1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అఛాఛటోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది. కానీ గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కల్గిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి ఆటోమెటిక్ పిస్టల్‌తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు.
కానీ ఆ సమయంలో బాపు హేరాం అని ఉచ్ఛరించలేదు. గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయారు. గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీనందలాల్ మెహతా మాత్రం తాను ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌లో గాంధీ హేరాం అంటూ నేలకొరిగారనే సమాచారాన్ని ఇచ్చారు. గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లారు. అక్కడే కుప్ప కూలిన గాంధీమహాత్ముని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లించే పరిస్థితి మరోలా ఉండేదేమో! కానీ ఆయనను బిర్లా హౌస్‌లోకే తరలించారు.
పోలీసుల విచారణలో గాడ్సే ఆశ్చర్యపోయే వివరాలను బయట పెట్టారు. 1934, 1944 మే లో, 1944 సెప్టెంబరు 9న ఇలా మూడు సార్లు తాను బాపూజీని హత్య చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. 1948 జనవరి 20న కూడా ప్రయత్నించి విఫలమయ్యానని గాడ్సే వ్యాఖ్యానించారు. అయిదో సారి అంటే జనవరి 30, 1948 తాను అనుకున్నది సాధించ గలిగానని వెల్లడించడం గమనార్హం. గాంధీ హత్యకు 48 గంటల ముందు ఆయన అభిమాని ఒకరు జాగ్రత్తగా ఉండాలని బాపూజీని కోరారు.
అప్పుడు ఆయన నవ్వుతూ ఒక ఉన్మాది తూటాతో నేను మరణించాలని రాసి ఉంటే.. అటువంటి చావును నేను చిరునవ్వుతో ఆహ్వానిస్తాను. ఆ ఉన్మాదిపై నాకు ఎటువంటి కోపమూ రాదు. పరమాత్మ నా హృదయంలోనూ, పెదాలపైనా నర్తిస్తున్నప్పుడు నేను చావుకు ఎందుకు భయపడాలి అని అన్నారు.
No comments:
Post a Comment