు తగినంతగా రావడం లేదు.

భగవంతుణ్ణి మానవులకుండె అన్ని దుర్భలతలు కలిగిన వ్యక్తిగా సామాన్యంగా మనుషులంతా ఊహించుకొంటారు, ప్రలోభాలతో ఆయనను ఉబ్బేయవచ్చని ఏమార్చవచ్చని భావిస్తారు. తధ్వారా తమ కోర్కెలు తీర్చుకోవడానికి రకరకాల పన్నాగాలు పన్నుతుంటారు. స్తోత్రపాటాలు చదువుతూ పూజ పేరుతో పూలు, పళ్ళు, కానుకలూ వంటివి అర్పిస్తుంటారు. అతడు తమవంటి గుణాలున్న వాడిని నమ్ముతారు కనుక - లంచాలకు లొంగుతాడని, పొగడ్తలకు పొంగిపోతాడని, తమకోర్కెలు తప్పక తీరుతాయని ఊహించుకొంటారు. ఒకపక్క పూజలు చేస్తున్నా, మరోపక్క మనసులో భగవంతుని ఉనికివల్ల అపనమ్మకం ఉండటం వల్లనే ఇన్నిరకాలు పూజా విధానాలు, మూఢాచారాలు ఏర్పడ్డాయి. ఎటుపోయి ఎటువచ్చినా కనీసం చెడు జరగకుండా వివత్తులేవీ మీదపడకుండాయఅయినా ఉంటాయని వాటిని పాటిస్తుంటాయని వాటిని పాటిస్తుంటారు తప్ప నిజమైనవిశ్వాసంతోకాదు. ఒకవేళ ఏదైనా మంచి జరిగితే, అదివారి భక్తి ప్రదర్శనకు ప్రతిఫలంగా భగవంతుడిచ్చిన వరదానమని అనుకోరాదు. ఎందుకంటే - భగవంతుని వద్ద అన్యాయానికి తావు లేదు. ఆయనవద్ద ఉన్నతులాదండం కచ్చితమైన న్యాయ సూత్రాలను అమలుచేస్తుంది. ప్రతిపనికీ నిస్పక్షపాతంగా ఫలితాలను నిర్ణయిస్తుంది కనుక వీరితప్పుల తడక వ్యవహారాలను, దురాలోచనలును ఆయన పట్టించుకోడు. పూజలకు ఆయన పొంగిపోడు.

భగవంతునికి కొందరి యందు ప్రేమా మరి కొందరి యందు ద్వేషమూ ఉండదు. కొందరిని ఆశీర్వదిస్తూ మరి కొందరిని శపించదు.ఆయన విధించిన నియమాలను పాటించేవారు సుఖ సంతోషాలతో ఉంటారు. భగవంతుడు వారి యందు ప్రసన్నత కలిగి ఉన్నడన్నదానికి గుర్తు అదే. ఆయన పెట్టిన కట్టుబాట్లను ఉల్లంగించినవారు, చెడుమార్గం పట్టినవారు తమకర్మల దుష్పలితాలను అనుభవిస్తున్నారు, దీనిని భగవంతుని అప్రసన్నతగా భావించాలి. నిజానికి భగవంతుడు సర్వమునూ సర్వులనూ నియమిత అనుసాసనంలో బందించాడు. ఇతర ప్రాణులన్నీ ఈ అనుశాసనాన్ని సహజ సిధ్ధంగా పాలిస్తున్నాయి. మనిషిమాత్రమే వక్రమార్గం పట్టి అశాంతికి లోనవుతున్నాడు. భగవంతుడు ఎవరితోనూ ఖటినంగా వుండడు, మృదువుగానూ వ్యవహరించడు. కానుకలు మొక్కుబడులు ఇచ్చి ఆయనను పక్షపాత ధోరణిలో వ్యవహరింపచేయలేరు. అందుచేత ఆస్తికులైన వారి కర్తవ్యమేమిటంటే - భగవంతుని సర్వవ్యాపకునిగా న్యాయ నిర్ణేతగా అంగీకరించి, తమ అలోచనలు, సీలం విచ్చలవిడిగా ఉండకుండా, ఇతరులను విశృంఖలంగా నడుచుకొన నివ్వకుండా చూచుకోవాలి.

భగవంతుని సామర్ధ్యాలు అనంతములు, ఆయన విభిన్న ప్రయోజనాల కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. వాటిలో మనిషి అంతరంగాన్ని ప్రభావితం చేసే ధార సజ్జనత, సదాశయత. దానిని సత్ప్రవృత్తుల సముచ్ఛయిని అని చెప్పవచ్చు. సూర్యుని వెలుగు, వేడి సోకుతూనే కమలములు వికసిస్తాయి. అదేవిధంగా పరబ్రహ్మయొక్క సాన్నిధ్యంకలగగానే మనిషి గుణ, కర్మ, స్వభాలు ఉత్కృష్టత అనే పరిమళం సోకి సుగంధభరిత మవుతుంది. భక్తి అంటే భావావేశం కాదు. అందులో భగవంతునికి చేరువకావాలన్న, ప్రగాఢమైన ఆకాంక్ష నిండి ఉండాలి. సర్వవ్యాపకమైన, అణువణువునా నిండి ఉన్న ఆ శక్తి సహజంగా తన వద్ద కూడా ఉంటుంది. వెలుపలి వాతావరణంలోనూ, అంతరంగంలోపలా కూడా నిండిఉన్నది. ఆఙ్ఞానం వల్ల ఆ శక్తి ఎక్కడో తమకు దూరాన ఉన్నట్లు భావించుకున్నారు. వివేకం, విఙ్ఞానం మేల్కొనగానే అది సర్వత్రా దృష్టిగోచరం అవుతూ ఉంటుంది.

సర్వవ్యాపక సత్తా యొక్క వాస్తవిక రోపం నిరాకారమే అయినప్పటికీ, ధ్యాస ధారణ అనే ఆధ్యాత్మిక సాధన పూర్తి కోసం ఏదో ఒక రూపం ఉండక తప్పదు. మనిషి కల్పన దైవమును కూడా తనలాంటి అవయవాలు గలవిగా ఊహించుకొన్నది. అనేక సాంప్రదాయాలలో భగవంతుడు అనుయాయూల భక్తికి ప్రతిరూపంగా సృజింపబడ్డాడు. అందుకనే "ఏకం సధ్ విప్రా: బహుదావదంతి" అన్నట్లు- ఏకము అనేక రూపాలుగా దృష్టి గోచరమయ్యేది అని చెప్పబడినది. ఈ జగత్ భగవంతుని విరాట్ దృశ్యమాన స్వరూపం. అర్జుననకు, యశోదకూ, కౌసల్యకూ ఈరూపంలోనే భగధర్శనమయినది. భర్మ చక్షులతో ఈ రూపాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చూడవచ్చు. ఈ విరాట్ బ్రహ్మ పూజను స్వచ్చత, ప్రగతి, అలంకరణ రూపములలో చేయవలసి ఉంటుంది. అనగా ఈవిశ్వంలోని పరిసరాలను అందంగా రూపొందించడం, పంచభూతాలను (భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, జలం) కాలుష్య రహితంగా పరిశుభ్రంగా కాపాడుకోవడం, మానవులలో సమత, మమత, మానవతలను పెంపొందించడం మొదలైనవి భగవంతునికి ప్రీతికరమైన ఆరాధనలు - పూజలు.

ఇప్పటికన్నా రాబోయే కాలం మరింత సమృధంగా, సమున్నతంగా, ప్రగతి శీలంగా, సుసంస్కృతంగా ఉంటుంది. అటువంటి కాలంకోసం అందరూ కలసి కృషిచేయాలి. అటువంటి భావనాశీల ప్రపంచాన్ని భగవంతుని ఉధ్యానవనంగా భావించి, తాను కర్తవ్య పరాయణుడైన తోటమాలిగా మారి, దాని ఉత్కర్షలో, అభ్యుదయలో తన కాలాన్ని, శ్రమను ఏకాగ్రతను, సాధనను వినియోగించాలి. దీనినే కర్మయోగమని అంటారు. గీతలో దీనిగురించి ప్రత్యేకంగా చెప్పబడినది.

ఆస్తికతా భావన మనిషి విశృంఖలత మీద అంకుశంవలే పనిచేస్తుంది. ఒంటెను ముక్కుతాడుతో, గుఱాన్ని కళ్ళెంతో, ఏనుగును అంకుశంతో అదుపు చేస్తారు. సర్కసులోని జంతువులను రింగుమాస్టారు కొరడాతో భయపెట్టి కావలసిన పనులను నేర్పుతాడు. చెప్పినట్లు వినేలా చేసుకొంటాడు. అదేవిధంగా భగవంతుని యందున్న నమ్మకం మనిషిని చెడుమార్గాన నడవకుండా అదుపుచేస్తుంది. దేవుడు శిక్షిస్తాడన్న భయంతో మనుషులు తప్పుచేయడానికి జంకుతారు. సన్మార్గాన్ని ఎంచుకుంటారు. దానివలన సమాజపు వ్యవస్త సుస్తిరంగా ఉంటుంది.

Monday, 28 July 2014

కొండల నగరం ...!


కొండల రాజ్యం, దుంగార్పూర్ రాజస్తాన్ రాష్ట్రం లోని దక్షిణ భాగం లో వుంది. ఈ పట్టణం దున్గార్పూర్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం గా వుంది. చారిత్రిక పత్రాల ప్రకారం ఇది ఇంతకు పూర్వం దుంగార్పూర్ రాజ్యానికి రాజధాని. ఈ జిల్లా లోని భిల్ జాతి వారు ఇక్కడి ప్రధాన, పురాతన నివాసులు, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారు. భిల్ జాతి ముఖ్య నాయకుడి నుంచి దుంగార్పూర్ ను వీర్ సింగ్ మహారాజు చేజిక్కించుకున్నాడు.

బొమ్మల తయారీ & చిత్రాలకు పటాలు కట్టడం – వికసించిన సృజనాత్మకత


ఇక్కడి దేశవాళీ బొమ్మల తయారీ కేంద్రం గురించి ప్రస్తావించక పొతే ఈ ప్రాంత వర్ణన అసంపూర్ణంగా వుంది పోతుంది. చెక్క నుంచి తయారయ్యే అందమైన బొమ్మలకు మెరుపులు అద్దడానికి లక్క ఉపయోగిస్తారు. అధిక భాగం బొమ్మలు మనుష్యులను జంతువులను పోలి వుంటాయి. వివిధ పండుగలు, సందర్భాల్లో ఈ బొమ్మలను విరివిగా ప్రదర్శిస్తారు. బొమ్మల తయారీకే కాక, దుంగార్పూర్ కంసాలి వారు తయారు చేసే చిత్ర పటాలకు కూడా ప్రసిద్ది.

దుంగార్పూర్ పట్టణం విస్తృత స్థాయి వారి సాగుకి, టేకు, మామిడి, ఖర్జూరాల ఉత్పత్తికి కూడా ప్రసిద్ది పొందింది. దుంగార్పూర్ లోని దట్టమైన అడవుల్లో పర్యాటకులు పర్వతారోహణ చేస్తూ – తోడేళ్ళు, అడవి పిల్లులు, నక్కలు, ముళ్ళ పందులు, ముంగిసలు లాంటి జంతు జాతులను కూడా చూడవచ్చు.


పండుగలూ – పర్వదినాలు – ఆనంద ప్రదర్శన !


దుంగార్పూర్ లోని బనేశ్వర్ దేవాలయం లో నిర్వహించే గిరిజనుల ప్రసిద్ధ పండుగ బనేశ్వర్ ఉత్సవం. ఫిబ్రవరి లో వచ్చే పౌర్ణమి లేదా మాఘ శుక్ల పౌర్ణమి నాడు జరిగే ఈ ఉత్సవం చూడడానికి ఈ దేవాలయానికి అనేక మంది భక్తులు వస్తారు. ఈ పవిత్ర సమయంలో, గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ ల నుంచి మహి, సోమ నదుల సంగమంలో స్నానం చేయడానికి ఇక్కడికి భిల్లులు వస్తారు. తాంత్రిక వినాయకుడు, జింక చర్మ దారి అయిన బ్రహ్మ, వీణ చేపట్టిన శివుడు, పద్మిని, పద్మపాణి యక్షుడు, గరుడారూడ అయిన వైష్ణవి విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు. ఈ పండుగలో ఈ ప్రాంతపు నృత్య రీతులు, సంగీతం రుచి చూడవచ్చు. హిందువుల ప్రసిద్ధ పండుగ హోలీ ని ఇక్కడ గిరిజన నృత్యాలతో జరుపుకుంటారు. దీపాల పండుగ దీపావళిని, దీపావళి తర్వాత జరిగే బార్ బ్రిజ్ ఉత్సవం ఈ ప్రాంతపు ప్రధాన పండుగలు.

అద్భుత నిర్మాణాలు – రాతి మీద వర్ణనలు


ఆకర్షణీయమైన బొమ్మలు, పండుగలు, వన్యప్రాణులకే కాక దుంగార్పూర్ రాజ ప్రాసాదాలకు, పురాతన ఆలయాలకు, మ్యూజియం లకు, సరస్సులకు కూడా ప్రసిద్ది చెంది౦ది. రాజపుత్ర నిర్మాణ శైలికి ప్రసిద్ది చెందింది ఉదయ విలాస్ భవనం. ఈ పెద్ద భవనాన్ని – రాణీవాసం, ఉదయ విలాసం, కృష్ణ ప్రకాశం లేదా ఏక్ తంబియా మహల్ అనే మూడు విభాగాలుగా విభజించారు.

క్లిష్టమైన రీతిలో చెక్కిన వసారాలు, తోరణాలు, కిటికీలకు ప్రసిద్ది చెందిన ఈ ప్రాసాదం ఇప్పుడు ఒక వారసత్వ హోటల్ గా మారిపోయింది. గాజు, అద్దాల పనికి ప్రసిద్ది చెందిన జునా మహల్ ను కూడా పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు. దుంగార్పూర్ లో మరో అద్భుత భవనం బాదల్ మహల్. గాయిబ్ సాగర్ సరస్సు ఒడ్డున వున్న ఈ భవనం విస్తారమైన నమూనాలకు, రాజపుత్ర, ముఘలాయి నిర్మాణ శైలుల మిశ్రమ శైలికి ప్రసిద్ది పొందింది.

దుంగార్పూర్ అనేక హిందూ, జైన ఆలయాలకు ప్రసిద్ది చెందింది. పర్యాటకులు ఈ ప్రాంతంలో ఉన్నపుడు వనేశ్వర్ ఆలయం, భువనేశ్వర్, సూర్పూర్ ఆలయం, దేవ్ సోమనాథ్ ఆలయం, విజయ్ రాజరాజేశ్వర్ ఆలయం, శ్రీనాథ్ జి ఆలయం చూడవచ్చు. దాని ఒడ్డున వున్న అనేక దేవాలయాలు, ప్రాసాదాల వల్ల గాయిబ్ సాగర్ సరస్సు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ గా మారింది. దుంగార్పూర్ వెళ్లాలనుకునే యాత్రికులు రాజమాతా దేవేంద్ర కున్వర్ ప్రభుత్వ మ్యూజియం, నాగ ఫణ జీ, గలియా కోట్, ఫతే ఘరీ కూడా చూడాలి.


దుంగార్పూర్ చేరుకోవడం


దుంగార్పూర్ జిల్లా వాయు, రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానించబడి ఉ౦ది. ఉదయపూర్ లోని మహారాణా ప్రతాప్ విమానాశ్రయం లేదా దబోక్, దుంగార్పూర్ కి సమీప విమానాశ్రయం. విదేశీ పర్యాటకులు న్యూ డిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐ జి ఐ) నుండి దుంగార్పూర్ చేరుకుంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రత్లాంలోని రైల్వే స్టేషన్ దుంగార్పూర్ కి సమీప రైల్వే స్టేషన్. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ రెండిటి నుండి కాబ్స్ ద్వారా ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. పర్యాటకులు ఉదయపూర్, ఇతర సమీప నగరాల నుండి బస్సులలో ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు.

పెనుకొండ కోట... ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు కోట (పెనుగొండ)




చనిన నాళుల తెనుగు కత్తులు సానవెట్టిన బండ, ఈ పెనుగొండ కొండ రంధ్రముల ప్రహరించు శత్రుల, రక్తధారల త్రావి త్రేచిన ఆంధ్ర, కన్నడ రాజ్యలక్ష్ముల, కరితి నీలపు దండ, ఈ పెనుగొండ కొండ వెరపులెరుగని బిరుదు నడకల, విజయనగరపు రాచకొడుకులు పొరలబోయగ కరడుకట్టిన పచ్చినెత్తురు కొండ, ఈ పెనుగొండ కొండ తిరుమలేంద్రుని కీర్తి తేనెలు, బెరసి దించిన కాపుకవనపు నిరుపమ ద్రాక్షారసంబులు నిండి తొలికెడు కుండ, ఈ పెనుగొండ కొండ

ఈ కోటను మొదటగా హోయసలలు పాలించారు. వారు జైన మతస్తులు ఐనందున అక్కడ జైన మతము బాగా అభివృద్ధి చెందినది. ఆకాలంలో పెనుగొండలో అనేక జైన దేవాలయాలు అభివృద్ధి చెందాయి. ఇప్పటికి ఈ ప్రాంతము జైన మతస్తులకు అత్యంత ప్రాదాన్యమైనది. ఆ తర్వాతి కాలంలో చాలుక్యలు, విజయనగర రాసులు, నవాబులు, టిప్పుసుల్తాను కూడ పరిపాలించాచు. చివరగా బ్రిటిష్ వారి వశమైనది. కృష్ణ దేవ రాయల కాలంలో పెనుగొండ వారి రాజ్యానికి రెండవ రాజధానిగా వర్థిల్లినది. అదేవిదంగా వారికి ఇది వేసవి విడిదిగా కూడ సేవ లందించింది. విజయ నగర సామ్రాజ్యం కృష్ణ దేవరాయల తర్వాత వెంకట పతి రాయలు ఈ కోటను తన ఆదీనములోనికి తెచ్చుకొన్నాడు. అతడు రాయ దలవాయి కోనేటి నాయుడు ని ఈ ప్రాంతానికి పాలకునిగా నియమించాడు. వారి వంశస్తులైన కోనేటి నాయుడు పెనుగొండతోబాటు రాయదుర్గ, కుందుర్పి కోటలను కూడ సుమారు 17 సంవత్సరాల పాటు పరి పాలించాడు. అతని తరువాత వెంకటపతి నాయుడు, పెద తిమ్ంప్ప నాయుడు, వెంకతపతి నాయుడు, కోనేతి నాయుడు, రాజగొపల నాయుడు మరియు తిమ్మప్ప నాయుడు మొదలగు వారు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.


సంపద....


విజయ నగర రాజ్య పతనానంతరము విజయనగరం నుండు ఆనేక ఏనుగులు, గుర్రాల పై విజయ నగర సంపదను తరలించి పెనుగొండలోను, చిత్తూరు జిల్లాలోని చంద్ర గిరి కోటలో దాచారని చారిత్రిక ఆదారాలున్నాని. అందుచేత పెనుగొండ కోటలో ముష్కరులు గుప్త నిధులకొరకు అనేక సార్లు త్రవ్వకాలు నిధిని తస్కరించారని కథనాలున్నాయి. ఇటీ వలి కాలంలోను ఇటు వంటి సంఘటనలు జరిగినట్టు వార్థలు వచ్చాయి.


విశేషాలు...


పెనుకొండ కోట బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాశనాలు ఉన్నాయి. ఇందులోని కట్టడాలు శత్రుదుర్బేద్యంగా ఉంటాయి. యెర్రమంచి గేటులో 1575లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఉంది. విజయనగరపు రాజులు యుధ్ధానికి వెళ్ళేముందు ఇక్కడే పూజలు జరిపేవారట. పెనుకొండ లొ 365 దేవాలయాలు కలవు. వీటిని కృష్ణదేవరాయలు నిర్మించాడు.

ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు.......

.
ఇతరమతాల బారినుండి హిందూ మత సంరక్షణకు కన్యాకుమారి నుండి కటకము వరకు రాయలసీమలో తెలుగుజాతి వీరులను నిల్పిన విజయనగర సామ్రాజ్యపు పట్టుకొమ్మలు కంచి, చంద్రగిరి, పెనుగొండ, గుత్తి రాయదుర్గము, పంపానగర విజయనగరము. ''కంచి'' ఐక్యమత్య విధానంతో శివకంచి విష్ణు కంచి, వేగవతీ నది తీరాన నిల్పిన పుణ్య భూమి.

శ్రీ కృష్ణదేవరాయలు తాత ఈశ్వరరాయలు, తండ్రి నరసరాయలు, తిమ్మరుసు గోవింద రాజులు చంద్రగిరిలో జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు జన్మస్థానము పెనుగొండ. అన్ని విద్యలూ పెనుగొండ, చంద్రగిరి, విజయనగరాలలో అభ్యసించారు.

శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు పూర్వీకులు తెలుగుగడ్డలో పుట్టి తెలుగుతల్లి పాలు తాగిన వీరులు. తిమ్మరుసు, తండ్రి రాచిరాజు. తాత వేమరాజు. వీరు కొండవీడు, ఉదయగిరి సామంతరాజు. బహమనీ సుల్తాన్లు గజపతులు తాల్రాజును హతమార్చి నందువలన తిమ్మరుసు తండ్రి రాచిరాజు 1460లో చంద్రగిరి చేరారు. అందుకే తిమ్మరుసు పగపట్టిన కొండవీటి సింహం. గజపతులతో 7 సంవత్సరాలు యుద్ధం జరిపి పగతీర్చుకొన్నాడు. శ్రీకృష్ణ దేవరాయలను గజపతుల అల్లునిగా జేసారు. కాని గజపతులు వ్లుెచ్ఛాబ్ధి కుంభోద్బవులు. తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయల అంత్య దశలో కుట్రలు పన్నారు. కాని తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయల అనుబంధము విడదీయరానిది. వారు చివరి వరకూ ఆత్మీయులే. శ్రీకృష్ణదేవరాయలుకు, తిమ్మరుసు 67 సంవత్సరముల వయస్సులో సాధారణ మరణము సంభవించినది. (వసుంధరా పిహ్లెట్‌-ఫ్రాన్స్‌ -విజయనగర్‌-నేషన్‌ బుక్‌ ట్రస్ట్‌).

వరాహపురాణములో తెలుగు ఆది జంటకవులు ఘంటసింగయ్య, నంది మల్లయ్య, శ్రీకృష్ణ దేవరాయల

పూర్వీకులు కంచి, అరణి దగ్గర దేవకీపుర దుర్గాధీశులు అని వివరించారు. ఆనాటికి ఈనాటికి కంచి పరిసర ప్రాంతాలలో తెలుగు మాతృభాషగా గల బ్రాహ్మణులు, వైశ్య, కాపు బలిజలు, చేనేత వర్గాలు, బలహీనవర్గాలు, దళితులు, ముస్లిములు ఎక్కువగా యున్నారు. ఆనాటి రాయలకొలువులో రాజకీయ ప్రాబల్యము వీరిదే.

తిమ్మరాజు శ్రీకృష్ణ దేవరాయలు ముత్తాత. భార్య దేవకి పేరున కంచి దగ్గర దేవకీపురము నిర్మించారు. తిమ్మరాజు కుమారుడు ఈశ్వరాయలు, భార్య బుక్కాంబ. క్రీ.శ. 1456 సంవత్సరము నాటికే ఈశ్వరరాయలు విజయనగర రాజప్రతినిధిగా సాళ్వనరసింహరాయలు సేనాధిపతిగా చంద్రగిరి నారాయణ వనములో ఉన్నారు. ఈశ్వరరాయలు సాళ్వనరసింహరాయలు కుడి భుజంగా కన్నడ ప్రాంతాలైన ఉమ్మత్తూరు, శ్రీరంగపట్నము, పశ్చిమ తెలుగు ప్రాంతాలు జయించారు. 1481 మార్చినెలలో బహమనీ సుల్తాన్‌ మహమ్మద్‌ షా కంచి దేవాలయము దోపిడీ సొమ్మును కందుకూరు వద్ద అడ్డగించిసొమ్ముతో సహా శిబిరము దోచుకొన్నాడు. శ్రీకృష్ణ దేవరాయల తండ్రి నరసరాయలు సాళ్వనరసింహరాయల సేనాధిపతిగా, బహమనీ సైన్యాధ్యక్షుడు ఆదిఖాన్‌ ఫకాషి ఉల్ముల్కును పెనుకొండ వద్ద ఓడించాడు.

చివరి సంగమరాజు ప్రౌఢదేవరాయలు బలహీనుడు. ఈ సమయంలో నరసరాయలు పెనుకొండ నుండి సైన్యము సమీకరించుకొని విజయనగరము ప్రవేశించాడు. విజయనగరము అవలీలగా స్వాధీనమైనది. సాళ్వనరసింహరాజు సింహాసనము అధిష్టించాడు (1485).

శ్రీకృష్ణ దేవరాయల తాత ఈశ్వరరాయలు, తండ్రి నరసరాయలు యిరువురూ సాళ్వనరసింగరాయలు వద్ద చంద్రగిరి నారాయణవనములో సేనాధిపతులు, కార్యకర్తలు, విశ్వాసపాత్రులుగా వున్నారు. చంద్రగిరి నారాయణ వనములో జన్మించిన నరసరాయలు చంద్రగిరి , పెనుకొండ, గుత్తి ప్రాంత విజయనగర రాజప్రతినిధిగా ఎక్కువ కాలమున్నాడు.

ఈ కాలములో తిమ్మరుసు చంద్రగిరి నారాయణవనంలో ఉంటూ తమ్ముడు గోవిందరాజులు, నరసరాయలు పెనుకొండ యందు ఎక్కువ కాలము (1485 నుండి 1490) ఉండేవిధంగా ప్రయత్నించారు. ఈ సమయములో 1489లో శ్రీకృష్ణ దేవరాయలు సాగివంశపు రాజకుమారి నాగులాదేవికి పెనుకొండ యందు జన్మించినాడు.

''తిప్పాజీ నాగలాదేవ్యో: కౌసల్య సుమిత్రాయో'' వీరనరసింహ రాయల శాసనము ప్రకారము నాగలాదేవి నరసరాయకుని కుల వధువని దేలుచున్నది. (డా|| నేలటూరి వెంకటరమణయ్య) శ్రీకృష్ణ దేవరాయల తల్లి సాగివంశపు రాజకుమారి అని-శ్రీరాజాదాట్ల వేంకట సింహాద్రి జగపతిరాజు సమర్పించిన తామ్రశాసనము వివరించింది. విజయనగర చరిత్ర-నూతలపాటి పేరరాజు) శ్రీకృష్ణదేవరాయలు జన్మస్థానము చంద్రగిరి నారాయణవనము అనడానికి తక్కువ ఆధారాలు వున్నాయి. అచ్యుత దేవరాయలు, శ్రీరంగరాయలు జన్మస్థానాలు పెనుకొండ. పెనుకొండ సమీపాన స్మార్తసమన్వయ శివకేశవుల దేవాలయాలు 32 ప్రాకారాలు గల చోళ సముద్రం లేపాక్షి శిల్ప, చిత్ర, సంగీత, నాట్య కళల విశిష్ఠ దేవాలయము విరుపన్న నాయకుని సోదరుడు విరుపన్న చేత అచ్యుత దేవరాయలు నిర్మింపజేశాడు. అచ్యుతాపురము, తల్లి ఓ బుళాపురము, తమ్ముడు శ్రీరంగనాయకులు పేరున ఉక్కడం శ్రీరంగాపురం నిర్మించారు.

శ్రీకృష్ణ దేవరాయలు యింటి పేరు సంపెటవారు అని పెద్దన వల్ల తెలుస్తోంది. పెద్దన గారి చాటువు- ''సంపెట నరపాల సార్వభౌముడు''

రాయరావుతుగండ రాచయేనుగు వచ్చి- యార్లకోట గోరాడునాడు- ''సంపెట నరపాల సార్వభౌముడు'' వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు.

సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణా చార్యులు- మా పెనుకొండ గ్రంథము- పేజీ నెం.59.

పొరపాట్లు చరిత్రలో అనేకం జరుగుతుంటాయి. ''రాయల సీమలో ఒక వింత అలవాటుంది. వంశం పేరు వేరుగా ఉంటుంది. రాయలవంశం తుళువంశం వారి యింటి పేరు సంపెట వారు. నేటికీ అనంతపురం జిల్లాలో సంపెట అని యింటిపేరు గల బలిజలు చాలామంది ఉన్నారు. పెనుకొండలో అనేక యుద్ధాలు జరిగాయి. విజయనగర ప్రారంభదినాల్లో పెనుకొండ ప్రధాననగరము. తర్వాత రాజధానిగా మారింది. పెనుకొండ శాపం వల్ల శిలగా మారిన ఒక అప్సరస.

అల్లసాని పెద్దన మనుచరిత్రలో చంద్రవంశపు యయాతి రాజు కుమారుడు తుర్వసుని కీర్తి స్ఫూర్తి వలన రాజవంశము పేరు తుళువాన్వయ మైయ్యిందని (పద్యము 21-22 యందు) వివరించారు. తెలుగు వ్యాకరణం ప్రకారము ''ర'' ''ళ''గా వ్యవహరింపబడి తుర్వసులు-తుళువసులుగా మారింది.

కర్ణాటకము భాషాపదము కాదు. విశాల దక్షిణాపథములో ఒక భాగం, ఒక రాగం, ఒక కర్నాటక సంగీతం. విజయనగర సామ్రాజ్యము దక్షిణాపథ సామ్రాజ్యము. కన్యాకుమారి నుండి కటకము వరకు గల రాయల సామ్రాజ్యము రాయలసీమ.

విజయనగరము పంపానగరమని, అనాది నుండీ పేరుగల తెలుగు తల్లి పార్వతీ పరమేశ్వురుల
పుణ్యస్థలము. తెలుగువారు ఆదిశివగణము నాగులయక్షుల ప్రతిబింబాలు. అందరూ నేడు చాళుక్యుల ప్రాంతము హిరణ్యరాష్ట్రమని అంగీకరిస్తున్నారు. చాళుక్య నందరాజు వారసుడు విజయద్వజుడు క్రీ.శ.1150లో విజయనగరము నిర్మించినారు. ఆ పుణ్యఫలము చేత చాళుక్యుల వారసుడు ఆరవీటి సోమదేవ రాజు కుంజరకోన (ఆనెగొంది)లో మాలిక్‌ నెబిని ఓడించాడు (క్రీ.శ.1334). ఆనెగొంది స్వాధీనం చేసుకొన్నాడు. ఆర్వీటి పిన్నమరాజు, రాఘవుడు కంపిలి రాయలను ఓడించారు. ఆనాడే తెలుగు తేజము కాకతీయుల రాజ్యం శంఖం పూరించి ''తేషాం శిరోభూషణమేవ దేశ త్రిలింగ నామా జగదేక సీమా'' అని తెలుగువారి యందు ఏకతా భావం కలిగించారు. విశాల విజయనగర సామ్రాజ్యానికి తెలుగు రాజులు పునాదులు వేశారు. ముస్లిములు ఆనాడే విభజించి పాలించే విధానాలు ప్రారంభించారు. హరహరరాయులు, బుక్కరాయలు తెలుగువారు కాకతీయుల బంధువులు. విధివశాన ముస్లిము రాజుల చేతిలో బందీలైనారు. ముస్లిము సుల్తాన్‌ పంటపండింది. ముస్లింల సైన్యసహకారంతో ఆనెగొంది, కంపిలి ప్రాంతాల స్వాధీనానికి సహకరించినారు. ప్రారంభంలో హరిహరరాయలు, బుక్కరాయలు ఆరవీటి వారిని వీరబల్లాలుని ఎదురించలేక గుత్తి, పెనుకొండ ప్రాంతాలలో మొదట స్థావరాలు ఏర్పరచుకొని క్రమంగా ఆనెగొంది స్వాధీనపరచుకొన్నారు. కావున విజయనగర స్థపనకు ఆదిస్థానం తెలుగు నేల స్మార్తసమన్వయ బ్రాహ్మణ మత విద్యారణ్య స్వామి అండదండలతో విజయనగర సామ్రాజ్యము అభివృద్ధి చెందింది. విద్యారణ్యస్వామి వారు తెలుగువారు. ఆనాటికి ఈనాటికి విజయనగర సామ్రాజ్యము తెలుగువారి సామ్రాజ్యము. విజయనగర సామ్రాజ్యము కుంజరకోన (ఆనెగొంది) పంపానగరము (హంపి) నేడు కన్నడ రాష్ట్రములో వున్నా తెలుగు వారే ఎక్కువగా ఉన్నారు. విజయనగర సామ్రాజ్యములో మొదటి నుండి చివర వరకు తెలుగు, తమిళ, మళయాళ భాషా ప్రాంతాలు 80 శాతము కన్నడ ప్రాంతాలు కేవలము 20 శాతము! కన్నడ ప్రాంత రాజులు ఉమ్మత్తూరు, శ్రీరంగ పట్నం నిరంతరం స్వతంత్రించేవారు.

విజయనగర సామ్రాజ్యము తల, మొండెము, కాళ్లు, చేతులు కంచి, చంద్రగిరి, పెనుకొండ, గుత్తి పంపానగరము విజయనగరము. విజయనగర సామ్రాజ్య స్థాపన కాలము నుండి చివరి వరకు -యువరాజులు లేక కాబోవు విజయనగర రాజులు ఈ ప్రాంతాల రాజప్రతినిధులుగా ఉన్నారు.

శ్రీకృష్ణ దేవరాయలు రెండవ రాజధాని విజయనగరం వలే ఏడు కోటలు గల పెనుకొండ, వేసవి విడిది, వసంతోత్సవాలు స్థావరంగా ఎక్కువ కాలము గడిపేవారు. వ్యాసరాయలు కృష్ణరాయలు ఏకాంతంగా రాజకీయాలు పెనుకొండలో చర్చించుకొనేవారు. నాగలాపురము, నాగసముద్రము గ్రామాలు పెనుకొండ సమీపంలో వున్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు జన్మస్థానమో? విద్యాస్థానమో? రణరంగ విద్యాబుద్ధులు అప్పాజీ, గోవిందరాజులు నేర్పించిన స్థానమో? చారిత్రక పరిశోదనలు అవసరము. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి, రాజకవి, కవిపోషకుడు. భువనవిజయంలో అశువుగా కవిత్వం చెప్పగల మేథావి. యాంధ్రులతో గుడిమాడి జీవనము సల్పియాంధ్రమున గ్రంథరచనము చేసి యాంధ్రకవుల నాదరించి పోషించి యాంధ్రవాజ్ఞయమును పెంపొందించిన తుళువరాజులు ఆంధ్రులనడంలో సందేహం లేదు. -డాక్టర్‌ నేలటూరి వెంకటరమణయ్య.

దేవకి, తిప్పాంబ, నగలాదేవి, ఓబాంబ, తిరుమలమ్మ, వరదరాజమ్మ తెలుగు రాజ పుత్రికలను వివాహమాడిన విజయనగర రాజులు తెలుగువారే.

శ్రీకృష్ణదేవరాయలు శ్రీవేంకటేశ్వరుని నిరంతర భక్తుడు. తిరుమలాంబ, చిన్నాదేవి విగ్రహాలు తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయప్రాంగణంలో ఆనాడు కొలువు తీరి వుండేవి. మరి ఈనాడో?

చివరికి మిగిలేది? శ్రీకృష్ణదేవరాయల అమరగాథ తెలుగువారి అందరి కథ. చిటికన వేలు కొనగోటితో దక్షణాపథము సంరక్షించిన తిమ్మరుసు తమ్ముడు గోవిందరాజు స్మృతి చిహ్నాలు పెనుకొండలో నిదిరిస్తున్నవి. ఆ స్మృతి చిహ్నాలను శ్రీకృష్ణదేవరాయలు రాయలసీమ రాజసం, తేజంతో ఉట్టి పడేలా నిర్మించారు. ఆనాడుబానిసలం. తిమ్మరుసు వర్దంతి ఉత్సవాలు సమాధుల వద్ద జరుపలేదు.

Sunday, 27 July 2014

కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి



• కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి.

• పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతము.

• ఆంధ్రదేశము లోని గోల్కొండ రాజ్యములో ఇది లభించింది.

• కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రముగా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు)వజ్రము.

• ఈ వజ్రము చరిత్రలో పలువివాదాలకు కారణమై, హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు బ్రిటిష్ వారికి దక్కినది.

• 1877లో విక్టోరియా మహారాణి హిందూదేశ మహారాణిగా పట్టాభిషిక్తురాలయినపుడు ఆమె కిరీటములో ప్రధానమైన వజ్రముగా పొదగబడింది.

• గోల్కొండ రాజ్యములోని ఓ అసాధారణ వజ్రం కోహినూరు.

• కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్ తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు , కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు.

• ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ కోహినూర్ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు.

• ఈ అసాధారణ వజ్రం ఎన్నో రాజ్యాలను కూల్చింది.

• ఎందరో రాజులను మార్చింది.

• చివరికి బ్రిటిష్‌ రాణి తల మీద చోటు సంపాదించింది.

• ఇంత ఘన చరిత్ర కలిగిన ఆ వజ్రం పేరు ‘కోహినూర్‌’.

• బాబర్‌ నామాలో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ కోహినూర్‌ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ “ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్‌ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది’ అన్నాడు.

• మాల్వా రాజు మహలక్ ‌దేవ్‌ దీని తొలి యజమానిగా చరిత్రకెక్కాడు.

• తర్వాత మాల్వాను జయించిన ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్‌ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నాడు.

• 1626వ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం బాబర్‌ వశమై ‘బాబర్‌ వజ్రం’గా పేరు పొందింది.

• క్రీ. శ. 1913వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్‌ రాజుల నుంచి పంజాబ్‌పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌దీన్ని సొంతం చేసుకున్నాడు.

• చివరికి చిన్నవయసులో పట్టాభిషిక్తుడైన దులీప్‌సింగ్‌ ద్వారా బ్రిటిష్‌ గవర్నర్‌ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు.

• రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది.

• సానపెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూటా ఎనబై ఆరు క్యారెట్ల నుంచి నూటా తొమ్మిది క్యారెట్లకు తగ్గింది.

• దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది.

• తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్‌ రాణులు దీన్ని ధరించారు.

• ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా 1947 మరియు 1953వ సంవత్సరంలలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు.