భాగ్యనగరం ఎలా వెలసింది? ఛార్మినార్ పుట్టుకకి సజీవ సాక్ష్యం ఏమిటి? నాడు దక్కన్ పీఠభూమిని పాలించిన కుతుబ్ షాహి వంశంలో సాగిన అపురూప ప్రేమకథ ఏమిటి? .కుతుబ్‌షా మదిలో భాగమతికి స్థానం దక్కింది కాని గోల్కొండ కోటలో లభించలేదు.......
ఆ కాలంలో భాగ్యనగరిని ఏలిన ఇబ్రహీం కుతుబ్ షా కుమారుడు యువరాజు కులీ తన సంస్థానంలోని అద్భుత సౌందర్యరాశి, నర్తకి..భాగమతిని ప్రేమించాడు. ప్రేమకానుకగా తను పాలిస్తున్న నగరానికి ఆమె పేరునే పెట్టాడు. చరిత్రలో ఇదో విజయవంతమైన కథ.అయితే భాగమతి పేరును కులీ కుతుబ్‌షా హైదర్‌గా మార్చివేశారు. రహ్మత్‌నగర్‌లో పురాతన సమాధి భాగమతిదని నిపుణులు నిర్ధారించారు.
ఇబ్రహీం కుతుబ్‌షా కుమారుడు మహ్మద్ కులీ కుతుబ్‌షా 4 ఏప్రిల్ 1566లో జన్మించారు. యుక్త వయస్సులో గుర్రపు స్వారీ చేస్తూ మూసీ నది ప్రవాహాన్ని దాటి ఆవైపున సమీపంలోని చెంచలం గ్రామంలోని భాగమతిని కలుసుకుని ప్రేమాయణం సాగించినట్టు చరిత్ర కారులు చెబుతున్నారు. వర్షాకాలంలో నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ మహ్మద్ కులీ మూసీలో ఈదుతూ ప్రేయసి భాగమతిని కలుసుకోవడాన్ని తెలుసుకున్న తండ్రి గోల్కొండ పాదుషా ఇబ్రహీం కుతుబ్‌షా మూసీ నదిపై అప్పట్లో సుమారు లక్ష రూపాయల తో 1578లో పూలే నర్వా పేరుతో (పురానాపూల్) వంతెన నిర్మించారు. సుమారు రెండున్నరేళ్ల పాటు నిర్మాణ పనులు జరిగాయి. పురానాపూల్ నిర్మించే కాలానికి మహ్మద్ కులీ వయసు 12 ఏళ్లు. ఈ వయసులో ఆయన ప్రేమలో పడినట్టు, భాగమతి అనే యువతితో ప్రేమాయణం కొనసాగించినట్టు చెబుతున్న కథనాలను ఆధునిక చరిత్రకారులు కొట్టివేస్తున్నారు. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలోనే గోల్కొండలో జనసామర్థ్యం సుమారు 70వేలకు పైగా పెరిగిందని, అక్కడ మంచినీటి వసతి సమస్యలు ఉత్పన్నమయ్యాయని కలరా వంటి రోగాలు వ్యాపించడంతో కొత్త నగరానికి శ్రీకారం చుట్టాలనే ప్రతిపాదనలు వచ్చినట్టు చరిత్ర కారులు పేర్కొంటున్నారు. ఇబ్రహీం కుతుబ్‌షా నగర విస్తరణ పనుల్లో భాగంగా 1578లో మూసీపై వంతెన నిర్మించారంటున్నారు. అయితే మూసీ నదిలో ఈదుతూ తన కుమారుడు మహ్మద్ కులీ 1580లో ఇబ్రహీం కుతుబ్‌షా మరణానంతరం మహ్మద్ కులీ అధికారం చేపట్టారు. గోల్కొండ కోట జన సమర్ధంగా మారడంతో మూసీ నదికి దక్షిణ భాగంలో కొత్త నగరానికి రూపకల్పన చేసి 1591లో చార్మినార్‌తో శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 1594లో బాద్‌షాహి అషూర్‌ఖానాను నిర్మించారు. నగరంలోని మూడు చోట్ల హైదర్‌మహల్ పేరుతో రాజమందిరాలను నిర్మించారు.
ఈ మందిరాల ఆనవాళ్లు లేక పోయినా చరిత్రలో హైదర్‌మహల్ నిర్మాణాలుండేవని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. షియా సంప్రదాయాన్ని ఆచరించిన మహ్మద్ కులీ కుతుబ్‌షా చార్మినార్ నిర్మాణంలో పంజా నగిషీలను ఏర్పాటు చేయించారు. కులీ కుతుబ్‌షా సొంతంగా పర్షియన్‌లో రాసుకున్న పద్యంలో తన 37 మంది ప్రేయసిల పేర్లను గుర్తు చేశారు. ఇందులో భాగమతి పేరు లేక పోవడం గమనార్హం
No comments:
Post a Comment