అల్లూరి విల్లుకి తెల్లోది విల విల.... గిరిజన సింహం అల్లూరి సీతారామరాజు పేరుకి తగ్గట్టుగానే అయన ఒక రామ రాజు, అప్పటిగిరిజనుల ను చైతన్యవంతుల్ని చేసిన గొప్ప వీరుడు మన అల్లూరి... ఈ సింహాన్ని పట్టడం చేతకాని బ్రిటీష్ మూకలు వెన్నుపోటు పొడిచి హత్య చేసారు... కాని రామరాజు మరణం వీర మరణం...
ఇరవై ఏడేళ్ళంటే ముక్కుపచ్చలారని వయసు. చదువు పూర్తిచేసుకొని, అప్పుడప్పుడే వ్యాపారమో, ఉద్యోగమో మరేదైనా సంపాదనామార్గమో ఎంచుకొని విజయాల బాటన నడక మొదలుపెట్టే వయసు. అల్లూరి సీతారామరాజు ఆ సరికే ఒక మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించగల ఉద్యమాన్ని నడిపి, దేశవ్యాప్తంగా ఒక స్వాతంత్ర్య స్పూర్తిని నింపి, నిష్క్రమించాడు.
ఈ నేల మనదిరా, ఈ గాలి మనదిరా అని స్వేశ్చగా అటవీసంపదను వాడుకొంటూ, చెట్లునరికి పోడువ్యవసాయం చేసుకొంటూ, వనసంపదని సంతల్లో బియ్యానికీ, వంటసరుకులకీ వస్తుమార్పిడి చేసుకొంటూ, పండుగలకీ పబ్బాలకీ ఇంకోలా చెప్పుకొంటే అసలు ఏ ప్రత్యేక సందర్భం లేకపోయినా ఈతకల్లునీ, తాటికల్లునీ సేవిస్తూ ఆనందంగా గడిపేస్తున్న మన్యం జనాలు బ్రిటీషువాళ్ళ అటవీ రిజర్వు చట్టాలు, అబ్కారీ చట్టాల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. చేతులూ కాళ్ళూ కట్టేసినట్టయ్యాయి. అప్పుడు సీతారామరాజు వాళ్ళ జీవితాల్లో వెలుగునింపే మెరుపులా, తెల్లవాళ్ళ పాలిట పిడుగులా వచ్చాడు.
1907లో, అంటే అప్పటికి సీతారామరాజుకి పదేళ్ళు ఉంటాయేమో - బిపిన్ చంద్రపాల్ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు. ఎందరో వాటికి ఉత్తేజితులయ్యారు. వారిలో మనహీరో ఒకడు. తరువాత ఒక పుష్కరకాలానికి గాంధీజీ సహాయనిరాకరణోధ్యమం వల్ల కొత్త ఆలోచనలకి త్వరగా స్పందించే వయసులో ఉన్న యువకుడు సీతారామరాజు తెల్లవాళ్ళను ఎదిరించాలని నిర్ణయించుకొన్నాడు. గాంధీజీలా అహింసామార్గంలో కాదు. హింసామార్గంలో.
మన్యప్రాంతానికివెళ్ళి అక్కడివాళ్ళకి స్వాతత్ర్యంయొక్క ప్రాముఖ్యతని నూరిపోసి, దళాన్ని కూడగట్టుకొన్నాడు. కాకపోతే పాతకాలపు విల్లంబులులాంటి ఆయుదాలు తెల్లవాళ్ళ తుపాకీ గుళ్ళముందు దిగదుడుపే! కాబట్టి, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి అక్కడ ఉన్న తుపాకీలనీ, మందుగుండు సామాగ్రినీ స్వాధీనం చేసుకోవడానికి చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి మొదలైన పోలీస్‌స్టేషన్ల మీద మెరుపుదాడి చేసి సఫలమయ్యాడు. ప్రభుత్వానికి వెన్నులో ఒణుకుపుట్టించాడు. ఈ చిచ్చరపిడుగుని ఎదుర్కోవడానికి ఆధునిక పరికరాలనీ, ఆయుదాలనీ, ప్రక్కరాష్ట్రాలనుంచి ప్రత్యేక పోలీసు బలగాలనీ రప్పించ వలసి వచ్చింది.
1922 నుంచి 1924 వరకూ కేవలం రెండు సంవత్సరాలే అయినా, ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేశాడు.
రాజుని నమ్ముకొన్న మన్యంప్రజలకి వేదింపులు మొదలయ్యాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్లూరి సీతారామరాజు లొంగేవాడుకాదు. కానీ, ఆశ్రితజన పీడన ఆతనికి వేదన అయ్యింది. అందుకే, తనకు తానుగా లొంగిపోయాడు. ఈ నిప్పుని వొడిలో పెట్టుకొంటే సామ్రాజ్యాన్నే కాల్చి మసిచేస్తుందని భావించారేమో! లొంగిపోయిన వీరుడ్ని అదుపులోకి తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు.
కానీ ఆ విప్లవజ్యోతి ఇంకా స్పూర్తిని నింపుతూనే ఉంది
No comments:
Post a Comment