Sunday 9 February 2014

జలపాతాలంటే ఏంటి?....వాటి అలుపెరగని ప్రయాణం ఎలా మొదలయింది...



నీటిని చూస్తేనే తెలీని ఆనందం ప్రతీ అణువులోనూ ప్రసరిస్తుంది.మనిషికీ నీటికీ మధ్య ఉన్న కెమిస్ట్ర్రీ ఇది.ఇక నీటి పరుగులు చూస్తే మనిషి మైమరచే పోతాడు.అదే నీరు దివి నుంచి భువికి  దిగివచ్చినట్లు మేఘాల మీదుగా జాలువారినట్లు..ఆకాశంలోంచి ఒక్క ఉదుటన ఉరకలు పెట్టినట్లు వయ్యారంగా నడిచొస్తే ఎలా ఉంటుంది.శరీరమంతా మధురానుభూతులు గిలిగింతలు పెట్టి కళ్లు వెయ్యి ఓల్టుల వెలుగులతో నిండిపోతాయి.కళ్లల్లోనే విద్యుద్దీపాలు మెరిసిపోతాయి.అలా వయ్యారాలు పోతూ ఉరికే నీటినే జలపాతాలు అంటారు.ప్రకృతి మనకందించిన అరుదైన అద్భుతాల్లో జలపాతాలు అత్యంత కీలకమైనవి.ఆ జలపాతాల  సోయగాలను ఒక్క సారి వీక్షించి వస్తే జన్మ జన్మల అలసట కూడా మాయమైపోతుంది.మరి సిటీ లైఫ్ లో పడి నవ్వడం కూడా మర్చిపోయిన  మనం ఒక్క సారి జలపాతాల్లోకి ఉరుకుదాం.పదండి.
జలహొయలు:-
నీలి ఆకాశం.

పచ్చదనంతో ఆకుపచ్చబంగారంలా మెరిసిపోయే నేలతల్లి సొగసు.భూదేవి పైట కొంగులా జర జరా ..జల జలా  నింగి నుంచి నేలను చేరే జలసుందరి పరవళ్లు.అన్నీ  ప్రకృతి కాన్వాస్ పై  అదృశ్య చిత్రకారుడెవరో  గీసిన అద్భుత దృశ్యకావ్యాలే.అన్నీ మనల్ని తమ వైపునకు రా రమ్మని పిలిచే వయ్యారాలే.ప్రకృతి సిద్ధంగా అవతరించే జలపాతాలకు పెద్ద చరిత్రే ఉంది.
జలపాతాలంటే ఏంటి?
ఎక్కడో పుట్టి ఎక్కడికో పరుగులు తీసే నదీ నదాలు అవధులు లేని ఆనందంతో దూసుకుపోతాయి.
ఆ పరుగులకు పరిమితులు లేవు. ఎవరినీ ఖాతరు చేసే ప్రసక్తే లేదు.కొండలు..కోనలూ దాటి నిరంతర యాత్ర చేస్తూనే పోతాయవి.ఆ క్రమంలోనే కొండలపై నుంచి అమాంతం అగాథాల్లాంటి లోయల్లోకి ఉత్సాహంగా ఉరకలు పెడతాయి నీళ్లు.ఆ ఉరకలే ..పాలనురుగుల ..వేల సొగసుల...జలపాతాలు.కొండలను ముద్దాడుతూ నీళ్లు కదలిటప్పుడు ఓ సంగీత పరికరంపై వేళ్లు కదిలినట్లు అదో రమణీయ సంగీతం.అదో కావ్యం.అది వింటేనే స్వర్గం.అందుకే జలపాతాలను వెతుక్కుంటూ పోవాలనిపిస్తుంది.వాటి పాదాల చెంత సేదతీరితే ఈ జన్మకదే చాలుననిపిస్తుంది.

భూమి పుట్టినప్పుడే నీరూ పుట్టింది.అంతకు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఆకాశం ఉండింది.పుట్టడంతోనే నీటికి ఉరకలు..పరుగులు వచ్చాయి.అల్లరీ అబ్బింది.అలా అల్లరి చేసే జల బిందువులే జలపాతాల వేషాలేసి ..కొత్తగా పరికిణీలేసుకునే అమ్మాయిల్లా మురిసిపోతాయి.నీరు మనం అనుకున్నంత బుద్దిగా ఏమీ ఉండదు.దానికి అల్లరి ఎక్కువ.నీటి కీ అమ్మాయిలకీ పోలికలు చాలానే ఉన్నాయి.అమ్మాయిల్లాగే నీరూ విశాల హృదయం ఉన్నది.ఆడదాని మనసులాగే నీటికి కరుణ ఎక్కువ.నచ్చిన వాటిని చేరుకునే  సందర్బంలోనూ అమ్మాయిల్లాగే నీటికీ  ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమతోనే కొండల పైనుంచి తానెంతగానో ప్రేమించే నేలను కలిసేందుకు నీరు అల్లరి పిల్లలాగే పరుగులు తీస్తుంది.

ఆడవాళ్ల లాగే నీరు లోతైంది కూడా.ఆ లోతును కనుక్కోవడం ఎవరికీ సాధ్యం కాదు.వరించి వచ్చిన ప్రియుడు కష్టాల్లో ఉంటే ప్రేయసి అమ్మైపోతుంది.ప్రియుడి మనోవేదనను పోగొట్టి తానెంత ఉన్నతమైనదో చాటుకుంటుంది.నీరూ అంతే. తనను చూసి మురిసిపోయేవాళ్లకోసమే కొండలపై నుంచి  ప్రకృతి సంగీతానికి అనుగుణంగా నాట్యం చేస్తూ ...హొయలొలికిస్తూ...మహాకావ్యంలా రూపాంతరం చెందుతుంది.
 నీళ్లూ ఎన్నో మలుపులు..వంపులు తిరుగుతూ..పరుగులు పెడుతూ...నవ్వులు రువ్వుతూ...మెరుపులు విసురుతూ...ముందుకు సాగుతాయి.ఆకాశాన్ని తాకే కొండల పై ప్రవహిస్తూ అంతెత్తు నుంచి ఒక్క సారిగా కిందకు ఉరుకుతాయి.ఆ ఉరకలో ఓ మ్యాజిక్ ఉంది.ఆ మ్యాజిక్ లో గొప్ప మ్యూజిక్ ఉంది.ఆ మ్యూజిక్ లో నారదుడు కూడా అసూయ పడే మెలొడీ ఉంది.అందుకే జలపాతాలంటే లక్షమంది అమ్మాయిలు లక్షవీణలతో ఒకే సారి ఓ అద్భుత గీతానికి రాగాలు కట్టడమే.




అసలింతకీ జలపాతాలు ఎప్పుడు పుట్టాయి?
వాటికి అంతటి సొగసు ఎలా వచ్చింది?
వాటికా గడసరితనాన్ని ఎవరు నేర్పారు?
ఇవన్నీ తెలుసుకోవాలంటే కోట్ల సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి

 


భగీరధుడి పేరు వినే ఉంటారు కదా.
ఇనవంశానికి చెందిన రాజు భగీరధుడు.
శ్రీరాముడి వంశీకుడన్నమాట.
తన రాజ్యం కరవు కాటకాలతో అలమటిస్తోంటే చూడలేకపోయాడు.
కైలాసం నుంచి గంగను భూమార్గం పట్టిస్తేనే గానీ తన ప్రజలు సుఖసంతోషాలతో ఉండరని అనుకున్నాడు.
అందుకే గంగ కోసం కఠోర తపస్సు చేశాడు.గంగ ప్రత్యక్షమైంది.భగీరథుడి మనోరథం అర్ధం చేసుకుంది.
తాను భూమ్మీదకు రావడానికి సిద్ధమే కానీ అంతెత్తునుంచి భూమి మీదకుదూకితే భూ మండలమే ముక్కలైపోతుంది.ఆసమస్యను ఎవరు పరిష్కరిస్తారని నిలదీసింది.నీరుకారిపోయిన భగీరథుడు ...శివుని కోసం తపస్సు చేశాడు.శివుడు ప్రత్యక్షమై సమస్యవిన్నాడు.
గంగ తన సిగలో దూకి అక్కడి నుంచి నేల పైకి రావడానికి వరమిచ్చాడు.అలా గంగమ్మతల్లి మొట్టమొదటి సారిగా భూమిని చేరేటపుడు శివుని సిగలోంచి అది  దుంకుతూ..ఉరుకుతూ..ముందుకు పరుగులు పెట్టింది.అదే మొదటి జలపాతం.జలపాతపు అందాలను మొట్టమొదటి సారిగా చూసి తరించిన అదృష్ట వంతుడు భగీరథుడే.ఆ తర్వాత ఆ గంగే సవాలక్ష నదులుగా అవతరించి ప్రపంచ వ్యాప్తంగా సవాలక్ష కొండలమీదుగా ఉరుకుతూ జలపాతాల...దృశ్యకావ్యాలను ఆవిష్కరించింది.



 




జలపాతం అనగానే మనకి గుర్తుకు వచ్చేది నయాగరా జలపాతం.నయాగరా పై మనసుపారేసుకున్న ఎందరో  ఆ జలపాతపు మోహంలో జీవితాలకు జీవితాలు గడిపేశారు.నయాగరా  అందాలపై కవితలు అల్లేసుకున్నారు.పాటలు కట్టి పాడుకున్నారు.కలల్లోకి ఆహ్వానించి ప్రేమించేశారు.
పొగరులు పోయే...
వలపులు విసిరే...
నగవులు కురిసే..

 ఈ జల సుందరి పరుగులో ఓ చమత్కారం ఉంది.ఈమె ఉరుకులో ఈ ప్రపంచమంతా తన పాదాక్రాంతమేనన్న గర్వం ఉంది.తనను చూసి మై మరిచిపోయిన ఎందరో తమ పోయిన మనసులను వెతుక్కుంటూ మతులు పోగొట్టుకుని  అందమైన అయోమయంలో కొట్టుమిట్టాడుతోంటే చూసి చూసి చిలిపిగా నవ్వే ఈ సుందరి చెక్కిలి పై మొగ్గలు తొడిగే ఓ సిగ్గుపువ్వు ప్రపంచమంతా కాంతిని వెదజల్లేలా మెరుస్తోంది.ఈ సుందరి ఎవరనేకదా మీ  ఉత్కంఠ.ఇదే మరి నయాగరా జలపాతమంటే.
 


అగ్రరాజ్యం అమెరికాలో..న్యూయార్క్ సిటీ ని ఆనుకుని ఉన్న ఆంటారియో లో నయాగరా నది నుంచి  జర్నీ చేసిందే ఈ జలపాతం.ప్రపంచ వ్యాప్తంగా నయాగరా జలపాతానికి ఫ్యాన్స్ ఉన్నారు.అందమైన మహిళ శిరోజాలను నయాగరా జలపాతంతో పోల్చి ఓ కవి మూర్ఛనలు పోతే..కుర్రకారును తన అందాలతో కిర్రెక్కించిన మార్లిన్ మన్రో నయాగరా జలపాతాన్ని చూసి తెగ అసూయ పడిపోయింది.తన అందాన్ని మించిన నయాగరా ను చూసి ఆశ్చర్యపోయింది.అందమంటే ఇదేరా భగవంతుడా అని మురిసిపోయింది.నయాగరా మాత్రం ఏమీ పట్టించుకోకుండా తనకే చేతనయిన వేగంతో పరుగులు తీస్తూనే ఉంది..

చిత్రం ఏమిటంటే నయాగరా జలపాతం న్యూయార్క్ సిటీ వైపు కన్నా నదికి ఆవల వైపు ఉన్న కెనడాలో ఇంకా బాగుంటుందిట. కెనడాలో జలపాతం దృశ్యాలు మరింత మత్తెక్కిస్తాయట.
1670 లో మొదటి సారిగా నయాగరా జలపాతాన్ని యూరోపియన్లు చూశారు.ఆ తర్వాతనే నయాగరా ప్రపంచ ఖ్యాతి గడించింది.కొన్నేళ్లుగా నయాగరా పాపులారిటీ రాకెట్ వేగంతో పెరిగిపోయింది . దాంతోనే ఈ ప్రాంతం నయాగరా సిటీగా అవతరించింది.ఇపుడు నయాగరా అంటే హనీమూన్ సిటీగా మారిపోయిందంటే ఈ జలపాతపు స్థాయి ఎంటో అర్ధం చేసుకోవచ్చు.
****
 

ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని జలపాతాలున్నా శ్రీలంక మాత్రం జలపాతాలకు పెట్టింది పేరు.ఎక్కువ జలపాతాలున్న దేశం బహుశ శ్రీలంకే కావచ్చు.ఈ సింహళ దేశానికి వెళ్లిన వారు జలపాతాల నడుమ తమను తాము మైమరిపోవడం ఖాయం.
ఏటవాలు కొండప్రాంతాలతో...తేయాకు తోటలతో సుందర దృశ్యాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సింహళ దేశం శ్రీలంక.ప్రపంచంలోనే ఇక్కడున్నన్ని జలపాతాలు ఇంకెక్కడా లేవు.వందకు పైగా జలపాతాలు శ్రీలంకలో వీక్షకులను వేరే లోకాలకు తీసుకెళ్తాయి.
ఇక ఇక్కడి జలపాతాల్లో అన్నింటి కన్నా ముఖ్యమైనది రావణ జలపాతం.ఇదే అది.
రామాయణ గాధలోని రావణుడి పేరుమీదనే ఈ జలపాతాన్ని పిలుస్తారు.సింహళంలో దీన్ని రావణ ఎల్ల అంటారు....సీతను అపహరించుకుపోయిన రావణాసురుడు ఈ జలపాతానికి దగ్గర్లోని ఓ గుహలోనే సీతను ముందుగా దాచాడట.అందుకే దీనికి రావణ జలపాతమని పేరు వచ్చిందని స్థానికులు చెప్తారు.
ఇలాంటి జలపాతాలు శ్రీలంకలో చాలానే ఉన్నాయి
.


మన జలపాతాలు
ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అలా జలపాతాల దగ్గరకెళ్లి  .. నీరు చేసే అద్భుతాన్ని చూస్తే...అదో రిలీఫ్.అలాంటిలాంటి రిలీఫ్ కాదు.జలపాతాలన్నీ ప్రకృతి సిద్ధమైనవే ..కాకపోతే ఒక్కో జలపాతానిదీ ఒక్కో ప్రత్యేకత.ఒక్కో జలపాతానిదీ ఒక్కో అందం.వాటిని చూసి తరించాలే కానీ మాటలతో వర్ణించడం కష్టం.మన దేశంలోనూ జలపాతాల సవ్వడి చేసే ప్రాంతాలకు లోటు లేదు.అవన్నీ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెంది జనాల మతులు పోగొడుతున్నాయి.

 భారత దేశంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతం నుండి జాలువారే జలపాతం. 
  • కర్ణాటక రాష్ట్ర్రంలోని  శరావతి నది పై ఉన్న ఈ జలపాతం పేరు జాగ్ జలపాతం.ఏకంగా 830 అడుగుల ఎత్తునుండి నీళ్లు ఉరుకుతోంటే చూడ్డానికి రెండు కళ్లు చాలనే చాలవు.
  • కేరళ లోని తిరుచూరు లోని అతిర పల్లి జలపాతాన్ని భారత దేశపు నయాగరా అంటారు.80 అడుగుల ఎత్తునుండి ఈ జలపాతం కిందకు ఉరుకుతుంది. చుట్టూ అందమైన దృశ్యాలూ..పచ్చటి మైదానాలు..చెట్లూ ఉంటాయిక్కడ.కేరళ వెళ్లే వాళ్లు తప్పనిసరిగా తమ టూర్ షెడ్యూల్ లో అతిర పల్లి వాటర్ ఫాల్స్ ను చేర్చి తీరతారు.లేదంటే వారి టూర్ అసంపూర్తిగా సాగినట్లే భావిస్తారు














మన రాష్ట్ర్రంలో ని ఈ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
  • దీని పేరు ఎత్తిపోతల జలపాతంనాగార్జున సాగర్ కు సరిగ్గా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం నిజంగానే ఓ అద్బుతం.హైదరాబాద్,విజయవాడ,వరంగల్ ప్రాంతాల నుండి నాగార్జున సాగర్ చేరుకుని అక్కడి నుంచి ఎత్తిపోతల జలపాతానికి వెళ్లచ్చు.
  • చంద్రవంక నదీ జలాలు నల్లమల నుంచి వచ్చి ఇక్కడ ఓ వాగుతో కలుస్తాయి.అనంతరం చంద్రవంక కొండల మీదనుంచి 70 అడుగుల ఎత్తునుంచి జలపాతం కిందకు ఉరుకుతుంది.
  • ఇక్కడే క్రోకోడైల్ బ్రీడింగ్ సెంటర్ కూడా ఉంది.అందుకే ఈ ప్రాంతానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు.ఈ ప్రాంతంలోనే బౌద్ధారామాలు ఉండడం మరో ప్రత్యేకత.
  • విశాఖ జిల్లా అరకు లోయ సమీపంలోని మరో కటికి జలపాతం. 
  • కుంటాల జలపాతం
  • కైలసకొన జలపాతం. 
  • టైగర్ జలపాతం 
  • పోచెరము జలపాతం 
  • రంపచోడవరం  జలపాతం
  • టైగర్ జలపాతం ర్  జలపాతం  టైగర్  జలపాతం టైగర్

ఇలాంటి జలపాతాలు చాలానే ఉన్నాయి.ప్రతీ ఒక్క జలపాతం గురించి చెప్పడం కష్టం.వాటి అందాలను ..వాటి  సోయగాలను కళ్లారా చూడాల్సిందే.
వాటిని చూసి తరించాలంటే ఒక్క జీవితం సరిపోదు.
 


 


No comments:

Post a Comment